
ఆమదాలవలస: ‘ఇసుక అక్రమ రవాణా తప్పుడు పని.. అయినా చేయక తప్పడం లేదు’ అని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని తన నియోజకవర్గం ఆమదాలవలసలో సుమారు 400 మంది ట్రాక్టర్ యజమానులు, వారి కుటుంబాలు కాళ్ల వేళ్ల పడుతుంటే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుచెప్పలేదన్నారు. శుక్రవారం ఆమదాలవసలోని అశోక పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో కూన రవికుమార్ మాట్లాడారు.
ట్రాక్టర్ యజమానుల కుటుంబాలు ఇసుక రవాణాతోనే బతుకుతున్నాయని.. అందుకే ర్యాంపుల్లోకి ఏ అధికారి వెళ్లి దాడులు నిర్వహించొద్దని హెచ్చరించినట్టు ఆయన అంగీకరించారు. అభివృద్ధిని చూడలేక కొన్ని పత్రికలు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు తనపై బురద జల్లుతున్నారని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.