new sand policy
-
'నో ఆన్లైన్ బుకింగ్.. ఎక్కడినుంచైనా ఇసుకను తీసుకెళ్లొచ్చు'
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం విలేకరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇసుక టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ కొత్త పాలసీ ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు, ప్రజల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుని పాలసీలో మార్పులు చేసి నూతన ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. నిర్ణయించిన ధరకే ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని, ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని రీచ్‌ల్లోనూ ఒకే ధర అమలు చేస్తున్నామని, ప్రతి ఇసుక రీచ్ వద్ద 20 వాహనాలు ఏర్పాటు చేసిట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి రీచ్‌ల్లోనూ ధరను ముందే నిర్ణయిస్తున్నామని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా వినియోగదారులు నేరుగా వచ్చి వారి సొంత వాహనాల్లో ఇసుకను తీసుకెళ్లొచ్చని, నాణ్యతను పరిశీలించి తమకు నచ్చినచోట ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు ఉందని వివరించారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై వస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. 'ఇసుక తవ్వకాలు, రీచ్‌ల నిర్వహణ, అమ్మకాలకు సంబంధించి టెండర్లను ఆహ్వానించాం. ఎవ్వరైనా పాల్గొనేందుకు వారం రోజులు అదనపు సమయం కూడా ఇచ్చాం. పూర్తి పారదర్శకంగా టెండర్లను నిర్వహించాం. ఇందులో భాగంగానే జనవరి 4న ఎంఎస్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ సంస్థ టెండర్ల విధానంలో ఎంతో అనుభవం ఉన్న ఏజెన్సీ. మూడు ప్యాకేజీల కు కచ్చితంగా నిబంధనలు పెట్టాం. సాంకేతిక, ఆర్థిక అర్హతలు అన్ని ముందే పరిశీలించాం. ఏడాదికి సుమారు వెయ్యి కోట్లు ఇసుకను సరఫరా చెయ్యగలరు. ప్రతి 15 రోజులకు ప్రభుత్వానికి టెండర్ సంస్థ డబ్బులు చెల్లించాలి. 70 శాతం రీచ్ లు ఖచ్చితంగా నిరంతరం అందుబాటులో ఉండాలి. ఇసుక కొరత సృష్టించడానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించాం. వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చెయ్యలేరు. ప్రతి రీచ్ దగ్గర టన్ను ఇసుక 475 ధర ను ఖరారు చేశాం. దానికి అదనంగా రవాణా ఛార్జీల ఉంటాయి' అని స్పష్టం చేశారు. చదవండి : విశాఖలో బీఎస్–6 ఇంధన ఉత్పత్తి స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు ఒప్పుకోం: విజయసాయిరెడ్డి -
కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
-
ప్రజాభిప్రాయం మేరకు నూతన ఇసుక విధానం
ఇసుక విధానం ఖరారుకు ముందు పత్రికా ప్రకటన ఇచ్చి.. ప్రజల సూచనలు, సలహాలు పొందాలి. ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండరాదు. పూర్తి పారదర్శక విధానం ఉండాలి. ధర కూడా రీజనబుల్‌గా ఉండాలి. సరఫరాలో సమర్థతను పెంచాలి. నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలి. ఎవరికి వారు రీచ్‌కు వచ్చి నిబంధనల మేరకు ఇసుక తీసుకుపోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించాలి. కాంట్రాక్టర్ స్టాండ్‌బై రవాణా సదుపాయం కూడా కల్పించాలి. ఆ నియోజకవర్గంలో నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల వారి ఇళ్లకు టోకెన్లు ఇచ్చి, సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలి. –సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: నూతన ఇసుక విధానంపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రుల బృందాన్ని ఆదేశించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నూతన ఇసుక విధానం రూపొందించాలని సూచించారు. నూతన ఇసుక విధానంపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మంత్రుల బృందం, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ఇసుక రీచ్‌లు, సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. వీలుంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వస్తుంది. రవాణా వ్యయం ఎక్కువగా ఉంది. అది రీజనబుల్‌గా ఉండాలి. నూతన ఇసుక విధానంపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు – చలాన కట్టి, ఎవరైనా వచ్చి ఇసుక తీసుకుపోయే విధంగా ఉండాలి. ఏ రేటుకు అమ్మాలి? అన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారించాలి. అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్మితే ఎస్ఈబీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) రంగ ప్రవేశం చేస్తుంది. – స్థానికంగా ఉన్న వారికి ఇసుక అవసరమైతే, వారికి కూడా కూపన్లు ఇచ్చి.. సబ్సిడీ ధరకు ఇసుక సరఫరా చేయొచ్చు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని పరిశీలించాలి. – ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అక్రమాలు జరగకుండా చూడండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక విధానంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నూతన ఇసుక పాలసీ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ఇసుక పాలసీ అమలుపై ఆయన బుధవారం జిల్లాల కలెక్టర్లకు తన కార్యదర్శి ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే.. అవినీతికి తావులేని, అక్రమ తవ్వకాలకు ఆస్కారం లేని పారదర్శక ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ ‘ఎ డర్టీ ఫిష్ స్పాయిల్ ద హోల్ పాండ్’ అనే రీతిలో ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైనా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందన్నారు. అలా జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి రహిత, పారదర్శక ఇసుక పాలసీని అమలుచేయాలని, ఎక్కడా అక్రమాలు జరగకుండా పటిష్ట వ్యవస్థ ఉండాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇందుకోసం కలెక్టర్లందరూ అన్ని వైపుల నుంచి సమగ్ర సమాచారం తెప్పించుకొని, అక్రమాలకు తావులేకుండా చూడాలన్నారు. రానున్న స్పందన సమావేశం నాటికి దీనిపై పక్కా సమాచారంతో సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. -
ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రీచ్‌లు, చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘాతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టపడింది. సీసీ కెమెరాల నిఘాతో పాటు టాస్క్ఫోర్సు దాడులు ముమ్మరం చేయడంతో అక్రమార్కుల వెన్నుల్లో వణుకు పుడుతోంది. మరోవైపు ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకునేలా పారదర్శక విధానంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బుక్ చేసుకున్న వారికి వెంటనే సమీపంలోని స్టాక్ యార్డులు, డిపోల నుంచి ఇసుక వెంటనే సరఫరా చేయడంతో అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు సరసమైన ధరలకు ఇసుక అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబరు 1 వరకూ ఈ విధానంలో రాష్ట్రంలో మొత్తం 23,81,716 టన్నుల ఇసుకను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సరఫరా చేసింది. ఇందులో బల్క్ వినియోగదారులు 3,88,955 టన్నులు, సాధారణ వినియోగదారులు 19,92,761 టన్నుల ఇసుకను కొనుగోలు చేశారు. గత 20 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార తదితర నదులకు వరద రావడంతో నవంబరు రెండో వారం ముగిసే వరకూ రీచ్‌లన్నీ నీటిలోనే మునిగిఉన్నాయి. దీంతో ఇసుక తవ్వకాలు, రవాణాకు అవరోధం ఏర్పడడంతో కొంత మేర ఇసుక కొరత ఏర్పడింది. గత నెల రెండోవారం తర్వాత వరద తగ్గడం, నవంబరు 14 నుంచి ఇసుక వారోత్సవాలను నిర్వహించి చర్యలు తీసుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత నెల 16 నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత మాటే లేదు. అన్ని డిపోలు, స్టాక్ పాయింట్లలో ఇసుక నిండుగా ఉంది. ప.గోదావరి జిల్లాలో అత్యధిక వినియోగం: పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా సాధారణ వినియోగదారులు 4,54,354 టన్నుల ఇసుకను కొనుగోలు చేయగా.. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 14,766 టన్నుల ఇసుక మాత్రమే బుక్ చేసుకున్నారు. ఒకేరోజు 5 జిల్లాల్లో టాస్క్ఫోర్సు దాడులు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపుతూ.. అక్రమార్కులకు రూ. 2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా జీఓ జారీ చేసింది. జీపీఎస్ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక సరఫరాకు అనుమతిస్తున్నారు. విజయవాడలోని కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు టాస్క్ఫోర్సు సిబ్బంది దాడుల్ని ముమ్మరం చేసింది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అనంతపురం, విజయనగరం, గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో విస్తృతంగా దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై 9, అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై 2 కేసులు నమోదు చేయడంతోపాటు 9 వాహనాలను సీజ్ చేశారు. -
ఇసుక కావాలా.. బుక్ చేయండిలా..
సాక్షి, బేస్తవారిపేట/కంభం: ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు ఇసుక కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందే. దీనికోసం సర్కారు వెబ్ అప్లికేషన్ రూపొందించింది. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవావాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి తదితర వివరాలు ‘సాక్షి’ పాఠకుల కోసం.. వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి.. వ్యాపార నిమిత్తం ఇసుక కావాల్సిన వారు, సాధారణ వినియోగదారులు ఎవరైనా సరే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వెబ్ అప్లికేషన్ ద్వారానే ఇసుకను బుక్ చేసుకోవాలి. చదువుకున్న వారైతే నేరుగా మొబైల్, టాబ్లెట్, పీసీ, ల్యాప్‌టాప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఇంటర్నెట్, కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి బుక్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోవాలి.. ఇసుక కావాల్సిన వారు ముందుగా ప్రభుత్వం రూపొందించిన శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానటరింగ్ సిస్టమ్(వెబ్ అప్లికేషన్) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా www. sand.ap.gov.in టైపు చేసి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. వెల్కమ్ టూ ఏపీ శాండ్ పోర్టల్ పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా రిజిస్ట్రేషన్ మెనూలోకి వెళ్లాలి. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి జనరల్ కన్జ్యూమర్, రెండోది బల్క్ కన్జ్యూమర్. మీ కేటగిరీని బట్టి ఒక దానిపై క్లిక్ చేయాలి. మీ వ్యక్తిగత అవసరాల కోసం, మీ సొంత గృహ నిర్మాణం, మరమ్మతుల కోసం బుక్ చేసుకునే వారు జనరల్ కన్జ్యూమర్ కేటగిరీలోకి వస్తారు. వ్యక్తిగత అవసరాలు కాని వారు అంటే బిల్డర్లు, డెవలపర్లు తదితరులు బల్క్ కన్జ్యూమర్ల కేటగిరీలోకి వస్తారు. మీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికోసం ఆ కేటగిరిలో ఉన్న రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేయాలి. వెంటనే రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. పేజీ ఓపెన్ అయ్యాక 1, 2, 3, 4 అని నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. ► ఆప్షన్–1 మొబైల్ నంబర్ వెరిఫికేషన్ దీనిని ప్రెస్ చేయగానే మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. కింద ఉన్న బాక్స్‌లో ఓటీపీ అని ఉంటుంది. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీని అందులో టైప్ చేయాలి. తర్వాత కింద ఉన్న సబ్మిట్ బటన్ నొక్కాలి. ► ఆప్షన్–2లో ఆధార్ నంబర్ అని ఉంటుంది. దీనిని ప్రెస్ చేయగానే ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ ఇవ్వాలంటే కచ్చితంగా మీరు 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఆధార్ నంబర్ నమోదు చేసి పక్కనే ఉన్న సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. ► ఆప్షన్–3లో ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయగానే మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో కాస్త ఎక్కువ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మొదటగా మొబైల్ నంబర్ ఇవ్వాలి. మీ జిల్లాను ఎంపిక చేసుకోవాలి. మీ మున్సిపాలిటీ/ మండలాన్ని ఎంపిక చేసుకోవాలి. మీ అడ్రస్‌ను డోర్ నంబర్‌తో సహా తర్వాత బాక్స్‌లో ఇవ్వాలి. పిన్ కోడ్‌నూ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ పూర్తి పేరు, రూరల్/అర్బన్ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీతో పాటు వార్డ్ నంబర్ కూడా ఇవ్వాలి. మీరు ఇచ్చిన చిరునామా దగ్గర్లో ఉన్న ల్యాండ్ మార్క్ ఇవ్వాలి. అలాగే మెయిల్ ఐడీ నమోదు చేసి చివరలో సబ్మిట్ బటన్ నొక్కాలి. ► ఆప్షన్–4లో కన్ఫర్మేషన్ ఆప్షన్‌ను ప్రెస్ చేయాలి. పేజీ ఓపెన్ కాగానే యూజర్ ఐడీ అని అడుగుతుంది. మీరు ఏదైతే ఫోన్ నంబర్ ఇచ్చారో దానిని ఎంటర్ చేయాలి. దాని కింద ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ టరŠమ్స్ అండ్ కండిషన్స్ బటన్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో ప్రొసీడ్ బటన్ వస్తుంది. దానిని ప్రెస్ చేయాలి. అంతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్టే. ఈ ప్రక్రియ ఒకసారి చేస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత బుకింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు మళ్లీ హోమ్ పేజీలోకి ఆటోమేటిక్‌గా వస్తారు. రిజిస్ట్రేసన్ పక్కన బుకింగ్ ఆప్షన్‌ను ప్రెస్ చేయగానే ఆన్లైన్ శాండ్ బుకింగ్, ట్రాక్ యువర్ ఆర్డర్ అనే రెండు సబ్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మొదటిది ఆన్లైన్ శాండ్ బుకింగ్‌ను క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన పేజీలో మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి. దాని కింద సెండ్ ఓటీపీ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఇసుక దేనికోసం అని ప్రత్యేక పేజీలో వివరాలు అడుగుతారు. అంటే కొత్త ఇంటి నిర్మాణమా? మరమ్మతులకా? అన్న విషయాన్ని ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఎన్ని ఫ్లోర్లు అని అడుగుతుంది. అవి ఎంటర్ చేశాక ఎన్ని చదరపు అడుగులో అడుగుతుంది. మీరు ఎన్ని చదరపు అడుగులు నమోదు చేస్తారో దానిని బట్టి ఆటోమేటిగ్గా మీకు ఎంత ఇసుక అవరసమో చెప్పేస్తుంది. ఉదాహరణకు 3000 చదరపు అడుగులు అని మీరు ఇచ్చారనుకోండి మీకు 175 టన్నుల ఇసుక అవసరమని చెబుతుంది. ఈ ఇసుకను మొత్తం ఒకేసారి బుక్ చేయడానికి కుదరదు. ఒకసారికి గరిష్టంగా 20 టన్నులు మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఇసుక ఎక్కడ కావాలో సంబంధిత స్టాక్ యార్డును ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయగానే బిల్ చూపిస్తుంది. బిల్ వచ్చిన తర్వాత వాహనాన్ని మాట్లాడుకుని ఇసుక తరలించుకురావచ్చు. -
టన్ను ఇసుక రూ.375, జీఎస్టీ అదనం
సాక్షి, ఒంగోలు సిటీ: ఇసుక మాఫియాకు గొంతులో వెలక్కాయ పడింది. ఇసుక నూతన విధానం చెక్ పెట్టింది. మంత్రి మండలి సమావేశంలో బుధవారం రాత్రి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు పలుకుబడి, కండ బలం ఉపయోగించి కొందరు ఇసుక దోపిడీ చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకున్నారు. ప్రజలకు ఇసుక దక్కనీయకుండా సైంధవులయ్యారు. ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసింది. జవాబుదారీతనం పెంచే విధంగా ఇసుక విధానం ఉంది. జిల్లాలో మద్దిపాడు, మద్దిరాలపాడు, చక్రాయపాలెం–1, చక్రాయపాలెం–2, దారకానిపాడు, కె.రాజుపాలెం, కె.బిట్రగుంట, నందిపాడు, రామాయపాలెం, చదలవాడ, కరవది, మల్లవరం ప్రాంతాల్లో ఇసుక రేవులు ఉన్నాయి. ఈ రేవుల్లో ఇసుక దోపిడి పెద్ద మొత్తంలోనే జరిగింది. మద్దిపాడు మండంలో అయితే మాఫియా కనుసన్నల్లోనే ఇసుక దోచుకున్నారు. ఈ రేవుల్లో 3,42,075 క్యూబిక్ మీటర్లు ఇసుక ఉన్నట్లుగా గనుల అధికారులు గుర్తించారు. అయితే ఈ రేవుల్లో ప్రస్తుతం 94 వేల క్యూబిక్ మీటర్లు మాత్రమే ఇసుక లభ్యత ఉందని అంచనా వేశారు. తాజాగా ప్రభుత్వానికి ఇక్కడి పరిస్ధితుల పై నివేదిక పంపారు. ఇవి కాకుండా పట్టా భూముల్లో 6,56,342 క్యూబిక్ మీటర్లు ఇసుక ఉందని అంచనా వేశారు. పట్టా భూముల్లో ఇసుక ఖనిజం మొత్తం 23 ప్రాంతాలలో ఉంది. నూతన ఇసుక విధానంలో జిల్లాలోని రేవుల నుంచి ఇసుక తీసుకొనే వీలు లేదు. నూతన విధానం నేటి నుంచి అమలు ఇసుక నూతన విధానం గురువారం నుంచి అమలులోకి రానుంది. గతంలో ఇసుక రేవుల నుంచి ఇసుక తీయడానికి వేలం పాటలు నిర్వహించే వారు. ఆ తర్వాత పొదుపు సంఘాల ద్వారా ఇసుక తవ్వకాలను అనుమతించారు. ఆ తర్వాత ఉచిత విధానాన్ని అమలు చేస్తున్నామంటూ..సరైన మార్గదర్శకాలు లేకుండా మాఫియాను పెంచి పోషించే విధంగా ప్రభుత్వం ఇసుక విధానాన్ని అమలు చేసింది. దీని వల్ల ఇసుక తీవ్ర కొరత వచ్చింది. ఇసుక దోపిడి చేశారు. ఇసుక అక్రమ అమ్మకాల ద్వారా రూ.కోట్లు గడించారు. నదులు,వాగులు,వంకల నుంచి ఇసుక దోపిడి చేశారు. ► ఈ దోపిడీ విధానాన్ని అడ్డుకొని ప్రతి ఒక్కరికి ఇసుక దక్కే నూతన విధానం గురువారం నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది. ► అంతా ఆన్లైన్ ద్వారా..పారదర్శకంగా అమలు ► వాహనాలకు జియో ట్యాగింగ్ తప్పని సరి. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్ధ ద్వారానే ఇసుక నామమాత్రపు రుసుంతో అమ్మకాలు ► వినియోగదారుడు ఇసుక ఎందుకోసమో వైనం చెప్పి యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఓటీపీ ద్వారా ఇసుక పరిమాణాన్ని నమోదు చేయించుకోవాలి. ఆ మొత్తాన్ని వాడుకోవడానికి ఆధార్, సెల్ నంబర్ ఇతర వివరాలను అందించాలి. ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించాలి. ఇలాంటి మార్గదర్శకాలను అనుసరించి ఇసుక రేవ నుంచి వినియోగానికి తీసుకోవాలి. పొరుగు జిల్లాల నుంచి ఇసుక.. ఇసుక నూతన విధానం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఇసుక నిల్వలు అంత మొత్తంలో లేవు. ఉన్న కొద్ది పాటి నిల్వలకు పర్యావరణ అనుమతులు ఉండాలి. వాల్టా చట్టం ప్రకారం తగినంత ఇసుక లేదు. దీంతో పొరుగు జిల్లాల నుంచి ఇసుక తెచ్చుకొనే విధంగా ఆన్లైన్ ద్వారా అనుమతులిస్తారు. ► జిల్లాకు కావాల్సిన ఇసుక నెల్లూరు, కడప జిల్లాల నుంచి తెచ్చుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకొని నేరుగా సైట్లోకి ఇసుక తెచ్చుకోవచ్చు. ► ప్రకాశం బ్యారేజ్‌కు నీరు విడుదల చేసినందున ఈ పాలసీలో ప్రస్తుతానికి ఇసుక తీసుకోవడానికి వీల్లేదు. నీరు పోయిన తర్వాత పరిస్ధితులను బట్టి గుంటూరు నుంచి ఇసుక తీసుకొనే వీలుంది. టన్నుకు రూ.375, కిమీకి రూ.4.95 ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఇసుక టన్ను రూ.375గా ఉంది. రవాణా ఛార్జీలు కిలోమీటరుకు రూ.4.95 గా నిర్ణయించారు. రవాణా ఛార్జీలను కలెక్టర్ అధ్యక్షతన కమిటీ నిర్ణయిస్తుంది. టన్నుకు రూ.375, అదనంగా జీఎస్టీని చెల్లించాలి. ఆన్లైన్లోనే చెల్లింపులు చేయాలి. ► మొబైల్ యాప్, మీసేవ, వెబ్సైట్లో నమోదు చేసుకొని కావాల్సిన పరిమాణంలో ఇసుక పొందవచ్చు. ► ఇసుక రవాణా చేసే వాహనాన్ని ‘మైన్స్ డాట్ ఏపీ జీవోవీ డాట్ ఇన్’ సైట్లో అడిగిన వివరాలను నమోదు చేసుకొని వాహనాన్ని నమోదు చేసుకోవాలి. ► అదే ఇసుక కావాల్సిన వారు జనరల్ కంజూమర్ అయితే పది వేల ఎస్ఎఫ్టీ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. వెబ్‌లో ఇసుక పరిమాణం నమోదు చేయాలి. ‘ఏపీ డాట్ జీవోవీ.ఇన్’ సైట్ లో ఎంత ఇసుక కావాలో నమోదు చేసుకోవాలి. ఆధార్,సెల్ నెంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసి ఓకే చేస్తే పేరు నమోదవుతుంది. మొబైల్ యాప్‌లో ఇసుక పరిమాణం కావాల్సిన వివరాలను చూపిస్తుంది. దీని ప్రకారం డబ్బు ఆన్లైన్లో కడితే రసీదు వస్తుంది. రేవు వద్ద మొబైల్లో వచ్చిన వివరాలను చూపిస్తే ఏపీఎండీసీ అధికారుల ఆధ్వర్యంలో ఇసుక లోడు చేస్తారు. పట్టా భూములకు అనుమతి లేదు.. జిల్లాలోని 23 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. ఇసుక తవ్వకాలను ఏపీఎండీసీ మాత్రమే చేపడుతుంది. ఎండీసీ అధికారులకు వివరాలను తెలియజేయాలి. వారి ఆధ్వర్యంలో ఇసుక రవాణా అనుమతిస్తారు. క్యూబిక్ మీటరుకు (ఒకటిన్నర టన్నుకు) రూ.60 చెల్లిస్తారు. అదీ ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాలకు చెల్లిస్తారు. 6,56,347 క్యూబిక్ మీటర్లు పట్టా భూముల్లో ఇసుక ఉన్నట్లుగా గనుల అధికారులు నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం పట్టా భూములున్న వారు ఏపీఎండీసీ అధికారులను సంప్రదించాలి. త్వరలోనే మార్గదర్శకాలు.. జిల్లాలో గుండ్లకమ్మ, మూసి,పాలేరు,మన్నేరు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉన్నాయి. వీటిలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం నుంచి త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయి. మద్దిపాడు,నాగులుప్పలపాడు, ఒంగోలు, అద్దంకి తదితర మండలాల్లో ఇవి ఉన్నాయి. నదులు, నదీపాయల్లో, పెద్ద ఏర్లు వద్ద ఉన్న ఇసుక నిక్షేపాలను తవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని అనుసరించి తవ్వకాలను చేపట్టాల్సి ఉంటుంది. ఆన్లైన్లో నమోదు చేసుకోండి.. ఇసుక నూతన విధానం అమలోకి వచ్చింది. ఆన్లైన్లో ఇసుక కావాల్సిన వారు నమోదు చేసుకొని తగిన పరిమాణంలో పొందవచ్చు. ఇంకా మంత్రి మండలి నిర్ణయాల అధికారిక పత్రం తమకు రాలేదు. థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్‌లో ఇసుక తవ్వకాలకు మార్గదర్శకాలు త్వరలోనే రానున్నాయి. టన్ను ఇసుక రూ.375 చెల్లించాలి. కలెక్టర్ అధ్యక్షతన కమిటీ కిమీకి రూ.4.95 లెక్కన రవాణా చార్జిలను నిర్ణయిస్తారు. వాహనాలకు జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడా ఇసుక అక్రమ రవాణాకు తావు లేకుండా నూతన విధానం ఉంది. – ఈ.నరసింహారెడ్డి, గనులశాఖ డీడీ -
నూతన ఇసుక పాలసీ
సాక్షి, కరీంనగర్: జిల్లాలో త్వరలో నూతన ఇసుక టాక్స్ పాలసీ అమలు చేస్తామని జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మంగళవారం నూతన ఇసుక టాక్స్ పాలసీపై మైనింగ్ అధికారులు, ఇసుక ట్రాక్టర్ల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నూతన ఇసుక పాలసీని రూపొందించిందని, దానిని అమలు చేస్తే ట్రాక్టర్ల ఓనర్లు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని తెలిపారు. ట్రాక్టర్ ఓనర్లకు సరైన రేటు లభిస్తుందని, ప్రజలకు తక్కువ ధరకే ఇసుక దొరకుతుందని తెలిపారు. ట్రాక్టర్ల ఓనర్లు వెంటనే ఏడీ మైనింగ్ ఆఫీస్‌లో ప్రతీ ట్రాక్టర్‌కు రూ.5 వేలు డిపాజిట్ చేసి వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇసుక కావాలనుకునే వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వారికి వరుస క్రమంలో కేటాయిస్తామని చెప్పారు. జిల్లాలో ఇసుక రీచ్‌లను గురించి రోడ్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని, ట్రాక్టర్ ఓనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇసుక అక్రమ రవాణా కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రజలకు ఇసుక నిత్యావసరంగా మారిందని, అక్రమ రవాణా ద్వారా జరిమానాలు కట్టలేక ట్రాక్టర్ ఓనర్లు, అధిక ధరలుచెల్లించలేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు నూతన ఇసుక పాలసీని అమలు చేస్తోందని చెప్పారు. ఈ నూతన ఇసుక పాలసీలో అక్రమ ఇసుకను తీసుకున్న వినియోగదారునిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నందున ఇకముందు జిల్లాలో ఎవరూ అక్రమ ఇసుకను తీసుకోరని ట్రాక్టర్ యజమానులకు తెలిపారు. వెంటనే ప్రభుత్వం రూపొందించిన ఇసుక పాలసీలో తమ ట్రాక్టర్లును నమోదు చేయించుకోవాలని సూచించారు. వారానికి ఒకసారి ఇసుక ట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఇసుక ట్రాక్టర్ ఓనర్ల సందేహాలను ఎమ్మెల్యే నివృత్తి చేశారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మైనింగ్ ఏడీ వెంకటేశం, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అసిస్టెంట్ జియాలో సిస్ట్ ఎం.రఘుబాబు, ప్రాజెక్టు ఆఫీసర్ తారక్ నాథ్‌రెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ సైదులు, ఇసుక ట్రాక్టర్ల ఓనర్లు తదితరులు పాల్గొన్నారు. -
టన్ను ఇసుక రూ.375
ఏపీఎండీసీ వెబ్సైట్ (యాప్) ద్వారా బుక్ చేసుకుని, ఆన్లైన్లో డబ్బు చెల్లించిన వారికి ఇసుకను స్టాక్ యార్డులోని వాహనంలో లోడ్ చేసి ఇస్తారు. లోడింగ్ రుసుముతో కలిపి ఈ ధర ఉంటుంది. కేవలం స్టాక్ యార్డుల్లో ఇసుక అందించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోవడం లేదు. వినియోగదారుల వద్దకు తక్కువ ధరకే రవాణా చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక విరివిగా అందుబాటులోకి రానుంది. నిల్వ కేంద్రాల్లో (స్టాక్ యార్డులు) టన్ను ఇసుకను కేవలం రూ.375 చెల్లించి తీసుకోవచ్చు. లోడింగ్ రుసుముతో కలిపి టన్ను ఇసుకను రూ.375కే ప్రజలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ), భూగర్భ గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువ ధరకే ప్రజలకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏపీఎండీసీ, భూగర్భ గనుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించారు. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, ఇసుక సరఫరా ధరను అధికారికంగా ప్రకటించనున్నారు. యాప్‌లో బుకింగ్.. ఆన్లైన్లో చెల్లింపులు రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని సెప్టెంబరు 5వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఏపీఎండీసీ వెబ్సైట్ (యాప్) ద్వారా బుక్ చేసుకుని, ఆన్లైన్లో డబ్బు చెల్లించిన వారికి ఇసుకను స్టాక్ యార్డులో వాహనంలో లోడ్ చేసి ఇస్తారు. లోడింగ్ రుసుముతో కలిపి ఈ ధర ఉంటుంది. కేవలం స్టాక్ యార్డుల్లో ఇసుక అందించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోవడం లేదు. వినియోగదారుల వద్దకు తక్కువ ధరకే రవాణా చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. జిల్లాల్లో ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్‌తో (లారీలు, టిప్పర్ల ఓనర్ల) సంప్రదింపులు జరిపి, ఇసుక రవాణాకు వీలైనంత తక్కువ ధరలు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కిలోమీటర్ రవాణాకు టన్నుకు రూ.4.90లోపే ఉండేలా చూడాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు ఒకటి రెండు రోజుల్లోనే ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ఇసుక రవాణా ధరలు ఖరారు చేస్తారు. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని, భూగర్భ గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న వాహనాలతో స్టాక్ యార్డుల నుంచి ప్రజలకు ఇసుక రవాణా చేయవచ్చు. 58 స్టాక్ యార్డులు సిద్ధం ఏపీఎండీసీ ఇప్పటికే రాష్ట్రంలో 58 చోట్ల స్థలాలను గుర్తించి, ఇసుక స్టాక్ యార్డులకు అనువుగా తీర్చిదిద్దింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో నదులు లేనందున ఇసుక లభ్యం కాదు. ఈ రెండు జిల్లాలకు శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. విశాఖపట్నంలోని అగనంపూడి, ముడసర్లోవలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి, లారీల్లో పొరుగు జిల్లాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. ఈ జిల్లాలోని స్టాక్ యార్డులకు ఇసుకను సుమారు 150 కిలోమీటర్ల నుంచి తరలించాల్సి ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఖర్చవుతుంది. అన్ని జిల్లాల్లో రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు ఇసుక తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 102 రీచ్‌ల నుంచి ఇసుక తరలించి ప్రజలకు అందిస్తారు. ఇసుకకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కొత్త రీచ్‌లను గుర్తించి, చట్టబద్ధమైన అనుమతులు తీసుకునే ప్రక్రియను కూడా అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. ఇసుక తవ్వే రీచ్‌ల సంఖ్యను దశలవారీగా 303కు పెంచాలని భూగర్భ గనుల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. సాధ్యమైనంత వరకూ సమీప ప్రాంతాల నుంచే ఇసుక అందించాలనే ఉద్దేశంతో స్టాక్ యార్డుల సంఖ్యను 157కు పెంచేందుకు ప్రణాళిక తయారు చేశారు. నిర్వహణ వ్యయం ఎక్కువైనా... తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకం, స్టాక్ యార్డులకు తరలింపు తదితర నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంది. పర్యావరణ నిబంధనావళి ప్రకారం రీచ్‌లలో యంత్రాలు వినియోగించకుండా కూలీలతోనే ఇసుక తవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అలాగే ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రజల ప్రయోజనార్థం సరసమైన ధరలకే ఇసుక అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందువల్లే తెలంగాణలో టన్ను ఇసుక ధర రూ.400 ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.375కే ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. టన్ను ఇసుకకు గరిష్టంగా రూ.225 ఖర్చు ఇసుకను రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు చేరవేసి, అక్కడి నుంచి ప్రజలకు అందించడానికి మొత్తం నిర్వహణ వ్యయం, పన్నులు కలిపి టన్నుకు దాదాపు రూ.225 ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు. రీచ్‌లో ఇసుకను తవ్వి స్టాక్ యార్డుకు చేరవేయడానికి కాంట్రాక్టర్లకు ఇచ్చే మొత్తమే టన్నుకు రూ.100 అవుతోంది. ఒక్కో స్టాక్ యార్డులో 14 మంది ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. టన్ను ఇసుకకు యార్డుల నిర్వహణకు సగటున రూ.30, జీఎస్టీ రూ.22, సీనరేజి రూ.33, జిల్లా మినరల్ ఫండ్(డీఎంఎఫ్) రూ.10, మెరిట్, ఐటీ, ఇతరత్రా అన్నీ కలిపితే అయ్యే వ్యయం రూ.225. స్టాక్ యార్డుల్లో టన్ను ఇసుక రూ.375కు విక్రయిస్తే ఖర్చులు పోను ప్రభుత్వానికి రూ.150 మిగులుతుందని అంచనా. ఇలా మిగిలే మొత్తాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.16.38 కోట్లు ఇవ్వండి: ఏపీఎండీసీ ఇసుక దారి మళ్లకుండా పకడ్బందీగా నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫైబర్ నెట్ తదితర ఏర్పాట్ల కోసం రూ.16.38 కోట్లు మూలధన నిధి కింద విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఏపీఎండీసీ కోరింది. స్టాక్ యార్డులకు ఫైబర్ నెట్ కోసం ఇప్పటికే రూ.38 లక్షలు చెల్లించామని ఆర్థిక శాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. -
ఇసుక కొరతకు ఇక చెల్లు!
ఇసుక ఇక సామాన్యునికి అందుబాటులోకి రానుంది. కోరిన వెంటనే అందించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పారదర్శకత కోసం కొత్త ఇసుక విధానం అమలు చేయనున్నారు. ఇప్పటికే దీనికోసం కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో ఇసుక నిల్వలున్నట్టు గుర్తించారు. వాటిని స్టాక్ చేసేందుకు సాలూరు, బొబ్బిలిలో రెండు పాయింట్లు గుర్తించి పదెకరాల స్థలాన్ని కేటాయించారు. కొద్దిరోజులుగా ఇసుక కొరతను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకున్న వారి నోళ్లకు ఇక తాళాలు పడనున్నాయి. సాక్షి, బొబ్బిలి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టనున్న ఇసుక కొత్త పాలసీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే నెల 5 నాటికి ఇసుక సరఫరాను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇసుక విధానం అమలు చేసేందుకు సంబంధిత శాఖల కమిటీ ఇప్పటికే జిల్లాలోని రీచ్‌లను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ప్రభుత్వం ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తగిన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇందుకోసం జిల్లాలో 62 ఇసుక రీచ్‌లు ఉండగా ఇందులో 55 ప్రాంతాల్లో ఇసుక నిల్వలను సంబంధిత శాఖాధికారులు గుర్తించారు. ఈ ఇసుక నిల్వలు ఎంత మేరకు తవ్వాల్సి ఉంటుందన్నది ఇప్పుడు చర్చిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఈ కొత్త ఇసుక పాలసీని నిర్ణీత సమయానికి ప్రారంభించేందుకు ఆయా శాఖలు పనిలో పడ్డాయి. ఒక్కో స్టాక్‌పాయింట్‌కు ఐదు ఎకరాలు.. జిల్లాలో ఇసుకను ఇతర ప్రాంతాల్లోని రీచ్‌లనుంచి తీసుకువచ్చి స్టాక్‌పాయింట్ల వద్ద నిల్వ చేస్తారు. ఈ పాయింట్ల నుంచి లబ్ధిదారులకు ఇసుకను తరలించేందుకు అనుమతులు జారీ చేస్తారు. జిల్లాలో సాలూరు, బొబ్బిలిలోని గొర్లె సీతారామపురం వద్ద గల ఐదేసి ఎకరాల వంతున స్థలాలను ఆయా తహసీల్దార్లు సిద్ధం చేసి చూపించారు. వీటిని సబ్ కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని ఏయే రీచ్‌ల నుంచయినా ఈ పాయింట్ల వద్దకు ఇసుకను లారీలతో తరలించి డంప్ చేస్తారు. ఇసుక లభ్యతను బట్టి త్వరలోనే స్టాక్‌పాయింట్లను పెంచే అవకాశం ఉంది. విజయనగరంలో ఇంకా గుర్తించాల్సి ఉంది. బ్యాంకులో డీడీ తీసి స్టాక్ పాయింట్‌కు వెళితే సరి.. జిల్లాలో గుర్తించిన స్టాక్‌పాయింట్ల నుంచి ఇసుకను తరలించేందుకు బ్యాంకులో డీడీలు తీయాల్సి ఉంటుంది. ఈ డీడీలను అందజేసిన వెంటనే వారికి కూపన్లు వస్తాయి. వాటిని తీసుకుని స్టాక్‌పాయింట్‌కు వెళితే అక్కడ ఇసుకను ఆయా వాహనాలకు పరిమాణాన్ని అనుసరించి అందజేస్తారు. వ్యాపారులకు, సాధారణ వినియోగదారులకు వేర్వేరు ధరలు.. జిల్లాలోని ఇసుక వినియోగదారులను రెండు రకాలుగా అధికారులు విభజిస్తున్నారు. ఒకటి సాధారణ లబ్ధిదారులు, రెండోది కాంట్రాక్టర్లు. యూనిట్ ధరను కాంట్రాక్టర్లకు, సాధారణ వినియోగదారులకు వేర్వేరుగా నిర్ణయించే ప్రక్రియ సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఓ యాప్ సిద్ధం చేసి ఆ యాప్ ద్వారా నమోదు చేసుకుని ఇసుకను తరలించుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పట్లో యాప్ విధానాన్ని అమలు పరిచే అవకాశం లేదు. శ్రీకాకుళం జిల్లా రీచ్‌లను ఇవ్వాలని లేఖ: జిల్లాలో ఇసుక కొరత ఉంది. నదులు, గెడ్డలు, వాగుల్లో ఇప్పటికే ఇసుకను పెద్ద ఎత్తున తరలించేశారు. ఒక మీటరు ఇసుకను తీసుకోవాలంటే 5 మీటర్ల లోతున ఇసుక నిల్వలుండాలి. అలాగే రెండు మీటర్ల లోతున ఇసుకను తవ్వాలంటే 8 మీటర్ల లోతు ఇసుక ఉండాలి. కానీ జిల్లాలో ఇప్పటికే మీటరు లోతున్న ఇసుకను కూడా పూర్తిగా తవ్వేశారు. దీనివల్ల జిల్లాలో ఇసుక కొరత తీవ్ర రూపం దాల్చింది. ఈ కొరతను అధిగమించేందుకు శ్రీకాకుళం జిల్లాలోని సంకిలి సమీపంలోని గోపాలపురం, అన్నవరం ప్రాంతాల్లో ఇసుక లభ్యత బాగానే ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఈ ఇసుక రీచ్‌లను విజయనగరం జిల్లాకు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖరాశారు. ఇవి గాకుండా ఈ జిల్లాలోని కొమరాడ, జియ్యమ్మవలసల్లో అత్యధికంగా ఇసుక నిల్వ లున్నాయి. వీటి నుంచి ప్రభుత్వం ఇసుకను రెండు స్టాక్పాయింట్లకు తరలించి ఇసుక కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోంది. విక్రయ బాధ్యత ఏపీఎండీసీకే.. జిల్లాలో గుర్తించిన వివిధ రీచ్‌లనుంచి ఇసుకను స్టాక్ పాయింట్లకు తరలించాక వాటిని విక్రయించడం, నిర్వహణ బాధ్యతలను ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించనున్నారు. స్టాక్ పాయింట్ స్థలాలను అప్పగించాక వాటికి ప్రహరీగానీ కంచెగానీ ఏర్పాటు చేసుకోవడం పొక్లెయిన్, వాహనాలు, కంప్యూటర్లు, సిబ్బందిని కేటాయించి వారికి పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నారు. వచ్చే నెల 5 నుంచి ఇసుక సరఫరా.. జిల్లాలో వచ్చే నెల 5 నుంచి ఇసుక సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సంబంధిత శాఖలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటికే రెండు చోట్ల స్టాక్‌పాయింట్లు గుర్తించాం. జిల్లాలో ఇసుకను యథేచ్ఛగా తోడేశారు. నిల్వలు తక్కువగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు రీచ్‌ల కోసం ప్రభుత్వానికి లేఖ రాశాం. ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఇసుక కొరతను తీర్చే ప్రయత్నాల్లో ఉన్నాం. – డాక్టర్ ఎస్.వి.రమణారావు, మైన్స్ ఏడీ, విజయనగరం -
కొత్త ఇసుక విధానం
-
‘ఇసుక తరలింపు వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి’
-
‘ఇసుక తరలింపు వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి’
సాక్షి, అమరావతి: కొత్త ఇసుక విధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. ఇకపై ఇసుకను ఏపీఎండీసీ ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లభిస్తున్న రేట్లకన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం ఆదేశించారు. అవినీతి లేకుండా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, పర్యావరణాన్ని పరిరక్షించేలా పారదర్శక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త ఇసుక విధానం సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్‌యార్డులు, నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్‌యార్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇసుక రీచ్ నుంచి స్టాక్‌యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదును ఇవ్వాలని.. రీచ్‌లవద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వే బ్రిడ్జిల ద్వారా లెక్కింపు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్టాక్‌యార్డు నుంచి వినియోగదారుడికి చేరేంతవరకూ మరొక రశీదు ఇవ్వాలని తెలిపారు. స్టాక్‌యార్డుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేయడమే కాకుండా.. ఇసుక బయటకు వెళ్లేటప్పుడు కూడా వే బ్రిడ్జి ద్వారా లెక్కింపు చేపట్టాలన్నారు. రీచ్‌లవద్ద, స్టాక్‌యార్డుల వద్ద అక్రమాలను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి ఉండాలని ఆదేశించారు. మాఫియాకు, అక్రమాలకు, అవకతవకలకు, కల్తీలకు దారితీయకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రెండు నెలల కాలంలో ఇసుక రవాణా వాహనాలను గుర్తించాలని, వాటికి జీపీఎస్ అమర్చాలని ఆదేశించారు. వీటికి సంబంధించి ఇతర సాంకేతిక సన్నాహాలు, వేబ్రిడ్జి, సీసీ కెమెరాల ఏర్పాటు, స్టాక్‌యార్డులను త్వరగా ఏర్పాటు పూర్తి చేయాలని సీఎం అన్నారు. ఇసుక వినియోగదారుల కోసం ఒక యాప్, వెబ్ పోర్టల్‌ను ఏపీఎండీసీ తయారుచేయనుంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంతవరకూ ఇసుక అందించే బాధ్యతను కలెక్టర్లు కొనసాగించనున్నారు. రెండు నెలల్లోగా అదనపు రీచ్‌లను గుర్తింపు, డిమాండ్‌కు తగినట్టుగా ఎన్ఎమ్డీసీ ఇసుకను అందించనుంది. ప్రభుత్వానికి, వినియోగదారుడికి పరస్పరం మేలు జరిగేలా గనుల శాఖ ధరను నిర్ణయించనుంది. కోరిన వెంటనే ఇసుకను అందుబాటులో ఉంచేలా రవాణావ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
ఇసుక పాలసీ అమలు కఠినతరం
పీయూసీ భేటీలో కమిటీ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ అమలును కఠినతరం చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) చైర్మన్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఆయన అధ్యక్షతన పీయూసీ భేటీ జరిగింది. కొత్త విధానం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, అయితే దీని అమలుపై పర్యవేక్షణ కొరవడిందని కమిటీ అభిప్రాయపడిందన్నారు. అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో మైనింగ్, పరిశ్రమల శాఖలపై సమీక్ష జరిపారు. గ్రానైట్ పరిశ్రమలను మైనింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని చెప్పారు. కొత్త ఇసుక పాలసీపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, రాయితీలు తదితర అంశాలపైనా చర్చ జరిపారు. -
తీరానికి చీకటి పోటు
కొత్త ఇసుక విధానం సామాన్య నిర్మాణదారులకు చుక్కలు చూపెడుతోంది. అదే విధానం అక్రమార్కులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. పరిమిత సంఖ్యలో రీచ్‌ల ఏర్పాటు కారణంగా.. మిగిలిన నదీతీరాల్లో చీకటి మాటున ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. వంశధార తీరంలోని ఇసుక తిన్నెలు వారి పాలిట బంగారంగా మారాయి. రెవెన్యూ ఉద్యోగులను మచ్చిక చేసుకొని చీకటి వేళల్లో.. నిఘా లేని ఇతర సమయాల్లో ఇసుకను సమీప ప్రాంతాలకు తరలించి.. అక్కడి నుంచి ట్రాక్టర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలంలోని వంశధార తీరగ్రామాల్లో ఈ దందా మరీ ఎక్కువగా సాగుతోంది. ఎల్.ఎన్.పేట:ప్రభుత్వ గుర్తింపు పొందని వంశధార తీరప్రాంతాలు ఇసుక దందాకు కేంద్రాలుగా వర్థిల్లుతున్నాయి. పెద్దసంఖ్యలో బారులు తీరుతున్న నాటుబళ్లు, ట్రాక్టర్లతో ఆ ప్రాంతాలు సందడిగా ఉంటున్నాయి. ఇసుక తరలింపునకే ఈ హడావుడి అంతా.. అని ఈ పాంతవాసులందరికీ తెలిసినా అధికారులు మాత్రం తమకేం తెలియదన్నట్లు మౌనం వహిస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలంలోదబ్బపాడు, బసవరాజుపేట, మిరియాపల్లి, స్కాట్‌పేట గ్రామాల సమీపంలోని వంశధార రేవుల నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది. గ్రామస్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం సహకారంతోనే ఈ దందా జరుగుతోందని తెలుస్తోంది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు గత డిసెంబర్లో దబ్బపాడు, బసవరాజుపేట గ్రామాల వద్ద నదికి వెళ్లే దారుల్లో అధికారులు ట్రెంచ్‌లు తవ్వించారు. అక్రమ రవాణాదారులు వాటిని పూడ్చేసి మరీ అక్రమ రవాణాకు మార్గం సుగమం చేసుకున్నారు. అధికార పార్టీ అండతోనే.. ఇసుక అక్రమ రవాణా వెనుక అధికార పార్టీకి చెందిన కొందరు గ్రామస్థాయి నేతల అండ ఉందని తెలిసింది. ‘ఇసుక వ్యాపారం చేసుకోండి మేం చూసుకుంటామని’ వీరు భరోసా ఇవ్వడంతోనే ఇసుక రవాణాదారులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, పోలీసులతో పాటు పత్రికల వారిని కూడా మేమే మేనేజ్ చేస్తామని వీరు భరోసా ఇవ్వడంతో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు, రవాణా సాగుతున్నాయి. ఇలా తరలిస్తారునది నుంచి నాటుబళ్లతో ఇసుకను తరలించి పెద్దకొల్లివలస ఆర్ఆర్ కాలనీలో ఓ చోట నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా వంశధార కుడి ప్రధాన కాలువ మీదుగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు.దబ్బపాడు, బసవరాజుపేట, స్కాట్‌పేట గ్రామాల సమీపంలో ఉన్న రేవుల నుంచి ఇసుకను నాటుబళ్లతో తరలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలు, రాత్రి 9 గంటలు, తెల్లవారు జామున 3 గంటల సమయాల్లో ఇసుక కోసం బళ్లు, ట్రాక్టర్లు తీరంలో బారులు తీరుతున్నాయి. మిరియాపల్లి సమీపంలో ధనుకువాడ రోడ్డు వరకు వంశధార నది నుంచి ఇసుకను పగలంతా మూటలతో ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలు ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలు పలుకుతోంది. నదిలో ఇసుక లోడు చేయడానికి ట్రాక్టరుకు రూ.600 నుంచి రూ.800 ఖర్చు చేస్తుండగా.. రెండు కిలోమీటర్లలోపు ప్రాంతాలకైతే రూ.3 వేలు.. అంతకంటే ఎక్కువ దూరానికైతే రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ఒక్కో ట్రాక్టర్ యజమాని ఒక రాత్రిలోనే రూ.15 వేల నుంచి రూ.20 వేలు అర్జిస్తున్నారు. ఉద్యోగులకు వాటాలు? గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అధికారులు అడ్డుకోకపోవడానికి వాటాలు చేతులు మారడమే కారణమని తెలుస్తోంది. ఈ దందాలో రెవెన్యూ, పోలీసు వర్గాలకు వాటాలు ఇస్తున్నామని, అందుకే ఇంత ధరకు అమ్మాల్సి వస్తోందని కొందరు ట్రాక్టర్ యజమానులే బాహటంగా చెపుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. చర్యలు తీసుకుంటాం ఈ వ్యవహారంపై తహశీల్దార్ ఎం.ఎన్ఎం.వి.రమణమూర్తిని వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఆయా గ్రామాలపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా నదికి వెళ్లే దారుల్లో ట్రెంచ్‌లు తవ్వించి ట్రాక్టర్లు వె ళ్లకుండా అడ్డుకుంటామని సరుబుజ్జిలి ఎస్సై ఎం.శ్రీనివాస్ అన్నారు. -
ఇసుక మాఫియాకు చెక్
⇒ అక్రమ తవ్వకాలకు కాలం చెల్లినట్లే ⇒ పట్టాభూములలో తవ్వకాలు కఠినతరం ⇒ నిబంధనలు ఉల్లంఘిస్తే డిపాజిట్లు జప్తు ⇒ ఇసుకమేటలపై ఇక డీఎల్ఎస్సీ కీలకం ⇒ కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ నియామకం ⇒ అమలులోకి రానున్న కొత్త ఇసుక విధానం ⇒ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమలులోకి తేనుంది. పట్టాభూములలో ఇసుక తవ్వకాలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది. ఈ మేరకు కొత్త ఇసుక విధానం (న్యూ స్యాండ్ పాలసీ)ని విడుదల చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కె.ప్రదీప్‌చంద్ర గురువారం ఉత్తర్వు లు జారీ చేశారు. పట్టాభూములలో ఇసుక మేటల తొలగింపు, ఇసుక రీచ్‌ల గుర్తింపు, కేటాయింపు, టీఎస్ఎండీసీ పాత్ర, ఇసుక రవాణాకు సంబంధించిన మార్గదర్శకాలను ఇందులో పేర్కొన్నారు. ఇసుక లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించి, తెలంగాణ గనుల శాఖ టెండర్లు నిర్వహించి రీచ్‌లను కేటాయించనుంది. నదుల మధ్యలో పట్టా భూములుంటే అందు లో ఇసుక తీసే బాధ్యతలను తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) నిర్వహిస్తుంది. పట్టాభూములలో ఇసుక మేటల ను తొలగించేందుకు గతంలో వ్యవసాయశాఖకు దరఖాస్తు చేసుకునే రైతులు ఇకపై నేరుగా గనులు, భూగర్భ శాఖ కార్యాలయాన్ని సంప్రదిం చాల్సి ఉంటుంది. ఇసుక మేటలను తొలగించేందుకు గతం లో జాయింట్ కలెక్టర్ అనుమతి ఇచ్చేవారు. కొత్త విధానం లో కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాస్థాయి స్యాండ్ కమిటీ (డీఎల్ఎస్సీ)లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీకి జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, డీపీఓ, డీడీ (గ్రౌండ్‌వాటర్), ఈఈ (ఆర్డబ్ల్యూఎస్), ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు), టీఎస్ఎండీసీ నామినేటెడ్ సభ్యుడు, అసిస్టెంట్ డైరక్టర్ (గనులు, భూగర్భశాఖ) సభ్యులుగా ఉంటారు. గిరిజన ప్రాంతాలైతే ఐటీడీఏ పీఓ కూడా ఉంటారు. అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు కూడ పోలీసు, రెవెన్యూ, రవాణా, గనుల శాఖలకు సర్వాధికారాలు ఇచ్చారు. కలకలం రేపుతున్న ఉత్తర్వులు పట్టాభూములలో ఇసుక మేటల తొలగింపు పేరిట అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్న ‘మాఫియా’ దూకుడుకు ప్రభుత్వం కళ్లెం వేయనుంది. అక్కడ ఇసుక మేటల తొలగింపునకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ జారీ అయిన ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. వాల్టా నిబంధనలకు తోడు కొత్త మార్గదర్శకాలు అక్రమ ఇసుక వ్యాపారానికి చెక్ పెట్టనున్నాయి. ప్రధానంగా పట్టాభూములలో ఇసుకమేటల తొలగింపు పేరిట అనుమతులు పొందిన బడా వ్యాపారులకు ఈ కొత్త విధానం మింగుడు పడని అంశం. గతంలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా, తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ అధికారం ఇక కమిటీకి ఉంటుంది. రైతులు ఇక ముందు గ నుల శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కమిటీ పరిశీలించిన మీదటే తవ్వకాలకు అనుమతి లభిస్తుంది. అను మతి లభిస్తే, ఆ మొత్తం ఇసుకకు సంబంధించిన రాయల్టీ, అంతే నగదును సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఆ తర్వాత నిబంధనలను ఉల్లంఘిస్తే డిపాజిట్ జప్తు చేయడంతోపాటు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం, ప్రజల అవసరాల కోసం మైనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లను గుర్తించి, అక్కడ నుంచి తీసిన ఇసుకతో డిపోలు ఏర్పాటు చేసి నిర్ణయించిన చౌకధరలకు ఇసుకను సరఫరా చేస్తారు. జిల్లాలో తీసిన ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించడాన్ని కూడా నిషేధించిన ప్రభుత్వం దానిని నేరంగా పరిగణించనుంది. అక్రమ రవాణాకు దరఖాస్తుల పరంపర మంజీరా నది పరీవాహక ప్రాంతం నుంచి ఇసుక తోడేందుకు ‘మాఫియా’ పట్టా భూములున్న రైతులను ఎంచుకుంది. అక్రమ ధనార్జనే లక్ష్యంగా తెరవెనుక భాగోతం నడుపుతున్న వ్యాపారులు రైతుల పేరిట దరఖాస్తులు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలను కఠినతరం చేయడం ‘మాఫియా’కు ఇబ్బందికరంగా మారినా, అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టాభూములలో ఇసుక మేటల తొలగింపు పేరిట బిచ్కుంద, మద్నూరు, కో టగిరి, బీర్కూరు మండలాలకు చెందిన ఆరుగురు రైతులు వ్యవసాయశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 15 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, వాటి సంఖ్య మొత్తం 21కి చేరింది. పట్టా భూముల పేరిట అనుమతులు పొంది, మంజీరా నది నుంచి ఇసుక తవ్వకాలు జరపడం ఇసుక ‘మాఫియా’కు పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి. టీఎస్ఎండీసీ పర్యవేక్షణలో బిడ్డింగ్‌ల ద్వారా జరిపే ఇసుక తవ్వకాలు, రవాణాను జీపీఎస్ పద్ధతిలో పర్యవేక్షించాలని ప్రభుత్వం పేర్కొంది. పట్టాభూములు, టెండర్ల ద్వారా కేటాయించిన రీచ్‌ల నుంచి ఇసుక తరలింపులో నిబంధనలను ఉల్లంఘించకుండా డివిజన్ స్థాయిలో సబ్‌కలెక్టర్/ఆర్డీఓల ఆధ్వర్యంలో కమిటీలకు మరిన్ని అధికారాలను అప్పగించారు. -
ఇసుక పాలసీ విధివిధానాలు విడుదల
* క్వారీల కేటాయింపు, తవ్వకాలు, విక్రయాలపై కమిటీలు * ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన ఇసుకను సులభంగా ప్రజలకు చేరవేసేందుకు కొత్త ఇసుక పాలసీని రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించిన విధివిధానాలను విడుదలచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక క్వారీల కేటాయింపు, తవ్వకాలు, విక్రయాలతోపాటు నియంత్రణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది. రాష్ట్ర స్థాయి కమిటీలో ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ చైర్మన్‌గా, మైన్స్ అండ్ జియాలజీ డెరైక్టర్ మెంబర్ కన్వీనర్‌గా 13 మంది సభ్యులు ఉంటారు. జిల్లాల స్థాయిలో ప్రభుత్వం ఇసుక కమిటీ (డీఎల్ఎస్సీ)లను ఏర్పాటు చేయనుంది. కలెక్టర్ చైర్మన్‌గా, జేసీ వైస్ చైర్మన్‌గా, గనులు, భూగర్భ వనరులశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఈ కమిటీల్లో ఉంటారు. ఐటీడీఏ పీవో, డీపీవో, గ్రౌండ్ వాటర్ డీడీ, ఇరిగేషన్ ఈఈ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, టీఎస్ఎండీసీ ప్రతినిధి ఒకరు కూడా సభ్యులుగా ఉంటారు. మైనింగ్ విభాగం జిల్లా పరిధిలో ఇసుక క్వారీలను గుర్తించి ప్రతిపాదలను సిద్ధం చేస్తే జిల్లా స్థాయి కమిటీ రెవెన్యూ, మైనింగ్ విభాగాల అధ్వర్యంలో సంయుక్త పరిశీలన అనంతరం టీఎస్ఎండీసీకి అలాట్మెంట్ నోటీసు జారీ చేస్తుంది. -
ఇసుక ధరలను అదుపు చేస్తాం
సాక్షి, గుంటూరు: ఇసుక ధరలను అదుపు చేస్తామని, ఇందులోభాగంగా ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. నూతన ఇసుక విధానం అమలుపై జిల్లా అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 15.49 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఇసుక విధానాన్ని సక్రమంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అర్బన్, రూరల్ ఎస్పీలు, జేసీ, జిల్లా పంచాయతీ అధికారి, డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, డీటీసీలతో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ధరల నియంత్రణ, అక్రమ తరలింపులపై ఈ కమిటీ రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తుందన్నారు. రవాణా చార్జీలపై పర్యవేక్షణకు డీటీసీ, అదనపు ఎస్పీ, ఏజేసీలతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. అవకతవకల నివారణకు అర్బన్, రూరల్ ఎస్పీల నేతృత్వంలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ పనిచేస్తుందన్నా రు. రవాణాలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వమే వాహనాలు కొనుగోలు చేస్తుందన్నారు. రూ.5.34 కోట్ల విలువైన ఇసుక విక్రయం జిల్లాలో ఐదు రీచ్‌ల ద్వారా ఇప్పటివరకు రూ.5.34 కోట్ల విలువైన 2,467 క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించినట్లు మంత్రి చెప్పారు. క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.650 కే విక్రయించామన్నారు. ఓగేరు, గుండ్లకమ్మ వంటి గుర్తింపు లేని రీచ్‌లలో పంచాయతీ కార్యదర్శుల అనుమతితో ఇసుక కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శి అక్రమాలకు పాల్పడితే తక్షణమే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలపై 18001212020 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే తక్షణమే పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, అర్బన్, రూరల్ ఎస్పీలు రాజేష్‌కుమార్, రామకృష్ణ, జేసీ డాక్టర్ శ్రీధర్, డీపీవో వీరయ్య పాల్గొన్నారు.