కాసులు గలగల! | double for Alcohol sales in distric | Sakshi
Sakshi News home page

కాసులు గలగల!

Published Sat, Mar 12 2016 1:48 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

కాసులు గలగల! - Sakshi

కాసులు గలగల!

రెండింతలైన మద్యం అమ్మకాలు
నాటుసారాను అరికట్టడమే కారణం
ఊరూరా వెలుస్తున్న బెల్టు షాపులు
70 శాతం అమ్మకాలు పల్లెల్లోనే..
గుడుంబా విక్రయదారులపై కేసులు

 ఒక్క పరిగి ఎక్సైజ్ ఠాణా పరిధిలో అమ్మకాలు
2014 చివరి త్రైమాసికంలో విక్రయాలు : రూ.8.94  కోట్లు
2015 చివరి త్రైమాసికంలో విక్రయాలు : రూ.18.28 కోట్లు
నాటుసారాపై ‘ఎక్సైజ్’ వేటు..! సర్కారు మద్యం సేల్స్ రెట్టింపు..!!
బెల్టుషాపుల్లో  విక్రయాలు70%
మద్యం దుకాణాల్లో విక్రయాలు30%
నాటుసారా విక్రేతలపై పెరిగిన కేసులు50%


మద్యంపై రాబడి రెట్టింపైంది. గ్రామాల్లో నాటుసారాపై ఉక్కుపాదం మోపడంతో మందుబాబులు సర్కారు మద్యంపై ఆధారపడినట్టు పెరిగిన ఎక్సైజ్ ఆదాయం చెబుతోంది. మారుమూల పల్లెలు, గిరిజన గ్రామాల్లో నాలుగైదు నెలల క్రితం వరకు ఏరులై పారిన నాటుసారా ఇప్పుడు సగానికిసగం తగ్గింది. ఇన్నాళ్లు నాటుసారాపై చూసీచూడనట్టు వ్యవహరించిన ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశారు. అదే సమయంలో నాటుసారా తయారు చేస్తున్న వారిపై కేసులు కూడా పెరిగాయి. ఒక్క పరిగి ఎక్సైజ్ ఠాణా పరిధిలో 2014, 2015 సంవత్సరాల్లోని చివరి మూడు నెలల అమ్మకాలు, ఆదాయాలను పోల్చిచూస్తే స్పష్టమైన తేడాలు కన్పిస్తున్నాయి.  - పరిగి

నల్లబెల్లం విక్రయదారులపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నారు. 2015 సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఏకంగా 150 మంది సారా విక్రేతలను బైండోవర్ చేశారు. 80 మందిపై  కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారు.

పరిగి : ఎక్సైజ్ శాఖ నాటుసారాపై ఉక్కుపాదం మోపిన తర్వాత మద్యం రాబడి రెండింతలైంది. 2014 చివరి త్రైమాసికం (అక్టోబర్, నవంబర్, డిసెంబర్)లో పరిగి ఎక్సైజ్ ఠాణా పరిధిలోకి వచ్చే నాలుగు మండలాలకు చెందిన 11 మద్యం దుకాణాల్లో 17,772 లిక్కర్ బాక్సులు, 31,726 బీర్ బాక్సులు అమ్ముడవగా రూ.8,94,404,14 విలువ చేసే అమ్మకాలు జరిగాయి. 2015 ఆరంభం నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరు నెలల కాలంనాటు నాటుసారాపై ఉక్కుపాదం మోపారు. తండాలు, గ్రామాలు వడ పోసి సారా కనిపించని స్థాయికి పరిస్థితిని తీసుకొచ్చారు. దీంతో మందుబాబులు లిక్కర్‌వైపు చూశారు. ప్రభుత్వ లక్ష్యం కూడా ఇదే కావడంతో గ్రామాల్లోనూ బెల్టు షాపులను చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో అమ్మకాలు జోరందుకున్నాయి. పరిగి ఎక్సైజ్ ఠాణా పరిధిలోని అవే 11 మద్యం దుకాణాల్లో 2015 చివరి త్రైమాసికంలో 41,272 లిక్కర్ బాక్సులు, 40,380 బీరు బాక్సులు, అమ్ముడవగా ఏకంగా రెండింతలకుపైగా రూ.18,28,57,371 అమ్మకాలు జరిగాయి.

 విచ్చలవిడి మద్యం అమ్మకాలూ.. కారణమే..
సారాపై ఉక్కుపాదం మోపడంతోపాటు మద్యం అమ్మకాల్లో విచ్చలవిడితనం కూడా అమ్మకాలు రెంట్టిపవడానికి కారణంగా తెలుస్తోంది.
పరిగి నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ప్రస్తుతం కిరాణా దుకాణాలకంటే బెల్టు షాపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 550 నుంచి 600 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో నాటుసారా విక్రయించే ప్రతి తండాలో ప్రస్తుతం బెల్టు షాపులు వెలిశాయి. దాబాలు, కిరాణా దుకాణాలు.. ఇలా ఎక్కడపడితే అక్కడ మద్యం విక్రయిస్తుండటంతో అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. నేరుగా లైసన్డ్ దుకాణాల గిరాకీ 30శాతం ఉంటుండగా బెల్టు షాపుల ద్వారానే 70 శాతం మద్యం విక్రయిస్తున్నారు. రోజుకు రూ.లక్ష విలువైన అమ్మకాలు అయ్యే షాపులో నేడు రూ. రెండు లక్షలు అవుతున్నాయి.  

 సారా కట్టడికి కేసులు, బైండోవర్లు..
సారా కట్టడి చేసేందుకు ఎక్సైజ్ అధికారులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. సారా తయారీకి వినియోగించే నల్లబెల్లం విక్రయదారులపై పీడీ యాక్టులు నమోదు చేశారు. సారాపై ఉక్కుపాదం మోపిన 2015 సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఏకంగా 150 మంది సారా విక్రేతలను బైండోవర్ చేశారు. 80 మందిపైన కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారు. రెండోసారి విక్రయించిన కొందరికి రూ.లక్ష వరకు జరిమానా విధించారు. ఇదే సమయంలో అవగాహన సదస్సులు సైతం నిర్వహించారు. ఏదిఏమైనా సారా విక్రయాలు ఆపి మద్యం విక్రయాలు మాత్రం పెంచగలిగారన్నది వాస్తవం.

ఆరోగ్యం దృష్ట్యే సారాపై సమరం
గ్రామాల్లో ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా తయారుచేసిన సారాతో అనేక మంది ఆరోగ్యాలు పాడుచేసుకున్నారు. ప్రాణాలు కూడా తీసుకున్నారు. నాటుసారా తాగే వారికి, తయారు చేసే, రవాణా చేసే, విక్రయించే వారికి అవగాహన కల్పించాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ ఆదేశాల మేరకు సారాను నిర్మూలించగలిగాం.  - శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ, పరిగి

 కల్లుదుకాణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
బషీరాబాద్ : ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మునీరొద్దీన్, సీఐ మాధవయ్య ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని దామర్‌చెడ్‌లో ఓ కల్లు దుకాణంపై దాడి చేశారు. 24 సీసాల్లో ఉన్న కల్తీకల్లును ధ్వంసం చేశారు.

 వ్యక్తి అదృశ్యం
జవహర్‌నగర్: చెన్నై బయలుదేరి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. సీఐ నర్సింహారావు కథనం ప్రకారం.. యాప్రాల్‌కు చెందిన శంకర్ (33) ఈనెల 8న చెన్నై వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లి ఆచూకీ లేకుం డా పోయాడు. దీంతో ఆమె భార్య శంకరమ్మ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement