సాక్షి, అమరావతి: ఇసుక బుకింగ్స్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రెండ్రోజుల్లో ఇందుకు సంబంధించిన సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించనుంది. ఇందులో భాగంగా ప్రజలకు అవసరమైనంత ఇసుకను అందుబాటులోకి తీసుకురానుంది. ఆన్‌లైన్ బుకింగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి రావడంతో వాటన్నింటికీ చెక్ పెట్టనుంది. ఇక నుంచి బల్క్ బుకింగ్స్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు అప్ప చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండ్రోజుల క్రితం సీఎం నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు తక్షణమే అమలుచేస్తామని, స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు పెంచుతామని ఆయన వెల్లడించారు. ఆయన ఇంకా ఏం పేర్కొన్నారంటే..
► ఇసుక బుకింగ్ కోసం ప్రతి రోజూ మధ్యాహ్నం పోర్టల్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే బుకింగ్స్ అయిపోతున్నాయి. దీనివల్ల మిగిలిన వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగులకు అనుమతిస్తూ ఉత్తర్వులిస్తున్నాం. మరింత పారదర్శకంగా బుకింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.
► సొంత అవసరాలకే ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయా? లేదా? అన్న విషయం సచివాలయాల ద్వారా నిర్ధారించే వ్యవస్థను ఏర్పాటుచేస్తాం.
► అలాగే, బల్క్ బుకింగ్స్‌కు అనుమతిచ్చే అధికారం జాయింట్ కలెక్టర్లకే ఇచ్చాం.
► ప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిని మూడు లక్షల టన్నులకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
► రానున్న వర్షాకాలం అవసరాల కోసం మొత్తం డెబ్బై లక్షల టన్నుల ఇసుకను నిల్వచేస్తున్నాం.
వలస కూలీలు వెళ్లిపోవడంతో ఇబ్బందులు
► గతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఎక్కువగా ఇసుక తవ్వకాలు జరిపేవారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా పనులు నిలిపివేయడంతో కూలీల్లో అధిక శాతం స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు.
► దీంతో ప్రస్తుతం స్థానికంగా వున్న కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరపాల్సిరావడంవల్ల కొంత సమస్య ఏర్పడింది.
► ఇసుక తవ్వకాల్లో నైపుణ్యం వున్న వలస కూలీలను తిరిగి రప్పించేందుకు కలెక్టర్ల ద్వారా ప్రయత్నిస్తున్నాం.
► పట్టాభూముల్లో ఇసుక నాణ్యతను టెక్నికల్ టీం పరిశీలించిన తరువాతే అనుమతిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment