Natusara
-
మద్యం అక్రమ రవాణాకు ‘చెక్’
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ఇసుక, మద్యం అక్రమ రవాణాపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టింది. తెలంగాణ, పంజాబ్, కర్ణాటక నుంచి భారీగా తరలి వస్తున్న మద్యానికి చెక్ పెడుతోంది. జగ్గయ్యపేట, దాచేపల్లి, తిరువూరు, మైలవరం, నూజివీడు ప్రాంతాల్లో ఎస్ఈబీ నిఘా పెట్టింది. మొక్కజొన్న ముసుగులో పంజాబ్ నుంచి తీసుకొచ్చి పొలంలోని గడ్డి వాములో దాచిన రూ.20 లక్షల మద్యాన్ని శనివారం స్వాధీనం చేసుకుంది. పకడ్బందీ చర్యలతో.. ► ఎస్ఈబీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులను రంగంలోకి దించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం పట్టుబడుతోంది. ► సోదాల సమయంలో పట్టుబడుతున్న మద్యం అత్యధికంగా తెలంగాణ నుంచే వస్తున్నట్టు తేలింది. ఈ దృష్ట్యా సరిహద్దులోని జగ్గయ్యపేట, దాచేపల్లి, మైలవరం, తిరువూరు, నూజివీడు తదితర ప్రాంతాల్లోని చెక్ పోస్టుల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ► గత నెల 29న తెలంగాణ నుంచి వస్తున్న 1,056 మద్యం బాటిల్స్‌ను మాచర్ల వద్ద ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. ► గత నెల 28న తెలంగాణాణ నుంచి ఏపీకి తరలిస్తున్న 284 మద్యం బాటిల్స్‌ను కర్నూలు ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ► గత నెల 27న కర్ణాటక నుంచి ఏపీకి అక్రమంగా గోనె సంచుల్లో తరలిస్తున్న 543 మద్యం బాటిల్స్‌ను పట్టుకున్నారు. మొక్కజొన్న లోడుతో పంజాబ్ మద్యం ► శుక్రవారం కృష్ణా జిల్లా కంకిపాడు పరిధిలోని మంతెన గ్రామ శివారులో రూ.20 లక్షల విలువైన 5,162 అక్రమ మద్యం బాటిల్స్‌ను పోలీసులు గుర్తించారు. ► విజయవాడ పోలీస్ కమిషన్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఎస్ఈబీ పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో పంజాబ్‌కు చెందిన అక్రమ మద్యం పట్టుబడటం గమనార్హం. ► కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన వీరంకి వెంకటరమణ మండల స్థాయిలో పేకాట, కోడి పందేల నిర్వాహకుడిగా పేరుంది. ► అతనికి విజయవాడ కృష్ణలంకకు చెందిన లారీ బ్రోకర్ షేక్ మహబూబ్ సుబానీ, నిడమానూరుకు చెందిన లారీ యజమానులు కొండపల్లి ఆనంద్, షేక్ రఫీ ముఠాగా ఏర్పడి అక్రమ మద్యం సరఫరాకు పక్కా ప్రణాళిక రచించినట్టు పోలీసులు గుర్తించారు. ► సుబానీ ద్వారా పంజాబ్‌లో తయారైన 142 కేసుల మద్యాన్ని కోల్‌కతా నుంచి మొక్కజొన్న లారీలో పంపించగా.. దానిని కంకిపాడు మండలం మంతెనలోని తన పొలం గల గడ్డివాములో వీరంకి వెంకటరమణ దాచి ఉంచాడు. ► పక్కా సమాచారం అందడంతో ఎస్ఈబీ అధికారులు మెరుపుదాడి చేసి రూ. 20 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ► నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అక్రమ మద్యంపై లోతుగా విచారణ జరుగుతోంది. అక్రమ మద్యంపై కఠిన చర్యలు ప్రజారోగ్యంతో ఆడుకునేలా నాటుసారా తయారీ, అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలించే వారిపై నిఘా పెట్టాం. బోర్డర్ చెక్‌పోస్టుల్లో సోదాలు ముమ్మరం చేశాం. మద్యం తరలిస్తూ పట్టుబడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కసారి పట్టుబడినా అటువంటి వారిపై నిఘా పెడుతున్నాం. అన్ని జిల్లాల్లో రాత్రి వేళ కూడా గస్తీ ముమ్మరం చేశాం. – వినీత్ బ్రిజ్‌లాల్, కమిషనర్, ఎస్ఈబీ -
సం‘సారా’లు బుగ్గి..
సాక్షి, గోకవరం (తూర్పు గోదావరి): గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. గ్రామాల్లో బెల్టుషాపుల నియంత్రణతో మద్యం ప్రియులు సారా వైపు చూస్తున్నారు. దీనిని అదునుగా చూసుకుని సారా వ్యాపారులు జోరుగా సారా తయారు, అమ్మకాలు సాగిస్తున్నారు. గోకవరం మండలంలో 14 పంచాయతీలు ఉండగా సుమారు 30 వరకు గ్రామాలు ఉన్నాయి. పలు గ్రామాల్లో సారా తయారీ కుటీర పరిశ్రమగా మారింది. సారా తయారీ దారులు సారా తయారీలో బెల్లం ఊటతో పాటు అమ్మోనియా వంటి పలు రసాయన పదార్థాలు కలపడంతో కల్తీ సారా తయారు కావడంతో తాగే వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఈ విషయం తెలిసినా అలవాటును వదులుకోలేనివారు సారాకు బానిసై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. గోకవరంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారీదారులు పోలీస్, ఎక్సైజ్ అధికారుల కళ్లుగప్పి సారాను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మండలంలో తంటికొండ, కామరాజుపేట, కొత్తపల్లి, మల్లవరం, గోకవరం, అచ్యుతాపురం, ఇటికాయలపల్లి, గోపాలపురం, గాదెలపాలెం, వెదురుపాక తదితర గ్రామాల్లో సారా తయారీ ఎక్కువగా జరుగుతోంది. ఆయా గ్రామాల్లో కాలువ గట్లు, మామిడి, జీడిమామిడి తోటల్లో భారీ స్థాయిలో సారా బట్టీలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రతిరోజూ వేల లీటర్ల సారా తయారవుతోంది. వీరికి గోకవరం, తదితర గ్రామాలకు చెందిన సారా బెల్లం వ్యాపారులు సారాను సరఫరా చేస్తున్నారు. గతంలో అర్ధరాత్రి సమయాల్లో సారాను తయారు చేసేవారు. సారా బెల్లం వ్యాపారులు నేరుగా బట్టీలకు సారా బెల్లాన్ని సరఫరా చేస్తుండడంతో పగటి పూటే ఈ సారా తయారీ జరుగుతోంది. విచ్చలవిడిగా సారా అమ్మకాలు మండలంలోని గోకవరం, తంటికొండ, ఇటికాయలపల్లి, అచ్యుతాపురం, కొత్తపల్లి, గాదెలపాలెం, గోపాలపురం, కామరాజుపేట, మల్లవరం తదితర గ్రామాల్లో సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా సారా అమ్మకాలు సాగుతుండడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా సారాకు బానిసలవుతున్నారు. కల్తీ సారా తాగడం వల్లన కొన్నేళ్ల క్రితం గుమ్మళ్లదొడ్డి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడగా, ఇటీవల తంటికొండకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. అలాగే అనేక మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇటీవల గోకవరం పోలీసులు పలు గ్రామాల్లో సారా అమ్మకాలు సాగిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అయినా ఇంకా అనేక గ్రామాల్లో సారా అమ్మకాలు సాగుతున్నాయి. దీనిపై ఎక్సైజ్‌శాఖ అధికారులు స్పందించి మండలంలో సారా తయారీ, అమ్మకాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. ఇటీవల అచ్యుతాపురం గ్రామంలో సారా తయారీ అమ్మకాలకు, తయారీకి వ్యతిరేకంగా గ్రామానికి చెందిన సీఐడీ యూత్ సభ్యులు ఉద్యమం చేపట్టారు. దీనిలో భాగంగా ఆదివారం సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ప్రతి గ్రామంలో ఈ విధంగా యువత ముందుకు వచ్చి సారాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే మంచి ఫలితం ఉంటుంది. నాలుగు నెలల్లో మార్పు తీసుకువస్తాం సారా తయారీ, అమ్మకాలపై నాలుగు నెలల్లో మార్పు తీసుకువస్తామని కోరుకొండ ఎక్సైజ్ శాఖ సీఐ కోలా వీరబాబు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. గ్రామాల్లో సారా వ్యాపారస్తులతో గ్రామపెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో చైతన్యం తీసుకువస్తామన్నారు. ముందస్తుగా బైండోవర్లు నమోదు చేస్తున్నామని, అప్పటికీ మారకపోతే పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నారు. -
అక్రమాల వసారా..!
ఏజెన్సీ వసారాలో నాటుసారా పూటుగా ప్రవహిస్తోంది. ఎన్నిమార్లు దాడులు చేసినా, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా గిరిజన గూడేల్లో ‘నాటు’ బట్టీల మంట ఆగనంటోంది. వందల సంఖ్యలో మందుబాబులు ఆస్పత్రుల పాలవుతున్నారు, తయారు చేస్తున్న వారూ అనారోగ్యం బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయినా ఈ బాట వీడడం లేదు. ప్రధానంగా పాలకొండ డివిజన్లోని ఏజెన్సీలోనూ, కాశీబుగ్గ, మందస పరిసర ప్రాంతాల్లోనూ నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తక్కువ ధరకే లభ్యమవుతుండడంతో సమీప గ్రామాల గిరిజనులతో పాటు మైదాన ప్రాంత వాసులు కూడా ఈ నిషాకు బానిసలైపోతున్నారు. శ్రీకాకుళం, పాలకొండ: సారా మహమ్మారి ఏజెన్సీని పట్టి పీడిస్తోంది. నిత్యం ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నా నాటుసారా తయారీని నియంత్రించలేకపోతున్నారు. ప్రధానంగా సీతంపేట మండలంలోని నారాయణ గూడలో అయితే ఇది దాదాపు కుటీర పరిశ్రమగా మారిపోయింది. మండ, మండగూడ, శంబాం, టిటుకుపాయి, పాలకొండ మండలంలోని బ ర్న, వీరఘట్టం మండలంలోని అచ్చెపువలస తదితర గిరిజన గ్రామాల్లో నిత్యం సారా తయా రు చేస్తున్నారు. మందస, కాశీబుగ్గ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లోనూ సారా తయారీ, విక్రయం అధిక మొత్తంలో సాగుతోంది. ఈ ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోల ద్వారా పాలకొండ, రాజాం, వీరఘట్టం, మం దస, సోంపేట, కాశీబుగ్గ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాలకొండ పట్టణంలోని రెల్లివీధిలో సారా అమ్మకాలు కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. నిత్యం వందల మంది నాటుసారా కోసం ఇక్కడకు వస్తున్నారు. కల్తీతో ప్రమాదం ఇటీవల కాలంలో రెల్లివీధిలో సారా తాగి తిరిగి వస్తున్న సమయంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే వీరు మద్యానికి బానిసలు కావడంతో వీరి మరణాలపై పెద్దగా ఫిర్యాదులు లేవు. వాస్తవంగా ఏజెన్సీ నుంచి సారాను 10 లీటర్ల క్యాన్లతో ఇక్కడకు తీసుకువస్తున్నారు. రెండు క్యాన్లతో ఉన్న కావిడిని రూ.1600కు కొంటున్నారు. దీన్ని నీళ్లతో కల్తీ చేసి రెండు రెట్లు చేస్తున్నారు. మత్తు తగ్గకుండా ఉండడానికి స్పిరిట్‌ను కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నారు. దీంతో సారాకు అలవాటు పడిన వారు కొంచెంకొంచెంగా మరణానికి చేరువవుతున్నారు. ప్రతి రోజు 40నుంచి 60 క్యాన్ల సారా దిగుమతి అవుతున్నట్లు అంచనా. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రస్తుతం సారాకు మరింత గిరాకీ పెరిగింది. ప్రమాదకర రసాయనాల వినియోగం నాటుసారా తయారీకి ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నారు. ప్రధాన వనరు పు లిసిన బెల్లం కాగా ఇందులో పంటలకు విని యోగించే యూరియాను అధికంగా వినియోగిస్తారు. దీనికి తోడు మత్తు కోసం పలు మొ క్కల నుంచి సేకరించిన వేళ్లను వాడుతారు. దీంతో సారాలో మత్తు చేరుతుంది. ఇది సారా తాగేవారిని కొంచెకొంచెంగా బానిసలుగా మార్చి, శరీరంలోని అవయవాలను ధ్వంసం చేస్తుంది. తక్కువ ధర కావడంతో.. మద్యానికి బానిసలైన వారు ఈ సారాను తాగుతున్నారు. ప్రతి ఊరిలోనూ బెల్టుషాపులు ఉన్నా ఇటే చూస్తున్నారు. మద్యం దుకాణాల్లో అధిక ధరలు ఉండడం, వాటిలోనూ కల్తీ ఆరోపణలు ఉండడంతో మందుబాబులు సారా తాగడానికి మొగ్గు చూపుతున్నారు. రూ.20కే నాటు సారా లోటాతో దొరుకుంది. మత్తు కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో రోజురోజుకు నాటుసారా తాగేవారి సంఖ్య పెరుగుతోంది. సాయంత్రం పాలకొండ–సీతంపేట రహదారి, మందస నుంచి గిరిజన ప్రాంతాలకు వెళ్లే దారిలో నాటుసారా కోసం వెళ్లే వారి సంఖ్య చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. 80 శాతం మద్యం బాధితులే ఆస్పత్రికి వస్తున్న కేసుల్లో 80 శాతం మంది మద్యం బానిసలే ఉంటున్నారు. ప్రతి రోజు నాటుసారా తాగిన వారి అవయవాలు పూర్తిగా దెబ్బతిని ఉంటున్నాయి. పేద కుటుంబాలకు చెందిన వారే అధికంగా ఉంటున్నారు. నరాలు పనిచేయక కాళ్లు, చేతులు చచ్చుపడిపోయి అనారోగ్యంతో మరణిస్తున్నారు.– జె.రవీంద్రకుమార్, వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రినిరంతరం దాడులు చేస్తున్నాం నాటుసారా తయారీపై నిరంతరం దాడులు చేస్తున్నాం. ప్రతి రోజు కనీసం 40 మంది సిబ్బంది గిరిజన గ్రామాల్లో దాడులు చేస్తున్నాం. అయినా తయారీ ఆగడం లేదు. సారా తయారీ దారులు మాపై ఎదురుదాడులకు తెగబడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే కుటీర పరిశ్రమలా చేస్తున్నారు. రవాణాపై దృష్టి సారించాం. ప్రధాన జంక్షన్ల వద్ద నిఘా ఏర్పాటు చేశాం. నవోదయం కార్యక్రమం ద్వారా సారాతో అనర్థాలను వివరిస్తున్నాం.– టీవీఆర్ మూర్తి, సీఐ, ఎక్సైజ్ శాఖ -
మత్తుపై ఆశ.. మృత్యు ఘోష!
మత్తు కోసం ఆశపడ్డ బడుగు జీవుల బతుకులను విష రసాయనంహాలాహలంలా దహించింది. చిత్తు కాగితాలేరుకుంటూ జీవితాన్నినడిపించే చిన్న బతుకులకు చేజిక్కిన ‘ద్రవం’ అనుకోని తీరులో విపత్తు సృష్టించింది. పెద గంట్యాడ స్వతంత్ర నగర్ కాలనీలో ఆదివారంవిషాదం కాలువకట్టి మరీ ప్రవహించింది. దొరికినదో, ఎవరిచ్చినదోకానీ.. ఆ అభాగ్యులకు దక్కిన ద్రవ పదార్థం ముగ్గురి ఆయుర్దాయాన్నిహరించింది. చేజిక్కిందే చాలని సంబరపడి, అదేమిటో కూడాతెలియకుండా గొంతు తడిచేసుకున్న అమాయక జీవులకు చివరికిఆపద సంప్రాప్తించింది. అనుకోకుండా దొరికిన క్యాన్‌లో ద్రవం చివరికికాలకూట విషమై.. బతుకులను కాల్చేసింది.మరో ఎనిమిది మందికి ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. సాక్షి, విశాఖపట్నం/గాజువాక: తెల్లారి లేచింది మొదలు చీకటి పడే వరకు వారికి ఒకటే తపన. ఎవరికీ అక్కర్లేని చెత్త, చెదారాన్ని వారు అక్కున చేర్చుకుంటారు. దానిపై వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాము చేపట్టిన వృత్తి దుర్భరమని తెలిసినా అందులోనే నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. రోజంతా పడ్డ శ్రమకు మత్తు నుంచి ఉపశమనం లభిస్తుందని తాగుడుకు అలవాటు పడ్డారు. ఆ అలవాటే ముగ్గురిని బలితీసుకుంది. మరికొందరిని చావుబతుకుల్లోకి నెట్టేసింది. పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీలో చోటు చేసుకున్న విషాదం వెనక మత్తు ఉండడం.. మృతుల్లో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఉండడం మరింత కలచివేసింది. ఎస్టీ కాలనీలో సంచార జాతుల తెగకు చెందిన కుటుంబాలు అధిక శాతం నివసిస్తున్నాయి. పురుషులు చిన్న చిన్న కూలిపనులు, పందుల పెంకపం వ్యాపకంగాను, మహిళలు చెత్తల్లోనుంచి విక్రయానికి ఉపయోగపడే వ్యర్థాలను సేకరిస్తుంటారు. ఈ తెగలో పురుషులతో పాటు మహిళలు కూడా మద్యం సేవిస్తుంటారు. శనివారం సాయంత్రం కాలనీకి సమీపంలో ఉన్న జీవీఎంసీ డంపింగ్ యార్డులో వ్యర్థాల సేకరణకు కోసం వెళ్లిన వాడపల్లి అంకమ్మకు అక్కడికి సమీపంలోనే పది లీటర్ల క్యాన్‌తో ఒక రకమైన రసాయన ద్రావకం దొరికింది. దాన్ని ఇంటికి తీసుకొచ్చిన ఆమె అందులో ఉన్నది సారా అని భావించింది. చాలా కాలం క్రితం ఈ కాలనీవాసులు నాటుసారా తెచ్చుకొని సేవించేవారు. దీంతో ఈ ద్రావకం కూడా సారా అని, దాన్ని ఎవరో అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటారని భావించింది. ఆ ద్రావకాన్ని శనివారం రాత్రే కాలనీలో ఉన్న తమ బంధువులు, పక్కవాళ్లకు పంచింది. సుమారు 20 మంది దానిని సేవించారు. ఆదివారం నిద్ర లేచే సమయానికి వారందరికీ కడుపులో మంట మొదలైంది. కొందరికి వాంతులయ్యాయి. రాత్రి తాగిన సారాలో పవర్ ఎక్కువగా ఉండి ఉంటుందని వారు భావించారు. వారిలో పెండ్ర అప్పలమ్మ(65) మంచంపై నుంచి లేవలేదు. ఇంట్లో కుటుంబ సభ్యులు పిలిచినా ఆమె సరిగా స్పందించకపోవడంతో మత్తు ఎక్కువై ఉంటుందని, అప్పటికే తమ ఇంట్లో ఉన్న మద్యాన్ని కూడా సేవించి ఉంటుందని భావించారు. చివరకు ఉదయం 10 గంటలు దాటినా ఆమె నుంచి చలనం లేకపోవడంతో మృతి చెందిందని నిర్ధారించి దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. మద్యం తాగడం ఆమె చివరి కోరిక అయి ఉండవచ్చని, ఇప్పుడు సారా(రసాయనం) తాగడంతో కోరిక తీరి మృతి చెందిందని భావించారు. ఈ క్రియ ముగిసేలోగా ఆమె సోదరుడు వాడపల్లి అప్పడు(50), ఆ కాలనీకి చెందిన ఆసనాల కొండోడు(64) కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆయనదీ రాత్రి తాగిన మద్యం(కెమికల్) ప్రభావమేననుకున్నారు. మరో కొద్ది సేపటికి అప్పడు పెద్ద కోడలు వాడపల్లి అంకమ్మ కూడా అస్వస్థతకు గురై వాంతులు కూడా అయ్యాయి. వాంతి నుంచి బయటకు వచ్చిన కెమికల్ పడ్డ నేల నల్లటి పొగ మాదిరిగా మారిపోవడంతో ఆమెను గాజువాకలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స మొదలైన కొద్దిసేపటికి ఆమె మామ వాడపల్లి అప్పడు(50), ఆసనాల కొండోడు (64) చనిపోయారు. వీరితో పాటు అస్వస్థకు గురైన 11 మందిని కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో రమణమ్మ, చిన్నారావు, అంకమ్మల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విచారణ చేపట్టిన పోలీసులు ఈ సంఘటనతో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఎస్టీ కాలనీలో పర్యటించారు. మృతులు, బాధితులు సేకరించిన కెమికల్‌పై ఆరా తీశారు. పది లీటర్ల క్యాన్‌తో ఉన్న రసాయన ద్రావకంలో ప్రస్తుతం మూడు లీటర్లే మిగిలి ఉందని, ఏడు లీటర్ల ద్రావకాన్ని 11 మంది సేవించారని సౌత్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బాధితులు సేవించింది మద్యం కాదని, ఉడ్ బర్నింగ్‌కు ఉపయోగించే కెమికల్ అయి ఉంటుందని అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు. పూర్తి స్థాయి నివేదిక సోమవారం వస్తుందని చెప్పారు. గాజువాక సీఐ కె.రామారావు, గాజువాక ఎక్సైజ్ సీఐ ఉపేంద్ర, గాజువాక పీహెచ్సీ వైద్యాధికారి తమ సిబ్బందితో సహా కాలనీలో పర్యటించి సంఘటకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ప్రజా ప్రతినిధులు, నాయకుల పరామర్శ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఈ కాలనీలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. సంఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, నాయకులు కటికల కల్పన, గండ్రెడ్డి రామునాయుడు, ఈగలపాటి యువశ్రీ, మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, రుషీ సేవా సంస్థ అధ్యక్షుడు చిక్కా సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు మంత్రి శంకరనారాయణరావు, జెర్రి పోతుల ముత్యాలు తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఉద్యోగం, రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి ఎస్టీ కాలనీలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి డిమాండ్ చేశారు. కాలనీని ఆనుకొని జీవీఎంసీ డంపింగ్ యార్డు కొనసాగడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. దీనికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డును కొనసాగించాలని స్థానిక కాలనీల ప్రజలు ఏళ్ల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వం పెడచెవినపెట్టిందన్నారు. డంపింగ్ యార్డు కాలనీ పక్కన ఉండటంవల్లే ఈ ద్రావకం లభించడానికి కారణమైందన్నారు. కేజీహెచ్‌లో ఆర్తనాదాలు పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): గాజువాక స్వంతంత్రనగర్లో నాటుసారా అని భ్రమపడి పరిశ్రమల్లో వాడే రసాయనాన్ని తాగి అస్వస్థతకు గురైన బాధితులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. బాధితులు, బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి మిన్నంటింది. ద్రవాన్ని తాగిన సుమారు 20 మందిలో ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు ద్రవం తాగిన మిగతా 11 మందిని కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో ఆసనాల కొండయ్య(60) మార్గమధ్యలో చనిపోయాడు. ఆసనాల చిన్న(58), ఆసనాల రమణమ్మ(59) పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందిస్తున్నారు. మిగతా ఎనిమిది మంది బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున తెలిపారు. ఆస్పత్రికి వచ్చిన కలెక్టర్ కాటమనేని భాస్కర్ బాధితుల పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆయన ఆదేశించారు. పోలీసు, ఎక్సైజ్ అధికారులతో ఘటనపై విచారణ చేపడతామని తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితులు తాగింది మద్యం కాదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పరిశ్రమల్లో వాడే రసాయనంగా అనుమానిస్తున్నామని, పరీక్ష నిమిత్తం ద్రవాన్ని ల్యాబ్‌కు పంపామని, సోమవారం ఉదయానికి పూర్తి సమాచారం తెలుస్తుందని చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న వారి వివరాలు 1.ఎ.ఎర్రొడు (50) 2.ఎ.అప్పన్న (22) 3.ఎ.చినఅప్పన్న (25) 4.పి.చిన్న (32) 5.పి.చిన అప్పన్న (32) 6.ఎ.చిన్నారావు (58)..పరిస్థితి విషమం 7.ఎ.అప్పన్న (40) 8.ఎ.రమణమ్మ (59)..పరిస్థితి విషమం 9.ఎ.రమణమ్మ (55) 10.ఎ.దుర్గయ్య (31) 11. అంకమ్మ(50) పరిస్థితి విషమం డంపింగ్ యార్డ్‌లో దొరికింది.. సుమారు 20 లీటర్లున్న క్యాన్ శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో డంపింగ్ యార్డ్‌లో దొరికింది. దాన్ని నాటుసారా అనుకుని సుమారు 20 మంది వరకూ తాగారు. అదే రోజు రాత్రి కూడా తాగిన ముగ్గురు చనిపోయారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. స్పిరిట్ కాదు. వాసన లేకపోవడంతో నాటుసారా అనుకునే మా వాళ్లంతా తాగారు.– ఆసనాల ఆనంద్,బాధిత కుటుంబానికి చెందిన యువకుడు -
మత్తులో మన్యం
మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతం నాటుసారా తయారీతో గుప్పుమంటోంది. మార్కాపురం ఎక్సైజ్ శాఖ పరిధిలోని పెద్దారవీడు, పెద్దదోర్నాల, యర్రగొండపాలెం, అర్ధవీడు, గిద్దలూరు మండలాల్లోని అటవీ సమీప గ్రామాల్లో, చెంచుగూడేల్లో నాటుసారా తయారవుతుంది. చెంచుల జీవితాల్లో వెలుగు తెచ్చేందుకు ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘నవోదయం’ పెద్దగా ఫలితాలు ఇవ్వటం లేదు. ఎక్సైజ్ పోలీసులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సాయంత్రమయ్యే సరికి గిరిజనులు నాటుసారా మత్తులో మునిగి తేలుతున్నారు. దీంతో ఆ మత్తులో పాతకక్షలు మనస్సులో పెట్టుకుని అంబులు వేసుకుంటూ ఒకరినొకరు చంపుకుంటున్నారు. పెద్దదోర్నాల పరిధిలోని కడపరాజుపల్లె, భ్రమరాంబ చెంచుకాలనీ, పణుకుమడుగు, బంధంబావి, కొర్రపోలు, బొమ్మలాపురం, చెర్లోపల్లె, సుందరయ్య కాలనీ, యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లోని శతకోడు, మర్రివేముల, పాలుట్ల, మురికిమళ్ల తండా, నరజాముల తండా, పీఆర్సీ తండా, అక్కపాలెం, తదితర ప్రాంతాల్లో, గిరిజన గూడేల్లో నాటుసారా య«థేచ్ఛగా తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల నామమాత్రపు దాడులతో నాటుసారా తయారీ ఆగటం లేదు. అటవీ సమీప గ్రామాల్లో నాటుసారా బట్టీలను ఏర్పాటు చేసి సారా తయారు చేస్తున్నారు. ఇందు కోసం బెల్లంఊట, తుమ్మచెక్కను ఉపయోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల మత్తు కోసం టాబ్లెట్లను కలుపుతున్నట్లు తెలుస్తోంది. నాటుసారా తయారీకి నాలుగైదు రోజుల సమయం పడుతుంది. ఎక్సైజ్ పోలీసులు నాటుసారా బట్టీలను ధ్వంసం చేస్తున్నారు తప్పితే తయారీదారులపై దృష్టి సారించటం లేదు. సెలవు రోజులు, పండుగ దినాల్లో నాటుసారా తయారీ ఎక్కువగా ఉంటోంది. ఇటీవల బెల్ట్‌షాపులను తొలగించటంతో పట్టణ సమీప గ్రామాల్లో కూడా నాటుసారా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కనిపించని “నవోదయం’: నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల జీవన స్థితిగతులు మార్చేందుకు, నాటుసారా మాన్పించేందుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం కార్యక్రమాన్ని ఏడాది కిందట ప్రారంభించారు. వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, కొంత మంది గ్రామస్తులతో కలిపి గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. నెలకు ఒకసారి సమావేశమై ప్రభుత్వ పథకాలను నిర్వహించటంతో పాటు నాటుసారా తాగడం, తయారు చేయటంపై జరిగే అనర్ధాలను వివరిస్తారు. అయితే, కమిటీలు నామమాత్రం కావటంతో నాటుసారా తయారీ, విక్రయాలు ఆగటం లేదు. ఎక్సైజ్ దాడులు ఇలా... గత ఏడాది మార్కాపురం ఎక్సైజ్ పోలీసులు భ్రమరాంబ చెంచు కాలనీ, కడపరాజుపల్లె, పణుకుమడుగు, కొర్రపోలు, చెర్లోపల్లె, సుందరయ్య కాలనీల్లో 9 కేసులు నమోదు చేసి 9 మందిని అరెస్టు చేశారు. యర్రగొండపాలెంలో 11, గిద్దలూరు 2, కనిగిరిలో 2, దర్శిలో ఒకరిని నాటుసారా విక్రయిస్తున్నారని అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరిలో మూడు కేసులు నమోదయ్యాయి. నాటు సారాను పూర్తిగా నిరోధిస్తాం నవోదయం కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేస్తున్నాం. నల్లమల అటవీ ప్రాంతంలో నాటుసారా నిరో«ధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గిరిజనుల్లో అవగాహన కల్పించి నాటుసారా నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నాం. గతంలో కంటే ఇప్పటికీ నాటుసారా తగ్గింది. నల్లబెల్లం విక్రయించే వారిపై కేసులు పెడుతున్నాం. బెల్ట్‌షాపులను గ్రామాల్లో పూర్తిగా నిరోధించాం. నాటుసారాకు సంబంధించి గత నెలలో 3 కేసులు నమోదు చేశాం. – హనుమంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్, మార్కాపురం -
నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ దాడులు
టి.సుండుపల్లి మండలం కుప్పగుట్టపల్లి శివార్లలోని నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీదారులు అధికారుల రాకతో పరారయ్యారు. ఈ దాడుల్లో రాయచోటి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఈఎస్టీఎఫ్ కడప ఇన్స్పెక్టర్ వెంకట రమణలు తమ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. -
పేరుకే ఉల్లిగడ్డల లారీ, కానీ..
వరంగల్: పేరుకు ఉల్లిగడ్డల లారీ..కానీ అందులో ఉండేది మద్యం బాటిల్స్.. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు వెళ్తున్న లారీని తనిఖీ చేయగా బయటపడిన విషయమిది. సోమవారం ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో మద్యం, మద్యం తయారీ సామగ్రి బయటపడింది. మెత్తం ఆరు టన్నుల నల్లబెల్లం, 5 క్వింటాళ్ల పటిక, 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. -
కాసులు గలగల!
♦ రెండింతలైన మద్యం అమ్మకాలు ♦ నాటుసారాను అరికట్టడమే కారణం ♦ ఊరూరా వెలుస్తున్న బెల్టు షాపులు ♦ 70 శాతం అమ్మకాలు పల్లెల్లోనే.. ♦ గుడుంబా విక్రయదారులపై కేసులు ఒక్క పరిగి ఎక్సైజ్ ఠాణా పరిధిలో అమ్మకాలు 2014 చివరి త్రైమాసికంలో విక్రయాలు : రూ.8.94 కోట్లు 2015 చివరి త్రైమాసికంలో విక్రయాలు : రూ.18.28 కోట్లు నాటుసారాపై ‘ఎక్సైజ్’ వేటు..! సర్కారు మద్యం సేల్స్ రెట్టింపు..!! బెల్టుషాపుల్లో విక్రయాలు70% మద్యం దుకాణాల్లో విక్రయాలు30% నాటుసారా విక్రేతలపై పెరిగిన కేసులు50% మద్యంపై రాబడి రెట్టింపైంది. గ్రామాల్లో నాటుసారాపై ఉక్కుపాదం మోపడంతో మందుబాబులు సర్కారు మద్యంపై ఆధారపడినట్టు పెరిగిన ఎక్సైజ్ ఆదాయం చెబుతోంది. మారుమూల పల్లెలు, గిరిజన గ్రామాల్లో నాలుగైదు నెలల క్రితం వరకు ఏరులై పారిన నాటుసారా ఇప్పుడు సగానికిసగం తగ్గింది. ఇన్నాళ్లు నాటుసారాపై చూసీచూడనట్టు వ్యవహరించిన ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశారు. అదే సమయంలో నాటుసారా తయారు చేస్తున్న వారిపై కేసులు కూడా పెరిగాయి. ఒక్క పరిగి ఎక్సైజ్ ఠాణా పరిధిలో 2014, 2015 సంవత్సరాల్లోని చివరి మూడు నెలల అమ్మకాలు, ఆదాయాలను పోల్చిచూస్తే స్పష్టమైన తేడాలు కన్పిస్తున్నాయి. - పరిగి నల్లబెల్లం విక్రయదారులపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నారు. 2015 సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఏకంగా 150 మంది సారా విక్రేతలను బైండోవర్ చేశారు. 80 మందిపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారు. పరిగి : ఎక్సైజ్ శాఖ నాటుసారాపై ఉక్కుపాదం మోపిన తర్వాత మద్యం రాబడి రెండింతలైంది. 2014 చివరి త్రైమాసికం (అక్టోబర్, నవంబర్, డిసెంబర్)లో పరిగి ఎక్సైజ్ ఠాణా పరిధిలోకి వచ్చే నాలుగు మండలాలకు చెందిన 11 మద్యం దుకాణాల్లో 17,772 లిక్కర్ బాక్సులు, 31,726 బీర్ బాక్సులు అమ్ముడవగా రూ.8,94,404,14 విలువ చేసే అమ్మకాలు జరిగాయి. 2015 ఆరంభం నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరు నెలల కాలంనాటు నాటుసారాపై ఉక్కుపాదం మోపారు. తండాలు, గ్రామాలు వడ పోసి సారా కనిపించని స్థాయికి పరిస్థితిని తీసుకొచ్చారు. దీంతో మందుబాబులు లిక్కర్‌వైపు చూశారు. ప్రభుత్వ లక్ష్యం కూడా ఇదే కావడంతో గ్రామాల్లోనూ బెల్టు షాపులను చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో అమ్మకాలు జోరందుకున్నాయి. పరిగి ఎక్సైజ్ ఠాణా పరిధిలోని అవే 11 మద్యం దుకాణాల్లో 2015 చివరి త్రైమాసికంలో 41,272 లిక్కర్ బాక్సులు, 40,380 బీరు బాక్సులు, అమ్ముడవగా ఏకంగా రెండింతలకుపైగా రూ.18,28,57,371 అమ్మకాలు జరిగాయి. విచ్చలవిడి మద్యం అమ్మకాలూ.. కారణమే.. సారాపై ఉక్కుపాదం మోపడంతోపాటు మద్యం అమ్మకాల్లో విచ్చలవిడితనం కూడా అమ్మకాలు రెంట్టిపవడానికి కారణంగా తెలుస్తోంది. పరిగి నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ప్రస్తుతం కిరాణా దుకాణాలకంటే బెల్టు షాపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 550 నుంచి 600 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో నాటుసారా విక్రయించే ప్రతి తండాలో ప్రస్తుతం బెల్టు షాపులు వెలిశాయి. దాబాలు, కిరాణా దుకాణాలు.. ఇలా ఎక్కడపడితే అక్కడ మద్యం విక్రయిస్తుండటంతో అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. నేరుగా లైసన్డ్ దుకాణాల గిరాకీ 30శాతం ఉంటుండగా బెల్టు షాపుల ద్వారానే 70 శాతం మద్యం విక్రయిస్తున్నారు. రోజుకు రూ.లక్ష విలువైన అమ్మకాలు అయ్యే షాపులో నేడు రూ. రెండు లక్షలు అవుతున్నాయి. సారా కట్టడికి కేసులు, బైండోవర్లు.. సారా కట్టడి చేసేందుకు ఎక్సైజ్ అధికారులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. సారా తయారీకి వినియోగించే నల్లబెల్లం విక్రయదారులపై పీడీ యాక్టులు నమోదు చేశారు. సారాపై ఉక్కుపాదం మోపిన 2015 సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఏకంగా 150 మంది సారా విక్రేతలను బైండోవర్ చేశారు. 80 మందిపైన కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారు. రెండోసారి విక్రయించిన కొందరికి రూ.లక్ష వరకు జరిమానా విధించారు. ఇదే సమయంలో అవగాహన సదస్సులు సైతం నిర్వహించారు. ఏదిఏమైనా సారా విక్రయాలు ఆపి మద్యం విక్రయాలు మాత్రం పెంచగలిగారన్నది వాస్తవం. ఆరోగ్యం దృష్ట్యే సారాపై సమరం గ్రామాల్లో ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా తయారుచేసిన సారాతో అనేక మంది ఆరోగ్యాలు పాడుచేసుకున్నారు. ప్రాణాలు కూడా తీసుకున్నారు. నాటుసారా తాగే వారికి, తయారు చేసే, రవాణా చేసే, విక్రయించే వారికి అవగాహన కల్పించాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ ఆదేశాల మేరకు సారాను నిర్మూలించగలిగాం. - శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ, పరిగి కల్లుదుకాణంపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు బషీరాబాద్ : ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మునీరొద్దీన్, సీఐ మాధవయ్య ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని దామర్‌చెడ్‌లో ఓ కల్లు దుకాణంపై దాడి చేశారు. 24 సీసాల్లో ఉన్న కల్తీకల్లును ధ్వంసం చేశారు. వ్యక్తి అదృశ్యం జవహర్‌నగర్: చెన్నై బయలుదేరి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. సీఐ నర్సింహారావు కథనం ప్రకారం.. యాప్రాల్‌కు చెందిన శంకర్ (33) ఈనెల 8న చెన్నై వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లి ఆచూకీ లేకుం డా పోయాడు. దీంతో ఆమె భార్య శంకరమ్మ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
నవోదయం వచ్చేనా..?
* సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రయత్నం * జోరుగా చైతన్యం విజయనగరం రూరల్: సారారహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఎంత కట్టడి చేస్తున్నా నాటుసారా తయారీ, అమ్మకాల జోరు తగ్గడం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నాటుసారా తయారీ జోరుగా ఉండడంతో గిరిజన ప్రజల ఆరోగ్యం గుల్లవుతోంది. నాటుసారా అమ్మకాలు, తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం ‘నవోదయం’ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు 45 రోజుల పాటు ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, అటవీశాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ర్యాలీలు, విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి సారా రక్కసిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని రాష్ట్ర, జిల్లా సరిహద్దు గ్రామాలు, గిరిజన గ్రామాల్లో అక్రమంగా నాటుసారా తయారీ జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా గత ఏడాది జూలై నుంచి జనవరి వరకు ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో 109 కేసులు నమోదు చేసి 103 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 80 కుటుంబాలు నాటుసారా తయారీలో పాలుపంచుకుంటున్నట్లు ఎక్సైజ్ అధికారుల సర్వేలో తేల్చారు. తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో సుమారు నాలుగు వందల మంది ప్రత్యక్షంగా నాటుసారా అమ్మకాల్లో పాలుపంచుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. నాటుసారా తయారీకి ఉపయోగించే లక్ష లీటర్ల బెల్లం ఊటను గత ఏడు నెలల కాలంలో ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలు, అమ్మకందారులను గుర్తించి ఆయా గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు నవోదయం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. చైతన్య కార్యక్రమాలు జిల్లాలో గుర్తించిన నాటుసారా తయారీదారులను, అమ్మకందారులను అదుపులోకి తీసుకుని అవగాహన కార్యక్రమాలు, కళాజాతాలు నిర్వహించి ఎక్సైజ్, రెవెన్యూ, పోలీసులు వారిచేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. వినకుంటే వారిపై కఠిన చర్యలకు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వారి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, ఇంటి కరెంట్‌ను రద్దు చేసే యోచనలో ఉన్నారు. జరిమానా ఫీజును సైతం అయిదు రెట్ల వరకు పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కమిటీల ఏర్పాటు నవోదయం కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా సభ్యులుగా ఎస్పీ, డీఎఫ్‌వో, కన్వీనర్‌గా ఎక్సైజ్‌శాఖ సహాయ కమిషనర్, ఇద్దరు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఉంటారు. అలాగే మండల కమిటీలో తహశీల్దార్ చైర్మన్‌గా సీఐ, ఎస్సై, ఎంపీడీవో, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉంటారు. గుర్తించిన గ్రామాల్లో ప్రజలను ఇందులో భాగస్వాములు చేస్తారు. 80 గ్రామాల్లో నవోదయం జిల్లాలో 30 గ్రామాల్లో సారా తయారీ, 50 గ్రామాల్లో సారా అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాలను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో నవోదయం కార్యక్రమం అమలు చేస్తున్నారు. విజయనగరం డివిజన్ పరిధిలోని కొత్తవలస ఎక్సైజ్ సర్కిల్, ఎస్.కోట సర్కిల్, నెల్లిమర్ల సర్కిల్, పార్వతీపురం డివిజన్ పరిధిలో పార్వతీపురం, కూనేరు చెక్‌పోస్టు, సాలూరు సర్కిల్లో ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. వీటని గ్రేడ్లుగా విభజించి నవోదయం కార్యక్రమం అమలు చేస్తున్నారు. సారారహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం సారా రహిత రాష్ట్రంలో భాగంగా నవోదయం కార్యక్రమంతో జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం. సారా తయారీ, అమ్మకందారులను అదుపులోకి తీసుకుని వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరుస్తాం. మాట వినని వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. - వై.చైతన్య మురళి, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ -
కొనసాగుతున్న ఎక్సైజ్ దాడులు
4500 లీటర్ల పానకం,85 లీటర్ల నాటుసార ధ్వంసం ఖిల్లాఘనపురం : ఖిల్లాఘనపురం మండలంలోని పలు తండాలు,గ్రామాలలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు నాటుసారా, బెల్లం పానకం ధ్వంసం చేశారు. అప్పారెడ్డిపల్లి, మామిడిమాడతం డా, జంగమాయపల్లి ఎర్రగట్టుతండాలలో వనపర్తి సీఐ నారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహిం చి నట్లు ఎక్సైజ్ ఎస్సై బాల్‌రాజు తెలిపారు. బెల్లం బట్ల కుండలు,డ్రమ్ముల్లో ఉంచిన పానకం ఇ ండ్లలో దాచిన నాటుసారాను ధ్వంసం చేశామన్నారు. మొత్తం 4500 లీటర్ల బెల్లం పానకం, 85 లీటర్ల నాటుసారను పారబోసి 9 కేసులు నమోదు చేశామన్నారు. అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈడిగి లలిత,ఎర్రగట్టుతండాకు చెందిన పిక్లీ పై కేసులు నమోదు చేశామని వివరించారు. నాటుసార తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ దాడులలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది నాగేశ్వర్‌రెడ్డి, తిరుపతి, బంతిలాల్, శ్రీనునాయక్, వహీదాబేగం తదితరులు పాల్గొన్నా రు. -
కాటేస్తున్న నాటుసారా?
రెండు నెలల వ్యవధిలో తండ్రీ కుమారుడుతో సహా ముగ్గురు మృతి ఏరులై పారుతున్నా పట్టించుకోలేక పోతున్న ఎక్సైజ్‌శాఖ సిబ్బంది కొరతతో నామమాత్రంగా దాడులు జెడ్.జోగింపేట(రావికమతం) : మండలంలోని మైదాన గిరిజన గ్రామాల్లో సారా ఏరులై పారుతుండడంతో తాగుడుకు బానిసలై యువకులు, వృద్దులు బలైపోతున్నారు. ముఖ్యంగా జెడ్.జోగింపేట గ్రామంలో గదబరి కళ్యాణం(56), అతని కుమారుడు గదబరి ఈశ్వరరావు రెండు నెలల వ్యవధిలో మృతిచెందారు. తాటిపర్తి గ్రామానికి చెందిన సెగ్గె చిరంజీవి దీనికి బలయ్యాడని ఆ గ్రామ సర్పంచ్ వంజరి గంగరాజు తెలిపారు. తక్షణం సారాను అరికట్టాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. జెడ్ జోగింపేటకు చెందిన గదబరి కళ్యాణం, అతని కుమారుడు సమీపంలోని కొండపై గల సారాబట్టీల వద్దకు తరచూ వెళ్లి వేడివేడి నాటుసారా తాగేవారన్నారు. నిత్యం తాగడం వల్ల వారి ముఖం పాలిపోయి, ఒళ్లంతా పొంగి గుండె మంటతో ముందు తండ్రి, రెండు నెలలకు కుమారుడు మృతిచెందారన్నారు. తండ్రీకుమారుల మృతితో అత్త కొండమ్మ, కోడలు జ్యోతి, ఆమె ఇద్దరు పిల్లలు అనాధలయ్యారన్నారు. సెగ్గె చిరంజీవి తాగుడుకు వెళ్లి కొండపైనే మృతిచెందాడని వివరించారు. కొంజుర్తి, డూకులంపాడు, పెడెంపాలెం, అజేయపురం, కడగెడ్డ, బంగారుబందల, కళ్యాణపులోవ గ్రామాల్లో చాలామంది యువకులు పనులు మాని మత్తులో దొర్లుతున్నారని చెప్పారు. విచ్చలవిడిగా తయారీ మాడుగుల రూరల్ : పల్లెల్లో సారా విచ్చలవిడిగా తయారవుతోంది. గ్రామాల్లో బెల్టుషాపులు ఉన్నప్పుడు వాటి అమ్మకాలు సజావుగా సాగేందుకు వైన్‌షాపు యజమానులు రైడ్ పార్టీ ఏర్పాటు చేసి సారా తయారీని అడ్డుకునేవారు. ఇప్పుడు అవి లేకపోవడంతో సారా తయారీ పెరిగి చాలామంది ఆస్పత్రులపాలవుతున్నారు. సీహెచ్.గదబూరు, ఎం.గదబూరు, పోతనపూడి, జాలంపల్లి, శంకరం, అవురువాడ, తదితర గిరిజన పంచాయతీలకు చెందిన శివారు గ్రామాల్లో సారా బట్టీల సంఖ్య పెరిగి ఎక్సైజ్ సిబ్బందికి తలనొప్పిగా మారింది. దీంతో తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తున్నారు. దీనికితోడు సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఇక్కడ 12మంది కానిస్టేబుళ్లకు ఏడుగురు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఒకరు, ఇద్దరు ఎస్ఐలకు ఒక్కరే ఉన్నారు. వీరితో పాటు ఒక్క సీఐ ఉన్నారు. వీరి పరిధిలో రెండు మండలాలు ఉన్నాయి. -
ఏజెన్సీలో ఎక్సైజ్ పోలీసుల విస్తృత దాడులు
పాడేరు/ అరకు రూరల్, న్యూస్‌లైన్ : ఏజెన్సీలోని పలు మండలాల్లో ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో 180 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. పాడేరు, జి.మాడుగుల మండలాల్లో గురువారం జరిపిన దాడుల్లో 110 లీటర్ల సారాతో ఐదుగుర్ని అరెస్టు చేసినట్టు పాడేరు ఎక్సైజ్ మొబైల్ పార్టీ సీఐ ఉపేంద్ర తెలిపారు. 12వ మైలురాయి, కోట్లగరువు ప్రాంతాలలో సారా కలిగి ఉన్న భీమరాజు, భీమన్న, పోతురాజు, వరలక్ష్మి, రవణమ్మలను అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో జి.మాడుగుల మండలం రోలంగిపుట్టు, పాడేరు మండలం అల్లివర ప్రాంతాలలో నాటుసారా తయారీ బట్టీలను ధ్వంసం చేసి, సుమారు 4వేల లీటర్ల పులుపును నేలమట్టం చేశామని చెప్పారు. అరకులోయ నియోజకవర్గం అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని దముకు, అరకు, కొత్తూరు, తుమ్మనవలస, నినిమామిడివలస, యండపల్లివలస గ్రామాల్లో దాడులు నిర్వహించినట్టు ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఆర్.జైభీం, అరకులోయ ఎక్సైజ్ సీఐ శైలజారాణి తెలిపారు. అరకులోయ ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల జరిపిన ఈ దాడుల్లో 70 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, 2,400 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశామన్నారు. సారా విక్రయిస్తున్న ఎస్కే, చంటి, టి.లక్ష్మి, గాలి నారాయణ, జి. అప్పలస్వామి, బి.పొదొం, కిండంగి దామోదర్, కిల్లో మహాదేవ్‌లను అదుపులోకి తీసుకున్నామని శుక్రవారం కోర్టుకు తరలిస్తామని చెప్పారు.