కొత్త ఇసుక విధానం సామాన్య నిర్మాణదారులకు చుక్కలు చూపెడుతోంది. అదే విధానం అక్రమార్కులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. పరిమిత సంఖ్యలో రీచ్‌ల ఏర్పాటు కారణంగా.. మిగిలిన నదీతీరాల్లో చీకటి మాటున ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. వంశధార తీరంలోని ఇసుక తిన్నెలు వారి పాలిట బంగారంగా మారాయి. రెవెన్యూ ఉద్యోగులను మచ్చిక చేసుకొని చీకటి వేళల్లో.. నిఘా లేని ఇతర సమయాల్లో ఇసుకను సమీప ప్రాంతాలకు తరలించి.. అక్కడి నుంచి ట్రాక్టర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలంలోని వంశధార తీరగ్రామాల్లో ఈ దందా మరీ ఎక్కువగా సాగుతోంది.
ఎల్.ఎన్.పేట:ప్రభుత్వ గుర్తింపు పొందని వంశధార తీరప్రాంతాలు ఇసుక దందాకు కేంద్రాలుగా వర్థిల్లుతున్నాయి. పెద్దసంఖ్యలో బారులు తీరుతున్న నాటుబళ్లు, ట్రాక్టర్లతో ఆ ప్రాంతాలు సందడిగా ఉంటున్నాయి. ఇసుక తరలింపునకే ఈ హడావుడి అంతా.. అని ఈ పాంతవాసులందరికీ తెలిసినా అధికారులు మాత్రం తమకేం తెలియదన్నట్లు మౌనం వహిస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలంలోదబ్బపాడు, బసవరాజుపేట, మిరియాపల్లి, స్కాట్‌పేట గ్రామాల సమీపంలోని వంశధార రేవుల నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది. గ్రామస్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం సహకారంతోనే ఈ దందా జరుగుతోందని తెలుస్తోంది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు గత డిసెంబర్‌లో దబ్బపాడు, బసవరాజుపేట గ్రామాల వద్ద నదికి వెళ్లే దారుల్లో అధికారులు ట్రెంచ్‌లు తవ్వించారు. అక్రమ రవాణాదారులు వాటిని పూడ్చేసి మరీ అక్రమ రవాణాకు మార్గం సుగమం చేసుకున్నారు.
అధికార పార్టీ అండతోనే..
ఇసుక అక్రమ రవాణా వెనుక అధికార పార్టీకి చెందిన కొందరు గ్రామస్థాయి నేతల అండ ఉందని తెలిసింది. ‘ఇసుక వ్యాపారం చేసుకోండి మేం చూసుకుంటామని’ వీరు భరోసా ఇవ్వడంతోనే ఇసుక రవాణాదారులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, పోలీసులతో పాటు పత్రికల వారిని
కూడా మేమే మేనేజ్ చేస్తామని వీరు భరోసా ఇవ్వడంతో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు, రవాణా సాగుతున్నాయి.
ఇలా తరలిస్తారునది నుంచి నాటుబళ్లతో ఇసుకను తరలించి పెద్దకొల్లివలస ఆర్‌ఆర్ కాలనీలో ఓ చోట నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా వంశధార కుడి ప్రధాన కాలువ మీదుగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు.దబ్బపాడు, బసవరాజుపేట, స్కాట్‌పేట గ్రామాల సమీపంలో ఉన్న రేవుల నుంచి ఇసుకను నాటుబళ్లతో తరలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలు, రాత్రి 9 గంటలు, తెల్లవారు జామున 3 గంటల సమయాల్లో ఇసుక కోసం బళ్లు, ట్రాక్టర్లు తీరంలో బారులు తీరుతున్నాయి.
మిరియాపల్లి సమీపంలో ధనుకువాడ రోడ్డు వరకు వంశధార నది నుంచి ఇసుకను పగలంతా మూటలతో ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.
ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలు
ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలు పలుకుతోంది. నదిలో ఇసుక లోడు చేయడానికి ట్రాక్టరుకు రూ.600 నుంచి రూ.800 ఖర్చు చేస్తుండగా.. రెండు కిలోమీటర్లలోపు ప్రాంతాలకైతే రూ.3 వేలు.. అంతకంటే ఎక్కువ దూరానికైతే రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ఒక్కో ట్రాక్టర్ యజమాని ఒక రాత్రిలోనే రూ.15 వేల నుంచి రూ.20 వేలు అర్జిస్తున్నారు.
ఉద్యోగులకు వాటాలు?
గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అధికారులు అడ్డుకోకపోవడానికి వాటాలు చేతులు మారడమే కారణమని తెలుస్తోంది. ఈ దందాలో రెవెన్యూ, పోలీసు వర్గాలకు వాటాలు ఇస్తున్నామని, అందుకే ఇంత ధరకు అమ్మాల్సి వస్తోందని కొందరు ట్రాక్టర్ యజమానులే బాహటంగా చెపుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.
చర్యలు తీసుకుంటాం
ఈ వ్యవహారంపై తహశీల్దార్ ఎం.ఎన్‌ఎం.వి.రమణమూర్తిని వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఆయా గ్రామాలపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా నదికి వెళ్లే దారుల్లో ట్రెంచ్‌లు తవ్వించి ట్రాక్టర్లు వె ళ్లకుండా అడ్డుకుంటామని సరుబుజ్జిలి ఎస్సై ఎం.శ్రీనివాస్ అన్నారు.
తీరానికి చీకటి పోటు
Published Wed, Feb 4 2015 2:07 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement