సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని స్టాక్ యార్డుల నిండుగా ఇసుక నింపాలని, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి కోరిన చోటుకు వెంటనే చేరవేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే నెల 5వ తేదీ నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే 102 ఇసుక రీచ్‌లను 47 షెడ్యూళ్లుగా విభజించి (ఒక్కో దానిలో రెండు మూడు రీచ్‌లు ఉండేలా) స్టాక్ యార్డులకు ఇసుక చేర వేసేందుకు జిల్లా యూనిట్‌గా టెండర్లు, రివర్స్ టెండర్లు నిర్వహించింది. సింగిల్ బిడ్లు వచ్చిన వాటిని రద్దు చేసి వీటితో కలిపి అసలు బిడ్లు రాని వాటికి తిరిగి టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. పారదర్శకత, ప్రజలకు సరసమైన ధరకు ఇసుక సరఫరా, ప్రజా ప్రయోజన కార్యక్రమాల కోసం సర్కారుకు రాబడి లక్ష్యాలుగా ఇసుక విషయంలో కొత్త విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా, లోప రహితంగా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారు.
కుట్రలు, కుతంత్రాలు సాగనివ్వొద్దు
వచ్చే నెల 5వ తేదీ నుంచి ఎవరు ఇసుక బుక్ చేసుకున్నా తక్షణమే సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వం అధికారులకు మార్గనిర్దేశం చేసింది. నూతన పాలసీని అత్యంత పారదర్శకంగా, ఏమాత్రం అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించింది. రాష్ట్రంలో టన్ను ఇసుక కూడా దుర్వినియోగం కావడానికి వీల్లేకుండా సరసమైన ధరలకు ప్రజలకు అందించాలన్నదే సీఎం ఉన్నతాశయమని, తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా ప్రయోజనాలకు వినియోగించడమే లక్ష్యమని పేర్కొంది. ‘గత ఐదేళ్లు మాఫియాగా మారి ఇసుక విక్రయాల ద్వారా దండుకున్న వారికి ప్రస్తుత సర్కారు కొత్త విధానం తేవడం సుతరామూ ఇష్టం లేదు. అందువల్ల ఈ మాఫియా గ్యాంగులు తెరవెనుక ఉండి టెండర్లను దెబ్బతీయాలని, ఇసుక సరఫరాలో ప్రభుత్వాన్ని విఫలం చేయాలని కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నాయి. టన్ను ఇసుకను రీచ్‌లో తవ్వి ట్రాక్టర్‌కు లోడ్ చేసి స్టాక్ యార్డుకు తరలించి అన్‌లోడ్ చేసి, తిరిగి వినియోగదారులకు రవాణా చేసేందుకు వాహనానికి లోడ్ చేయడం కోసం కేవలం పది పైసలకే టెండరు దాఖలు చేయడం ఇందుకు నిదర్శనం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాఖలైన టెండర్లు ఈ కోవలోనివేనని గుర్తించి ముందుకెళ్లండి. ఎవరి ఆటలూ సాగనీయొద్దు. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లండ’ని ప్రభుత్వం పేర్కొంది.
కొత్త రీచ్‌లకు త్వరితగతిన అనుమతులు
ప్రస్తుతం గుర్తించిన 102 ఇసుక రీచ్‌లతోపాటు కొత్త రీచ్‌లను గుర్తించి అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు త్వరితగతిన తీసుకునేందుకు చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే అనుమతులు ఉన్న రీచ్‌లలో కొన్ని చోట్ల భారీ వర్షాల వల్ల నదులు ప్రవహిస్తున్నందున ఇసుక తీయలేని పరిస్థితి ఉందని, అందువల్ల మిగిలిన చోట్ల ఇసుకను స్టాక్ యార్డులకు చేరవేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పింది. ‘రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాల అమరిక త్వరగా పూర్తి చేయాలి. జీపీఎస్ పరికరాలు అమర్చుకున్న ప్రతి వాహనానికి ఏపీఎండీసీలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ఎక్కడా ఏకస్వామ్యం ఉండరాదు. జిల్లా యూనిట్‌గా ఇసుక రవాణా బాధ్యతలు ఒకే సంస్థకు గంపగుత్తగా అప్పగించొద్దు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక రవాణా చేసేందుకు జీపీఎస్ అమర్చుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏ వాహనమైనా అనుమతించండి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం కోసం వాహనాలకు జీపీఎస్ యంత్రాలు తప్పనిసరిగా అమర్చాలనే నిబంధన పెడుతున్నాం’ అని ప్రభుత్వం పేర్కొంది.
