ఏరుల్లో మారీచ్‌లు | sans mafia in vizainagaram supplay of sands | Sakshi
Sakshi News home page

ఏరుల్లో మారీచ్‌లు

Published Thu, Nov 13 2014 4:07 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

ఏరుల్లో మారీచ్‌లు - Sakshi

ఏరుల్లో మారీచ్‌లు

ఇసుక రీచ్‌ల వద్ద మారీచ్‌ల మాయాజాలానికి అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ప్రైవేట్ వ్యక్తులు దందా చేస్తున్నారు. ఒకరిచ్చిన స్లిప్పులతో తమకు కావలసిన వారికి ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇందేంటని అడిగితే అధికార పార్టీ నాయకుని కనుసన్నల్లో ఇదంతా జరుగుతోందని, నేరుగా సొమ్ము ముట్టజెప్పితే సులువుగా పని అయిపోతుందన్న సమాధానం వినిపిస్తోంది.
 
* అడ్డుగోలుగా ప్రైవేట్ దందా
* దుర్వినియోగమవుతున్న నిర్వాహకుల స్లిప్పులు
* స్లిప్పులిచ్చి మూడు రోజులవుతున్నా సరఫరా కాని ఇసుక
* ఒకే స్లిప్పుపై నాలుగైదు లోడ్లు తరలిస్తున్నారని ఆరోపణలు
* పద్ధతి ప్రకారం వెళ్లిన వారికి సరఫరాలో జాప్యం
* ఇసుక రీచ్‌ల వద్ద రాత్రి పూట ప్రైవేటు వ్యక్తుల హవా

సాక్షి ప్రతినిధి, విజయనగరం :  విజయనగరానికి చెందిన ఒకాయన ఆరు ట్రాక్టర్ల ఇసుక లోడ్ కోసం ఈనెల 10 న ఆంధ్రా బ్యాంకులో రూ.9వేలకు  డీడీ తీశారు. డీడీతో పాటు దరఖాస్తు, ఇతర ధ్రువీకరణపత్రాలను పట్టుకుని నెల్లిమర్ల మండలం పారసాం ఇసుకు రీచ్ వద్దకెళ్లారు. అవన్నీ చూసినఒక ట్రాక్టర్ యజమాని వెంటనే ఆయన దగ్గర  వాలిపోయాడు.

అన్నీ నేను చూసుకుంటానని చెప్పి డీడీతో పాటు పత్రాలన్నీ లోపలకు తీసుకెళ్లి నమోదు చేయించారు. వెంటనే ఆయనొక స్లిప్ ఇచ్చారు. ఈ స్లిప్‌ను చూపించి ఇసుక లోడ్ చేసుకుని తీసుకెళ్లాలని సదరు రీచ్ నిర్వాహకులు సూచించారు. దీంతో ఇసుక కావల్సిన వ్యక్తి ఇంటికొచ్చేశాడు. వెంటనే వచ్చేస్తుంది కదా అని ఇసుక కోసం ఎదురు చూశాడు. ఆ రోజు రాలేదు. తర్వాత రోజైన 11వ తేదీన చేరలేదు. దీంతో ఆ వ్యక్తి అప్రమత్తమై సదరు ట్రాక్టర్ యజమానికి 12వ తేదీ(బుధవారం)న ఫోన్ చేశాడు.

11వ తేదీ రాత్రి మీ పేరున లోడ్ చేశామని కాకపోతే అది వేరొకరికి ఇచ్చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. దీనిపై ఫిర్యాదు చేస్తానని సదరు వ్యక్తి గట్టిగా నిలదీయడంతో   ఇక్కడ చాలా జరుగుతున్నాయి. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా నడుచుకోక తప్పదు. ఈరోజు తప్పక వచ్చేస్తుందని చెప్పుకొచ్చాడు. సాయంత్రానికి మళ్లీ ఫోన్ చేసి ఈ రోజు రాదని గురువారం తీసుకొచ్చేస్తామని మాట మార్చాడు.

అసలెందుకిలా జరుగుతుందని రూ.9వేలు డీడీ కట్టిన వ్యక్తి ఆరాతీయగా తమకిచ్చిన స్లిప్పు నఖలును  వారి వద్ద ఉంచుకుని, దాన్ని చూపించి అనధికారికంగా ఇసుకను తరలించేస్తున్నారన్న విషయాన్ని స్థానికుల నుంచి తెలుసుకున్నారు. ఆ మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుని కనుసన్నల్లో ఇదంతా జరుగుతోందని, నేరుగా సొమ్ము ముట్టజెప్పితే సులువుగా పని అయిపోతుందన్న విషయాన్ని తెలుసుకుని అవాక్కయ్యాడు.

మేక్ సొసైటీకిచ్చిన ఇసుక రీచ్‌లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనడానికి ఇది మచ్చుకు ఒక ఉదాహరణ.   ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అధికారికంగా జరుగుతున్న రవాణా కన్న అనధికారికంగా జరుగుతున్న రవాణే ఎక్కువనే ఆరోపణలు ఉన్నాయి.  మేక్ సొసైటీలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా ఉండడం, వారికి సంబంధించిన గ్రామైక్య సంఘాలే సభ్యులు కావడంతో అక్రమాలకు తెరలేచినట్టు స్పష్టమవుతోంది.

ఒకరి స్లిప్పుతో మరొకరికి అనధికారికంగా తరలించేస్తున్నారని సమాచారం.   ఎక్కడైనా తనిఖీలు జరిగితే తప్ప ఆ స్లిప్పులను రెగ్యులర్‌గా వాడుకుంటున్నారు. వాస్తవానికైతే స్లిప్ ఇచ్చిన రోజునే లోడ్ సరఫరా జరగాలి. కానీ సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఉన్న వారు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఎప్పటిలాగే ఇసుక దోపిడీ జరిగిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అధికారులు గుర్తించి, ఇంకా ప్రారంభించని ఇసుక రీచ్‌లలో కూడా అడ్డగోలుగా తవ్వకాలు జరిగిపోతున్నాయి. యథచ్ఛేగా రవాణా అయిపోతోంది.

వాస్తవానికైతే అధికారులు ఇప్పటివరకు 17రీచ్‌లను గుర్తించారు. అందులో ఆరు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా 11రీచ్‌లలో ప్రారంభం కావల్సి ఉంది. వీటిలో పార్వతీపురం డివిజన్‌లో ఉన్న  ప్రారంభం కాని రీచ్‌లలో అక్రమ తవ్వకాలు, రవాణా ఎక్కువుగా జరుగుతున్నట్టు సమాచారం.   ఇదిలా ఉండగా ప్రారంభమైన ఆరు రీచ్‌లలో కూడా రాత్రి పూట అనధికార తవ్వకాలు, రవాణా జరుగుతున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి.

ప్రస్తుత నిబంధనల మేరకు పగటి పూట మాత్రమే తవ్వకాలు చేసి రవాణా చేయాలి. కానీ పద్ధతి తప్పిన వారంతా రాత్రిపూట తమ పని కానిచ్చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.  ప్రైవేటు దందా నడుస్తోందని, రీచ్‌లవద్ద వసూళ్ల దుకాణాలు  తెరిచేశారన్న వాదనలు ఉన్నాయి. కాగా, స్లిప్ ఇచ్చిన మూడు రోజులైనా ఇసుక సరఫరా కాకపోవడంపై డీఆర్‌డీఎ అడిషనల్ ప్రాజెక్టు డెరైక్టర్ సుధాకర్ వద్ద ’సాక్షి’ ప్రస్తావించగా ఈసేవ ద్వారా బుక్ చేసుకుంటే తామే సరఫరా చేస్తామని, అందువల్ల ఎటువంటి ఇబ్బందులు రావడం లేదన్నారు.

బ్యాంకు డీడీలు తీసిన వారు ట్రాక్టర్ తీసుకెళ్లి దగ్గరుండి లోడింగ్ చేయించుకోవాలన్నారు. అలా కాకుండా బ్రోకర్లను ఆశ్రయించి, తద్వారా జాప్యం జరిగితే  తమకేమి సంబంధం లేదన్నారు. అయినప్పటికీ ఆరోపణలు వచ్చిన దృష్ట్యా రీచ్‌ల వద్ద ప్రైవేటు వ్యక్తుల్లేకుండా పోలీసుల ద్వారా చర్యలు తీసుకుంటామని సుధాకర్ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement