సాక్షి, అమరావతి: కొత్త ఇసుక విధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఇకపై ఇసుకను ఏపీఎండీసీ ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లభిస్తున్న రేట్లకన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం ఆదేశించారు. అవినీతి లేకుండా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, పర్యావరణాన్ని పరిరక్షించేలా పారదర్శక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త ఇసుక విధానం సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్‌యార్డులు, నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్‌యార్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.
ఇసుక రీచ్ నుంచి స్టాక్‌యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదును ఇవ్వాలని.. రీచ్‌లవద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వే బ్రిడ్జిల ద్వారా లెక్కింపు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్టాక్‌యార్డు నుంచి వినియోగదారుడికి చేరేంతవరకూ మరొక రశీదు ఇవ్వాలని తెలిపారు. స్టాక్‌యార్డుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేయడమే కాకుండా.. ఇసుక బయటకు వెళ్లేటప్పుడు కూడా వే బ్రిడ్జి ద్వారా లెక్కింపు చేపట్టాలన్నారు. రీచ్‌లవద్ద, స్టాక్‌యార్డుల వద్ద అక్రమాలను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు.
ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి ఉండాలని ఆదేశించారు. మాఫియాకు, అక్రమాలకు, అవకతవకలకు, కల్తీలకు దారితీయకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రెండు నెలల కాలంలో ఇసుక రవాణా వాహనాలను గుర్తించాలని, వాటికి జీపీఎస్ అమర్చాలని ఆదేశించారు. వీటికి సంబంధించి ఇతర సాంకేతిక సన్నాహాలు, వేబ్రిడ్జి, సీసీ కెమెరాల ఏర్పాటు, స్టాక్‌యార్డులను త్వరగా ఏర్పాటు పూర్తి చేయాలని సీఎం అన్నారు.
ఇసుక వినియోగదారుల కోసం ఒక యాప్, వెబ్ పోర్టల్‌ను ఏపీఎండీసీ తయారుచేయనుంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంతవరకూ ఇసుక అందించే బాధ్యతను కలెక్టర్లు కొనసాగించనున్నారు. రెండు నెలల్లోగా అదనపు రీచ్‌లను గుర్తింపు, డిమాండ్‌కు తగినట్టుగా ఎన్‌ఎమ్‌డీసీ ఇసుకను అందించనుంది. ప్రభుత్వానికి, వినియోగదారుడికి పరస్పరం మేలు జరిగేలా గనుల శాఖ ధరను నిర్ణయించనుంది. కోరిన వెంటనే ఇసుకను అందుబాటులో ఉంచేలా రవాణావ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment