- రెండు నెలల వ్యవధిలో తండ్రీ కుమారుడుతో సహా ముగ్గురు మృతి
- ఏరులై పారుతున్నా పట్టించుకోలేక పోతున్న ఎక్సైజ్‌శాఖ
- సిబ్బంది కొరతతో నామమాత్రంగా దాడులు
జెడ్.జోగింపేట(రావికమతం) : మండలంలోని మైదాన గిరిజన గ్రామాల్లో సారా ఏరులై పారుతుండడంతో తాగుడుకు బానిసలై యువకులు, వృద్దులు బలైపోతున్నారు. ముఖ్యంగా జెడ్.జోగింపేట గ్రామంలో గదబరి కళ్యాణం(56), అతని కుమారుడు గదబరి ఈశ్వరరావు రెండు నెలల వ్యవధిలో మృతిచెందారు. తాటిపర్తి గ్రామానికి చెందిన సెగ్గె చిరంజీవి దీనికి బలయ్యాడని ఆ గ్రామ సర్పంచ్ వంజరి గంగరాజు తెలిపారు. తక్షణం సారాను అరికట్టాలని సర్పంచ్ డిమాండ్ చేశారు.
జెడ్ జోగింపేటకు చెందిన గదబరి కళ్యాణం, అతని కుమారుడు సమీపంలోని కొండపై గల సారాబట్టీల వద్దకు తరచూ వెళ్లి వేడివేడి నాటుసారా తాగేవారన్నారు. నిత్యం తాగడం వల్ల వారి ముఖం పాలిపోయి, ఒళ్లంతా పొంగి గుండె మంటతో ముందు తండ్రి, రెండు నెలలకు కుమారుడు మృతిచెందారన్నారు. తండ్రీకుమారుల మృతితో అత్త కొండమ్మ, కోడలు జ్యోతి, ఆమె ఇద్దరు పిల్లలు అనాధలయ్యారన్నారు. సెగ్గె చిరంజీవి తాగుడుకు వెళ్లి కొండపైనే మృతిచెందాడని వివరించారు. కొంజుర్తి, డూకులంపాడు, పెడెంపాలెం, అజేయపురం, కడగెడ్డ, బంగారుబందల, కళ్యాణపులోవ గ్రామాల్లో చాలామంది యువకులు పనులు మాని మత్తులో దొర్లుతున్నారని చెప్పారు.
విచ్చలవిడిగా తయారీ
మాడుగుల రూరల్ : పల్లెల్లో సారా విచ్చలవిడిగా తయారవుతోంది. గ్రామాల్లో బెల్టుషాపులు ఉన్నప్పుడు వాటి అమ్మకాలు సజావుగా సాగేందుకు వైన్‌షాపు యజమానులు రైడ్ పార్టీ ఏర్పాటు చేసి సారా తయారీని అడ్డుకునేవారు. ఇప్పుడు అవి లేకపోవడంతో సారా తయారీ పెరిగి చాలామంది ఆస్పత్రులపాలవుతున్నారు. సీహెచ్.గదబూరు, ఎం.గదబూరు, పోతనపూడి, జాలంపల్లి, శంకరం, అవురువాడ, తదితర గిరిజన పంచాయతీలకు చెందిన శివారు గ్రామాల్లో సారా బట్టీల సంఖ్య పెరిగి ఎక్సైజ్ సిబ్బందికి తలనొప్పిగా మారింది. దీంతో తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తున్నారు. దీనికితోడు సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఇక్కడ 12మంది కానిస్టేబుళ్లకు ఏడుగురు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఒకరు, ఇద్దరు ఎస్‌ఐలకు ఒక్కరే ఉన్నారు. వీరితో పాటు ఒక్క సీఐ ఉన్నారు. వీరి పరిధిలో రెండు మండలాలు ఉన్నాయి.