సాక్షి ప్రతినిధి, కర్నూలు:
ఆ ఎమ్మెల్యే నా వద్ద రూ.5 లక్షలు తీసుకున్నారు. ఇవ్వమంటే ఇవ్వడం లేదు. మీరైనా ఇప్పించండి సార్!
ఎన్నికల ఖర్చు కోసం చేబదులుగా ఇవ్వమంటే రూ.10 లక్షలు ఇచ్చా. ఇప్పటి వరకు తిరిగివ్వలేదు సార్!!
ఇవీ సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఏకంగా ముఖ్యమంత్రికి వచ్చిన విజ్ఞాపనలు. తీసుకున్న అప్పులను తీర్చడం లేదని... అడిగితే పట్టించుకోవడం లేదని వీరు వాపోతున్నారు. ఈ విధంగా ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా పలువురు అధికార పార్టీ నేతలే ఎమ్మెల్యేపై ఫిర్యాదులు చేయడంతో సీఎం కాస్తా బిత్తరపోయినట్టు సమాచారం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన చేసిన అప్పులను పలువురు తెలుగు తమ్ముళ్లే ఏకరువు పెట్టడంతో సీఎంకు కాస్తా మైండ్ బ్లాంక్ అయి దిమ్మ తిరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా 20 నిమిషాల భేటీ జరిపి క్లాస్ పీకినట్టు సమాచారం. మొత్తం మీద ఆ ఎమ్మెల్యే వ్యవహారం కాస్తా ఇప్పుడు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయింది.
ఫిర్యాదుల మీద ఫిర్యాదులు : జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించారు. ఇక్కడే రాత్రి బస కూడా చేశారు. ఆ సందర్భంగా జిల్లాలోని పలువురు తెలుగు తమ్ముళ్లు ఆయన వద్దకు క్యూ కట్టి తమ బాధలను చెప్పుకున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమ వద్ద వడ్డీకి తీసుకున్న డబ్బును సదరు ఎమ్మెల్యే తిరిగి ఇవ్వడం లేదని వారంతా ముక్త కంఠంతో విన్నవించినట్టు తెలిసింది. ఎమ్మెల్యే బాధితులంతా కలిసి ఎలాగైనా తమ డబ్బులు తమకు వచ్చేలా న్యాయం చేయాలని వేడుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా ప్రతి చిన్న పనికీ ఆయన వద్దకు వెళ్లాల్సి వస్తోందని.. కిందిస్థాయి అధికారులు కూడా తమ మాట వినడం లేదని వాపోయినట్టు తెలిసింది.
ఎమ్మెల్యేతో చెప్పించాల్సిందే...
మరోవైపు సదరు ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపైనా తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యే సిఫారసు చేస్తేనే పనిచేయాలని సదరు నియోజకవర్గంలోని అధికారులందరికీ హుకుం జారీ అయింది. దీంతో అధికార పార్టీ నేతలు వెళ్లినా... ఎమ్మెల్యేతో ఒక ఫోను చేయించండంటూ అధికారులు తేల్చిచెబుతున్నారు. దీంతో ప్రతి చిన్న పనికి ఎమ్మెల్యే వద్దకు వెళ్లాల్సి రావడంతో తెలుగు తమ్ముళ్లకు చిర్రెత్తుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యవహరిశైలితో నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది.
మండిపడ్డ సీఎం?
అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారశైలి పట్ల వచ్చిన ఫిర్యాదులపై సీఎం మండిపడ్డట్టు సమాచారం. ఇందులో భాగంగా జిల్లా పర్యటన అనంతరం తిరుగు ప్రయాణానికి ముందు సదరు ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా ఉదయం 20 నిమిషాల పాటు సీఎం సమావేశమయ్యారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడంతో పాటు స్థానికంగా పార్టీకి ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం మండిపడ్డట్టు తెలిసింది.
ఇదేం వ్యవహారశైలి అని నిలదీయడంతో పాటు వెంటనే మార్చుకోకపోతే కష్టమని తీవ్రస్థాయిలో క్లాస్ పీకినట్టు సమాచారం. అయితే, సీఎం భేటీ తర్వాత కూడా సదరు ఎమ్మెల్యే వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
ఖద్దరు నలగదు.. అప్పు తీరదు!
Published Wed, May 6 2015 4:23 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM
Advertisement