ఇంటి నుంచే ఇసుక బుకింగ్‌ | Special website available for Sand booking in Online | Sakshi
Sakshi News home page

నెట్టింట్లో ఇసుక!

Published Sat, Nov 16 2019 3:45 AM | Last Updated on Sat, Nov 16 2019 8:41 AM

Special website available for Sand booking in Online - Sakshi

ఇసుక కావాలంటే ఇక ఎక్కడికో పరుగులు తీయాల్సిన పనిలేదు. ఇంటర్నెట్‌ సదుపాయం కలిగిన స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌ ఉంటే చాలు కాలు కదపకుండా ఎక్కడ నుంచైనా ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కంప్యూటర్‌పై స్వల్ప పరిజ్ఞానం ఉన్న వారు కూడా సులభంగా ఇసుక బుక్‌ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించారు.   
 – సాక్షి, అమరావతి

సాక్షి, అమరావతి: ఇసుక అక్రమార్కులకు కఠిన శిక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా ఇసుక నిల్వ, బ్లాక్‌ మార్కెటింగ్, ఇసుకతో వ్యాపారం చేసిన వారికి రూ. 2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ చిన్న తరహా ఖనిజ రాయితీల నిబంధనలను సవరిస్తూ భూగర్భ గనుల శాఖ కార్యదర్శి రాంగోపాల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక సరఫరాపై ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థను నోడల్‌ ఏజెన్సీగా నియమించిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఇసుకను అక్రమంగా తవ్వి రవాణా చేస్తున్నారని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కొందరు ఏపీఎండీసీ వెబ్‌సైట్‌ నుంచి నకిలీ ఐడీలతో మోసపూరితంగా ఇసుక బుక్‌ చేసుకుని బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధించేలా నిబంధనావళిని సవరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పరిమితికి మించి ఇసుక నిల్వ చేస్తే స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తారు. అపరాధ రుసుముతోపాటు చట్ట ప్రకారం రెండేళ్ల వరకు శిక్ష పడుతుంది.  

ఇసుక బుకింగ్‌ ఇలా..
- ఆన్‌లైన్‌లో sand.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే ‘వెల్‌కమ్‌ టు ఆంధ్రప్రదేశ్‌ శాండ్‌’ అని  ఉంటుంది. దాని కిందే జనరల్‌ బుకింగ్‌ / బల్క్‌ కన్జూమర్‌ లాగిన్‌ అని ఉంటుంది. 
సాధారణ వినియోగదారులు ‘జనరల్‌’ అనే కాలమ్‌ కింద, అధిక పరిమాణంలో ఇసుక కావాల్సిన వారు ‘బల్క్‌ కన్జూమర్‌ లాగిన్‌’ కింద రిజిస్ట్రేషన్‌ అనే చోట్ల క్లిక్‌ చేయగానే మొబైల్‌ నంబరు అనే కాలమ్‌ ఉంటుంది. 
అందులో మొబైల్‌ నంబరు టైప్‌ చేసి సబ్మిట్‌ అని క్లిక్‌ చేస్తే ఆరు అంకెల వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. ఆ నంబరును పాస్‌వర్డ్‌ అనే చోట టైప్‌ చేసి సబ్మిట్‌ అని క్లిక్‌ చేస్తే ఆధార్‌ నంబరు, జిల్లా, పట్టణం/ గ్రామం,  చిరునామా తదితర కాలాలు కనిపిస్తాయి. 
అన్ని కాలాలను సక్రమంగా భర్తీ చేసి సబ్‌మిట్‌ అని క్లిక్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తైనట్లు సమాచారం వస్తుంది. వెంటనే మొబైల్‌ నంబరు అనే కాలమ్‌లో ఫోన్‌ నంబరు టైప్‌ చేసి దాని కింద సెండ్‌ ఓటీపీని క్లిక్‌ చేస్తే మొబైల్‌కు ఆరు అంకెల నంబరు వస్తుంది.
దీన్ని టైప్‌ చేసి సెండ్‌ ఓటీపీ అని నొక్కితే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తైనట్లు మెసేజ్‌ వస్తుంది. వెంటనే యూజర్‌ ఐడీ, ఐపీ నంబరు కనిపిస్తాయి. 

ఎంత కావాలంటే అంత..
శాండ్‌ ఆర్డర్‌లోకి వెళ్లి ప్రొసీడ్‌ అని క్లిక్‌ చేయాలి. అక్కడ ఎన్ని టన్నులు, ఎక్కడి (స్టాక్‌ యార్డు) నుంచి ఎక్కడకు డెలివరీ చేయాలి? వివరాలు నమోదు చేయాలి. 
టన్ను రూ.375 చొప్పున ఎంత డబ్బు చెల్లించాలో కూడా వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. అన్నీ నమోదు చేసిన తర్వాత చెక్‌ చేసుకుని సబ్మిట్‌ అని క్లిక్‌ చేస్తే ‘పేమెంట్‌ గేట్‌వే’ అని కనిపిస్తుంది. నచ్చిన విధానంలో ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాలి. 
ఈ రసీదు సంబంధిత స్టాక్‌ యార్డులో అందచేసి ఇసుక తీసుకెళ్లవచ్చు. స్టాక్‌ యార్డుల దగ్గరే వాహనాలు కూడా ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే ప్రస్తుతం ఇసుక బుకింగ్‌ అందుబాటులో ఉంది. ఇలా ఇసుక బుక్‌ చేసుకున్న వారు మరుసటి రోజు ఇసుకను స్టాక్‌యార్డుల నుంచి వాహనాల్లో తీసుకెళ్లవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement