Supply of sand
-
ఇసుక వారోత్సవం
-
వరదలు తగ్గగానే.. భారీగా ఇసుక
అవినీతిని దూరం చేయడంతో రాబందుల మాదిరిగా మనపై రాళ్లు వేస్తున్నారు. టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తోంది. దుష్ప్రచారాలను వెంటనే ఖండించాలి. గతంలో ఎప్పుడూలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి.. వరదలు వస్తున్నాయి.. ఇలా వర్షాలు రావడం రైతులకు, అందరికీ మంచిదే. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదే. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వరదల కారణంగా 90 రోజులుగా ఇసుకను ఆశించినంత రీతిలో తీయలేకపోతున్నామని, వచ్చే వారమంతా దాని మీదే పని చేసి కొరత లేకుండా చేద్దామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని భావిస్తున్నామని, ఆ తర్వాత ‘ఇసుక వారోత్సవం’ చేపట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. గతంలో ఇసుకను దోచేసిన వారే ఇప్పుడు దుష్ప్రచారం చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇసుక లభ్యత, సరఫరాపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదని, ఒక్క ఇసుక లారీ కూడా రాష్ట్రం నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహరా ఉంచాలని, డీజీపీ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో కుడి, ఎడమ తేడా లేకుండా రాబందుల మాదిరిగా ఇసుకను దోచేసిన వారు, ఇష్టానుసారం అవినీతికి పాల్పడిన వారు మనపై రాళ్లు వేస్తున్నారన్నారు. గతంలో వారు వ్యవస్థను తీవ్ర అవినీతిమయం చేస్తే, ఇప్పుడు దాన్ని మనం పూర్తిగా మరమ్మతు చేస్తున్నామని చెప్పారు. ‘ఎక్కడైనా అక్రమం జరిగితే అడ్డుకోండని కలెక్టర్, ఎస్పీలకు ఎప్పుడో చెప్పాను. ఆ గ్రీన్ కార్డు వారికి ఉంది. అందుకే ఇవాళ ఇసుక తవ్వకాలలో అవినీతిని దూరంగా పెట్టగలిగాం అని గర్వంగా చెప్పగలుతున్నా’ అని సీఎం అన్నారు. వాగులు, వంకల్లో 70 రీచ్‌లు గుర్తింపు వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో ఇసుక తీసేందుకు 70 రీచ్‌లను గుర్తించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో ఎవరైనా చలానా కట్టి, 20 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్ ద్వారా తరలించుకోవచ్చన్నారు. పనులు కావాల్సిన వారు గ్రామ సచివాలయం ద్వారా ఇసుక రీచ్‌ల్లో పనులు చేసుకోవచ్చని, దీన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. వరద తగ్గగానే ఆ రీచ్‌లలో ఎవరు పనులు అడిగినా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రభుత్వమే ఇసుకను తవ్వుతుంది కాబట్టి.. పేదలకు మరింతగా పనులు దొరికి మంచి జరుగుతుందన్నారు. ఈ విషయాలను ప్రజలకు తెలియజేస్తూ మరో పక్క ప్రతిపక్షం కావాలనే దుష్ప్రచారం చేస్తోందనే విషయాన్నీ వివరించాలని సీఎం సూచించారు. భవన నిర్మాణ కార్మికులకు గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక తవ్వకాల్లో పనులు కల్పించాలని ఆదేశించారు. ముందుకొచ్చిన వారికి సరఫరా బాధ్యతలు కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున రవాణా చార్జి నిర్ణయించామని, ఎవరైతే ముందుకు వస్తారో వారికి ఇసుక సరఫరా కూడా అప్పగిస్తామని చెప్పామని సీఎం గుర్తుచేశారు. ఇంకా ఎవరైనా ముందుకు వస్తే దరఖాస్తు తీసుకుని వారికి ఆ పని అప్పగించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇంత పారదర్శకంగా మనం చేస్తున్న వాటన్నింటి గురించి ప్రజలకు చెప్పాలని సీఎం సూచించారు. 267 రీచ్‌లు ఉంటే వరదల కారణంగా సుమారు 60 చోట్ల మించి ఇసుకను తీయలేకపోతున్నామన్నారు. రెండు రోజుల్లో నవంబర్ నెల వస్తోందని, కచ్చితంగా వరదలు తగ్గుతాయని.. ఆ వెంటనే కావాల్సినంతగా ఇసుకను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇంతకు ముందు అవినీతి, మాఫియాలతో ఇసుకను తరలించేవారని, ఇప్పుడు ప్రభుత్వమే తవ్వకాలు చేపట్టింది కాబట్టి, అన్ని చోట్లా యంత్రాలు కాకుండా మాన్యువల్‌గా ఆ పని చేస్తున్నందున భవన నిర్మాణ కార్మికులకు మరింతగా పనులు లభిస్తాయని చెప్పారు. దీంతో పనులు దొరకలేదన్న సమస్య తలెత్తదని స్పష్టం చేశారు. -
ఇక పక్కాగా ఇసుక సరఫరా
సాక్షి, అమరావతి : కొత్త విధానం ద్వారా ఇసుక సరఫరాకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అవసరమైతే కొత్త రీచ్‌లకు త్వరితగతిన అనుమతులు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబరు అయిదో తేదీ నుంచి కొత్త విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ముందస్తు కసరత్తు, సన్నద్ధతపై మంగళవారం సచివాలయంలో మంత్రి రామచంద్రారెడ్డి భూగర్భ గనులు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారులతో సమీక్షించారు. ‘ఎక్కడా ఇసుక దుర్వినియోగం కావడానికి వీల్లేదు. అవసరమైన చోట తక్షణమే స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయండి. వాటికి సమీపంలో వేబ్రిడ్జిలు ఉండేలా చూడండి. ఇసుక రేవుల్లోనూ, స్టాక్ యార్డుల్లోనూ సీసీ కెమెరాలతో పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలి. ఇసుక లోడింగ్ చేసినప్పటి నుంచి వాహన కదలికలన్నీ జీపీఎస్ ద్వారా పర్యవేక్షించడం ద్వారా ఎవరు బుక్ చేసుకున్నారో వారికే ఇసుక వెళ్లేలా చూడొచ్చు. ప్రజలకు ప్రస్తుతం అందుతున్న ధరకంటే ఏమాత్రం పెరగకుండా ఇసుకను అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ఈ దిశగా త్వరగా అన్ని ఏర్పాట్లుచేయండి’ అని మంత్రి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరుకే అన్నీ సిద్ధంచేయాలి వచ్చే నెల నుంచి కొత్త విధానం ద్వారా ఇసుక అందించాల్సి ఉన్నందున ఈ నెలాఖరుకే సర్వ సన్నద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఇసుక బుక్ చేస్తే త్వరగా పంపలేదనే చెడ్డ పేరు ప్రభుత్వానికి రాకుండా అధికారులు చూడాలని మంత్రి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. 46 స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేస్తున్నామని, ఈ నెలాఖరుకల్లా రాష్ట్రవ్యాప్తంగా 124 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు సాగించడానికి వీలుగా పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకుంటామని అధికారులు మంత్రికి వివరించారు. విశాఖ జిల్లాలో నదులు లేకపోవడం, ఎక్కువ ఇసుక వినియోగం ఉన్నందున అక్కడకు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఇసుకను సరఫరా చేసేందుకు ఏర్పాట్లుచేస్తామన్నారు. -
కార్యదర్శుల చేతికి ఇసుక రీచ్‌లు
* జిల్లాలో 13 మండలాల్లోని 32 రీచ్‌లు అప్పగింత * ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడినుంచే ఇసుక సరఫరా విజయనగరం మున్సిపాలిటీ : ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు ఇసుక కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శులకే రీచ్‌లపై అజమాయిషీ ఇచ్చి అవసరమైన ఇసుక సరఫరాకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యా ప్తంగా 13 మండలాల్లోని 32 రీచ్‌లను వారికి అప్పగిస్తూ భూగర్భ జల శాఖ అధికారుల నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చాయి. ఈ రీచ్‌ల ద్వారా కేవలం ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో చేపట్టే పనులకు మా త్రమే ఇసుక సరఫరా చేయనున్నారు. అంతేగాకుండా ఆ గ్రామ పంచాయతీలో ఇళ్లు నిర్మించుకుంటే దానిని నిజ నిర్ధారణ చేసుకుని సరఫరా చేయాలి. ఇంజినీరింగ్ అధికారులు ముందుగా జాయింట్ కలెక్టర్‌కు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమో దరఖాస్తు చేసుకోవాలి. జేసీ ఆమోదించాక భూగర్భ గనుల శాఖ అధికారికి పంపిస్తారు. అక్కడి నుంచి జిల్లా పంచాయతీ అధికారి ద్వారా కార్యదర్శులకు ఆదేశాలు జారీ అవుతాయి. క్యూబిట్ మీటర్‌కు రూ. 66లు పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించే ఇసుక రీచ్‌ల్లో ఇసుక ధర క్యూబిక్ మీటర్‌కు రూ. 66 గా నిర్ధారించినట్లు భూగర్బగనుల శాఖ ఏడీ మాధవరావు సాక్షికి తెలిపారు. జేసి అనుమతి ఇచ్చాక ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలో తెలుసుకుని తద్వారా వచ్చే మొత్తాన్ని కార్యదర్శి చలానా ద్వారా ప్రభుత్వానికి జమ చేస్తారు. దీని రవాణాకు కార్యదర్శే వే బిల్లు అందిస్తారు. కార్యదర్శులకు కేటాయించిన ఇసుక రీచ్‌లివే... బొబ్బిలి మండలంలోని పారాది, పెంట, పారాది బిట్-3, పారాది బిట్-2, గుర్ల మండలంలోని గరికివలస, భూపాలపురం, కలవచర్ల, చింతలపేట, నడుపూరు గజపతినగరం మండలంలోని ఎం.ముగడాం-1, ఎం.ముగడాం-2, ఎం.ముగడాం-3 బలిజిపేట మండలంలోని పెద్దింపేట, అరసాడ, కొమరాడ మండలంలోని పూర్ణపాడు, కల్లికోట, దుగ్గి-2, దుగ్గి డెంకాడ మండలంలోని సింగవరం-2, సింగవరం-1 దత్తిరాజేరు మండలంలోని పెదకాద రామభద్రపురం మండలంలోని రొంపిల్లి, కొట్టక్కి, గొల్లపేట సీతానగరంలోని పనుకుపేట, పెదంకలాం, పెదభోగిలి మెంటాడ మండలంలోని మెంటాడ పాచిపెంట మండలంలోని కర్రివలస జియ్యమ్మవలస మండలంలోని బిట్రపాడు ఎస్‌కోట మండలంలోని చామలపల్లి -
ఏరుల్లో మారీచ్‌లు
ఇసుక రీచ్‌ల వద్ద మారీచ్ల మాయాజాలానికి అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ప్రైవేట్ వ్యక్తులు దందా చేస్తున్నారు. ఒకరిచ్చిన స్లిప్పులతో తమకు కావలసిన వారికి ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇందేంటని అడిగితే అధికార పార్టీ నాయకుని కనుసన్నల్లో ఇదంతా జరుగుతోందని, నేరుగా సొమ్ము ముట్టజెప్పితే సులువుగా పని అయిపోతుందన్న సమాధానం వినిపిస్తోంది. * అడ్డుగోలుగా ప్రైవేట్ దందా * దుర్వినియోగమవుతున్న నిర్వాహకుల స్లిప్పులు * స్లిప్పులిచ్చి మూడు రోజులవుతున్నా సరఫరా కాని ఇసుక * ఒకే స్లిప్పుపై నాలుగైదు లోడ్లు తరలిస్తున్నారని ఆరోపణలు * పద్ధతి ప్రకారం వెళ్లిన వారికి సరఫరాలో జాప్యం * ఇసుక రీచ్‌ల వద్ద రాత్రి పూట ప్రైవేటు వ్యక్తుల హవా సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరానికి చెందిన ఒకాయన ఆరు ట్రాక్టర్ల ఇసుక లోడ్ కోసం ఈనెల 10 న ఆంధ్రా బ్యాంకులో రూ.9వేలకు డీడీ తీశారు. డీడీతో పాటు దరఖాస్తు, ఇతర ధ్రువీకరణపత్రాలను పట్టుకుని నెల్లిమర్ల మండలం పారసాం ఇసుకు రీచ్ వద్దకెళ్లారు. అవన్నీ చూసినఒక ట్రాక్టర్ యజమాని వెంటనే ఆయన దగ్గర వాలిపోయాడు. అన్నీ నేను చూసుకుంటానని చెప్పి డీడీతో పాటు పత్రాలన్నీ లోపలకు తీసుకెళ్లి నమోదు చేయించారు. వెంటనే ఆయనొక స్లిప్ ఇచ్చారు. ఈ స్లిప్‌ను చూపించి ఇసుక లోడ్ చేసుకుని తీసుకెళ్లాలని సదరు రీచ్ నిర్వాహకులు సూచించారు. దీంతో ఇసుక కావల్సిన వ్యక్తి ఇంటికొచ్చేశాడు. వెంటనే వచ్చేస్తుంది కదా అని ఇసుక కోసం ఎదురు చూశాడు. ఆ రోజు రాలేదు. తర్వాత రోజైన 11వ తేదీన చేరలేదు. దీంతో ఆ వ్యక్తి అప్రమత్తమై సదరు ట్రాక్టర్ యజమానికి 12వ తేదీ(బుధవారం)న ఫోన్ చేశాడు. 11వ తేదీ రాత్రి మీ పేరున లోడ్ చేశామని కాకపోతే అది వేరొకరికి ఇచ్చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. దీనిపై ఫిర్యాదు చేస్తానని సదరు వ్యక్తి గట్టిగా నిలదీయడంతో ఇక్కడ చాలా జరుగుతున్నాయి. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా నడుచుకోక తప్పదు. ఈరోజు తప్పక వచ్చేస్తుందని చెప్పుకొచ్చాడు. సాయంత్రానికి మళ్లీ ఫోన్ చేసి ఈ రోజు రాదని గురువారం తీసుకొచ్చేస్తామని మాట మార్చాడు. అసలెందుకిలా జరుగుతుందని రూ.9వేలు డీడీ కట్టిన వ్యక్తి ఆరాతీయగా తమకిచ్చిన స్లిప్పు నఖలును వారి వద్ద ఉంచుకుని, దాన్ని చూపించి అనధికారికంగా ఇసుకను తరలించేస్తున్నారన్న విషయాన్ని స్థానికుల నుంచి తెలుసుకున్నారు. ఆ మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుని కనుసన్నల్లో ఇదంతా జరుగుతోందని, నేరుగా సొమ్ము ముట్టజెప్పితే సులువుగా పని అయిపోతుందన్న విషయాన్ని తెలుసుకుని అవాక్కయ్యాడు. మేక్ సొసైటీకిచ్చిన ఇసుక రీచ్‌లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనడానికి ఇది మచ్చుకు ఒక ఉదాహరణ. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అధికారికంగా జరుగుతున్న రవాణా కన్న అనధికారికంగా జరుగుతున్న రవాణే ఎక్కువనే ఆరోపణలు ఉన్నాయి. మేక్ సొసైటీలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా ఉండడం, వారికి సంబంధించిన గ్రామైక్య సంఘాలే సభ్యులు కావడంతో అక్రమాలకు తెరలేచినట్టు స్పష్టమవుతోంది. ఒకరి స్లిప్పుతో మరొకరికి అనధికారికంగా తరలించేస్తున్నారని సమాచారం. ఎక్కడైనా తనిఖీలు జరిగితే తప్ప ఆ స్లిప్పులను రెగ్యులర్‌గా వాడుకుంటున్నారు. వాస్తవానికైతే స్లిప్ ఇచ్చిన రోజునే లోడ్ సరఫరా జరగాలి. కానీ సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఉన్న వారు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఎప్పటిలాగే ఇసుక దోపిడీ జరిగిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అధికారులు గుర్తించి, ఇంకా ప్రారంభించని ఇసుక రీచ్‌లలో కూడా అడ్డగోలుగా తవ్వకాలు జరిగిపోతున్నాయి. యథచ్ఛేగా రవాణా అయిపోతోంది. వాస్తవానికైతే అధికారులు ఇప్పటివరకు 17రీచ్‌లను గుర్తించారు. అందులో ఆరు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా 11రీచ్‌లలో ప్రారంభం కావల్సి ఉంది. వీటిలో పార్వతీపురం డివిజన్లో ఉన్న ప్రారంభం కాని రీచ్‌లలో అక్రమ తవ్వకాలు, రవాణా ఎక్కువుగా జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ప్రారంభమైన ఆరు రీచ్‌లలో కూడా రాత్రి పూట అనధికార తవ్వకాలు, రవాణా జరుగుతున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుత నిబంధనల మేరకు పగటి పూట మాత్రమే తవ్వకాలు చేసి రవాణా చేయాలి. కానీ పద్ధతి తప్పిన వారంతా రాత్రిపూట తమ పని కానిచ్చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు దందా నడుస్తోందని, రీచ్‌లవద్ద వసూళ్ల దుకాణాలు తెరిచేశారన్న వాదనలు ఉన్నాయి. కాగా, స్లిప్ ఇచ్చిన మూడు రోజులైనా ఇసుక సరఫరా కాకపోవడంపై డీఆర్డీఎ అడిషనల్ ప్రాజెక్టు డెరైక్టర్ సుధాకర్ వద్ద ’సాక్షి’ ప్రస్తావించగా ఈసేవ ద్వారా బుక్ చేసుకుంటే తామే సరఫరా చేస్తామని, అందువల్ల ఎటువంటి ఇబ్బందులు రావడం లేదన్నారు. బ్యాంకు డీడీలు తీసిన వారు ట్రాక్టర్ తీసుకెళ్లి దగ్గరుండి లోడింగ్ చేయించుకోవాలన్నారు. అలా కాకుండా బ్రోకర్లను ఆశ్రయించి, తద్వారా జాప్యం జరిగితే తమకేమి సంబంధం లేదన్నారు. అయినప్పటికీ ఆరోపణలు వచ్చిన దృష్ట్యా రీచ్‌ల వద్ద ప్రైవేటు వ్యక్తుల్లేకుండా పోలీసుల ద్వారా చర్యలు తీసుకుంటామని సుధాకర్ చెప్పారు.