గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా ఎస్వీ జూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోస్టర్లను ఆవిష్కరిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి మంగళం/ మార్కాపురం: ఏపీలో పెద్దపులుల సంరక్షణ, సంఖ్య పెరగడంలో అటవీశాఖ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర అటవీ, విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గ్లోబల్ టైగర్స్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఏపీలోని నల్లమల అడవుల్లో గత సంవత్సరం జరిగిన గణనలో 74 పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య 80కి చేరినట్టు తేలిందన్నారు.నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు కింద పులుల సంరక్షణ పనులను అటవీశాఖ సమర్థంగా నిర్వహిస్తోందని అభినందించారు.
పులుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని, అంతరించిపోతున్నాయన్నది ద్రుష్పచారమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు ప్రత్యేకంగా కారిడార్ అభివృద్ధి చేసి, టైగర్ రిజర్వు పరిధిని విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. తద్వారా అటవీ రక్షణ, పులుల సంరక్షణ సులభతరం అవుతుందన్నారు. అనంతరం పులుల సంరక్షణపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జూ ప్రవేశంలో ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణపై స్టాళ్లను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణపై ఫొటో గ్యాలరీ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, ఏపీ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియపాండే, సీసీఎఫ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
నల్లమలలో 80 పెద్ద పులులు
నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం 80 పెద్ద పులులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా పులుల సంఖ్యను విడుదల చేశారు. ఎన్‌ఎస్‌టీఆర్– తిరుపతి కారిడార్ (నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం) వరకూ ఇవి ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment