జంతువుల ఆరోగ్య సంరక్షణ విభాగంలో సేవలందిస్తున్న జోయిటిస్ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ)ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఇండియాలో తన కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తోంది. ఈ సెంటర్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.
‘అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు తమ వ్యాపారాలు విస్తరించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. దాంతో స్థానికంగా యువతకు ఉపాధి లభిస్తోంది. జంతువుల ఆరోగ్య సంరక్షణ విభాగంలో తెలంగాణలో వ్యాపారాన్ని విస్తరించేందుకు చాలా అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో కంపెనీలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. సంస్థలకు కావాల్సిన నైపుణ్యాల కోసం స్థానిక యువతను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’ అన్నారు.
జోయిటిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ మాట్లాడుతూ..‘హైదరాబాద్ జోయిటిస్ ఇండియా కేపబులిటీ సెంటర్‌కు అనువైన ప్రదేశమని భావిస్తున్నాం. భవిష్యత్తులో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు హైదరాబాద్ కీలకంగా మారనుంది. కాబట్టి కంపెనీ కార్యకలాపాలు ఇక్కడ విస్తరించాలని నిర్ణయించాం. సాంకేతిక ఆవిష్కరణలతో జంతు ఆరోగ్య సంరక్షణ అందించడం కంపెనీ ముఖ్య ఉద్దేశం. జంతువులకు డయాగ్నోసిస్, వైద్యం వంటి ప్రాథమిక సేవలందిస్తున్నాం. ఈ సౌకర్యాన్ని పెంపుడు జంతువుల యజమానులు, రైతులు, జంతు సంరక్షకులు వినియోగించుకోవాలి. అంతర్జాతీయంగా ఈ వ్యాపారం ఏటా 4-6 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇండియాలో ఈ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా మారనుంది. జంతు ఆరోగ్య సంరక్షణలో కొత్త టెక్నాలజీల ఆవిష్కరణల రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఆర్ అండ్ డీ) కోసం పెట్టుబడిని పెంచుతున్నాం. 2023లో ఇది 613 మిలియన్లకు(రూ.5,100 కోట్లు) చేరుకుంది’ అని చెప్పారు. సమీప భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ సాయంతో పరిశోధనలు చేసేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని జోయిటిస్ ఇండియా కెపబులిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ అన్నారు.
ఇదీ చదవండి: ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టత
2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా జంతువుల ఆరోగ్య సంరక్షణ మార్కెట్ విలువ రూ.7,824.5 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతంమేర వృద్ధి చెందింది. 2029 వరకు ఈ మార్కెట్ విలువ 1.89 బిలియన్ డాలర్ల(రూ.15,871 కోట్లు)కు చేరనుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment