సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇన్నాళ్లూ నాణ్యత లేని పనులకు కూడా బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చిన నేతలు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. పనులు చేయకపోయినప్పటికీ బిల్లులు ఇవ్వాల్సిందేనని అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ప్రధానంగా కర్నూలు–కడప (కేసీ) కెనాల్ పరిధిలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రూ.10 కోట్ల పనులకు బిల్లులు ఇవ్వాలంటూ సాగునీటి శాఖ ఇంజినీర్లను బెదిరిస్తున్నారు.
కేసీ కెనాల్ పరిధిలో ఎక్కడపడితే అక్కడ నీరు–చెట్టు పనులు చేసినట్టు రికార్డులు సృష్టించి.. బిల్లులు ఇవ్వాలని హుకుం జారీ చేస్తుండడం గమనార్హం. వాస్తవానికి ఇక్కడ సుమారు రూ.3 కోట్ల మేర పనులు చేసిన నేతలు.. ఏకంగా రూ.10 కోట్లకు బిల్లులు ఇవ్వాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ విధంగా చేయడం కుదరదని ఇంజినీర్లు నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంతో కొంత పనిచేస్తే బిల్లులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని, పూర్తిగా పనిచేయకుండానే ఇస్తే తాము ఇరుక్కోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. అయితే, తాము చెప్పినట్లు చేయకపోతే బదిలీ చేయిస్తామని కూడా అధికార పార్టీ ముఖ్యనేత హెచ్చరించినట్టు తెలుస్తోంది.
సామూహిక సెలవులో...
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండలంలో ఇప్పటికే రూ.3 కోట్ల నీరు–చెట్టు పనులను అధికార పార్టీ నేతలు చేపడుతున్నారు. ఇవి ఏమాత్రమూ నాణ్యత లేకుండా చేస్తున్నారు. లెక్కలన్నీ తప్పులతడకే. రూ.3 కోట్ల పనులు చేస్తున్నా..వారికి ఆశ తీరలేదు. పైగా పనులేవీ నిర్ణీత పద్ధతిలో చేయడం లేదు. అయినప్పటికీ లెక్కలు సరిగానే ఉన్నాయంటూ ఇంజినీర్లపై ఒత్తిళ్లు తెస్తున్నారు.
అక్కడితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా మరో రూ.7 కోట్లు కలిపి మొత్తం రూ.10 కోట్ల పనులు చేసినట్టు లెక్కలు రాయమంటున్నారు. ఈ విధంగా చేయకపోతే బదిలీ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన ఒత్తిళ్లు ఏకంగా చీఫ్ ఇంజినీర్ వరకూ వస్తున్నట్టు సమాచారం. ఏకంగా అధికార పార్టీ ముఖ్యనేత నుంచి కూడా ఒత్తిళ్లు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాము సామూహిక సెలవులో వెళ్లడం మినహా మరో గత్యంతరం లేదని సాగునీటిశాఖ ఇంజినీర్లు వాపోతున్నట్లు సమాచారం.
వారంటేనే మక్కువ!
గత ఏడాది చేపట్టిన నీరు–చెట్టు పనులు కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతలకు దక్కలేదు. పక్కనున్న బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్లకు చెందిన ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ప్రస్తుతం సాగుతున్న రూ.3 కోట్ల పనులు కూడా ఈ కాంట్రాక్టర్‌కే ఇచ్చారు. ప్రస్తుతం మరో రూ.7 కోట్ల పనుల లెక్కలు కూడా ఈ కాంట్రాక్టర్ ఖాతాలోనే వేయాలనేది అధికార పార్టీ ముఖ్యనేత చేస్తున్న ఒత్తిడి.
తమకు ఇవ్వకుండా ఇతరులకు అప్పగించడం ఏమిటని స్థానిక అధికార పార్టీ నేతలు రుసరుసలాడుతున్నారు. మరోవైపు సదరు కాంట్రాక్టర్ కాస్తా ఏకంగా 50 శాతం నుంచి 60 శాతం వరకూ అధికార పార్టీ ముఖ్యనేతకు ఇవ్వాల్సి వస్తోందని, అందువల్ల మొత్తం రూ.10 కోట్లకు బిల్లులు వేయాలని ఇంజినీర్ల వద్ద పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో సాగునీటి శాఖ ఇంజినీర్లు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment