ఇసుక కావాలా.. బుక్‌ చేయండిలా.. | Easy Steps To Online Sand Booking | Sakshi
Sakshi News home page

ఇసుక కావాలా.. బుక్‌ చేయండిలా..

Published Wed, Sep 11 2019 10:02 AM | Last Updated on Wed, Sep 11 2019 10:02 AM

Easy Steps To Online Sand Booking - Sakshi

సాక్షి, బేస్తవారిపేట/కంభం: ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు ఇసుక కావాలంటే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సిందే. దీనికోసం సర్కారు వెబ్‌ అప్లికేషన్‌ రూపొందించింది. ఆన్‌లైన్‌లో ఎలా బుక్‌ చేసుకోవావాలి, రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలి తదితర వివరాలు ‘సాక్షి’ పాఠకుల కోసం..

వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవాలి..
వ్యాపార నిమిత్తం ఇసుక కావాల్సిన వారు, సాధారణ వినియోగదారులు ఎవరైనా సరే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వెబ్‌ అప్లికేషన్‌ ద్వారానే ఇసుకను బుక్‌ చేసుకోవాలి. చదువుకున్న వారైతే నేరుగా మొబైల్, టాబ్లెట్, పీసీ, ల్యాప్‌టాప్‌ల ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఇంటర్‌నెట్, కామన్‌ సర్వీస్‌ సెంటర్లకు వెళ్లి బుక్‌ చేయించుకోవచ్చు.

రిజిస్ట్రేషన్‌ ఇలా చేసుకోవాలి..
ఇసుక కావాల్సిన వారు ముందుగా ప్రభుత్వం రూపొందించిన శాండ్‌ సేల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానటరింగ్‌ సిస్టమ్‌(వెబ్‌ అప్లికేషన్‌) ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ముందుగా www. sand.ap.gov.in టైపు చేసి వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి. వెల్‌కమ్‌ టూ ఏపీ శాండ్‌ పోర్టల్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. ముందుగా రిజిస్ట్రేషన్‌ మెనూలోకి వెళ్లాలి. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి జనరల్‌ కన్జ్యూమర్, రెండోది బల్క్‌ కన్జ్యూమర్‌. మీ కేటగిరీని బట్టి ఒక దానిపై క్లిక్‌ చేయాలి. మీ వ్యక్తిగత అవసరాల కోసం, మీ సొంత గృహ నిర్మాణం, మరమ్మతుల కోసం బుక్‌ చేసుకునే వారు జనరల్‌ కన్జ్యూమర్‌ కేటగిరీలోకి వస్తారు. వ్యక్తిగత అవసరాలు కాని వారు అంటే బిల్డర్లు, డెవలపర్లు తదితరులు బల్క్‌ కన్జ్యూమర్ల కేటగిరీలోకి వస్తారు. మీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దీనికోసం ఆ కేటగిరిలో ఉన్న రిజిస్ట్రేషన్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి. వెంటనే రిజిస్ట్రేషన్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. పేజీ ఓపెన్‌ అయ్యాక 1, 2, 3, 4 అని నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.

► ఆప్షన్‌–1 మొబైల్‌ నంబర్‌ వెరిఫికేషన్‌ దీనిని ప్రెస్‌ చేయగానే మీ మొబైల్‌ నంబర్‌ అడుగుతుంది. మీ ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. కింద ఉన్న బాక్స్‌లో ఓటీపీ అని ఉంటుంది. మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీని అందులో టైప్‌ చేయాలి. తర్వాత కింద ఉన్న సబ్‌మిట్‌ బటన్‌ నొక్కాలి. 
► ఆప్షన్‌–2లో ఆధార్‌ నంబర్‌ అని ఉంటుంది. దీనిని ప్రెస్‌ చేయగానే ఆధార్‌ నంబర్‌ అడుగుతుంది. ఆధార్‌ నంబర్‌ ఇవ్వాలంటే కచ్చితంగా మీరు 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఆధార్‌ నంబర్‌ నమోదు చేసి పక్కనే ఉన్న సబ్‌మిట్‌ బటన్‌ ప్రెస్‌ చేయాలి.
► ఆప్షన్‌–3లో ప్రెజెంట్‌ రెసిడెన్షియల్‌ అడ్రస్‌ అని ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేయగానే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. ఈ పేజీలో కాస్త ఎక్కువ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మొదటగా మొబైల్‌ నంబర్‌ ఇవ్వాలి. మీ జిల్లాను ఎంపిక చేసుకోవాలి. మీ మున్సిపాలిటీ/ మండలాన్ని ఎంపిక చేసుకోవాలి. మీ అడ్రస్‌ను డోర్‌ నంబర్‌తో సహా తర్వాత బాక్స్‌లో ఇవ్వాలి. పిన్‌ కోడ్‌నూ తప్పనిసరిగా ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత మీ పూర్తి పేరు, రూరల్‌/అర్బన్‌ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీతో పాటు వార్డ్‌ నంబర్‌ కూడా ఇవ్వాలి. మీరు ఇచ్చిన చిరునామా దగ్గర్లో ఉన్న ల్యాండ్‌ మార్క్‌ ఇవ్వాలి. అలాగే మెయిల్‌ ఐడీ నమోదు చేసి చివరలో సబ్‌మిట్‌ బటన్‌ నొక్కాలి. 
► ఆప్షన్‌–4లో కన్ఫర్మేషన్‌ ఆప్షన్‌ను ప్రెస్‌ చేయాలి. పేజీ ఓపెన్‌ కాగానే యూజర్‌ ఐడీ అని అడుగుతుంది. మీరు ఏదైతే ఫోన్‌ నంబర్‌ ఇచ్చారో దానిని ఎంటర్‌ చేయాలి. దాని కింద ఐ హ్యావ్‌ యాక్సెప్టెడ్‌ టరŠమ్స్‌ అండ్‌ కండిషన్స్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత పేజీలో ప్రొసీడ్‌ బటన్‌ వస్తుంది. దానిని ప్రెస్‌ చేయాలి. అంతే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్టే. ఈ ప్రక్రియ ఒకసారి చేస్తే సరిపోతుంది. 

రిజిస్ట్రేషన్‌ తర్వాత బుకింగ్‌
రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు మళ్లీ హోమ్‌ పేజీలోకి ఆటోమేటిక్‌గా వస్తారు. రిజిస్ట్రేసన్‌ పక్కన బుకింగ్‌ ఆప్షన్‌ను ప్రెస్‌ చేయగానే ఆన్‌లైన్‌ శాండ్‌ బుకింగ్, ట్రాక్‌ యువర్‌ ఆర్డర్‌ అనే రెండు సబ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మొదటిది ఆన్‌లైన్‌ శాండ్‌ బుకింగ్‌ను క్లిక్‌ చేయాలి. ఓపెన్‌ అయిన పేజీలో మీ మొబైల్‌ నంబర్‌ ఇవ్వాలి. దాని కింద సెండ్‌ ఓటీపీ బటన్‌ ప్రెస్‌ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఇసుక దేనికోసం అని ప్రత్యేక పేజీలో వివరాలు అడుగుతారు. అంటే కొత్త ఇంటి నిర్మాణమా? మరమ్మతులకా? అన్న విషయాన్ని ప్రెస్‌ చేయాలి.

ఆ తర్వాత ఎన్ని ఫ్లోర్లు అని అడుగుతుంది. అవి ఎంటర్‌ చేశాక ఎన్ని చదరపు అడుగులో అడుగుతుంది. మీరు ఎన్ని చదరపు అడుగులు నమోదు చేస్తారో దానిని బట్టి ఆటోమేటిగ్గా మీకు ఎంత ఇసుక అవరసమో చెప్పేస్తుంది. ఉదాహరణకు 3000 చదరపు అడుగులు అని మీరు ఇచ్చారనుకోండి మీకు 175 టన్నుల ఇసుక అవసరమని చెబుతుంది. ఈ ఇసుకను మొత్తం ఒకేసారి బుక్‌ చేయడానికి కుదరదు. ఒకసారికి గరిష్టంగా 20 టన్నులు మాత్రమే బుక్‌ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఇసుక ఎక్కడ కావాలో సంబంధిత స్టాక్‌ యార్డును ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేయాలి. పేమెంట్‌ చేయగానే బిల్‌ చూపిస్తుంది. బిల్‌ వచ్చిన తర్వాత వాహనాన్ని మాట్లాడుకుని ఇసుక తరలించుకురావచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement