ప్రభుత్వానికి నివేదించిన అధికార యంత్రాంగం
ఇసుక బ్లాక్ మార్కెటింగ్, దళారుల అక్రమ కార్యకలాపాలే ప్రధాన కారణం
40 లక్షల మంది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం
గత ఆర్నెళ్లలో రూ.300 కోట్లకుపైగా జీఎస్టీ ఆదాయం తగ్గుదల
ఇసుక డిమాండ్‌లో సగం కూడా సరఫరా చేయలేకపోయాం
ఉచితం కాగితాల్లోనే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం కుప్పకూలిపోయిందని, ఇందుకు ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్, నిర్వహణ లోపాలు, అక్రమ కార్యకలాపాలే కారణమని అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ఇసుక ఉచితం ప్రకటనలకే పరిమితమని, ధరలు మాత్రం భారీగా పెరిగాయని పేర్కొంది. ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలి వెళ్లడం, అక్రమ విక్రయాల కారణంగా డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయలేకపోతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
సుమారు 40 లక్షల మంది కార్మికులకు జీవనోపాధి కల్పించే నిర్మాణ రంగం కుప్పకూలిపోవడానికి ఇసుక ధరలు భారీగా పెరగడంతో పాటు లభ్యత లేకపోవడమేనని కారణమని తేల్చారు. ఈ ఆర్థిక ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి నిర్మాణ రంగంలో జీఎస్‌టీ ద్వారా రూ.1,260 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.955 కోట్లు మా త్రమే సమకూరినట్లు ప్రభుత్వానికి నివేదించారు. రూ.300 కోట్లకుపైగా ఆదాయం పడిపోవడానికి కారణం నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోవడమేనని, ఇసుక లభ్యత లేకపోవడం తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు.
గత ఆర్నెళ్లలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకకు డిమాండ్ ఉండగా కే వలం 32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి నట్లు తెలిపారు. ఇసుక రీచ్‌లను దక్కించుకునేందుకు తక్కువ ధరకు కోట్ చేసిన ప్రైవేట్ ఏజెన్సీలు అక్రమాలకు తెరతీశాయన్నారు. గత 30 రోజుల్లో సగటున రోజుకు 26, 000 మెట్రిక్ టన్నుల చొప్పున 5.62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇసుక సరఫరా చేసినట్లు చెబుతున్నారు.
వాస్తవానికి రోజుకు 80,000 నుంచి 90,000 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా ఇసుక కొరతకు గత సర్కారు విధానాలే కారణమంటూ ప్రభుత్వ పెద్దలు నిందలు మోపడంపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.
గత ప్రభుత్వంలో సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం పెరుగుదల
ఇసుక కొరతతో లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతిందని, నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోయాయని ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని అధికారుల నివేదికలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019–20లో జీఎస్‌టీ రూపంలో రూ.974 కోట్లు ఆదాయం రాగా 2023–24 నాటికి రూ.2,083 కోట్లకు పెరిగిందని, అంటే సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం మేర పెరిగిందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment