విశాఖ జిల్లా మర్రిపాలెం వద్దనున్న యార్డ్‌లో సిద్ధం చేసిన ఇసుక
ఏపీఎండీసీ వెబ్‌సైట్ (యాప్) ద్వారా బుక్ చేసుకుని, ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించిన వారికి ఇసుకను స్టాక్ యార్డులోని వాహనంలో లోడ్ చేసి ఇస్తారు. లోడింగ్ రుసుముతో కలిపి ఈ ధర ఉంటుంది. కేవలం స్టాక్ యార్డుల్లో ఇసుక అందించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోవడం లేదు. వినియోగదారుల వద్దకు
తక్కువ ధరకే రవాణా చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక విరివిగా అందుబాటులోకి రానుంది. నిల్వ కేంద్రాల్లో (స్టాక్ యార్డులు) టన్ను ఇసుకను కేవలం రూ.375 చెల్లించి తీసుకోవచ్చు. లోడింగ్ రుసుముతో కలిపి టన్ను ఇసుకను రూ.375కే ప్రజలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ), భూగర్భ గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువ ధరకే ప్రజలకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏపీఎండీసీ, భూగర్భ గనుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించారు. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, ఇసుక సరఫరా ధరను అధికారికంగా ప్రకటించనున్నారు.
యాప్‌లో బుకింగ్.. ఆన్‌లైన్‌లో చెల్లింపులు
రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని సెప్టెంబరు 5వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఏపీఎండీసీ వెబ్‌సైట్ (యాప్) ద్వారా బుక్ చేసుకుని, ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించిన వారికి ఇసుకను స్టాక్ యార్డులో వాహనంలో లోడ్ చేసి ఇస్తారు. లోడింగ్ రుసుముతో కలిపి ఈ ధర ఉంటుంది. కేవలం స్టాక్ యార్డుల్లో ఇసుక అందించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోవడం లేదు. వినియోగదారుల వద్దకు తక్కువ ధరకే రవాణా చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. జిల్లాల్లో ట్రాన్స్‌పోర్టర్స్ అసోసియేషన్‌తో (లారీలు, టిప్పర్ల ఓనర్ల) సంప్రదింపులు జరిపి, ఇసుక రవాణాకు వీలైనంత తక్కువ ధరలు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కిలోమీటర్ రవాణాకు టన్నుకు రూ.4.90లోపే ఉండేలా చూడాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు ఒకటి రెండు రోజుల్లోనే ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ఇసుక రవాణా ధరలు ఖరారు చేస్తారు. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని, భూగర్భ గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న వాహనాలతో స్టాక్ యార్డుల నుంచి ప్రజలకు ఇసుక రవాణా చేయవచ్చు.
58 స్టాక్ యార్డులు సిద్ధం
ఏపీఎండీసీ ఇప్పటికే రాష్ట్రంలో 58 చోట్ల స్థలాలను గుర్తించి, ఇసుక స్టాక్ యార్డులకు అనువుగా తీర్చిదిద్దింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో నదులు లేనందున ఇసుక లభ్యం కాదు. ఈ రెండు జిల్లాలకు శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. విశాఖపట్నంలోని అగనంపూడి, ముడసర్లోవలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి, లారీల్లో పొరుగు జిల్లాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. ఈ జిల్లాలోని స్టాక్ యార్డులకు ఇసుకను సుమారు 150 కిలోమీటర్ల నుంచి తరలించాల్సి ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఖర్చవుతుంది. అన్ని జిల్లాల్లో రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు ఇసుక తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 102 రీచ్‌ల నుంచి ఇసుక తరలించి ప్రజలకు అందిస్తారు. ఇసుకకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కొత్త రీచ్‌లను గుర్తించి, చట్టబద్ధమైన అనుమతులు తీసుకునే ప్రక్రియను కూడా అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. ఇసుక తవ్వే రీచ్‌ల సంఖ్యను దశలవారీగా 303కు పెంచాలని భూగర్భ గనుల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. సాధ్యమైనంత వరకూ సమీప ప్రాంతాల నుంచే ఇసుక అందించాలనే ఉద్దేశంతో స్టాక్ యార్డుల సంఖ్యను 157కు పెంచేందుకు ప్రణాళిక తయారు చేశారు.
నిర్వహణ వ్యయం ఎక్కువైనా...
తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకం, స్టాక్ యార్డులకు తరలింపు తదితర నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంది. పర్యావరణ నిబంధనావళి ప్రకారం రీచ్‌లలో యంత్రాలు వినియోగించకుండా కూలీలతోనే ఇసుక తవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అలాగే ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రజల ప్రయోజనార్థం సరసమైన ధరలకే ఇసుక అందించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అందువల్లే తెలంగాణలో టన్ను ఇసుక ధర రూ.400 ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.375కే ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు.
టన్ను ఇసుకకు గరిష్టంగా రూ.225 ఖర్చు
ఇసుకను రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు చేరవేసి, అక్కడి నుంచి ప్రజలకు అందించడానికి మొత్తం నిర్వహణ వ్యయం, పన్నులు కలిపి టన్నుకు దాదాపు రూ.225 ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు. రీచ్‌లో ఇసుకను తవ్వి స్టాక్ యార్డుకు చేరవేయడానికి కాంట్రాక్టర్లకు ఇచ్చే మొత్తమే టన్నుకు రూ.100 అవుతోంది. ఒక్కో స్టాక్ యార్డులో 14 మంది ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. టన్ను ఇసుకకు యార్డుల నిర్వహణకు సగటున రూ.30, జీఎస్‌టీ రూ.22, సీనరేజి రూ.33, జిల్లా మినరల్ ఫండ్(డీఎంఎఫ్) రూ.10, మెరిట్, ఐటీ, ఇతరత్రా అన్నీ కలిపితే అయ్యే వ్యయం రూ.225. స్టాక్ యార్డుల్లో టన్ను ఇసుక రూ.375కు విక్రయిస్తే ఖర్చులు పోను ప్రభుత్వానికి రూ.150 మిగులుతుందని అంచనా. ఇలా మిగిలే మొత్తాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
రూ.16.38 కోట్లు ఇవ్వండి: ఏపీఎండీసీ
ఇసుక దారి మళ్లకుండా పకడ్బందీగా నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫైబర్ నెట్ తదితర ఏర్పాట్ల కోసం రూ.16.38 కోట్లు మూలధన నిధి కింద విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఏపీఎండీసీ కోరింది. స్టాక్ యార్డులకు ఫైబర్ నెట్ కోసం ఇప్పటికే రూ.38 లక్షలు చెల్లించామని ఆర్థిక శాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment