చెక్‌డ్యాముల్లోనూ చెలరేగిపోయారు! | Irregularities in check dams | Sakshi
Sakshi News home page

చెక్‌డ్యాముల్లోనూ చెలరేగిపోయారు!

Published Sun, Jun 10 2018 2:46 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Irregularities in check dams  - Sakshi

చెట్లకు డబ్బులు కాస్తాయి..
నీరుకు నిధులు పారుతాయి అన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు బాగా గ్రహించారు. అందుకే.. ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన నీరు–చెట్టు పథకం ప్రజల కన్నా నాయకులకే ఎక్కువ మేలు చేసింది.

ఈ పథకం కింద మంజూరైన కోటాను కోట్ల రూపాయలను తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున నొక్కేశారు. చెరువుల పూడికతీత పనుల్లో దొరికిన చోట దొరికినట్లు ఎలా మింగేశారో చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం, కాలువల ఆధునికీకరణ పనుల్లో కూడా అదే స్థాయిలో.. అదే రీతిలో చెలరేగిపోయారు. ఈ పనుల్లో తెలుగు తమ్ముళ్ల మాయలు, లీలలు ఎన్నో.. ఎన్నెన్నో..
 
సాగునీటి సంఘాల ద్వారా చేపట్టాల్సిన నీరు–చెట్టు  పనులను టీడీపీ నేతలు హైజాక్‌ చేసేశారు. కుదిరిన చోట కాంట్రాక్టర్లుగాను. వీలుకాని చోట కాంట్రాక్టర్లకు బినామీలుగా అవతారం ఎత్తేశారు. అవసరం ఉన్నా లేకున్నా పనులు సృష్టించి వాటికి మంజూరైన నిధుల్లో ఖర్చు పెట్టిన దానికన్నా జేబులో వేసుకున్నదే ఎక్కువ. ఒక్క అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోనే 2014 నుంచి ఇప్పటివరకు 254 పనులకు గాను మొత్తం రూ.14కోట్ల వరకు ప్రజాధనం స్వాహా అయిందంటే తెలుగు తమ్ముళ్ల స్వాహాకార్యం ఏ రేంజ్‌లో సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు.

కాలువలు, చెక్‌డ్యామ్‌ నిర్మాణాలకు పైపై పూతలతో సరిపెట్టేస్తున్నారు. కొన్నిచోట్ల అవసరం లేకపోయినా కాసులకు కక్కుర్తిపడి పనులు కానిచ్చేశారు. ఉపాధి పనులు చేసిన చోట ఆడిట్‌ పూర్తికాకపోతే నీరు–చెట్టు పనులు చేయకూడదన్న నిబంధనను గాలికొదిలేశారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పచ్చచొక్కాలు చెప్పిందే వేదంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పనుల తీరూతెన్నూ ఒక్కోచోట ఒక్కోలా ఉన్నాయి. ఉదాహరణకు..

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వేదాద్రిలోని మేకల వాగుపై రెండు కొండల మధ్య రెండేళ్ల కిందట రూ.15లక్షలతో చెక్‌ డ్యాం నిర్మించారు. దీని కింద ఉన్న ప్లాట్‌ఫాం మొత్తం కుంగిపోయి కొట్టుకుపోయింది. ఈ పనికి 2–3 లక్షలకు మించి ఖర్చుకాదని సమాచారం. జన్మభూమి కమిటీ సభ్యులు ఈ పని చేపట్టారు.
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని దాసళ్లపల్లి గ్రామంలోని దోమలేరులో రూ.20లక్షల పైబడి పనులు చేశారు. పనులు చేయకముందు గుంటలో నీరుండేవని.. ఇప్పుడు పశువులు తాగేందుకు కూడా చుక్క నీరు నిలబడడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షం నీరంతా వృధాగా పోతోంది. యాభై శాతం పనులు కూడా జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు.  
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని కూర్మాయి కౌండిన్య నదిలో నీరు–చెట్టు ద్వారా రూ.33.4లక్షల అంచనాతో రెండేళ్ల క్రితం చెక్‌డ్యామ్‌కు మరమ్మతులు చేపట్టారు. ఈ కాంట్రాక్టును టీడీపీకి చెందిన శ్రీనివాసులనాయుడు దక్కించుకున్నారు. పనులు నాసిరకంగా చేయడంతో పగుళ్లు వచ్చాయి. వర్షాలకు చెక్‌డ్యాం ముందు భా గం కొట్టుకుపోయింది. ప్రధాన డ్యాం బీటలు వారింది.
⇒  వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం.. జమ్మలమడుగు మండలం.. బొమ్మేపల్లి పంచాయితీలోని బీ ఆర్‌ కొట్టాల సమీపంలోనున్న తిరువెగలప్పలో బలంగా ఉన్న చెక్‌డ్యామ్‌ను పగులగొట్టి సమీపంలోనే మరోటి రూ. 10లక్షలతో చేపట్టారు. మరమ్మతులతో సరిపోయే దానికి తమ్ముళ్లు కాసుల కోసం ఇలా స్కెచ్‌ వేశారు.
⇒  కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వెంకటగిరి గ్రామం వద్దనున్న ఉప్పాగువంకలో రూ.10లక్షలతో నిర్మించిన చెక్‌డ్యాం పూర్తిగా కొట్టుకుపోయింది.  భూమి ఓ వైపు ఎత్తు, మరోవైపు పల్లంగా ఉన్న ప్రాంతంలో దీనిని నిర్మించారు. దీంతో దిగువ వైపునున్న మట్టికత్వ వరద నీటికి పూర్తిగా కొట్టుకుపోయింది.
ఇదే జిల్లా ఆదోనిలో రూ.5.40కోట్లతో చేపట్టిన పనులకు లెక్కలు తేలడంలేదు. 44 పనులలో ఎన్ని పూర్తయ్యాయి, ఏ దశలో నిలిచాయో రికార్డుల్లో పొందుపర్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
⇒  నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం జి. అయ్యవారిపల్లె సమీపంలో ఉన్న వంకపై చెక్‌డ్యాం నిర్మించారు. మళ్లీ గత ఏడాది రూ.40లక్షల అంచనా వ్యయంతో ఆ ప్రాంతంలో మళ్లీ అవసరం లేకపోయినా  మరో ఫైబర్‌గేట్‌ చెక్‌డ్యాం కట్టేశారు. ప్రజాధనం వృధా అయిందే తప్ప రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేకపోయింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 181 చెక్‌డ్యాంలు మంజూరు కాగా, ఇందుకు రూ.16.57కోట్లు కేటాయించారు.  ఇందులో సగానికి పైగా నిర్మాణాలు అవసరంలేని ప్రాంతాల్లో చేపట్టారు. కొన్ని చెక్‌డ్యాంలు ఇప్పటికే పగుళ్లు వచ్చి వర్షపు నీరు బయటకు వెళ్లిపోతోంది. మరికొన్ని నిర్మాణ సమయంలోనే కొట్టుకుపోయాయి.టీడీపీ నేతలు 10–15 శాతం కమీషన్‌ పద్ధతిలో కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. దీంతో కాంట్రాక్టర్లు నాణత్యకు మంగళం పాడారు.

పనులు చేయకుండానే బిల్లులు
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో అరుకుమాకులపల్లి చెరువుకు నీరు చేరే కాలువను పునరుద్ధరించడానికి 2016–17లో దాదాపు రూ.16లక్షలు కేటాయించారు. చెరువుకు మూడు వైపులా ఉన్న కాల్వల్లో అడ్డం కులు, కంప చెట్లను తొలగించాలి. అయితే, ఈ పనులు గత ఏడాది కూడా చేశారు.

అధికార పార్టీ ఎంపీటీసీ భర్త తిరిగి వీటిని రికార్డు చేయించి బిల్లులు తీసుకున్నారు. అలాగే, నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో పేరంగుంట తూముకు పనులు చేయకుండానే రూ.9లక్షల 96వేలకు బిల్లులు సమర్పించారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడైన ఈ వ్యక్తి కుటుంబ సభ్యులు మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు కావడం గమనార్హం. ఇలా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నేతలు చేతివాటం ప్రదర్శించారు.

దుర్వినియోగానికి పరాకాష్ట
విజిలెన్స్‌ దాడులు, ఆడిట్‌ నివేదికలు, పోలీసు కేసులు కావేవీ పైరవీలకు అనర్హం అన్నట్లు సాగాయి విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలోని నీరు–చెట్టు అక్రమాలు. పై ఫొటో.. మండలంలోని కోట్లశిర్లాం గ్రామంలో ఏడొంపుల గెడ్డపై నిర్మించిన చెక్‌డ్యాం. మరికొద్ది దూరంలో మరో చెక్‌ డ్యాంను రూ.15లక్షలు వెచ్చించి నిర్మించినట్లు ఎంబుక్‌లలో నమోదు చేయించి నిధులు డ్రా చేశారు. ఈ రెండు పనులకు గ్రామానికి చెందిన డమ్మీ సర్పంచ్‌ మీసాల రామారావు, మాజీ సర్పంచ్‌ తాడ్డి శ్రీనివాసరావులు కాంట్రాక్టు పొందారు.

మొత్తం రూ.30లక్షల పనుల్లో రూ.25లక్షల మేర అవినీతి జరిగిందని సోషల్‌ ఆడిట్‌ బృందం తేల్చింది. ఈ చెక్‌ డ్యాంలు నిర్మించిన వారం రోజులకే కురిసిన వర్షంతో కొట్టుకుపోయాయి. ఇలా మండలంలో రూ.6కోట్ల మేర పనులు చేస్తే మూడున్నర కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. మండలంలోని అక్రమాలపై కేసులు సైతం నమోదయ్యాయి. వీటికి సంబంధించి రికవరీ పెట్టినా పైసా కూడా వసూలు కాలేదు. పోలీసు కేసులను సైతం నీరుగార్చేలా టీడీపీ నేతలు పైరవీలు సాగిస్తున్నారు.

చిన్నపాటి వర్షానికే..
అనంతపురం జిల్లా తాడిపర్తి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండలంలోని సి.రామరాజుపల్లి వద్దనున్న ఈ వంకలో రూ.లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ చెక్‌డ్యాం పూర్తిగా ధ్వంసమైంది. చిట్టూరు గ్రామానికి చెందిన సర్పంచ్‌ రూ.8లక్షల వ్యయంతో 2016లో దీనిని నిర్మించారు. అయితే, ఇక్కడి నేల.. డ్యాం నిర్మాణానికి అనుకూలంగా లేకపోవడంతో నిర్మించిన ఆర్నెల్లకే చిన్నపాటి వర్షానికి ఎందుకూ పనికిరాకుండా పోయింది.

కాగితాల్లో పంపు షెడ్డు కట్టేశారు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని ఆక్విడెక్టు ఇది. 2016–17 సంవత్సరానికి గాను ఇక్కడ పంపుషెడ్డు నిర్మాణం చేసి నీటిని తోడేందుకు నీరు–చెట్టు నిధుల నుండి రూ.5.53 లక్షల ఖర్చుచేశారు. దీనిపై ఆరా తీస్తే అక్విడెక్టు వద్ద పంపుహౌస్‌గాని, మోటార్లుగాని లేవు. కనీసం విద్యుత్‌ కనెక్షన్లు కూడా లేవు.

ఈ పనులు డీసీ చైర్మన్‌ తోట ఫణిబాబు చేసినట్లుగా రికార్డుల్లో ఉంది. అలాగే, కాలువల్లో సిల్టు తీసింది కూడా ఈయనే. నీటిని తోడేందుకు పాత మోటార్లను తెచ్చి పని జరిగిన తరువాత పట్టుకుపోయారు. పంపుషెడ్డు నిర్మాణం చేయలేదు. అధికారులు అందించిన వివరాల్లో మాత్రం పంపుషెడ్డు నిర్మాణం పూర్తయినట్లు పేర్కొన్నారు. డీసీ చైర్మన్‌ టీడీపీ నాయకుడు కావడం, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల్లో ఒకరు కావడంతో అధికారులు అతనిని ప్రశ్నించే సాహసం చేయడంలేదు.

నా పొలంలో చెక్‌ డ్యాం నిర్మించలేదు
నా పొలంగా చెక్‌ డ్యాం నిర్మిస్తారని అధికారులు చెప్పారు. అయితే, ఇప్పటివరకూ నిర్మించలేదు. ఐదు నెలల తర్వాత.. మీ పొలంలో చెక్‌ డ్యాం నిర్మించలేదా అంటూ అధికారులు అడిగారు. అయితే, గ్రామంలో చాలామంది మీ పొలంలో చెక్‌ డ్యాం పేరుతో డబ్బు స్వాహా చేశారని చెబుతున్నారు. – సుంకమ్మ, లత్తవరం, ఉరవకొండ నియోజకవర్గం, అనంతపురం జిల్లా

సగానికి సగం లాభం
నీరు–చెట్టు పనుల్లో రూ.10లక్షల విలువగల పనిని చేస్తే రూ.3లక్షలకు దాకా కాంట్రాక్టర్‌కు గిట్టుబాటు అవుతోంది. కౌండిన్యలో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.10లక్షలకు పైనే టెండర్లు పిలిచారు. 27శాతం లెస్‌కే టెండర్లు పడ్డాయి. పని అంచనాలో 30శాతం తగ్గితే అగ్రిమెంట్లు, కమీషన్లు మరో 20శాతం పోతే 50శాతం అంచనాతో ఈ పనులు జరిగినట్లు లెక్క. అంటే ఈ పనుల్లో సగానికి సగం మిగులుతున్నట్లే కదా! – చెంగారెడ్డి, కూర్మాయి, పలమనేరు నియోజకవర్గం, చిత్తూరు జిల్లా  

పూడిక తీయకుండానే రూ.10లక్షలు హాంఫట్‌
ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత పంచాయతీ అయిన విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలోని పెదలబుడు సమీపంలోని చాకిరేవు గెడ్డ వద్ద గతంలో చెక్‌డ్యాం నిర్మించారు. అయితే, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ ద్వారా ఈ చెక్‌డ్యాంను 2015–16లో రూ.10లక్షలతో అభివృద్ధి చేశామని ప్రచార బోర్డును ఏర్పాటుచేశారు.

కానీ, తాజాగా ఇదే చెక్‌డ్యామ్‌కు రూ.10లక్షలతో సిమెంట్‌ గట్టు, ఇతర మరమ్మతులు చేపట్టారు. ఇవి చాలా నాసిరకంగా, అరకొరగా.. మొక్కుబడిగా జరిగాయి. పూడికతీత పనులు చేపట్టకపోవడంవల్ల చెక్‌డ్యామ్‌లో మట్టి పేరుకుపోయి నీరు నిలవని పరిస్థితి నెలకొంది. పూడికతీత పనులను చేపట్టకుండానే మరమ్మతుల పేరిట రూ.10లక్షలు ఖర్చు పెట్టిన వైనం తీవ్ర విమర్శల పాలవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement