చెరువులు జలాశయాల్లో పూడిక తీసిన మట్టి, ఇసుకతో వ్యాపారం చేసుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు
సాక్షి, అమరావతి: నాలుగేళ్లుగా టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తోన్న ఇసుక, మట్టి దోపిడీని ప్రభుత్వం అధికారికం చేసింది. జలాశయాలు, చెరువుల్లో పూడిక తీసిన మట్టి, ఇసుకతో వ్యాపారం చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తవ్విన ఇసుక, మట్టికి సీనరేజీ ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. రాష్ట్రంలో నీరు–చెట్టు పథకం కింద చెరువులు, జలాశయాల్లో పూడిక తీసే పనులకు నాలుగేళ్ల క్రితమే సర్కార్ శ్రీకారం చుట్టింది.
నిబంధనల ప్రకారం పూడిక తీసిన మట్టి, ఇసుకను రైతులు సొంత ఖర్చుతో తమ పొలాలకు తీసుకెళ్లవచ్చు కానీ అమ్ముకోకూడదు. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు నిబంధనలను వక్రీకరించి వ్యాపారం చేస్తున్నారు. 2015–16లో 18.20, 2016–17లో 29.07, 2017–18లో 24.04, 2018–19లో ఇప్పటివరకూ 3.85 వెరసి.. 75.16 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడికను తీసినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇందులో 45 కోట్ల క్యూబిక్ మీటర్లకుపైగా మట్టి, ఇసుకను క్యూబిక్ మీటర్ రూ.550 చొప్పున విక్రయించి రూ.24,750 కోట్లకుపైగా సొమ్ము చేసుకున్నారు.
చెరువులు, జలాశయాల్లో పూడిక తీసిన మట్టి, ఇసుకతో వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు
ఏడాది మాత్రమే గడువుండటంతో..
టీడీపీ సర్కార్‌కి ఏడాది మాత్రమే గడువుండటంతో మట్టి, ఇసుక ద్వారా రూ.వేల కోట్లు కొల్లగొట్టడానికి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నేతృత్వంలోని మాఫియా స్కెచ్ వేసింది. సొంత ఖర్చులతో పూడికను తీసి మట్టి, ఇసుకను వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటామని చిన్న నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌కు ప్రతిపాదనలు పంపారు. వాటిపై ఆమోదముద్ర వేయాలంటూ కీలక మంత్రి జలవనరుల శాఖ మంత్రిపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. అధికారులు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు.
నీరు–చెట్టు పథకంపై గత సోమవారం నిర్వహించిన సమీక్షలో సొంత ఖర్చుతోపూడిక తీస్తామని ముందుకొచ్చిన వారికి ఎందుకు అడ్డుతగులుతున్నారంటూ సీఎం చంద్రబాబు మండినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో చేసేది లేక జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెరువు లేదా జలాశయంలో పూడిక తీసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. చెరువులు, జలాశయాలకు నష్టం వాటిల్లకుండా క్యూబిక్ మీటర్‌కు రూ.1 చొప్పున పూచీకత్తుగా వసూలు చేయాలని, పూడికతీత పూర్తయిన తర్వాత ఎలాంటి నష్టం వాటిల్లకపోతే ఆ మొత్తాన్ని కూడా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.
పనులు చేయకపోయినా..
నీరు–చెట్టు కింద రాష్ట్రంలో పనులన్నీ నామినేషన్ పద్ధతిలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు అప్పగించారు. పనులు చేసినా చేయకున్నా చేసినట్లుగానే రికార్డులు రాసి రూ.12,819.82 కోట్లను ఇప్పటివరకూ బిల్లుల రూపంలో చెల్లించారు. ఈ పథకం కింద ఇప్పటివరకూ 75.16 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించడం ద్వారా 65.192 టీఎంసీల నిల్వ సామర్థ్యం పెరిగిందని సర్కార్ లెక్కలు చెబుతోంది. కానీ.. ఈ లెక్కలను అధికారవర్గాలే కొట్టిపారేస్తుండటం గమనార్హం.
–ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్నది.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం సమీపంలోని బ్రహ్మలింగం చెరువు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి నీరు–చెట్టు పథకం కింద ఈ చెరువును అడ్డగోలుగా తవ్వేశారు. పూడిక తీసిన మట్టిని క్యూబిక్ మీటర్ రూ.550 చొప్పున విక్రయిస్తూ.. రోజూ కనీసం రూ.ఐదు లక్షల వరకూ వెనకేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధి దోపిడీ దెబ్బకు చెరువు గొయ్యిగా మారి తూములకు నీళ్లు అందడం లేదు.
–ఇక్కడ కనిపిస్తున్నది.. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని కోదండరాముని చెరువు. ఇష్టారాజ్యంగా పూడిక తీసిన మట్టిని టీడీపీ కీలక ప్రజాప్రతినిధి క్యూబిక్ మీటర్ రూ.550 నుంచి రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. తూముల మట్టం కంటే మూడు నాలుగు మీటర్ల లోతుకు మట్టిని తవ్వేశారు. దీంతో తూములకు సక్రమంగా నీళ్లందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో ఈ రెండు చెరువుల్లోనే కాదు.. వేలాది చెరువుల్లో ఇదే పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఈ ఆగడాలకు దన్నుగా నిలిచేలా సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment