గ్రామాల గుండా రాజధానేతర ప్రాంతానికి ట్రాక్టర్‌లో తరలిస్తున్న మట్టి
సాక్షి, అమరావతిబ్యూరో : మట్టి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఇసుకనే తమ ప్రధాన ఆదాయ వనరుగా చూసుకున్న అధికార పార్టీ నాయకులు ఇప్పుడు మట్టిపై కన్నేశారు. తుళ్లూరు మండల టీడీపీ నాయకులు దీన్నే ఆసరాగా చేసుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో చేపడుతున్న రహదారుల నిర్మాణం కోసం తవ్వుతున్న మట్టిని ఈ ప్రాంతంలోనే వినియోగించాల్సి ఉంది. కానీ ఈ ప్రాంతంలో ఉన్న మట్టి బాగా సారవంతమైనది కావడంతో గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాల్లోని రైతులు దీన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుండడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో రాత్రి వేళల్లో గట్టుచప్పుడుకాకుండా పొక్లెయిన్లతో మట్టిని తవ్వి ట్రాక్టర్లు, లారీలతో తరలిస్తున్నారు.
రహదారుల నిర్మాణం కోసంతవ్వుతున్న మట్టి....
రాజధానిలో పది ఎక్స్‌ప్రెస్ రహదారుల నిర్మాణం సాగుతోంది. ఈ రోడ్లను ఏడు లేయర్లుగా వేయనున్నారు. ఇందులో భాగంగా భూమిలోని మట్టిని ఒక మీటర్ మేర తవ్వుతున్నారు. ఇలా తవ్విన మట్టిని రాజధానిలో ఇంకో ప్రాంతంలో చేపడుతున్న నిర్మాణాల కోసం ఉపయోగించాల్సి ఉంది. కానీ, సదరు కాంట్రాక్టర్లతో తుళ్లూరు మండలానికి చెందిన అధికార పార్టీ నేతలు ఒప్పందం చేసుకుని మట్టిని యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
కాంట్రాక్టర్లకు కొద్దిమొత్తంలో ముట్టజెప్పి...
రహదారుల నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు కొద్ది మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి టీడీపీ నేతలు మట్టిని తరలించుకుపోతున్నారు. రాజ ధాని పరిధిలోని గ్రామాల నుంచి రోజుకు సుమారు వెయ్యి వరకు ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలతో మట్టిని బయటి ప్రాంతాలకు తరలిస్తున్నారంటే ఈ వ్యవహారం ఎంత లాభసాటిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజధాని గ్రామాలైన వెంకటపాలెం, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయుని పాలెం, రాయపూడి, తుళ్లూరు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, అనంతవరం గ్రామాల నుంచి ఈ మట్టి అక్రమ రవాణా సాగుతోంది.
వాటాలు పంచుకునే విషయంలో ఘర్షణ
రాజధాని ప్రాంతంలోని అధికార పార్టీ నేతలు ఓ అవగాహనకు వచ్చి మట్టిని తరలిస్తున్నారు. అయితే వాటాలు పంచుకునే విషయంలో వారిలో వారికి మనస్పర్థలు రావడంతో మట్టి అక్రమ రవాణా అందరికి తెలిసింది. నెక్కల్లు – అనంతవరం మధ్య చేపడుతున్న రహదారి కోసం తవ్విన మట్టిని తరలించే విషయంలో అనంతవరం టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య మనస్పర్థలు తలెత్తి అవి పరస్పరం దాడి చేసుకునేందుకు దారి తీశాయి. మట్టి కోసం దాడులు చేసుకుంటున్నారంటే దీని ద్వారా ఏ స్థాయిలో ఆదాయం వస్తుందో అర్థం చేసుకోవచ్చు.
రూ.20 నుంచి రూ.30 కోట్ల మేర ఆదాయం
మట్టి పరిమాణాన్ని బట్టి రేటు నిర్ణయిస్తున్నారు. ఒక ట్రాక్టర్ మట్టికి గరిష్టంగా రూ. వెయ్యి వరకు అలాగే లారీలు, టిప్పర్లకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా రోజు వారీగా ఆదాయం రూ. కోటి నుంచి రూ. కోటిన్నర్రకు పైగా వస్తోంది. లంచాలు, మామూళ్లు పోను నెలకు రూ. 30 కోట్ల వరకు ఆదాయాన్ని కొళ్లగొడుతున్నారు. మామూళ్ల మత్తులో సీఆర్‌డీఏ అధికారులు జోగుతూ... మట్టి అక్రమ రవాణాకు పచ్చ జెండా ఊపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment