achyuthapuram
-
బాధితులకు మెరుగైన వైద్యం అందించండి
సాక్షి, అమరావతి: అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసిందని, ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుదని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రమాదంపై జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులతో బుధవారం రాత్రి ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచి, బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతకు ముందు ఈ ఘటనపై ఆయన అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హెల్త్ సెక్రటరీని తక్షణమే అచ్యుతాపురం వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్సులు వినియోగించాలని సూచించారు. కాగా, గురువారం ఘటన స్థలికి చంద్రబాబు వెళ్లనున్నారు. -
అచ్యుతాపురం సెజ్‌లో ఈఎస్ఐ హాస్పిటల్
సాక్షి, అమరావతి: వేగంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగులకు త్వరలో ఈఎస్ఐ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న డిస్పెన్సరీ స్థానంలో 30 పడకల హాస్పిటల్ నిర్మించాలని ఈఎస్ఐ నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 50 లక్షల మందికి పైగా ఈఎస్ఐ పథకం ప్రయోజనాలు పొందుతుండగా అందులో ఒక్క అచ్యుతాపురం సెజ్ పరిధిలోనే 60,000 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఇన్‌పేషెంట్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా 30 పడకల హాస్పిటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి అవసరమైన రెండు ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడానికి ఏపీఐఐసీ బోర్డు ఈ మధ్యనే ఆమోదం తెలిపింది. దీంతో అచ్యుతాపురంలోని ఏపీ సెజ్ ప్లాట్ నెంబర్ 45లోగల రెండు ఎకరాల భూమిని ఈఎస్ఐ కార్పొరేషన్‌కు ఉచితంగా ఇస్తూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీఐఐసీని ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
తమ్ముడిని చంపిన అన్న
అచ్యుతాపురం: తనను కాదన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే కక్షతో తోడబుట్టిన తమ్ముడిని ఓ అన్న కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం జాలరిపాలెంలో జరిగింది. వివరాలు.. పూడిమడక శివారు జాలరిపాలేనికి చెందిన మడ్డు పోలమ్మ పెద్ద కుమారుడు రాజుకు పెళ్లి చేయడానికి ఇటీవల భీమిలికి చెందిన అమ్మాయిని చూశారు. కానీ ఆ అమ్మాయి పోలమ్మ చిన్న కుమారుడు యర్లయ్య(21)ను చేసుకుంటానని చెప్పింది. దీంతో పోలమ్మ ఆ సంబంధాన్ని యర్లయ్యకు ఖాయం చేసింది. రాజుకు మరో సంబంధం చూస్తానని నచ్చచెప్పింది. మే నెలలో పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టుకున్నారు. యర్లయ్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండడంతో రాజు అసహనానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో సోమవారం యర్లయ్య ఫోన్ కొనుక్కుంటానని తల్లి పోలమ్మను డబ్బులడిగాడు. ఆమె రూ.2 వేలు ఇవ్వగా.. అవి సరిపోవని రూ.4వేలు కావాలంటూ తల్లితో గొడవ పడ్డాడు. ఇంతలో యర్లయ్యను అడ్డుకున్న రాజు.. వలను అల్లడానికి ఉపయోగించే ఒరుగు అని పిలిచే కత్తిని అమాంతం తమ్ముడి గొంతులో దించాడు. వెంటనే అక్కడ్నుంచి పారిపోయాడు. యర్లయ్యను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ జరిపారు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. తనను కాదన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే కక్షతోనే తమ్ముడిని హత్య చేసినట్లు రాజు అంగీకరించాడని సీఐ నారాయణరావు, ఎస్ఐ లక్ష్మణరావు వెల్లడించారు. -
సం‘సారా’లు బుగ్గి..
సాక్షి, గోకవరం (తూర్పు గోదావరి): గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. గ్రామాల్లో బెల్టుషాపుల నియంత్రణతో మద్యం ప్రియులు సారా వైపు చూస్తున్నారు. దీనిని అదునుగా చూసుకుని సారా వ్యాపారులు జోరుగా సారా తయారు, అమ్మకాలు సాగిస్తున్నారు. గోకవరం మండలంలో 14 పంచాయతీలు ఉండగా సుమారు 30 వరకు గ్రామాలు ఉన్నాయి. పలు గ్రామాల్లో సారా తయారీ కుటీర పరిశ్రమగా మారింది. సారా తయారీ దారులు సారా తయారీలో బెల్లం ఊటతో పాటు అమ్మోనియా వంటి పలు రసాయన పదార్థాలు కలపడంతో కల్తీ సారా తయారు కావడంతో తాగే వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఈ విషయం తెలిసినా అలవాటును వదులుకోలేనివారు సారాకు బానిసై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. గోకవరంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారీదారులు పోలీస్, ఎక్సైజ్ అధికారుల కళ్లుగప్పి సారాను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మండలంలో తంటికొండ, కామరాజుపేట, కొత్తపల్లి, మల్లవరం, గోకవరం, అచ్యుతాపురం, ఇటికాయలపల్లి, గోపాలపురం, గాదెలపాలెం, వెదురుపాక తదితర గ్రామాల్లో సారా తయారీ ఎక్కువగా జరుగుతోంది. ఆయా గ్రామాల్లో కాలువ గట్లు, మామిడి, జీడిమామిడి తోటల్లో భారీ స్థాయిలో సారా బట్టీలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రతిరోజూ వేల లీటర్ల సారా తయారవుతోంది. వీరికి గోకవరం, తదితర గ్రామాలకు చెందిన సారా బెల్లం వ్యాపారులు సారాను సరఫరా చేస్తున్నారు. గతంలో అర్ధరాత్రి సమయాల్లో సారాను తయారు చేసేవారు. సారా బెల్లం వ్యాపారులు నేరుగా బట్టీలకు సారా బెల్లాన్ని సరఫరా చేస్తుండడంతో పగటి పూటే ఈ సారా తయారీ జరుగుతోంది. విచ్చలవిడిగా సారా అమ్మకాలు మండలంలోని గోకవరం, తంటికొండ, ఇటికాయలపల్లి, అచ్యుతాపురం, కొత్తపల్లి, గాదెలపాలెం, గోపాలపురం, కామరాజుపేట, మల్లవరం తదితర గ్రామాల్లో సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా సారా అమ్మకాలు సాగుతుండడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా సారాకు బానిసలవుతున్నారు. కల్తీ సారా తాగడం వల్లన కొన్నేళ్ల క్రితం గుమ్మళ్లదొడ్డి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడగా, ఇటీవల తంటికొండకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. అలాగే అనేక మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇటీవల గోకవరం పోలీసులు పలు గ్రామాల్లో సారా అమ్మకాలు సాగిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అయినా ఇంకా అనేక గ్రామాల్లో సారా అమ్మకాలు సాగుతున్నాయి. దీనిపై ఎక్సైజ్‌శాఖ అధికారులు స్పందించి మండలంలో సారా తయారీ, అమ్మకాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. ఇటీవల అచ్యుతాపురం గ్రామంలో సారా తయారీ అమ్మకాలకు, తయారీకి వ్యతిరేకంగా గ్రామానికి చెందిన సీఐడీ యూత్ సభ్యులు ఉద్యమం చేపట్టారు. దీనిలో భాగంగా ఆదివారం సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ప్రతి గ్రామంలో ఈ విధంగా యువత ముందుకు వచ్చి సారాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే మంచి ఫలితం ఉంటుంది. నాలుగు నెలల్లో మార్పు తీసుకువస్తాం సారా తయారీ, అమ్మకాలపై నాలుగు నెలల్లో మార్పు తీసుకువస్తామని కోరుకొండ ఎక్సైజ్ శాఖ సీఐ కోలా వీరబాబు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. గ్రామాల్లో సారా వ్యాపారస్తులతో గ్రామపెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో చైతన్యం తీసుకువస్తామన్నారు. ముందస్తుగా బైండోవర్లు నమోదు చేస్తున్నామని, అప్పటికీ మారకపోతే పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నారు. -
అతిథి ఉన్నా.. ఆదాయం కరువు
సాక్షి, అచ్యుతాపురం (విశాఖపట్నం): అతిథి గృహాలున్నా ఆదాయం మాత్రం సున్నా. ఎస్ఈజెడ్ పరిశ్రమలు, కొండకర్ల ఆవ, తంతడి బీచ్ పర్యాటక ప్రదేశాలు ఉన్నందున అతిథి గృహాలకు గిరాకీ ఉంది. పరిశ్రమలకు వచ్చే అతిథులు, పర్యాటకం కోసం వచ్చే ఔత్సాహికులు సేదదీరడానికి అతిథి గృహాల అవసరం ఉంది. అతిథుల తాకిడి ఎక్కువకావడంతో ఇక్కడ ఏడు లాడ్జీలు వెలిశాయి. ఒక్కొక్క గదికి రోజువారి అద్దె రూ.15 వందల వరకూ ఉంది. ఇలా ప్రైవేట్ లాడ్జీలకు రూ.వేలల్లో ఆదాయం వస్తున్నా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన జెడ్పీ అతిథి గృహానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రావడం లేదు. అద్దెకు ఇస్తారన్న సమాచారం ఎవరికీ తెలియదు. ఇన్నాళ్ల నుంచి ప్రజాప్రతినిధులు అతిథి గృహాన్ని వాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు సొంత జాగీరుగా అతిథి గృహాన్ని వాడుకున్నారు. ఈ అతిథి గృహంలో అన్ని వసతులు ఉన్నందున రోజుకు రూ.ఐదు వేలకు మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కొండకర్లలో అతిథి గృహ భవనం శిథిలమైంది. గతంలో ఇక్కడి గదులు అద్దెకు ఇచ్చేవారు. అద్దెను అక్కడి వాచ్మెన్ తీసుకొనేవాడు. ఇప్పుడు భవనం శిథిలమవడంతో ఆదాయం రాలేదు. ఉండేందుకు సౌకర్యాల్లేక.. కొండకర్ల, తంతడి బీచ్, అచ్యుతాపురం,చోడపల్లి పరిధిలో గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం అవసరం ఉంది. పర్యాటక ప్రదేశాలకు కుటుంబ సమేతంగా పర్యాటకులు వస్తున్నారు. వారు సేదదీరడానికి అతిథిగృహాల అవసరం ఉంది. తీరప్రాంతంలో విరివిగా సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. వారికి అతిథిగృహాలు అందుబాటులో లేకపోవడంతో విశాఖకు తరలివెళ్లిపోతున్నారు. పంచాయతీలకు ఆదాయం కరువు మండల పరిషత్ కార్యాలయం వద్ద అతిథిగృహం ఉంది. తంతడిలో రెండు తుపాను షెల్టర్లు ఉన్నాయి. ఎస్ఈజెడ్కు సమీపంలో పూడిమడకలో మూడు తుపాను షెల్టర్లు ఉన్నాయి. తుపాను సమయంలో వీటి అవసరం ఉంటుం ది. అంతవరకూ ఖాళీగా ఉంటున్నాయి. ఒక్కక్క భవనానికి ప్రభుత్వం రూ.కోటికి మించి వెచ్చించింది. భవనం బాగోగులు చూడకపోతే పాడైపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం భవనం వాచ్మెన్లు అనధికారికంగా భవనాన్ని అద్దెకు ఇచ్చి తృణమోపణమో తీసుకుంటున్నారు. తంతడిలో తుపాను షెల్టర్‌ని నెలరోజులు సీరియల్ షూటింగ్‌కి అనధికారికంగా అద్దెకు ఇచ్చారు. గ్రామంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఈ సొమ్ము స్వాహా చేశారన్న విమర్శలున్నాయి. పంచాయతీకి ఏమాత్రం ఆదాయం రాలేదు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా.. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన తుఫాను షెల్టర్లు గ్రామనాయకుల విలసాలకు అడ్డాగా మారింది. ఆధునిక వసతులతో నిర్మించిన భవనాలలో పేకటరాయుళ్లు దర్జాగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గ్రామనాయకుల ఇళ్లలో వేడుకలు జరిగినప్పుడు తుపానుòషెల్టర్లను విడిదిగా వినియోగిస్తున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు మండలానికి వచ్చినప్పుడు సేదదీరడానికి మాత్రమే గెస్ట్‌హౌస్‌లు ఉపయోగపడుతున్నాయి. ఎలాంటి ఆదాయం సమకూరలేదు. ఆదాయం పోతోంది అచ్యుతాపురం పరిసరాలలో చిన్న గదికి రూ.3 వేల అద్దె వస్తుంది. పరిశ్రమలకు వచ్చేవారు. పర్యాటకులకు రోజువారీగా అద్దెకు గెస్ట్ హౌస్‌లు కావాలి. రూ.లక్షల ఖర్చుతో నిర్మించిన గెస్ట్‌హౌస్‌లు ఇంతవరకూ అద్దెకు ఇచ్చిన దాఖలాలు లేవు. రూపాయి ఆదాయం రాలేదు. గెస్ట్‌హౌస్‌లు, ప్రైవేటు భవనాలను పంచాయతీకి అప్పగించి అద్దెకి ఇస్తే సమృద్ధిగా ఆదాయం వస్తుంది. – సూరాడ ధనరాజు, పూడిమడక అద్దెకు ఇస్తే రూ.వేలల్లో ఆదాయం తంతడిలో పర్యాటకులు సంఖ్య పెరిగింది. షూటింగ్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోట్ల రూపాయలతో నిర్మించిన తుఫాను షెల్టర్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని అద్దెకి ఇచ్చి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. పంచాయతీ సిబ్బందిలో ఒకరు భవనాలను అద్దెకు ఇచ్చే ప్రక్రియపై దృష్టిసారించడంతో నెలకు రూ.20వేల ఆదాయం వస్తుంది. ఇకనైనా అధికారులు దృష్టిపెట్టి ప్రస్తుతం ఉన్న ఖాళీభవనాలను అద్దెకు ఇవ్వడంతో ఆదాయం వస్తుంది. పారిశుధ్యం, తాగునీటి సమస్యను పరిష్కరించుకోవడానికి వీలవుతుంది. – చోడిపల్లి దేముడు, తంతడి -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ..బాలిక మృతి
కొత్తగూడెం: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ బాలిక మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అచ్యుతాపురం వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రమాదంలో మౌనిక(16) మృతిచెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన గ్రామస్థులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.