Underground mines department
-
గణనీయంగా పెరిగిన పులుల సంఖ్య
తిరుపతి మంగళం/ మార్కాపురం: ఏపీలో పెద్దపులుల సంరక్షణ, సంఖ్య పెరగడంలో అటవీశాఖ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర అటవీ, విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గ్లోబల్ టైగర్స్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఏపీలోని నల్లమల అడవుల్లో గత సంవత్సరం జరిగిన గణనలో 74 పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య 80కి చేరినట్టు తేలిందన్నారు.నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు కింద పులుల సంరక్షణ పనులను అటవీశాఖ సమర్థంగా నిర్వహిస్తోందని అభినందించారు. పులుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని, అంతరించిపోతున్నాయన్నది ద్రుష్పచారమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు ప్రత్యేకంగా కారిడార్ అభివృద్ధి చేసి, టైగర్ రిజర్వు పరిధిని విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. తద్వారా అటవీ రక్షణ, పులుల సంరక్షణ సులభతరం అవుతుందన్నారు. అనంతరం పులుల సంరక్షణపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జూ ప్రవేశంలో ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణపై స్టాళ్లను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణపై ఫొటో గ్యాలరీ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, ఏపీ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియపాండే, సీసీఎఫ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. నల్లమలలో 80 పెద్ద పులులు నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం 80 పెద్ద పులులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా పులుల సంఖ్యను విడుదల చేశారు. ఎన్ఎస్టీఆర్– తిరుపతి కారిడార్ (నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం) వరకూ ఇవి ఉన్నట్లు తెలిపారు. -
ఇసుక ఇబ్బందులకు.. రెండ్రోజుల్లో చెక్
సాక్షి, అమరావతి: ఇసుక బుకింగ్స్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రెండ్రోజుల్లో ఇందుకు సంబంధించిన సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించనుంది. ఇందులో భాగంగా ప్రజలకు అవసరమైనంత ఇసుకను అందుబాటులోకి తీసుకురానుంది. ఆన్లైన్ బుకింగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి రావడంతో వాటన్నింటికీ చెక్ పెట్టనుంది. ఇక నుంచి బల్క్ బుకింగ్స్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు అప్ప చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండ్రోజుల క్రితం సీఎం నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు తక్షణమే అమలుచేస్తామని, స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు పెంచుతామని ఆయన వెల్లడించారు. ఆయన ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ► ఇసుక బుకింగ్ కోసం ప్రతి రోజూ మధ్యాహ్నం పోర్టల్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే బుకింగ్స్ అయిపోతున్నాయి. దీనివల్ల మిగిలిన వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగులకు అనుమతిస్తూ ఉత్తర్వులిస్తున్నాం. మరింత పారదర్శకంగా బుకింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ► సొంత అవసరాలకే ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయా? లేదా? అన్న విషయం సచివాలయాల ద్వారా నిర్ధారించే వ్యవస్థను ఏర్పాటుచేస్తాం. ► అలాగే, బల్క్ బుకింగ్స్‌కు అనుమతిచ్చే అధికారం జాయింట్ కలెక్టర్లకే ఇచ్చాం. ► ప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిని మూడు లక్షల టన్నులకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► రానున్న వర్షాకాలం అవసరాల కోసం మొత్తం డెబ్బై లక్షల టన్నుల ఇసుకను నిల్వచేస్తున్నాం. వలస కూలీలు వెళ్లిపోవడంతో ఇబ్బందులు ► గతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఎక్కువగా ఇసుక తవ్వకాలు జరిపేవారు. కరోనా లాక్డౌన్ కారణంగా పనులు నిలిపివేయడంతో కూలీల్లో అధిక శాతం స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. ► దీంతో ప్రస్తుతం స్థానికంగా వున్న కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరపాల్సిరావడంవల్ల కొంత సమస్య ఏర్పడింది. ► ఇసుక తవ్వకాల్లో నైపుణ్యం వున్న వలస కూలీలను తిరిగి రప్పించేందుకు కలెక్టర్ల ద్వారా ప్రయత్నిస్తున్నాం. ► పట్టాభూముల్లో ఇసుక నాణ్యతను టెక్నికల్ టీం పరిశీలించిన తరువాతే అనుమతిస్తున్నాం. -
ఇంటికే ఇసుక విజయవంతం
సాక్షి, అమరావతి: ఆన్లైన్లో ఎక్కడ నుంచి బుక్ చేసుకున్నా ఇంటివద్దకే ఇసుక అందించే సరికొత్త విధానం నాలుగు జిల్లాల్లో విజయవంతం కావడంతో రాష్ట్రమంతా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం 9 జిల్లాల్లో ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకుని స్టాక్ యార్డుల నుంచి పొందే సదుపాయం ఉంది. నాలుగు జిల్లాల్లో మాత్రం వినియోగదారులు కోరిన చోటకే ఇసుకను అందచేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. మాఫియా, దళారీ వ్యవస్థలను నిర్మూలించడంతోపాటు అక్రమ రవాణా, తవ్వకాలను అడ్డుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సరసమైన ధరలకు ఇసుకను అందించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తోంది. రాష్ట్రమంతా డోర్ డెలివరీకి కసరత్తు గత ఏడాది సెప్టెంబరు 5వతేదీన కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) 60.44 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు సరఫరా చేసింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ఇసుకను అందించే విధానం తొలుత అమల్లోకి తెచ్చింది. ప్రజలకు మరింత సౌలభ్యం కోసం ఇసుక డోర్ డెలివరీ విధానాన్ని అమలులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించిన నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, వైఎస్సార్ జిల్లాల్లో ప్రవేశపెట్టింది. కిలోమీటర్ల వారీగా టన్ను / ట్రాక్టరుకు ఇసుక రవాణా చార్జీలను అధికారులు ఖరారు చేశారు. ఆన్లైన్లో డబ్బు చెల్లించిన వారికి ప్రస్తుతం ఈ నాలుగు జిల్లాల్లో ఇంటికే ఇసుక అందచేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే 1.12 లక్షల మందికి డోర్ డెలివరీ చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ఇసుకను ఇక్కడి అవసరాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు చెక్ పోస్టులను పెంచడంతోపాటు మూడు వేల మందికిపైగా కొత్త సిబ్బందిని నియమిస్తోంది. 24 గంటలూ పనిచేసేలా శక్తివంతమైన సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ నుంచే వాహనాల కదలికలపై నిఘా జీపీఎస్ పరికరాలు కలిగి ఉండి, భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలనే ఇసుక సరఫరాకు అనుమతిస్తున్నారు. ఇసుక తరలించే వాహనాలు ఎక్కడ నుంచి బయలుదేరాయి? ఎక్కడకు వెళుతున్నాయి? దారి మళ్లుతున్నాయా? అనే విషయాలను విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచే పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. -
ఇంటి నుంచే ఇసుక బుకింగ్
ఇసుక కావాలంటే ఇక ఎక్కడికో పరుగులు తీయాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ సదుపాయం కలిగిన స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ఉంటే చాలు కాలు కదపకుండా ఎక్కడ నుంచైనా ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కంప్యూటర్‌పై స్వల్ప పరిజ్ఞానం ఉన్న వారు కూడా సులభంగా ఇసుక బుక్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. – సాక్షి, అమరావతి సాక్షి, అమరావతి: ఇసుక అక్రమార్కులకు కఠిన శిక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా ఇసుక నిల్వ, బ్లాక్ మార్కెటింగ్, ఇసుకతో వ్యాపారం చేసిన వారికి రూ. 2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ రాయితీల నిబంధనలను సవరిస్తూ భూగర్భ గనుల శాఖ కార్యదర్శి రాంగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఇసుకను అక్రమంగా తవ్వి రవాణా చేస్తున్నారని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కొందరు ఏపీఎండీసీ వెబ్సైట్ నుంచి నకిలీ ఐడీలతో మోసపూరితంగా ఇసుక బుక్ చేసుకుని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధించేలా నిబంధనావళిని సవరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పరిమితికి మించి ఇసుక నిల్వ చేస్తే స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తారు. అపరాధ రుసుముతోపాటు చట్ట ప్రకారం రెండేళ్ల వరకు శిక్ష పడుతుంది. ఇసుక బుకింగ్ ఇలా.. - ఆన్లైన్లో sand.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లగానే ‘వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ శాండ్’ అని ఉంటుంది. దాని కిందే జనరల్ బుకింగ్ / బల్క్ కన్జూమర్ లాగిన్ అని ఉంటుంది. - సాధారణ వినియోగదారులు ‘జనరల్’ అనే కాలమ్ కింద, అధిక పరిమాణంలో ఇసుక కావాల్సిన వారు ‘బల్క్ కన్జూమర్ లాగిన్’ కింద రిజిస్ట్రేషన్ అనే చోట్ల క్లిక్ చేయగానే మొబైల్ నంబరు అనే కాలమ్ ఉంటుంది. - అందులో మొబైల్ నంబరు టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆరు అంకెల వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ నంబరును పాస్వర్డ్ అనే చోట టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆధార్ నంబరు, జిల్లా, పట్టణం/ గ్రామం, చిరునామా తదితర కాలాలు కనిపిస్తాయి. - అన్ని కాలాలను సక్రమంగా భర్తీ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైనట్లు సమాచారం వస్తుంది. వెంటనే మొబైల్ నంబరు అనే కాలమ్‌లో ఫోన్ నంబరు టైప్ చేసి దాని కింద సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తే మొబైల్‌కు ఆరు అంకెల నంబరు వస్తుంది. - దీన్ని టైప్ చేసి సెండ్ ఓటీపీ అని నొక్కితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైనట్లు మెసేజ్ వస్తుంది. వెంటనే యూజర్ ఐడీ, ఐపీ నంబరు కనిపిస్తాయి. ఎంత కావాలంటే అంత.. - శాండ్ ఆర్డర్‌లోకి వెళ్లి ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. అక్కడ ఎన్ని టన్నులు, ఎక్కడి (స్టాక్ యార్డు) నుంచి ఎక్కడకు డెలివరీ చేయాలి? వివరాలు నమోదు చేయాలి. - టన్ను రూ.375 చొప్పున ఎంత డబ్బు చెల్లించాలో కూడా వెబ్సైట్లో కనిపిస్తుంది. అన్నీ నమోదు చేసిన తర్వాత చెక్ చేసుకుని సబ్మిట్ అని క్లిక్ చేస్తే ‘పేమెంట్ గేట్‌వే’ అని కనిపిస్తుంది. నచ్చిన విధానంలో ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలి. - ఈ రసీదు సంబంధిత స్టాక్ యార్డులో అందచేసి ఇసుక తీసుకెళ్లవచ్చు. స్టాక్ యార్డుల దగ్గరే వాహనాలు కూడా ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే ప్రస్తుతం ఇసుక బుకింగ్ అందుబాటులో ఉంది. ఇలా ఇసుక బుక్ చేసుకున్న వారు మరుసటి రోజు ఇసుకను స్టాక్‌యార్డుల నుంచి వాహనాల్లో తీసుకెళ్లవచ్చు. -
గ్రామీణ స్ధాయిలో ఇసుక సరఫరాకు చర్యలు
-
గ్రామ సచివాలయాల్లోనే ఇసుక పర్మిట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్నచిన్న వాగులు, వంకలు, ఏరులలో లభ్యమయ్యే ఇసుకను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు కొరత తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏరులు, వాగులు వంకలలో ఇసుక తవ్వకాలు, రవాణాను క్రమబద్ధీకరిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకటి నుంచి మూడు ఆర్డర్ స్ట్రీమ్స్‌గా పరిగణించే వంకలు, వాగులు, ఏరులలో ఇసుకను స్థానిక అవసరాలకు విస్తృతంగా వాడుకునేలా చూడటం ద్వారా తాత్కాలికంగా కొరతను అధిగమించేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. గ్రామ సచివాలయాల్లోనే ఇసుక రవాణా పర్మిట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సూచన మేరకు మార్గదర్శకాలు.. ఇప్పటివరకు ప్రజలు ఎక్కువగా పెద్ద పెద్ద నదుల ఇసుకపైనే ఆధారపడుతూ వస్తున్నారు. వరదల నేపథ్యంలో దీనివల్ల సమస్య ఏర్పడింది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో బుధవారం చర్చించిన అనంతరం ఆయన సూచనల మేరకు భూగర్భగనుల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి మూడు ఆర్డర్ స్ట్రీమ్స్‌లో ఇసుక తవ్వకాలు, వినియోగానికి సంబంధించి తాజాగా రూపొందించిన మార్గదర్శకాలు మూడు నెలల పాటు అమల్లో ఉంటాయని, తర్వాత సమీక్షించి అవసరమైన మార్పు చేర్పులు చేస్తామని అందులో స్పష్టం చేసింది. రీచ్‌ల గుర్తింపు బాధ్యత కలెక్టర్లకు భారీగా ఇసుక లభించే గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, పెన్నా లాంటి పెద్ద నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో తవ్వకాలకు వీలు లేనందున ఏర్పడిన కొరతను వంకలు, ఏరులు, వాగుల ద్వారా అధిగమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్ టు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్‌గా పేర్కొనే వీటిలోని ఇసుకను ఏపీ వాల్టా చట్టం నిబంధనల మేరకు తవ్వి స్థానిక అవసరాలు తీర్చాలని గనుల శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలవారీగా జిల్లాల్లో ఈ తరహా ఇసుక రీచ్‌లు ఎన్ని ఉన్నాయో గుర్తించే బాధ్యతను కలెక్టర్లకే అప్పగించింది. ఇందులోని ఇసుకను స్థానిక అవసరాలకు (వ్యాపారానికి కాదు) మాత్రమే వినియోగించుకునేలా గ్రామ సచివాలయాల సిబ్బంది పర్యవేక్షిస్తారు. సరఫరా ఇలా... ఇసుక కావాల్సిన వారు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేలా గ్రామ సచివాలయంలో సిబ్బందికి డబ్బులు చెల్లించి రవాణా పర్మిట్ (ట్రాన్సిట్ పాస్) తీసుకోవాలి. సచివాలయ అధికారి ఒరిజినల్ పర్మిట్‌ను ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇచ్చి మరో కాపీని సచివాలయంలోనే ఉంచుతారు. ఇసుక రీచ్‌ల పర్యవేక్షణను గ్రామ సచివాలయ ఇన్చార్జి సంబంధిత వలంటీర్‌కు అప్పగిస్తారు. సచివాలయంలో డబ్బులు చెల్లించిన వారు రేవు వద్దకు వెళ్లి పర్మిట్‌ను వలంటీర్‌కు ఇచ్చి ట్రాక్టరు, ఎద్దుల బండిలో ఇసుక నింపుకొని తీసుకెళ్లవచ్చు. ఈ పర్మిట్ 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నిర్దిష్ట సమయంలోగా ఇసుక తీసుకెళ్లకుంటే పర్మిట్ చెల్లుబాటు కాదు. ట్రాక్టర్లలో ఇసుకను రేవు నుంచి 20 కిలోమీటర్లకు మించి తీసుకెళ్లరాదు. ఎవరూ అవసరానికి మించి ఇసుక నిల్వ చేయరాదు. ఇలా చూడాల్సిన బాధ్యత గ్రామ సచివాలయ అధికారులదే. పర్మిట్ తప్పనిసరి.. ఇసుక రవాణా పర్మిట్ పాస్‌ల జారీ కోసం ముద్రించిన ఫారం–ఎస్ 3 పుస్తకాలను గ్రామ సచివాలయాలకు ఏపీఎండీసీ సరఫరా చేస్తుంది. ఇసుకను తరలించేందుకు పర్మిట్ తప్పనిసరి. పాస్ లేకుండా తరలిస్తే జరిమానా విధిస్తారు. ప్రతి పాస్‌కు ఒరిజనల్, డూప్లికేట్ అనే రెండు పేపర్లు ఉంటాయి. దీంతో ఏయే గ్రామ సచివాలయం పరిధిలో ఎంత ఇసుక విక్రయించారనే గణాంకాలు పక్కాగా ఉంటాయి. వరదల వల్ల తాత్కాలికంగా ఏర్పడిన ఇసుక సమస్యను పరిష్కరించడం కోసమే భూగర్భ గనుల ఈ ఆదేశాలను జారీ చేసింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. భారీ వరదలు, వర్షాలతో... మాఫియాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇసుక తవ్వకం, సరఫరాకు సంబంధించి ప్రభుత్వం సెప్టెంబరు నాలుగో తేదీన కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్రజల అవసరాల మేరకు ఇసుక సరఫరా బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించింది. ఈ సీజన్లో నిరంతరాయంగా గోదావరిలో ధవళేశ్వరం వద్ద 55 రోజుల నుంచి, కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజి వద్ద 71 రోజులుగా వరద కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో 400 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై తుంగభద్రలో భారీగా వరదనీరు పొంగుతోంది. వంశధార, పెన్నాల్లోనూ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వాయుగుండం/ తుపాను ప్రభావం వల్ల వర్షాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రీచ్‌లన్నీ నీటితో నిండిపోయి ఇసుక తవ్వకాలు జరపలేని పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులుగా ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున ఇసుక సమస్య ఉత్పన్నమైంది. ఐదేళ్లకు సరిపడా నిల్వలు రాష్ట్రంలో గత పుష్కర కాలంలో ఎన్నడూ లేనన్ని రోజులు గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, వంశధార ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి నీటితోపాటు ఇసుక భారీగా కొట్టుకువచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని నదుల్లో ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలున్నాయి. వరదనీరు తగ్గుముఖం పట్టగానే రీచ్‌లలో తవ్వకాలు ఆరంభించి ప్రజలు కోరినంత ఇసుక సరఫరా చేస్తామని భూగర్భ గనులశాఖ అధికారులు తెలిపారు. ప్రారంభంలో ఏపీఎండీసీ రోజుకు ఐదు వేల టన్నుల ఇసుకను మాత్రమే ప్రజలకు సరఫరా చేసేది. ఇప్పుడు వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ 45 వేల టన్నుల వరకు సరఫరా చేస్తోంది. వరద తగ్గితే రోజుకు లక్ష టన్నులు సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ఏపీఎండీసీ అధికారులు తెలిపారు. ఏపీఎండీసీ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈనెల 22 వరకు 6,07,311 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసింది. ఇదే కాలంలో అధికారులు గుంటూరు జిల్లాలో 2 లక్షల టన్నులు, గోదావరి జిల్లాలో 55 వేల టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. కొత్త మార్గదర్శకాలతో సమస్య పరిష్కారం ‘రాష్ట్రంలో రోజుకు సగటున 80 నుంచి 85 వేల టన్నుల ఇసుక అవసరం. నిర్మాణ రంగం భారీగా వేగం పుంజుకుంటే రోజుకు సగటున ఇసుక అవసరం లక్ష టన్నులకు చేరవచ్చు. ప్రస్తుతం ఏపీఎండీసీ స్టాక్ యార్డుల ద్వారా రోజుకు 45 వేల టన్నుల వరకూ ఇసుక సరఫరా చేస్తోంది. దీన్ని 85 వేల టన్నులకు పెంచితే ఎలాంటి సమస్య ఉండదు. నదుల్లో నీరు తగ్గిపోగానే రేవులన్నీ అందుబాటులోకి వస్తాయి. రోజుకు లక్ష టన్నులు కూడా ఇసుక సరఫరా చేసేందుకు ఏపీఎండీసీ సిద్ధంగా ఉంది. వరదలు, భారీ వర్షాల వల్ల ఏర్పడిన ఇసుక సమస్య తాత్కాలికమే. దీన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏరులు, వాగులు, వంకలలో, ఇసుక తవ్వకాలు, సరఫరాకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశాం. దీంతో ఇసుక సమస్య పూర్తిగా పరిష్కారం కానుంది’ – సాల్మన్ ఆరోఖ్యరాజ్ (ముఖ్యమంత్రి కార్యదర్శి) -
టన్ను ఇసుక రూ.375
ఏపీఎండీసీ వెబ్సైట్ (యాప్) ద్వారా బుక్ చేసుకుని, ఆన్లైన్లో డబ్బు చెల్లించిన వారికి ఇసుకను స్టాక్ యార్డులోని వాహనంలో లోడ్ చేసి ఇస్తారు. లోడింగ్ రుసుముతో కలిపి ఈ ధర ఉంటుంది. కేవలం స్టాక్ యార్డుల్లో ఇసుక అందించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోవడం లేదు. వినియోగదారుల వద్దకు తక్కువ ధరకే రవాణా చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక విరివిగా అందుబాటులోకి రానుంది. నిల్వ కేంద్రాల్లో (స్టాక్ యార్డులు) టన్ను ఇసుకను కేవలం రూ.375 చెల్లించి తీసుకోవచ్చు. లోడింగ్ రుసుముతో కలిపి టన్ను ఇసుకను రూ.375కే ప్రజలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ), భూగర్భ గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువ ధరకే ప్రజలకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏపీఎండీసీ, భూగర్భ గనుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించారు. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, ఇసుక సరఫరా ధరను అధికారికంగా ప్రకటించనున్నారు. యాప్‌లో బుకింగ్.. ఆన్లైన్లో చెల్లింపులు రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని సెప్టెంబరు 5వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఏపీఎండీసీ వెబ్సైట్ (యాప్) ద్వారా బుక్ చేసుకుని, ఆన్లైన్లో డబ్బు చెల్లించిన వారికి ఇసుకను స్టాక్ యార్డులో వాహనంలో లోడ్ చేసి ఇస్తారు. లోడింగ్ రుసుముతో కలిపి ఈ ధర ఉంటుంది. కేవలం స్టాక్ యార్డుల్లో ఇసుక అందించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోవడం లేదు. వినియోగదారుల వద్దకు తక్కువ ధరకే రవాణా చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. జిల్లాల్లో ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్‌తో (లారీలు, టిప్పర్ల ఓనర్ల) సంప్రదింపులు జరిపి, ఇసుక రవాణాకు వీలైనంత తక్కువ ధరలు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కిలోమీటర్ రవాణాకు టన్నుకు రూ.4.90లోపే ఉండేలా చూడాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు ఒకటి రెండు రోజుల్లోనే ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ఇసుక రవాణా ధరలు ఖరారు చేస్తారు. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని, భూగర్భ గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న వాహనాలతో స్టాక్ యార్డుల నుంచి ప్రజలకు ఇసుక రవాణా చేయవచ్చు. 58 స్టాక్ యార్డులు సిద్ధం ఏపీఎండీసీ ఇప్పటికే రాష్ట్రంలో 58 చోట్ల స్థలాలను గుర్తించి, ఇసుక స్టాక్ యార్డులకు అనువుగా తీర్చిదిద్దింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో నదులు లేనందున ఇసుక లభ్యం కాదు. ఈ రెండు జిల్లాలకు శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. విశాఖపట్నంలోని అగనంపూడి, ముడసర్లోవలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి, లారీల్లో పొరుగు జిల్లాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. ఈ జిల్లాలోని స్టాక్ యార్డులకు ఇసుకను సుమారు 150 కిలోమీటర్ల నుంచి తరలించాల్సి ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఖర్చవుతుంది. అన్ని జిల్లాల్లో రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు ఇసుక తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 102 రీచ్‌ల నుంచి ఇసుక తరలించి ప్రజలకు అందిస్తారు. ఇసుకకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కొత్త రీచ్‌లను గుర్తించి, చట్టబద్ధమైన అనుమతులు తీసుకునే ప్రక్రియను కూడా అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. ఇసుక తవ్వే రీచ్‌ల సంఖ్యను దశలవారీగా 303కు పెంచాలని భూగర్భ గనుల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. సాధ్యమైనంత వరకూ సమీప ప్రాంతాల నుంచే ఇసుక అందించాలనే ఉద్దేశంతో స్టాక్ యార్డుల సంఖ్యను 157కు పెంచేందుకు ప్రణాళిక తయారు చేశారు. నిర్వహణ వ్యయం ఎక్కువైనా... తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకం, స్టాక్ యార్డులకు తరలింపు తదితర నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంది. పర్యావరణ నిబంధనావళి ప్రకారం రీచ్‌లలో యంత్రాలు వినియోగించకుండా కూలీలతోనే ఇసుక తవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అలాగే ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రజల ప్రయోజనార్థం సరసమైన ధరలకే ఇసుక అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందువల్లే తెలంగాణలో టన్ను ఇసుక ధర రూ.400 ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.375కే ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. టన్ను ఇసుకకు గరిష్టంగా రూ.225 ఖర్చు ఇసుకను రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు చేరవేసి, అక్కడి నుంచి ప్రజలకు అందించడానికి మొత్తం నిర్వహణ వ్యయం, పన్నులు కలిపి టన్నుకు దాదాపు రూ.225 ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు. రీచ్‌లో ఇసుకను తవ్వి స్టాక్ యార్డుకు చేరవేయడానికి కాంట్రాక్టర్లకు ఇచ్చే మొత్తమే టన్నుకు రూ.100 అవుతోంది. ఒక్కో స్టాక్ యార్డులో 14 మంది ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. టన్ను ఇసుకకు యార్డుల నిర్వహణకు సగటున రూ.30, జీఎస్టీ రూ.22, సీనరేజి రూ.33, జిల్లా మినరల్ ఫండ్(డీఎంఎఫ్) రూ.10, మెరిట్, ఐటీ, ఇతరత్రా అన్నీ కలిపితే అయ్యే వ్యయం రూ.225. స్టాక్ యార్డుల్లో టన్ను ఇసుక రూ.375కు విక్రయిస్తే ఖర్చులు పోను ప్రభుత్వానికి రూ.150 మిగులుతుందని అంచనా. ఇలా మిగిలే మొత్తాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.16.38 కోట్లు ఇవ్వండి: ఏపీఎండీసీ ఇసుక దారి మళ్లకుండా పకడ్బందీగా నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫైబర్ నెట్ తదితర ఏర్పాట్ల కోసం రూ.16.38 కోట్లు మూలధన నిధి కింద విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఏపీఎండీసీ కోరింది. స్టాక్ యార్డులకు ఫైబర్ నెట్ కోసం ఇప్పటికే రూ.38 లక్షలు చెల్లించామని ఆర్థిక శాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. -
ఇసుక రెడీ.. 5 నుంచి సరఫరా
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని స్టాక్ యార్డుల నిండుగా ఇసుక నింపాలని, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి కోరిన చోటుకు వెంటనే చేరవేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే నెల 5వ తేదీ నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే 102 ఇసుక రీచ్‌లను 47 షెడ్యూళ్లుగా విభజించి (ఒక్కో దానిలో రెండు మూడు రీచ్‌లు ఉండేలా) స్టాక్ యార్డులకు ఇసుక చేర వేసేందుకు జిల్లా యూనిట్‌గా టెండర్లు, రివర్స్ టెండర్లు నిర్వహించింది. సింగిల్ బిడ్లు వచ్చిన వాటిని రద్దు చేసి వీటితో కలిపి అసలు బిడ్లు రాని వాటికి తిరిగి టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. పారదర్శకత, ప్రజలకు సరసమైన ధరకు ఇసుక సరఫరా, ప్రజా ప్రయోజన కార్యక్రమాల కోసం సర్కారుకు రాబడి లక్ష్యాలుగా ఇసుక విషయంలో కొత్త విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా, లోప రహితంగా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలు సాగనివ్వొద్దు వచ్చే నెల 5వ తేదీ నుంచి ఎవరు ఇసుక బుక్ చేసుకున్నా తక్షణమే సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వం అధికారులకు మార్గనిర్దేశం చేసింది. నూతన పాలసీని అత్యంత పారదర్శకంగా, ఏమాత్రం అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించింది. రాష్ట్రంలో టన్ను ఇసుక కూడా దుర్వినియోగం కావడానికి వీల్లేకుండా సరసమైన ధరలకు ప్రజలకు అందించాలన్నదే సీఎం ఉన్నతాశయమని, తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా ప్రయోజనాలకు వినియోగించడమే లక్ష్యమని పేర్కొంది. ‘గత ఐదేళ్లు మాఫియాగా మారి ఇసుక విక్రయాల ద్వారా దండుకున్న వారికి ప్రస్తుత సర్కారు కొత్త విధానం తేవడం సుతరామూ ఇష్టం లేదు. అందువల్ల ఈ మాఫియా గ్యాంగులు తెరవెనుక ఉండి టెండర్లను దెబ్బతీయాలని, ఇసుక సరఫరాలో ప్రభుత్వాన్ని విఫలం చేయాలని కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నాయి. టన్ను ఇసుకను రీచ్‌లో తవ్వి ట్రాక్టర్‌కు లోడ్ చేసి స్టాక్ యార్డుకు తరలించి అన్లోడ్ చేసి, తిరిగి వినియోగదారులకు రవాణా చేసేందుకు వాహనానికి లోడ్ చేయడం కోసం కేవలం పది పైసలకే టెండరు దాఖలు చేయడం ఇందుకు నిదర్శనం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాఖలైన టెండర్లు ఈ కోవలోనివేనని గుర్తించి ముందుకెళ్లండి. ఎవరి ఆటలూ సాగనీయొద్దు. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లండ’ని ప్రభుత్వం పేర్కొంది. కొత్త రీచ్‌లకు త్వరితగతిన అనుమతులు ప్రస్తుతం గుర్తించిన 102 ఇసుక రీచ్‌లతోపాటు కొత్త రీచ్‌లను గుర్తించి అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు త్వరితగతిన తీసుకునేందుకు చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే అనుమతులు ఉన్న రీచ్‌లలో కొన్ని చోట్ల భారీ వర్షాల వల్ల నదులు ప్రవహిస్తున్నందున ఇసుక తీయలేని పరిస్థితి ఉందని, అందువల్ల మిగిలిన చోట్ల ఇసుకను స్టాక్ యార్డులకు చేరవేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పింది. ‘రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాల అమరిక త్వరగా పూర్తి చేయాలి. జీపీఎస్ పరికరాలు అమర్చుకున్న ప్రతి వాహనానికి ఏపీఎండీసీలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ఎక్కడా ఏకస్వామ్యం ఉండరాదు. జిల్లా యూనిట్‌గా ఇసుక రవాణా బాధ్యతలు ఒకే సంస్థకు గంపగుత్తగా అప్పగించొద్దు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక రవాణా చేసేందుకు జీపీఎస్ అమర్చుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏ వాహనమైనా అనుమతించండి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం కోసం వాహనాలకు జీపీఎస్ యంత్రాలు తప్పనిసరిగా అమర్చాలనే నిబంధన పెడుతున్నాం’ అని ప్రభుత్వం పేర్కొంది. సర్వసన్నద్ధం దిశగా ఏర్పాట్లు ఇసుక కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకే కాకుండా నూతన విధానం కొలిక్కి వచ్చే వరకు లోటుపాట్లను సవరించి గాడిన పెట్టేందుకు ప్రతిరోజూ సమీక్షించాలని సీఎం జగన్ తన ముఖ్య సలహాదారు అజేయకల్లంను ఆదేశించారు. సీఎం ఆదేశం మేరకు ఇసుక పాలసీ అమలుకు సన్నద్ధత, లోటుపాట్ల సవరణ, ఇంకా చేయాల్సిన ఏర్పాట్లపై భూగర్భ గనులు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారులతో అజేయ కల్లం సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా తెలియజేస్తే ప్రభుత్వం పరిష్కార మార్గాలు సూచిస్తుందని, లోపాలు, విమర్శలకు తావులేని విధంగా ఇసుక సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వరదల వల్ల ప్రస్తుతం 70 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు ప్రారంభించి స్టాక్ యార్డులకు చేరవేస్తామని, నీరు తగ్గగానే మిగతా 32 రీచ్‌లలో కూడా తవ్వకాలు సాగిస్తామని అధికారులు వివరించారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 30 – 32 స్టాక్ యార్డులతో ఇసుక సరఫరా ప్రారంభించి తర్వాత వీటి సంఖ్య క్రమంగా పెంచుతామని చెప్పారు. స్టాక్ యార్డుల నుంచి సరఫరా కోసం 5 జిల్లాల్లో టెండర్లు స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులకు ఇసుకను టిప్పర్లు, లారీల్లో తరలించడం కోసం జిల్లా యూనిట్‌గా టెండర్లు, రివర్స్ టెండర్లు నిర్వహించగా రెండు జిల్లాల్లో సింగిల్ టెండర్లు వచ్చాయి. వీటిని ఏపీఎండీసీ తిరస్కరించింది. మరో మూడు జిల్లాల్లో గిట్టుబాటుకాని రేట్లకు బిడ్లు దాఖలయ్యాయి. దీంతో కాంట్రాక్టర్లతో అధికారులు చర్చించి వీటిని రద్దు చేశారు. దీంతో విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఇసుక రవాణాకు తిరిగి టెండర్లు ఆహ్వానిస్తూ 29 తుది గడువుగా ఏపీఎండీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రాక్టర్లకు టెండర్లు స్టాక్ యార్డుల నుంచి 30 కిలోమీటర్ల లోపు దూరానికి తక్కువ పరిమాణంలో ఇసుక అవసరమైన వారికి సరఫరా కోసం ట్రాక్టర్లు వినియోగించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది. ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తోంది. కనీసం పది ట్రాక్టర్లు సొంతంగా కలిగి ఉన్న, లీజుకు తీసుకుని ఉన్న వారు టెండర్లలో పాల్గొనడానికి అర్హులు. టెండర్ల దాఖలుకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉంది. ఈ మూడు టెండర్లకు సంబంధించి నిబంధనలు, ఇతర వివరాల కోసం ఏపీఎండీసీ వెబ్సైట్లో చూడవచ్చు. సింగిల్ టెండర్లు రద్దు రీచ్‌లలో ఇసుక తవ్వకం, ట్రాక్టర్లకు కూలీలతో లోడింగ్, సమీపంలోని స్టాక్ యార్డుకు రవాణా, అక్కడ అన్లోడింగ్, తిరిగి వినియోగదారులకు చేరవేసేందుకు లోడింగ్‌కు 102 రీచ్‌లను 47 షెడ్యూళ్లుగా విభజించి జిల్లా యూనిట్‌గా ఏపీఎండీసీ ఈ– టెండర్లు నిర్వహించింది. వీటిలో అతి తక్కువకు కోట్‌చేసిన ఎల్–1ను గరిష్ట మొత్తంగా నిర్ణయించి రివర్స్ యాక్షన్ (రివర్స్ టెండర్లు) జరిపింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో రెండేసి షెడ్యూళ్లకు సింగిల్ టెండర్లు రావడంతో రద్దు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో రెండు షెడ్యూళ్లకు అధిక మొత్తాల్లో బిడ్లు రావడంతో తిరస్కరించింది. అనంతపురం జిల్లాలో ఒకదానికి, తూర్పు గోదావరి జిల్లాలో రెండింటికి బిడ్లు రాలేదు. దీంతో మొత్తం తొమ్మిది షెడ్యూళ్లకు మళ్లీ టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 29వ తేదీలోగా బిడ్లు దాఖలు చేయాలని అందులో పేర్కొంది. 97.82 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సిద్ధం రాష్ట్ర వ్యాప్తంగా 97.82 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. ఈ మేరకు జిల్లాలు, రీచ్‌ల వారీగా ఇసుక నిల్వలను ప్రభుత్వం గుర్తించింది. నదుల్లో 90 ఓపెన్ రీచ్‌లు, 31 డీసిల్టేషన్ కేంద్రాలు, 82 పట్టా భూముల్లో ఎక్కడ ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉన్నాయో గనుల శాఖ గుర్తించి ఏపీఎండీసీకి పంపించింది. -
ఇక పక్కాగా ఇసుక సరఫరా
సాక్షి, అమరావతి : కొత్త విధానం ద్వారా ఇసుక సరఫరాకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అవసరమైతే కొత్త రీచ్‌లకు త్వరితగతిన అనుమతులు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబరు అయిదో తేదీ నుంచి కొత్త విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ముందస్తు కసరత్తు, సన్నద్ధతపై మంగళవారం సచివాలయంలో మంత్రి రామచంద్రారెడ్డి భూగర్భ గనులు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారులతో సమీక్షించారు. ‘ఎక్కడా ఇసుక దుర్వినియోగం కావడానికి వీల్లేదు. అవసరమైన చోట తక్షణమే స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయండి. వాటికి సమీపంలో వేబ్రిడ్జిలు ఉండేలా చూడండి. ఇసుక రేవుల్లోనూ, స్టాక్ యార్డుల్లోనూ సీసీ కెమెరాలతో పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలి. ఇసుక లోడింగ్ చేసినప్పటి నుంచి వాహన కదలికలన్నీ జీపీఎస్ ద్వారా పర్యవేక్షించడం ద్వారా ఎవరు బుక్ చేసుకున్నారో వారికే ఇసుక వెళ్లేలా చూడొచ్చు. ప్రజలకు ప్రస్తుతం అందుతున్న ధరకంటే ఏమాత్రం పెరగకుండా ఇసుకను అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ఈ దిశగా త్వరగా అన్ని ఏర్పాట్లుచేయండి’ అని మంత్రి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరుకే అన్నీ సిద్ధంచేయాలి వచ్చే నెల నుంచి కొత్త విధానం ద్వారా ఇసుక అందించాల్సి ఉన్నందున ఈ నెలాఖరుకే సర్వ సన్నద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఇసుక బుక్ చేస్తే త్వరగా పంపలేదనే చెడ్డ పేరు ప్రభుత్వానికి రాకుండా అధికారులు చూడాలని మంత్రి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. 46 స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేస్తున్నామని, ఈ నెలాఖరుకల్లా రాష్ట్రవ్యాప్తంగా 124 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు సాగించడానికి వీలుగా పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకుంటామని అధికారులు మంత్రికి వివరించారు. విశాఖ జిల్లాలో నదులు లేకపోవడం, ఎక్కువ ఇసుక వినియోగం ఉన్నందున అక్కడకు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఇసుకను సరఫరా చేసేందుకు ఏర్పాట్లుచేస్తామన్నారు. -
ఇసుక కొత్త విధానంపై ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రజలపై అదనపు భారం పడకుండా రాబడి పెంపు లక్ష్యంగా ఇసుకపై కొత్త విధానం రూపకల్పనకు సర్కార్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కొత్త విధానం రూపకల్పనపై చర్చించేందుకు ప్రారంభమైన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హోంమంత్రి సుచరిత, ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ , ఆర్థిక శాఖ కార్యదర్శి, గనుల శాఖ కార్యదర్శి, గనుల శాఖ ఉన్నతాధికారులతో పాటు తెలంగాణ గనుల శాఖ ఉన్నతాధికారులు, ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను కూడా ఈ సమావేశానికి హాజరు అయ్యారు. కాగా రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగిన ఇసుక దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రస్తుత విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇసుక కొత్త విధానంపై కసరత్తు
సాక్షి, అమరావతి: ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడం, ప్రజలపై అదనపు భారం పడకుండా రాబడి పెంపు లక్ష్యంగా ఇసుకపై కొత్త విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగిన ఇసుక దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రస్తుత విధానాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం మేరకు అన్ని రకాలుగా ఉత్తమ విధానం రూపకల్పనపై వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులను అధికారులు అధ్యయనం చేశారు. వీటన్నింటినీ సమీక్షించిన అనంతరం తెలంగాణలో అమల్లో ఉన్న విధానమే ఉత్తమమైనదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. చిన్నచిన్న లోపాలను సరిచేస్తే తెలంగాణ విధానం అత్యుత్తమమైనదని భూగర్భ గనుల శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డికి కూడా ప్రాథమికంగా తెలియజేశారు. 17న మంత్రుల సమావేశం ఇసుకపై కొత్త పాలసీ అత్యంత కీలకమైన అంశం కావడంతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారు. ఇసుక మాఫియా నియంత్రణలో భాగస్వాములు కావాల్సిన వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించి కొత్త విధానంపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్త విధానం రూపకల్పనపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌లతో ఈనెల 17వ తేదీన సమావేశం కానున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ , ఆర్థిక శాఖ కార్యదర్శి, గనుల శాఖ కార్యదర్శి, గనుల శాఖ ఉన్నతాధికారులను కూడా దీనికి హాజరు కావాలని ఆదేశించారు. తెలంగాణ గనుల శాఖ ఉన్నతాధికారులు, ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఉన్నవాటిలో తెలంగాణ విధానమే ఉత్తమం వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానాల్లో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న పద్ధతి ఉత్తమంగా ఉందని భూగర్భ గనుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణలో ఇసుక క్వారీలు అక్కడి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇసుక సరఫరా బాధ్యతను తెలంగాణ సర్కారు టీఎస్ఎండీసీకి అప్పగించింది. క్వారీల నుంచి టీఎస్ఎండీసీ ఇసుకను స్టాక్ యార్డులకు తరలిస్తుంది. స్టాక్ యార్డుల నుంచి ఇసుకను విక్రయిస్తుంది. ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. స్టాక్‌యార్డులో క్యూబిక్ మీటరు (ఒకటిన్నర టన్ను) ఇసుక ధర రూ. 600గా నిర్ణయించారు. ఇసుక రవాణా వాహనదారులంతా టీఎస్ఎండీసీ వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. వెబ్సైట్లో లారీ యజమానుల ఫోన్ నంబర్లు ఉంటాయి. ఇసుక కావాల్సిన వారు వాహనదారులకు ఫోన్ చేసి మాట్లాడుకుని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికే సరఫరా చేస్తారు. ఈ విధానంలోని మంచి చెడ్డలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని పరిశీలించి లోపాలను సరిదిద్ది ఉత్తమ పాలసీ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే టీఎస్ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్, గనుల శాఖ సంచాలకులను ఈ నెల 17న జరిగే ఉన్నత స్థాయి సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలంగాణ గనుల శాఖ సంచాలకులు సుశీల్‌కుమార్ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ గనుల శాఖ సంచాలకులు) పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. -
‘గని’లో ఏదీ పని?
=మూడేళ్లుగా జేడీ పోస్టు ఖాళీ =విధుల్లేక గోళ్లు గిల్లుకుంటున్న ఉద్యోగులు సాక్షి, విశాఖపట్నం: ఐదు జిల్లాల పర్యవేక్షణ కోసం ఏర్పాటయిన భూగర్భ గనులశాఖ జోనల్ జాయింట్ డెరైక్టర్ కార్యాలయ సిబ్బందికి పని లేకుండా పోయింది. మూడేళ్లుగా జాయింట్ డెరైక్టర్ పోస్టును రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఐదు నెలల క్రితం ఓ అధికారిని నియమించినా తాజాగా ఆయననూ హైదరాబాద్‌కే బదిలీ చేశారు. ఉన్నతాధికారి లేనప్పుడు ఉత్తర, ప్రత్యుత్తరాలెందుకని ఐదు జిల్లాల అధికారులు పంపించడం మానేశారు. దీంతో ఇక్కడ సిబ్బంది గోళ్లు గిల్లుకుంటున్నారు. ఊరకే జీతాలు తీసుకుంటున్నామన్న అసంతృప్తితో ఉన్నారు. పని కల్పించండి మహాప్రభో అని వేడుకుంటున్నారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్బ గనుల అనుమతులు, అక్రమాలు, అధికారుల పనితీరును పర్యవేక్షించేందుకు ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జేడీ, అసిస్టెంట్ మైనింగ్ ఆఫీసర్, మినరల్ రెవెన్యూ ఆఫీసర్, సూపరింటెండెం ట్, ముగ్గురు రాయల్టీ ఇన్స్పెక్టర్లు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు డేటా ఆపరేటర్లు, మరొక అటెండర్ పని చేస్తున్నారు. వాస్తవానికి ఐదు జిల్లాల్లో అనుమతుల్చిన మైనింగ్ లీజులను పరిశీలించడం, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం. గనుల అక్రమ రవాణాదార్లపై చర్యలు తీసుకోవడం, వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపడం, అధికారుల పనితీరును పర్యవేక్షణ, బాధ్యతాయుతంగా పనిచేయని అధికారులపై చర్యలకు సిఫార్సు చేయడం వంటి విధులు నిర్వర్తించాలి. కానీ మూడేళ్లుగా ఈ బాధ్యతలేవీ చేపట్టడం లేదు. జేడీ స్థాయి అధికారిని నియమించకుండా ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఐదు నెలల క్రితం రఫీ అహ్మద్ అనే అధికారిని జేడీగా నియమించారు. కానీ హెడ్ ఆఫీస్ అవసరాలకని నాలుగు నెలలు పాటు హైదరాబాద్‌లోనే ఉంచేశారు. నెల రోజులే ఇక్కడ పనిచేసిన ఆయనను ఇటీవల హైదరాబాద్ బదిలీ చేసేశారు. ఆయన స్థానంలో వేరొకర్ని నియమించలేదు. దీంతో లీజుల అనుమతులు, అక్రమాలు, అక్రమ రవాణా తదితర పర్యవేక్షణ చేసే నాధుడు లేకుండా పోయాడు. జేడీ లేరన్న కారణంతో దిగువ స్థాయి అధికారులు ఉత్తర, ప్రత్యుత్తరాలు జరపడం మానేశారు. దీంతో ఉద్యోగులు చేసేందుకు పని లేకుండా ఉన్నారు. రెగ్యులర్ జేడీని నియమించి ఇక్కడే ఉంచాలని కోరుతున్నారు. మరోవైపు కార్యాలయం జీతాలు, అద్దెలు, నిర్వహణ వ్యయం కింద దాదాపు రూ.2.5 లక్షలు ప్రతీ నెలా ఖర్చవుతోంది.