పాడేరు/ అరకు రూరల్, న్యూస్‌లైన్ : ఏజెన్సీలోని పలు మండలాల్లో ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో 180 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. పాడేరు, జి.మాడుగుల మండలాల్లో గురువారం జరిపిన దాడుల్లో 110 లీటర్ల సారాతో ఐదుగుర్ని అరెస్టు చేసినట్టు పాడేరు ఎక్సైజ్ మొబైల్ పార్టీ సీఐ ఉపేంద్ర తెలిపారు. 12వ మైలురాయి, కోట్లగరువు ప్రాంతాలలో సారా కలిగి ఉన్న భీమరాజు, భీమన్న, పోతురాజు, వరలక్ష్మి, రవణమ్మలను అరెస్టు చేశామన్నారు.
ఈ దాడుల్లో జి.మాడుగుల మండలం రోలంగిపుట్టు, పాడేరు మండలం అల్లివర ప్రాంతాలలో నాటుసారా తయారీ బట్టీలను ధ్వంసం చేసి, సుమారు 4వేల లీటర్ల పులుపును నేలమట్టం చేశామని చెప్పారు. అరకులోయ నియోజకవర్గం అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని దముకు, అరకు, కొత్తూరు, తుమ్మనవలస, నినిమామిడివలస, యండపల్లివలస గ్రామాల్లో దాడులు నిర్వహించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఆర్.జైభీం, అరకులోయ ఎక్సైజ్ సీఐ శైలజారాణి తెలిపారు.
అరకులోయ ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల జరిపిన ఈ దాడుల్లో 70 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, 2,400 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశామన్నారు. సారా విక్రయిస్తున్న ఎస్‌కే, చంటి, టి.లక్ష్మి, గాలి నారాయణ, జి. అప్పలస్వామి, బి.పొదొం, కిండంగి దామోదర్, కిల్లో మహాదేవ్‌లను అదుపులోకి తీసుకున్నామని శుక్రవారం కోర్టుకు తరలిస్తామని చెప్పారు.
ఏజెన్సీలో ఎక్సైజ్ పోలీసుల విస్తృత దాడులు
Published Fri, Sep 13 2013 2:46 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement