అక్రమాల వసారా..! | Police Attack on Natusara Camp Srikakulam | Sakshi
Sakshi News home page

అక్రమాల వసారా..!

Published Tue, Feb 26 2019 10:36 AM | Last Updated on Tue, Feb 26 2019 10:36 AM

Police Attack on Natusara Camp Srikakulam - Sakshi

పాలకొండ రెల్లి వీధిలో ప్యాకెట్లుగా మార్చిన సారాను స్వాధీనం చేసుకున్న అధికారులు

ఏజెన్సీ వసారాలో నాటుసారా పూటుగా ప్రవహిస్తోంది. ఎన్నిమార్లు దాడులు చేసినా, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా గిరిజన గూడేల్లో ‘నాటు’ బట్టీల మంట ఆగనంటోంది. వందల సంఖ్యలో మందుబాబులు ఆస్పత్రుల పాలవుతున్నారు, తయారు చేస్తున్న వారూ అనారోగ్యం బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయినా ఈ బాట వీడడం లేదు. ప్రధానంగా పాలకొండ డివిజన్‌లోని    ఏజెన్సీలోనూ, కాశీబుగ్గ, మందస పరిసర ప్రాంతాల్లోనూ నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తక్కువ ధరకే లభ్యమవుతుండడంతో సమీప గ్రామాల గిరిజనులతో పాటు మైదాన ప్రాంత వాసులు కూడా ఈ నిషాకు బానిసలైపోతున్నారు.

శ్రీకాకుళం, పాలకొండ: సారా మహమ్మారి ఏజెన్సీని పట్టి పీడిస్తోంది. నిత్యం ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేస్తున్నా నాటుసారా తయారీని నియంత్రించలేకపోతున్నారు. ప్రధానంగా సీతంపేట మండలంలోని నారాయణ గూడలో అయితే ఇది దాదాపు కుటీర పరిశ్రమగా మారిపోయింది. మండ, మండగూడ, శంబాం, టిటుకుపాయి, పాలకొండ మండలంలోని బ ర్న, వీరఘట్టం మండలంలోని అచ్చెపువలస తదితర గిరిజన గ్రామాల్లో నిత్యం సారా తయా రు చేస్తున్నారు. మందస, కాశీబుగ్గ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లోనూ సారా తయారీ, విక్రయం అధిక మొత్తంలో సాగుతోంది. ఈ ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోల ద్వారా పాలకొండ, రాజాం, వీరఘట్టం, మం దస, సోంపేట, కాశీబుగ్గ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాలకొండ పట్టణంలోని రెల్లివీధిలో సారా అమ్మకాలు కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. నిత్యం వందల మంది నాటుసారా కోసం ఇక్కడకు వస్తున్నారు.

కల్తీతో ప్రమాదం
ఇటీవల కాలంలో రెల్లివీధిలో సారా తాగి తిరిగి వస్తున్న సమయంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే వీరు మద్యానికి బానిసలు కావడంతో వీరి మరణాలపై పెద్దగా ఫిర్యాదులు లేవు. వాస్తవంగా ఏజెన్సీ నుంచి సారాను 10 లీటర్ల క్యాన్‌లతో ఇక్కడకు తీసుకువస్తున్నారు. రెండు క్యాన్‌లతో ఉన్న కావిడిని రూ.1600కు కొంటున్నారు. దీన్ని నీళ్లతో కల్తీ చేసి రెండు రెట్లు చేస్తున్నారు. మత్తు తగ్గకుండా ఉండడానికి స్పిరిట్‌ను కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నారు. దీంతో సారాకు అలవాటు పడిన వారు కొంచెంకొంచెంగా మరణానికి చేరువవుతున్నారు. ప్రతి రోజు 40నుంచి 60 క్యాన్‌ల సారా దిగుమతి అవుతున్నట్లు అంచనా. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ప్రస్తుతం సారాకు మరింత గిరాకీ పెరిగింది.

ప్రమాదకర రసాయనాల వినియోగం
నాటుసారా తయారీకి ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నారు. ప్రధాన వనరు పు లిసిన బెల్లం కాగా ఇందులో పంటలకు విని యోగించే యూరియాను అధికంగా వినియోగిస్తారు. దీనికి తోడు మత్తు కోసం పలు మొ క్కల నుంచి సేకరించిన వేళ్లను వాడుతారు. దీంతో సారాలో మత్తు చేరుతుంది. ఇది సారా తాగేవారిని కొంచెకొంచెంగా బానిసలుగా మార్చి, శరీరంలోని అవయవాలను ధ్వంసం చేస్తుంది.

తక్కువ ధర కావడంతో..
మద్యానికి బానిసలైన వారు ఈ సారాను తాగుతున్నారు. ప్రతి ఊరిలోనూ బెల్టుషాపులు ఉన్నా ఇటే చూస్తున్నారు. మద్యం దుకాణాల్లో అధిక ధరలు ఉండడం, వాటిలోనూ కల్తీ ఆరోపణలు ఉండడంతో మందుబాబులు సారా తాగడానికి మొగ్గు చూపుతున్నారు. రూ.20కే నాటు సారా లోటాతో దొరుకుంది. మత్తు కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో రోజురోజుకు నాటుసారా తాగేవారి సంఖ్య పెరుగుతోంది. సాయంత్రం పాలకొండ–సీతంపేట రహదారి, మందస నుంచి గిరిజన ప్రాంతాలకు వెళ్లే దారిలో నాటుసారా కోసం వెళ్లే వారి సంఖ్య చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.

80 శాతం మద్యం బాధితులే
ఆస్పత్రికి వస్తున్న కేసుల్లో 80 శాతం మంది మద్యం బానిసలే ఉంటున్నారు. ప్రతి రోజు నాటుసారా తాగిన వారి అవయవాలు పూర్తిగా దెబ్బతిని ఉంటున్నాయి.  పేద కుటుంబాలకు చెందిన వారే అధికంగా ఉంటున్నారు. నరాలు పనిచేయక కాళ్లు,     చేతులు చచ్చుపడిపోయి అనారోగ్యంతో మరణిస్తున్నారు.– జె.రవీంద్రకుమార్, వైద్యులు

ప్రభుత్వ ఆస్పత్రినిరంతరం దాడులు చేస్తున్నాం
నాటుసారా తయారీపై నిరంతరం దాడులు చేస్తున్నాం. ప్రతి రోజు కనీసం 40 మంది సిబ్బంది గిరిజన గ్రామాల్లో దాడులు చేస్తున్నాం. అయినా తయారీ ఆగడం లేదు. సారా తయారీ దారులు మాపై ఎదురుదాడులకు తెగబడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే కుటీర పరిశ్రమలా చేస్తున్నారు. రవాణాపై దృష్టి సారించాం. ప్రధాన జంక్షన్ల వద్ద నిఘా ఏర్పాటు చేశాం. నవోదయం కార్యక్రమం ద్వారా సారాతో అనర్థాలను వివరిస్తున్నాం.– టీవీఆర్‌ మూర్తి, సీఐ, ఎక్సైజ్‌ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement