కుందూ నదిలో ప్రొక్లెయిన్‌తో పనులు చేస్తున్న దృశ్యం
నంద్యాల: ఎన్నికలు వచ్చే సమయానికి ఆర్థికంగా బలోపేతం కావాలన్న టీడీపీ నేతల ఆలోచన..భారీ అక్రమాలకు తెరతీస్తోంది. ఇందుకు నంద్యాల డివిజన్‌లో జరుగుతున్న నీరు– చెట్టు పనులనే ఉదాహరణగా చెప్పవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా మేజర్ ఇరిగేషన్ శాఖ పరిధిలోని పనులను మైనర్ ఇరిగేషన్ ఈఈకి అప్పగించారు. తెలుగుగంగ, కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు ఉండడంతో వారికి పనులు దక్కనీయకుండా టీడీపీ నేతలు పక్కా వ్యూహం రచించారు. జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి..ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు.
నంద్యాల డివిజన్ పరిధిలో మూడేళ్లుగా నీరు–చెట్టు పనులు జరుగుతున్నాయి. వీటిని అధికార పార్టీకి చెందిన వారే చేస్తున్నారు. మైనర్ ఇరిగేషన్‌లో నంద్యాల డివిజన్‌లో సుమారు 5 వేలకు పైగా పనులు మంజూరు చేయించుకున్నారు. ఆ శాఖ ఆధ్వర్యంలో కుంటలు, చెరువుల పూడికతీత వంటి పనులు చేయాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా కేసీ కెనాల్, తెలుగుగంగకు చెందిన పనులు ఆ శాఖకు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టులకు 12మంది ఈఈలు ఉన్నారు. ఈ అధికారులకు ఒక్కొక్కరికి 200 పనులు కూడా లేవు. అయితే మైనర్ ఇరిగేషన్‌లో ఒక్క ఈఈకే రూ.500 కోట్ల పనులు అప్పగించారు. ఇప్పటికే కుందూ పనులు చేస్తున్న మైనర్ ఇరిగేషన్ అధికారులు ఇవి చాలవన్నట్లు కేసీ కెనాల్ ఆయకట్టు పనులు కూడా దక్కించుకున్నారు. కేసీ కెనాల్, తెలుగుగంగలో పని చేస్తున్న ఈఈలు, డీఈలు, ఏఈలు పనులు లేక గోళ్లు గిల్లుకుంటుంటే మైనర్ ఇరిగేషన్ అధికారులేమో ఐదువేల పనులతో తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు.
పని తక్కువ.. ఆదాయం ఎక్కువ..
పని తక్కువ ఉండటం, ఆదాయం ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ నాయకుల కన్ను కుందూ వెడల్పు పనులపై పడింది. ఈ పనులు కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీకి అప్పగించాలి. అలా చేస్తే నీటి సంఘాల అధ్యక్షులకు ఈ పనులు ఇవ్వాల్సి వస్తుంది. నంద్యాల డివిజన్‌లో అధికంగా నీటి సంఘాల అధ్యక్షులు వైఎస్సార్సీపీకి చెందినవారే ఉన్నారు. వీరికి ఈ పనులను మైనర్ ఇరిగేషన్‌కు అప్పగించారు. ప్రస్తుతం జన్మభూమి కమిటీ సభ్యులు చేస్తున్నారు. సుమారు రూ.50కోట్ల పనులు జరుగుతుండగా..ఒక్కో పనికి 75 మీటర్ల చొప్పున రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు కేటాయిస్తున్నారు. ప్రొక్లెయిన్‌తో ఈ పనిని ఒక్కరోజులో చేసేస్తున్నారు. ఎక్కువ చేసినా ఇసుక వస్తుందనే ధైర్యంతో పనులు సాగిస్తున్నారు.
తప్పుదోవ..
టీడీపీ నేతల సూచన మేరకు..నంద్యాలలోని మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ కీలక అధికారి జిల్లా ఉన్నతస్థాయి అధికారులను తప్పుదోవ పట్టించారు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మైనర్ శాఖలో కూపారు. ఇప్పటికే ఈ అధికారి నీరు–చెట్టు పనుల్లో కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పని చేసిన ఈ శాఖకు చెందిన అధికారి ఈ సీటు కోసం రూ.5కోట్లు ఖర్చుపెట్టడానికి కూడా సిద్ధపడినట్లు సమాచారం. అంతేకాకుండా తాను బదిలీ అయిన స్థానంలో ఇంకా జాయినింగ్ రిపోర్టు తీసుకోలేదంటే ఈ శాఖలో ఎంత అవినీతి జరుగుతుందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment