అంతరించిపోతున్న అరుదైన జీవి.. ప్రపంచంలోనే అతి చిన్న జీవాలు  | Chevrotain An endangered rare creature of deer | Sakshi
Sakshi News home page

అంతరించిపోతున్న అరుదైన జీవి.. ప్రపంచంలోనే అతి చిన్న జీవాలు 

Published Tue, Nov 22 2022 5:04 AM | Last Updated on Tue, Nov 22 2022 8:33 AM

Chevrotain An endangered rare creature of deer - Sakshi

నల్లమలలో సంచరిస్తున్న మూషిక జింకలు

దుష్టశిక్షణ..శిష్ట రక్షణ కోసం సాక్షాత్తు శ్రీమహావిష్ణువే నరుడు.. సింహం రూపాలతో నరసింహుడిగా అవతరించాడనేది పురాణ గాథ. నల్లమల అడవుల్లో మాత్రం మూషిక మొహం.. జింక దేహంతో ఓ బుల్లి ప్రాణి నరసింహుడి కంటే అంతకు ముందే అవతరించింది. ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్న ప్రాణి అయిన దీనిని మూషిక జింక అంటారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టిన మూషిక జింక శరీర అమరికలో అప్పటినుంచి ఇప్పటివరకు ఎటువంటి మార్పులు జరగలేదట. అందుకే దీనిని సజీవ శిలాజంగా కూడా పరిగణిస్తారు. 

పెద్దదోర్నాల (ప్రకాశం): మూషిక జింక.. ప్రపంచంలోనే అతి బుల్లి జింక. ఆంగ్లంలో మౌస్‌ డీర్‌ లేదా చెవ్రోటేన్‌గా పిలిచే ఈ జీవి గుండ్రని దేహం.. చిన్న చిన్న కాళ్లతో  25 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు, 10 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది. నెమరు వేసుకునే జీవుల్లో పొట్టలో మూడు గదులుండే జీవి ఇదొక్కటే. ప్రపంచంలో క్రమేపీ అంతరించిపోతున్న మూగ జీవాలలో ఒకటైన మూషిక జింకలకు కొమ్ములు ఉండవు. నల్లమల అభయారణ్యంలో సంచరించే అత్యంత చిన్న జీవులు ఇవి. దక్షిణాసియా దేశాలైన భారత్, శ్రీలంక, దేశాలలోనే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గడ్డి పరకలు, ఆకులు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుని జీవిస్తాయి.  

బరువు తక్కువ.. భయం ఎక్కువ 
మూడు కిలోల వరకు బరువు పెరిగే ఈ జీవులు కొమ్ములు లేని కారణంగా పగలంతా గుబురు పొదల్లోనే దాగి ఉంటాయి. కేవలం రాత్రి పూట మాత్రమే ఆరు బయట సంచరిస్తుంటాయి. వీటి గర్భధారణ సమయం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. వీటి జీవిత కాలం కూడా ఆరేళ్లకు మించి ఉండదు. అడవిలో సంచరించే ఏ చిన్న మాంసాహార ప్రాణులైనా వీటిని అవలీలగా వేటాడే అవకాశం ఉంటుంది. ఆకాశంలో సంచరించే గద్దలు, గరుడ పక్షులు నుంచి కూడా వీటికి ఎక్కువగా ముప్పు ఉంటుంది. అవి అవలీలగా వీటిని నోటకరుచుకుని ఆకాశంలోకి ఎగిరిపోయే ప్రమాదం ఉన్నందున పగలు చెట్ల పొదల్లోనే దాగి రాత్రి పూట మాత్రమే అడవిలో సంచరిస్తుంటాయి. 

నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం 
అంతరించిపోతున్న వన్య ప్రాణుల జాతులను సంరక్షించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కేంద్ర జంతు సాధికార సంస్థ అంతరించిపోతున్న ఒక్కో వన్యప్రాణి జాతిని సంరక్షించే బాధ్యతను ఒక్కో జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించింది. తిరుపతి జూ పార్క్‌కు అడవి కోడి, విశాఖపట్నం జూ పార్క్‌కు వైల్డ్‌డాగ్, హైదరాబాద్‌ జూ పార్కుకు మౌస్‌డీర్‌ సంరక్షణ బాధ్యతల్ని కేటాయించింది.

ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న మూషిక జింకలను సంరక్షించటంతో పాటు వాటి పునరుత్పత్తి ప్రక్రియను హైదరాబాద్‌ జూ పార్క్‌ 2010లో చేపట్టింది. నాలుగు ఆడ మూషిక జింకలు, రెండు మగ మూషిక జింకలతో హైదరాబాద్‌ జూ పార్క్‌లో వీటి సంరక్షణçతో పాటు పునరుత్పత్తిని ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన ఐదేళ్లలోనే వాటి సంఖ్యను భారీగా పెంచగలిగారు. పునరుత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసి మూషిక జింకలను ఆమ్రాబాద్, అచ్చంపేట అడవుల్లో వదిలిపెట్టారు.    

రాత్రి పూట మాత్రమే సంచరిస్తాయి 
నల్లమల అభయారణ్యంలో వీటి సంచారం ఎక్కువగా ఉంది. మాంసాహార వన్యప్రాణులు, పక్షుల బారినుంచి కాపాడుకునేందుకు రాత్రి పూట మాత్రమే ఇవి అడవిలో సంచరిస్తుంటాయి. పగటి పూట చెట్ల పొదలోపల నివాసం ఉంటాయి. అంతరించిపోతున్న ఈ జాతిని సంరక్షించేందుకు గతంలో హైదరాబాద్‌ జూపార్క్‌ అధికారులు చర్యలు చేపట్టారు.  
– విశ్వేశ్వరావు, ఫారెస్ట్‌ రేంజి అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement