సం‘సారా’లు బుగ్గి.. | People Making Natusara In Gokavaram East Godavari | Sakshi
Sakshi News home page

సం‘సారా’లు బుగ్గి..

Published Tue, Jul 23 2019 12:27 PM | Last Updated on Tue, Jul 23 2019 12:27 PM

People Making Natusara In Gokavaram East Godavari - Sakshi

గోకవరం మండలంలో సారా తయారు చేస్తున్న దృశ్యం (ఫైల్‌ ఫొటో)

సాక్షి, గోకవరం (తూర్పు గోదావరి): గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. గ్రామాల్లో బెల్టుషాపుల నియంత్రణతో మద్యం ప్రియులు సారా వైపు చూస్తున్నారు. దీనిని అదునుగా చూసుకుని సారా వ్యాపారులు జోరుగా సారా తయారు, అమ్మకాలు సాగిస్తున్నారు. గోకవరం మండలంలో 14 పంచాయతీలు ఉండగా సుమారు 30 వరకు గ్రామాలు ఉన్నాయి. పలు గ్రామాల్లో సారా తయారీ కుటీర పరిశ్రమగా మారింది. సారా తయారీ దారులు సారా తయారీలో బెల్లం ఊటతో పాటు అమ్మోనియా వంటి పలు రసాయన పదార్థాలు కలపడంతో కల్తీ సారా తయారు కావడంతో తాగే వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది.

ఈ విషయం తెలిసినా అలవాటును వదులుకోలేనివారు సారాకు బానిసై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. గోకవరంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారీదారులు పోలీస్, ఎక్సైజ్‌ అధికారుల కళ్లుగప్పి సారాను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మండలంలో తంటికొండ, కామరాజుపేట, కొత్తపల్లి, మల్లవరం, గోకవరం, అచ్యుతాపురం, ఇటికాయలపల్లి, గోపాలపురం, గాదెలపాలెం, వెదురుపాక తదితర గ్రామాల్లో సారా తయారీ ఎక్కువగా జరుగుతోంది.

ఆయా గ్రామాల్లో కాలువ గట్లు, మామిడి, జీడిమామిడి తోటల్లో భారీ స్థాయిలో సారా బట్టీలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రతిరోజూ వేల లీటర్ల సారా తయారవుతోంది. వీరికి గోకవరం, తదితర గ్రామాలకు చెందిన సారా బెల్లం వ్యాపారులు సారాను సరఫరా చేస్తున్నారు. గతంలో అర్ధరాత్రి సమయాల్లో సారాను తయారు చేసేవారు. సారా బెల్లం వ్యాపారులు నేరుగా బట్టీలకు సారా బెల్లాన్ని సరఫరా చేస్తుండడంతో పగటి పూటే ఈ సారా తయారీ జరుగుతోంది.

విచ్చలవిడిగా సారా అమ్మకాలు
మండలంలోని గోకవరం, తంటికొండ, ఇటికాయలపల్లి, అచ్యుతాపురం, కొత్తపల్లి, గాదెలపాలెం, గోపాలపురం, కామరాజుపేట, మల్లవరం తదితర గ్రామాల్లో సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా సారా అమ్మకాలు సాగుతుండడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా సారాకు బానిసలవుతున్నారు. కల్తీ సారా తాగడం వల్లన కొన్నేళ్ల క్రితం గుమ్మళ్లదొడ్డి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడగా, ఇటీవల తంటికొండకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. అలాగే అనేక మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇటీవల గోకవరం పోలీసులు పలు గ్రామాల్లో సారా అమ్మకాలు సాగిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.

అయినా ఇంకా అనేక గ్రామాల్లో సారా అమ్మకాలు సాగుతున్నాయి. దీనిపై ఎక్సైజ్‌శాఖ అధికారులు స్పందించి మండలంలో సారా తయారీ, అమ్మకాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. ఇటీవల అచ్యుతాపురం గ్రామంలో సారా తయారీ అమ్మకాలకు, తయారీకి వ్యతిరేకంగా గ్రామానికి చెందిన సీఐడీ యూత్‌ సభ్యులు ఉద్యమం చేపట్టారు.  దీనిలో భాగంగా ఆదివారం సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ప్రతి గ్రామంలో ఈ విధంగా యువత ముందుకు వచ్చి సారాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే మంచి ఫలితం ఉంటుంది.

నాలుగు నెలల్లో మార్పు తీసుకువస్తాం
సారా తయారీ, అమ్మకాలపై నాలుగు నెలల్లో మార్పు తీసుకువస్తామని కోరుకొండ ఎక్సైజ్‌ శాఖ సీఐ కోలా వీరబాబు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. గ్రామాల్లో సారా వ్యాపారస్తులతో గ్రామపెద్దల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి వారిలో చైతన్యం తీసుకువస్తామన్నారు. ముందస్తుగా బైండోవర్‌లు నమోదు చేస్తున్నామని, అప్పటికీ మారకపోతే పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

అచ్యుతాపురం గ్రామ శివారున తుప్పల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లం ఊట

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement