సాక్షి, అమరావతి: ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడం, ప్రజలపై అదనపు భారం పడకుండా రాబడి పెంపు లక్ష్యంగా ఇసుకపై కొత్త విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగిన ఇసుక దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రస్తుత విధానాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం మేరకు అన్ని రకాలుగా ఉత్తమ విధానం రూపకల్పనపై వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులను అధికారులు అధ్యయనం చేశారు. వీటన్నింటినీ సమీక్షించిన అనంతరం తెలంగాణలో అమల్లో ఉన్న విధానమే ఉత్తమమైనదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. చిన్నచిన్న లోపాలను సరిచేస్తే తెలంగాణ విధానం అత్యుత్తమమైనదని భూగర్భ గనుల శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డికి కూడా ప్రాథమికంగా తెలియజేశారు.
17న మంత్రుల సమావేశం
ఇసుకపై కొత్త పాలసీ అత్యంత కీలకమైన అంశం కావడంతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారు. ఇసుక మాఫియా నియంత్రణలో భాగస్వాములు కావాల్సిన వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించి కొత్త విధానంపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్త విధానం రూపకల్పనపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌లతో ఈనెల 17వ తేదీన సమావేశం కానున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్‌సింగ్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ , ఆర్థిక శాఖ కార్యదర్శి, గనుల శాఖ కార్యదర్శి, గనుల శాఖ ఉన్నతాధికారులను కూడా దీనికి హాజరు కావాలని ఆదేశించారు. తెలంగాణ గనుల శాఖ ఉన్నతాధికారులు, ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించారు.
ఉన్నవాటిలో తెలంగాణ విధానమే ఉత్తమం
వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానాల్లో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న పద్ధతి ఉత్తమంగా ఉందని భూగర్భ గనుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణలో ఇసుక క్వారీలు అక్కడి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇసుక సరఫరా బాధ్యతను తెలంగాణ సర్కారు టీఎస్‌ఎండీసీకి అప్పగించింది. క్వారీల నుంచి టీఎస్‌ఎండీసీ ఇసుకను స్టాక్ యార్డులకు తరలిస్తుంది. స్టాక్ యార్డుల నుంచి ఇసుకను విక్రయిస్తుంది. ఇసుక కావాల్సిన వారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. స్టాక్‌యార్డులో క్యూబిక్ మీటరు (ఒకటిన్నర టన్ను) ఇసుక ధర రూ. 600గా నిర్ణయించారు.
ఇసుక రవాణా వాహనదారులంతా టీఎస్‌ఎండీసీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నారు. వెబ్‌సైట్‌లో లారీ యజమానుల ఫోన్ నంబర్లు ఉంటాయి. ఇసుక కావాల్సిన వారు వాహనదారులకు ఫోన్ చేసి మాట్లాడుకుని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఇంటికే సరఫరా చేస్తారు. ఈ విధానంలోని మంచి చెడ్డలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని పరిశీలించి లోపాలను సరిదిద్ది ఉత్తమ పాలసీ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే టీఎస్‌ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్, గనుల శాఖ సంచాలకులను ఈ నెల 17న జరిగే ఉన్నత స్థాయి సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలంగాణ గనుల శాఖ సంచాలకులు సుశీల్‌కుమార్ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ గనుల శాఖ సంచాలకులు) పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment