సాక్షి, ఒంగోలు సిటీ: ఇసుక మాఫియాకు గొంతులో వెలక్కాయ పడింది. ఇసుక నూతన విధానం చెక్ పెట్టింది. మంత్రి మండలి సమావేశంలో బుధవారం రాత్రి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు పలుకుబడి, కండ బలం ఉపయోగించి కొందరు ఇసుక దోపిడీ చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకున్నారు. ప్రజలకు ఇసుక దక్కనీయకుండా సైంధవులయ్యారు. ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసింది. జవాబుదారీతనం పెంచే విధంగా ఇసుక విధానం ఉంది. జిల్లాలో మద్దిపాడు, మద్దిరాలపాడు, చక్రాయపాలెం–1, చక్రాయపాలెం–2, దారకానిపాడు, కె.రాజుపాలెం, కె.బిట్రగుంట, నందిపాడు, రామాయపాలెం, చదలవాడ, కరవది, మల్లవరం ప్రాంతాల్లో ఇసుక రేవులు ఉన్నాయి.
ఈ రేవుల్లో ఇసుక దోపిడి పెద్ద మొత్తంలోనే జరిగింది. మద్దిపాడు మండంలో అయితే మాఫియా కనుసన్నల్లోనే ఇసుక దోచుకున్నారు. ఈ రేవుల్లో 3,42,075 క్యూబిక్ మీటర్లు ఇసుక ఉన్నట్లుగా గనుల అధికారులు గుర్తించారు. అయితే ఈ రేవుల్లో ప్రస్తుతం 94 వేల క్యూబిక్ మీటర్లు మాత్రమే ఇసుక లభ్యత ఉందని అంచనా వేశారు. తాజాగా ప్రభుత్వానికి ఇక్కడి పరిస్ధితుల పై నివేదిక పంపారు. ఇవి కాకుండా పట్టా భూముల్లో 6,56,342 క్యూబిక్ మీటర్లు ఇసుక ఉందని అంచనా వేశారు. పట్టా భూముల్లో ఇసుక ఖనిజం మొత్తం 23 ప్రాంతాలలో ఉంది. నూతన ఇసుక విధానంలో జిల్లాలోని రేవుల నుంచి ఇసుక తీసుకొనే వీలు లేదు.
నూతన విధానం నేటి నుంచి అమలు
ఇసుక నూతన విధానం గురువారం నుంచి అమలులోకి రానుంది. గతంలో ఇసుక రేవుల నుంచి ఇసుక తీయడానికి వేలం పాటలు నిర్వహించే వారు. ఆ తర్వాత పొదుపు సంఘాల ద్వారా ఇసుక తవ్వకాలను అనుమతించారు. ఆ తర్వాత ఉచిత విధానాన్ని అమలు చేస్తున్నామంటూ..సరైన మార్గదర్శకాలు లేకుండా మాఫియాను పెంచి పోషించే విధంగా ప్రభుత్వం ఇసుక విధానాన్ని అమలు చేసింది. దీని వల్ల ఇసుక తీవ్ర కొరత వచ్చింది. ఇసుక దోపిడి చేశారు. ఇసుక అక్రమ అమ్మకాల ద్వారా రూ.కోట్లు గడించారు. నదులు,వాగులు,వంకల నుంచి ఇసుక దోపిడి చేశారు.
► ఈ దోపిడీ విధానాన్ని అడ్డుకొని ప్రతి ఒక్కరికి ఇసుక దక్కే నూతన విధానం గురువారం నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది.
► అంతా ఆన్‌లైన్ ద్వారా..పారదర్శకంగా అమలు
► వాహనాలకు జియో ట్యాగింగ్ తప్పని సరి.
► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్ధ ద్వారానే ఇసుక నామమాత్రపు రుసుంతో అమ్మకాలు
► వినియోగదారుడు ఇసుక ఎందుకోసమో వైనం చెప్పి యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఓటీపీ ద్వారా ఇసుక పరిమాణాన్ని నమోదు చేయించుకోవాలి. ఆ మొత్తాన్ని వాడుకోవడానికి ఆధార్, సెల్ నంబర్ ఇతర వివరాలను అందించాలి. ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించాలి. ఇలాంటి మార్గదర్శకాలను అనుసరించి ఇసుక రేవ నుంచి వినియోగానికి తీసుకోవాలి.
పొరుగు జిల్లాల నుంచి ఇసుక..
ఇసుక నూతన విధానం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఇసుక నిల్వలు అంత మొత్తంలో లేవు. ఉన్న కొద్ది పాటి నిల్వలకు పర్యావరణ అనుమతులు ఉండాలి. వాల్టా చట్టం ప్రకారం తగినంత ఇసుక లేదు. దీంతో పొరుగు జిల్లాల నుంచి ఇసుక తెచ్చుకొనే విధంగా ఆన్‌లైన్ ద్వారా అనుమతులిస్తారు.
► జిల్లాకు కావాల్సిన ఇసుక నెల్లూరు, కడప జిల్లాల నుంచి తెచ్చుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకొని నేరుగా సైట్‌లోకి ఇసుక తెచ్చుకోవచ్చు.
► ప్రకాశం బ్యారేజ్‌కు నీరు విడుదల చేసినందున ఈ పాలసీలో ప్రస్తుతానికి ఇసుక తీసుకోవడానికి వీల్లేదు. నీరు పోయిన తర్వాత పరిస్ధితులను బట్టి గుంటూరు నుంచి ఇసుక తీసుకొనే వీలుంది.
టన్నుకు రూ.375, కిమీకి రూ.4.95
ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఇసుక టన్ను రూ.375గా ఉంది. రవాణా ఛార్జీలు కిలోమీటరుకు రూ.4.95 గా నిర్ణయించారు. రవాణా ఛార్జీలను కలెక్టర్ అధ్యక్షతన కమిటీ నిర్ణయిస్తుంది. టన్నుకు రూ.375, అదనంగా జీఎస్టీని చెల్లించాలి. ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేయాలి.
► మొబైల్ యాప్, మీసేవ, వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని కావాల్సిన పరిమాణంలో ఇసుక పొందవచ్చు.
► ఇసుక రవాణా చేసే వాహనాన్ని ‘మైన్స్ డాట్ ఏపీ జీవోవీ డాట్ ఇన్’ సైట్‌లో అడిగిన వివరాలను నమోదు చేసుకొని వాహనాన్ని నమోదు చేసుకోవాలి.
► అదే ఇసుక కావాల్సిన వారు జనరల్ కంజూమర్ అయితే పది వేల ఎస్‌ఎఫ్‌టీ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. వెబ్‌లో ఇసుక పరిమాణం నమోదు చేయాలి. ‘ఏపీ డాట్ జీవోవీ.ఇన్’ సైట్ లో ఎంత ఇసుక కావాలో నమోదు చేసుకోవాలి. ఆధార్,సెల్ నెంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసి ఓకే చేస్తే పేరు నమోదవుతుంది. మొబైల్ యాప్‌లో ఇసుక పరిమాణం కావాల్సిన వివరాలను చూపిస్తుంది. దీని ప్రకారం డబ్బు ఆన్‌లైన్‌లో కడితే రసీదు వస్తుంది. రేవు వద్ద మొబైల్‌లో వచ్చిన వివరాలను చూపిస్తే ఏపీఎండీసీ అధికారుల ఆధ్వర్యంలో ఇసుక లోడు చేస్తారు.
పట్టా భూములకు అనుమతి లేదు..
జిల్లాలోని 23 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. ఇసుక తవ్వకాలను ఏపీఎండీసీ మాత్రమే చేపడుతుంది. ఎండీసీ అధికారులకు వివరాలను తెలియజేయాలి. వారి ఆధ్వర్యంలో ఇసుక రవాణా అనుమతిస్తారు. క్యూబిక్ మీటరుకు (ఒకటిన్నర టన్నుకు) రూ.60 చెల్లిస్తారు. అదీ ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు ఖాతాలకు చెల్లిస్తారు. 6,56,347 క్యూబిక్ మీటర్లు పట్టా భూముల్లో ఇసుక ఉన్నట్లుగా గనుల అధికారులు నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం పట్టా భూములున్న వారు ఏపీఎండీసీ అధికారులను సంప్రదించాలి.
త్వరలోనే మార్గదర్శకాలు..
జిల్లాలో గుండ్లకమ్మ, మూసి,పాలేరు,మన్నేరు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉన్నాయి. వీటిలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం నుంచి త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయి. మద్దిపాడు,నాగులుప్పలపాడు, ఒంగోలు, అద్దంకి తదితర మండలాల్లో ఇవి ఉన్నాయి. నదులు, నదీపాయల్లో, పెద్ద ఏర్లు వద్ద ఉన్న ఇసుక నిక్షేపాలను తవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని అనుసరించి తవ్వకాలను చేపట్టాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి..
ఇసుక నూతన విధానం అమలోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఇసుక కావాల్సిన వారు నమోదు చేసుకొని తగిన పరిమాణంలో పొందవచ్చు. ఇంకా మంత్రి మండలి నిర్ణయాల అధికారిక పత్రం తమకు రాలేదు. థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్‌లో ఇసుక తవ్వకాలకు మార్గదర్శకాలు త్వరలోనే రానున్నాయి. టన్ను ఇసుక రూ.375 చెల్లించాలి. కలెక్టర్ అధ్యక్షతన కమిటీ కిమీకి రూ.4.95 లెక్కన రవాణా చార్జిలను నిర్ణయిస్తారు. వాహనాలకు జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడా ఇసుక అక్రమ రవాణాకు తావు లేకుండా నూతన విధానం ఉంది.
– ఈ.నరసింహారెడ్డి, గనులశాఖ డీడీ
Comments
Please login to add a commentAdd a comment