సర్వసన్నద్ధం దిశగా ఏర్పాట్లు
ఇసుక కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకే కాకుండా నూతన విధానం కొలిక్కి వచ్చే వరకు లోటుపాట్లను సవరించి గాడిన పెట్టేందుకు ప్రతిరోజూ సమీక్షించాలని సీఎం జగన్ తన ముఖ్య సలహాదారు అజేయకల్లంను ఆదేశించారు. సీఎం ఆదేశం మేరకు ఇసుక పాలసీ అమలుకు సన్నద్ధత, లోటుపాట్ల సవరణ, ఇంకా చేయాల్సిన ఏర్పాట్లపై భూగర్భ గనులు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారులతో అజేయ కల్లం సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా తెలియజేస్తే ప్రభుత్వం పరిష్కార మార్గాలు సూచిస్తుందని, లోపాలు, విమర్శలకు తావులేని విధంగా ఇసుక సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వరదల వల్ల ప్రస్తుతం 70 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు ప్రారంభించి స్టాక్ యార్డులకు చేరవేస్తామని, నీరు తగ్గగానే మిగతా 32 రీచ్‌లలో కూడా తవ్వకాలు సాగిస్తామని అధికారులు వివరించారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 30 – 32 స్టాక్ యార్డులతో ఇసుక సరఫరా ప్రారంభించి తర్వాత వీటి సంఖ్య క్రమంగా పెంచుతామని చెప్పారు.
స్టాక్ యార్డుల నుంచి సరఫరా కోసం 5 జిల్లాల్లో టెండర్లు
స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులకు ఇసుకను టిప్పర్లు, లారీల్లో తరలించడం కోసం జిల్లా యూనిట్‌గా టెండర్లు, రివర్స్ టెండర్లు నిర్వహించగా రెండు జిల్లాల్లో సింగిల్ టెండర్లు వచ్చాయి. వీటిని ఏపీఎండీసీ తిరస్కరించింది. మరో మూడు జిల్లాల్లో గిట్టుబాటుకాని రేట్లకు బిడ్లు దాఖలయ్యాయి. దీంతో కాంట్రాక్టర్లతో అధికారులు చర్చించి వీటిని రద్దు చేశారు. దీంతో విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఇసుక రవాణాకు తిరిగి టెండర్లు ఆహ్వానిస్తూ 29 తుది గడువుగా ఏపీఎండీసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ట్రాక్టర్లకు టెండర్లు
స్టాక్ యార్డుల నుంచి 30 కిలోమీటర్ల లోపు దూరానికి తక్కువ పరిమాణంలో ఇసుక అవసరమైన వారికి సరఫరా కోసం ట్రాక్టర్లు వినియోగించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది. ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తోంది. కనీసం పది ట్రాక్టర్లు సొంతంగా కలిగి ఉన్న, లీజుకు తీసుకుని ఉన్న వారు టెండర్లలో పాల్గొనడానికి అర్హులు. టెండర్ల దాఖలుకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉంది. ఈ మూడు టెండర్లకు సంబంధించి నిబంధనలు, ఇతర వివరాల కోసం ఏపీఎండీసీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
సింగిల్ టెండర్లు రద్దు
రీచ్‌లలో ఇసుక తవ్వకం, ట్రాక్టర్లకు కూలీలతో లోడింగ్, సమీపంలోని స్టాక్ యార్డుకు రవాణా, అక్కడ అన్‌లోడింగ్, తిరిగి వినియోగదారులకు చేరవేసేందుకు లోడింగ్‌కు 102 రీచ్‌లను 47 షెడ్యూళ్లుగా విభజించి జిల్లా యూనిట్‌గా ఏపీఎండీసీ ఈ– టెండర్లు నిర్వహించింది. వీటిలో అతి తక్కువకు కోట్‌చేసిన ఎల్–1ను గరిష్ట మొత్తంగా నిర్ణయించి రివర్స్ యాక్షన్ (రివర్స్ టెండర్లు) జరిపింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో రెండేసి షెడ్యూళ్లకు సింగిల్ టెండర్లు రావడంతో రద్దు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో రెండు షెడ్యూళ్లకు అధిక మొత్తాల్లో బిడ్లు రావడంతో తిరస్కరించింది. అనంతపురం జిల్లాలో ఒకదానికి, తూర్పు గోదావరి జిల్లాలో రెండింటికి బిడ్లు రాలేదు. దీంతో మొత్తం తొమ్మిది షెడ్యూళ్లకు మళ్లీ టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 29వ తేదీలోగా బిడ్లు దాఖలు చేయాలని అందులో పేర్కొంది.
97.82 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సిద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా 97.82 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. ఈ మేరకు జిల్లాలు, రీచ్‌ల వారీగా ఇసుక నిల్వలను ప్రభుత్వం గుర్తించింది. నదుల్లో 90 ఓపెన్ రీచ్‌లు, 31 డీసిల్టేషన్ కేంద్రాలు, 82 పట్టా భూముల్లో ఎక్కడ ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉన్నాయో గనుల శాఖ గుర్తించి ఏపీఎండీసీకి పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment