నెక్కల్లు–అనంతవరం గ్రామాల మధ్యలో రహదారుల నిర్మాణం కోసం తవ్విన మట్టిని విక్రయించుకునే విషయంలో టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య కుమ్ములాట జరిగింది. వాటాలు పంచుకునే విషయమై టీడీపీ నేతలు పరస్పరం తన్నుకున్నారు. ఈ వ్యవహారం పోలీసుస్టేషన్‌కు చేరింది.
సాక్షి, అమరావతిబ్యూరో/తుళ్లూరు రూరల్ : రాజధానిలో వాటాలు పంచుకునే విషయమై టీడీపీ నేతలు పరస్పరం తన్నులాటకు దిగారు. మాకంటే మాకు వాటా ఎక్కువ కావాలని పరస్పరం వాగ్వాదానికి దిగారు. మాటకు మాట పెరగడంతో పిడిగుద్దులతో కొట్టుకున్నారు. తుళ్లూరు మండలం నెక్కళ్లు గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగాన్ని ముగించాలని చూసినా ఓ వర్గం టీడీపీ నేతలు ఇందుకు ససేమిరా అనడంతో ఇరు వర్గాల పంచాయతీ సోమవారం తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
పోలీస్‌స్టేషన్ బయటే పంచాయితీ..!
నెక్కళ్లు–అనంతవరం గ్రామాల మధ్యలో రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఇందుకోసం తవ్విన మట్టిని ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్ల సాయంతో రాజధానేతర గ్రామాలకు తరలిస్తున్నారు. ఈ తరలింపులో వాటాలు అందకపోయే సరికి నెక్కల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. సుమారు 200 మంది రెండు గ్రూపులుగా ఏర్పడి పరస్పరం రాళ్లు రవ్వుకున్నారు. చివరికి ఈ ఉదంతం తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు చేరేసరికి మండల టీడీపీకి చెందిన కీలక నేతలు రంగంలోకి దిగారు. ఈ విషయం బయటికి పొక్కితే రచ్చ రచ్చ అవుతుందని.. సైలెంట్‌గా దీన్ని ముగించాలని ఇరు వర్గాలకు సూచించారు. స్టేషన్ బయటే పంచాయతీ పెట్టి ఇరు వర్గాలను శాంతింపజేసి, వాటాల విషయం తర్వాత చర్చిద్దామని నచ్చజెప్పి పంపించేశారు.
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా....
నిబంధనల మేరకు రాజధాని నిర్మాణం కోసం తవ్విన మట్టిని ఈ ప్రాంతంలోనే ఉపయోగించాల్సి ఉంది. కానీ భూ బకాసురులు అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి తమ పని కానిచ్చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ భయభాంత్రులకు గురిచేస్తున్నారు. లారీకి రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు, ట్రాక్టర్‌కు రూ. 500 నుంచి రూ. వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. నెక్కళ్లు, అనంతవరం, రాయపూడి, వెలగపూడి, మల్కాపురం తదితర గ్రామాల్లో ఈ దందా కొనసాగుతున్నా సీఆర్‌డీఏ అధికారులు కానీ, ఏడీసీ అధికారులు కానీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment