సాక్షి, అమరావతి : కొత్త విధానం ద్వారా ఇసుక సరఫరాకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అవసరమైతే కొత్త రీచ్‌లకు త్వరితగతిన అనుమతులు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబరు అయిదో తేదీ నుంచి కొత్త విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ముందస్తు కసరత్తు, సన్నద్ధతపై మంగళవారం సచివాలయంలో మంత్రి రామచంద్రారెడ్డి భూగర్భ గనులు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారులతో సమీక్షించారు. ‘ఎక్కడా ఇసుక దుర్వినియోగం కావడానికి వీల్లేదు.
అవసరమైన చోట తక్షణమే స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయండి. వాటికి సమీపంలో వేబ్రిడ్జిలు ఉండేలా చూడండి. ఇసుక రేవుల్లోనూ, స్టాక్ యార్డుల్లోనూ సీసీ కెమెరాలతో పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలి. ఇసుక లోడింగ్ చేసినప్పటి నుంచి వాహన కదలికలన్నీ జీపీఎస్ ద్వారా పర్యవేక్షించడం ద్వారా ఎవరు బుక్ చేసుకున్నారో వారికే ఇసుక వెళ్లేలా చూడొచ్చు. ప్రజలకు ప్రస్తుతం అందుతున్న ధరకంటే ఏమాత్రం పెరగకుండా ఇసుకను అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. ఈ దిశగా త్వరగా అన్ని ఏర్పాట్లుచేయండి’ అని మంత్రి రామచంద్రారెడ్డి ఆదేశించారు.
ఈ నెలాఖరుకే అన్నీ సిద్ధంచేయాలి
వచ్చే నెల నుంచి కొత్త విధానం ద్వారా ఇసుక అందించాల్సి ఉన్నందున ఈ నెలాఖరుకే సర్వ సన్నద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఇసుక బుక్ చేస్తే త్వరగా పంపలేదనే చెడ్డ పేరు ప్రభుత్వానికి రాకుండా అధికారులు చూడాలని మంత్రి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. 46 స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేస్తున్నామని, ఈ నెలాఖరుకల్లా రాష్ట్రవ్యాప్తంగా 124 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు సాగించడానికి వీలుగా పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకుంటామని అధికారులు మంత్రికి వివరించారు. విశాఖ జిల్లాలో నదులు లేకపోవడం, ఎక్కువ ఇసుక వినియోగం ఉన్నందున అక్కడకు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఇసుకను సరఫరా చేసేందుకు ఏర్పాట్లుచేస్తామన్నారు.
ఇక పక్కాగా ఇసుక సరఫరా
Published Wed, Aug 7 2019 4:35 AM | Last Updated on Wed, Aug 7 2019 4:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment