గ్రామ సచివాలయాల్లోనే ఇసుక పర్మిట్లు | Sand permits in village secretariat itself | Sakshi
Sakshi News home page

గ్రామ సచివాలయాల్లోనే ఇసుక పర్మిట్లు

Published Thu, Oct 24 2019 3:53 AM | Last Updated on Thu, Oct 24 2019 10:47 AM

Sand permits in village secretariat itself - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్నచిన్న వాగులు, వంకలు, ఏరులలో లభ్యమయ్యే ఇసుకను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు కొరత తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏరులు, వాగులు వంకలలో ఇసుక తవ్వకాలు, రవాణాను క్రమబద్ధీకరిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకటి నుంచి మూడు ఆర్డర్‌ స్ట్రీమ్స్‌గా పరిగణించే వంకలు, వాగులు, ఏరులలో ఇసుకను స్థానిక అవసరాలకు విస్తృతంగా వాడుకునేలా చూడటం ద్వారా తాత్కాలికంగా కొరతను అధిగమించేందుకు  ఈ చర్యలు ఉపకరిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. గ్రామ సచివాలయాల్లోనే ఇసుక రవాణా పర్మిట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి సూచన మేరకు మార్గదర్శకాలు..
ఇప్పటివరకు ప్రజలు ఎక్కువగా పెద్ద పెద్ద నదుల ఇసుకపైనే ఆధారపడుతూ వస్తున్నారు. వరదల నేపథ్యంలో దీనివల్ల సమస్య ఏర్పడింది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో బుధవారం చర్చించిన అనంతరం ఆయన సూచనల మేరకు భూగర్భగనుల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి మూడు ఆర్డర్‌ స్ట్రీమ్స్‌లో ఇసుక తవ్వకాలు, వినియోగానికి సంబంధించి తాజాగా రూపొందించిన మార్గదర్శకాలు మూడు నెలల పాటు అమల్లో ఉంటాయని, తర్వాత సమీక్షించి అవసరమైన మార్పు చేర్పులు చేస్తామని అందులో స్పష్టం చేసింది. 

రీచ్‌ల గుర్తింపు బాధ్యత కలెక్టర్లకు
భారీగా ఇసుక లభించే గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, పెన్నా లాంటి పెద్ద నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో తవ్వకాలకు వీలు లేనందున ఏర్పడిన కొరతను వంకలు, ఏరులు, వాగుల ద్వారా అధిగమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్‌ టు థర్డ్‌ ఆర్డర్‌ స్ట్రీమ్స్‌గా పేర్కొనే వీటిలోని ఇసుకను ఏపీ వాల్టా చట్టం నిబంధనల మేరకు తవ్వి స్థానిక అవసరాలు తీర్చాలని గనుల శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలవారీగా జిల్లాల్లో ఈ తరహా ఇసుక రీచ్‌లు ఎన్ని ఉన్నాయో గుర్తించే బాధ్యతను కలెక్టర్లకే అప్పగించింది. ఇందులోని ఇసుకను స్థానిక అవసరాలకు (వ్యాపారానికి కాదు) మాత్రమే వినియోగించుకునేలా గ్రామ సచివాలయాల సిబ్బంది పర్యవేక్షిస్తారు.

సరఫరా ఇలా...
ఇసుక కావాల్సిన వారు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేలా గ్రామ సచివాలయంలో సిబ్బందికి డబ్బులు చెల్లించి రవాణా పర్మిట్‌ (ట్రాన్సిట్‌ పాస్‌) తీసుకోవాలి. సచివాలయ అధికారి ఒరిజినల్‌ పర్మిట్‌ను ఇసుక బుక్‌ చేసుకున్న వారికి ఇచ్చి మరో కాపీని సచివాలయంలోనే ఉంచుతారు. ఇసుక రీచ్‌ల పర్యవేక్షణను గ్రామ సచివాలయ ఇన్‌చార్జి సంబంధిత వలంటీర్‌కు అప్పగిస్తారు. సచివాలయంలో డబ్బులు చెల్లించిన వారు రేవు వద్దకు వెళ్లి పర్మిట్‌ను వలంటీర్‌కు ఇచ్చి ట్రాక్టరు, ఎద్దుల బండిలో ఇసుక నింపుకొని తీసుకెళ్లవచ్చు. ఈ పర్మిట్‌ 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నిర్దిష్ట సమయంలోగా ఇసుక తీసుకెళ్లకుంటే పర్మిట్‌ చెల్లుబాటు కాదు. ట్రాక్టర్లలో ఇసుకను రేవు నుంచి 20 కిలోమీటర్లకు మించి తీసుకెళ్లరాదు. ఎవరూ అవసరానికి మించి ఇసుక నిల్వ చేయరాదు. ఇలా చూడాల్సిన బాధ్యత గ్రామ సచివాలయ అధికారులదే. 

పర్మిట్‌ తప్పనిసరి..
ఇసుక రవాణా పర్మిట్‌ పాస్‌ల జారీ కోసం ముద్రించిన ఫారం–ఎస్‌ 3 పుస్తకాలను గ్రామ సచివాలయాలకు ఏపీఎండీసీ సరఫరా చేస్తుంది. ఇసుకను తరలించేందుకు పర్మిట్‌ తప్పనిసరి. పాస్‌ లేకుండా తరలిస్తే జరిమానా విధిస్తారు. ప్రతి పాస్‌కు ఒరిజనల్, డూప్లికేట్‌ అనే రెండు పేపర్లు ఉంటాయి. దీంతో ఏయే గ్రామ సచివాలయం పరిధిలో ఎంత ఇసుక విక్రయించారనే గణాంకాలు పక్కాగా ఉంటాయి. వరదల వల్ల తాత్కాలికంగా ఏర్పడిన ఇసుక సమస్యను పరిష్కరించడం కోసమే భూగర్భ గనుల ఈ ఆదేశాలను జారీ చేసింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 

భారీ వరదలు, వర్షాలతో...
మాఫియాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇసుక తవ్వకం, సరఫరాకు సంబంధించి ప్రభుత్వం సెప్టెంబరు నాలుగో తేదీన కొత్త విధానాన్ని  ప్రకటించింది. ప్రజల అవసరాల మేరకు ఇసుక సరఫరా బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించింది. ఈ సీజన్‌లో నిరంతరాయంగా గోదావరిలో ధవళేశ్వరం వద్ద 55 రోజుల నుంచి,  కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజి వద్ద 71 రోజులుగా వరద కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో 400 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై తుంగభద్రలో భారీగా వరదనీరు పొంగుతోంది. వంశధార, పెన్నాల్లోనూ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వాయుగుండం/ తుపాను ప్రభావం వల్ల వర్షాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రీచ్‌లన్నీ నీటితో నిండిపోయి ఇసుక తవ్వకాలు జరపలేని పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులుగా ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున ఇసుక సమస్య ఉత్పన్నమైంది.

ఐదేళ్లకు సరిపడా నిల్వలు
రాష్ట్రంలో గత పుష్కర కాలంలో ఎన్నడూ లేనన్ని రోజులు గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, వంశధార ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి నీటితోపాటు ఇసుక భారీగా కొట్టుకువచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని నదుల్లో ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలున్నాయి. వరదనీరు తగ్గుముఖం పట్టగానే రీచ్‌లలో తవ్వకాలు ఆరంభించి ప్రజలు కోరినంత ఇసుక సరఫరా చేస్తామని భూగర్భ గనులశాఖ అధికారులు తెలిపారు. ప్రారంభంలో ఏపీఎండీసీ రోజుకు ఐదు వేల టన్నుల ఇసుకను మాత్రమే ప్రజలకు సరఫరా చేసేది. ఇప్పుడు వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ 45 వేల టన్నుల వరకు సరఫరా చేస్తోంది. వరద తగ్గితే రోజుకు లక్ష టన్నులు సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ఏపీఎండీసీ అధికారులు తెలిపారు. ఏపీఎండీసీ సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి ఈనెల 22 వరకు 6,07,311 మెట్రిక్‌ టన్నుల ఇసుకను సరఫరా చేసింది. ఇదే కాలంలో అధికారులు గుంటూరు జిల్లాలో 2 లక్షల టన్నులు, గోదావరి జిల్లాలో 55 వేల టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. 

కొత్త మార్గదర్శకాలతో సమస్య పరిష్కారం
‘రాష్ట్రంలో రోజుకు సగటున 80 నుంచి 85 వేల టన్నుల ఇసుక అవసరం. నిర్మాణ రంగం భారీగా వేగం పుంజుకుంటే రోజుకు సగటున ఇసుక అవసరం లక్ష టన్నులకు చేరవచ్చు. ప్రస్తుతం ఏపీఎండీసీ స్టాక్‌ యార్డుల ద్వారా రోజుకు 45 వేల టన్నుల వరకూ ఇసుక సరఫరా చేస్తోంది. దీన్ని 85 వేల టన్నులకు పెంచితే ఎలాంటి సమస్య ఉండదు. నదుల్లో నీరు తగ్గిపోగానే రేవులన్నీ అందుబాటులోకి వస్తాయి. రోజుకు లక్ష టన్నులు కూడా  ఇసుక సరఫరా చేసేందుకు ఏపీఎండీసీ సిద్ధంగా ఉంది. వరదలు, భారీ వర్షాల వల్ల ఏర్పడిన ఇసుక సమస్య తాత్కాలికమే. దీన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏరులు, వాగులు, వంకలలో, ఇసుక తవ్వకాలు, సరఫరాకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశాం. దీంతో ఇసుక సమస్య పూర్తిగా పరిష్కారం కానుంది’ 
– సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ (ముఖ్యమంత్రి కార్యదర్శి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement