
టీడీపీ సభలకు జనం ‘కదలిరా’వడం లేదు. కార్యకర్తలు నానా తంటాలుపడి బలవంతంగా తరలించినా... చివరి వరకూ ఉండటం లేదు. పసలేని ప్రసంగాలు... అదేపనిగా రాగాలు తీస్తూ జగన్‌పై నిందారోపణలు... జనాన్ని ఆకర్షించని నిర్ణయాలు... సభలను నీరుగార్చేస్తున్నాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక్కోసభ నిర్వహించాలని యోచించినా... పట్టుమని పది సభలే నిర్వహించారు. అవి కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. దత్తపుత్రుడి సాయం తీసుకుందామను కుంటే... ఆయన నుంచి సానుకూల స్పందన రావడం లేదు. సీట్ల సర్దుబాటు తేలకుండా సభలకు వెళ్లేందుకు జనసేన నేతలు కూడా సుముఖత చూపడం లేదు.
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల ‘రా కదలిరా’ పేరిట ప్రారంభించిన సభలు అర్ధంతరంగా ఆపేస్తున్నారా... అంటే తమ్ముళ్లనుంచి ఔననే సమాధానం వస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనం ఏమాత్రం సానుకూలంగా లేకపోవడం... టీడీపీ నేతలు, క్యాడర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
ముక్కుతూ మూలుగుతూ ఇప్పటివరకు 10 సభలు నిర్వహించినా మిగిలిన జిల్లాల్లో వాటిని నిర్వహించడం కష్టమని చెబుతున్నారు. నెలాఖరులోగా ఎలాగోలా కొన్ని చోట్ల సభలు నిర్వహించి.. మరికొన్ని చోట్ల రద్దు చేసి.. మరో కార్యక్రమం తలపెట్టాలని భావిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఒంగోలుతో మొదలుపెట్టి 29వ తేదీ వరకూ షెడ్యూల్ ప్రకటించినా... జనం నుంచి స్పందన లేకపోవడంతో కొన్ని సభలు నిలిచిపోయాయి.
చిత్తూరు పార్లమెంటు పరిధిలోని జీడీ నెల్లూరు సభ, బుధవారం జరగాల్సిన రాజంపేట పార్లమెంటు పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఉరవకొండ సభలు వాయిదా పడ్డాయి. ఈ నెల 27న రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని గోపాలపురంలో సభ నిర్వహించాల్సి వున్నా అక్కడ రద్దు చేసి 29న రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించారు.
సభలన్నీ అట్టర్ ఫ్లాపే
ఇప్పటివరకు నిర్వహించిన సభలన్నీ విఫలమవడంతో టీడీపీలో నైరాశ్యం నెలకొంది. తిరువూరు, కనిగిరి, ఆచంట, ఆళ్లగడ్డ, గుడివాడ తదితర సభలు జనం లేక వెలవెలబోయాయి. సభలు విజయవంతమైనట్లు ఎల్లోమీడియా ఎంతగా బూస్టప్ ఇచ్చినా వాస్తవానికి అవన్నీ ఫ్లాపేనని ఆ పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
అరకులో పెట్టిన సభ తర్వాత ఇక నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రసంగంలో సీఎం జగన్‌పై ఈర్ష్య, ద్వేషంతో తిట్టిపోయడం తప్ప తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమిటి చేశారో చెప్పలేకపోవంతో జనం విసిగెత్తిపోతున్నారు. బాబు ప్రతి ఎన్నికల్లోనూ హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక దానిని బుట్టదాఖలు చేయడంతో ప్రజలు ఈసారి హామీలను ఏమాత్రం నమ్మడం లేదు.
కార్యక్రమాలన్నీ విఫలమే...
బాబు ఏ కార్యక్రమం చేపట్టినా విఫలమవుతూనే ఉన్నాయి. బాదుడే బాదుడు,, ఆయన కుమారుడు లోకేశ్ నిర్వహించిన పాదయాత్ర ఈ కోవలోకే వస్తాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయ్యాక ఆయన సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికీ సరైన ఆదరణ లభించలేదు.
బాబుపై నమ్మకం పోయింది
జనం తనను నమ్మడం లేదని చంద్రబాబు కూడా గుర్తించారు. అందుకే జనసేనతో కలిసి వారిని నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నా అది కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. రా కదలిరా సభలకు పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడం దీనికి నిదర్శనం. సీట్లు ఖరారు కాకుండా సభలకు ఎందుకెళ్లాలని పవన్ వెనుకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే రా కదలిరా సభలకు ఇక ఫుల్‌స్టాప్ పెట్టనున్నారు. త్వరలో మరో కొత్త పేరుతో, కొత్త కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నా... అసలు జనాన్నిఆకర్షించలేకపోవడంతో ఏ పేరుతో కార్యక్రమం నిర్వహించినా ఉపయోగం ఏమిటనే అభిప్రాయాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.