నాటుసారా తయారీకి సిద్ధం చేసిన సామగ్రి
మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతం నాటుసారా తయారీతో గుప్పుమంటోంది. మార్కాపురం ఎక్సైజ్ శాఖ పరిధిలోని పెద్దారవీడు, పెద్దదోర్నాల, యర్రగొండపాలెం, అర్ధవీడు, గిద్దలూరు మండలాల్లోని అటవీ సమీప గ్రామాల్లో, చెంచుగూడేల్లో నాటుసారా తయారవుతుంది. చెంచుల జీవితాల్లో వెలుగు తెచ్చేందుకు ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘నవోదయం’ పెద్దగా ఫలితాలు ఇవ్వటం లేదు. ఎక్సైజ్ పోలీసులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సాయంత్రమయ్యే సరికి గిరిజనులు నాటుసారా మత్తులో మునిగి తేలుతున్నారు. దీంతో ఆ మత్తులో పాతకక్షలు మనస్సులో పెట్టుకుని అంబులు వేసుకుంటూ ఒకరినొకరు చంపుకుంటున్నారు.
పెద్దదోర్నాల పరిధిలోని కడపరాజుపల్లె, భ్రమరాంబ చెంచుకాలనీ, పణుకుమడుగు, బంధంబావి, కొర్రపోలు, బొమ్మలాపురం, చెర్లోపల్లె, సుందరయ్య కాలనీ, యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లోని శతకోడు, మర్రివేముల, పాలుట్ల, మురికిమళ్ల తండా, నరజాముల తండా, పీఆర్సీ తండా, అక్కపాలెం, తదితర ప్రాంతాల్లో, గిరిజన గూడేల్లో నాటుసారా య«థేచ్ఛగా తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల నామమాత్రపు దాడులతో నాటుసారా తయారీ ఆగటం లేదు. అటవీ సమీప గ్రామాల్లో నాటుసారా బట్టీలను ఏర్పాటు చేసి సారా తయారు చేస్తున్నారు. ఇందు కోసం బెల్లంఊట, తుమ్మచెక్కను ఉపయోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల మత్తు కోసం టాబ్లెట్లను కలుపుతున్నట్లు తెలుస్తోంది. నాటుసారా తయారీకి నాలుగైదు రోజుల సమయం పడుతుంది. ఎక్సైజ్ పోలీసులు నాటుసారా బట్టీలను ధ్వంసం చేస్తున్నారు తప్పితే తయారీదారులపై దృష్టి సారించటం లేదు. సెలవు రోజులు, పండుగ దినాల్లో నాటుసారా తయారీ ఎక్కువగా ఉంటోంది. ఇటీవల బెల్ట్‌షాపులను తొలగించటంతో పట్టణ సమీప గ్రామాల్లో కూడా నాటుసారా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
కనిపించని “నవోదయం’:
నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల జీవన స్థితిగతులు మార్చేందుకు, నాటుసారా మాన్పించేందుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం కార్యక్రమాన్ని ఏడాది కిందట ప్రారంభించారు. వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, కొంత మంది గ్రామస్తులతో కలిపి గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. నెలకు ఒకసారి సమావేశమై ప్రభుత్వ పథకాలను నిర్వహించటంతో పాటు నాటుసారా తాగడం, తయారు చేయటంపై జరిగే అనర్ధాలను వివరిస్తారు. అయితే, కమిటీలు నామమాత్రం కావటంతో నాటుసారా తయారీ, విక్రయాలు ఆగటం లేదు.
ఎక్సైజ్ దాడులు ఇలా...
గత ఏడాది మార్కాపురం ఎక్సైజ్ పోలీసులు భ్రమరాంబ చెంచు కాలనీ, కడపరాజుపల్లె, పణుకుమడుగు, కొర్రపోలు, చెర్లోపల్లె, సుందరయ్య కాలనీల్లో 9 కేసులు నమోదు చేసి 9 మందిని అరెస్టు చేశారు. యర్రగొండపాలెంలో 11, గిద్దలూరు 2, కనిగిరిలో 2, దర్శిలో ఒకరిని నాటుసారా విక్రయిస్తున్నారని అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరిలో మూడు కేసులు నమోదయ్యాయి.
నాటు సారాను పూర్తిగా నిరోధిస్తాం
నవోదయం కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేస్తున్నాం. నల్లమల అటవీ ప్రాంతంలో నాటుసారా నిరో«ధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గిరిజనుల్లో అవగాహన కల్పించి నాటుసారా నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నాం. గతంలో కంటే ఇప్పటికీ నాటుసారా తగ్గింది. నల్లబెల్లం విక్రయించే వారిపై కేసులు పెడుతున్నాం. బెల్ట్‌షాపులను గ్రామాల్లో పూర్తిగా నిరోధించాం. నాటుసారాకు సంబంధించి గత నెలలో 3 కేసులు నమోదు చేశాం. – హనుమంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్, మార్కాపురం
Comments
Please login to add a commentAdd a comment