‘గని’లో ఏదీ పని? | 'Mine' nothing in the work? | Sakshi
Sakshi News home page

‘గని’లో ఏదీ పని?

Published Thu, Nov 7 2013 2:21 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

'Mine' nothing in the work?

 

=మూడేళ్లుగా జేడీ పోస్టు ఖాళీ
=విధుల్లేక గోళ్లు గిల్లుకుంటున్న ఉద్యోగులు

 
సాక్షి, విశాఖపట్నం: ఐదు జిల్లాల పర్యవేక్షణ కోసం ఏర్పాటయిన భూగర్భ గనులశాఖ జోనల్ జాయింట్ డెరైక్టర్ కార్యాలయ సిబ్బందికి పని లేకుండా పోయింది. మూడేళ్లుగా జాయింట్ డెరైక్టర్ పోస్టును రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఐదు నెలల క్రితం ఓ అధికారిని నియమించినా తాజాగా ఆయననూ హైదరాబాద్‌కే  బదిలీ చేశారు. ఉన్నతాధికారి లేనప్పుడు ఉత్తర, ప్రత్యుత్తరాలెందుకని ఐదు జిల్లాల అధికారులు పంపించడం మానేశారు. దీంతో ఇక్కడ సిబ్బంది గోళ్లు గిల్లుకుంటున్నారు.

ఊరకే జీతాలు తీసుకుంటున్నామన్న అసంతృప్తితో ఉన్నారు. పని కల్పించండి మహాప్రభో అని వేడుకుంటున్నారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్బ గనుల అనుమతులు, అక్రమాలు, అధికారుల పనితీరును పర్యవేక్షించేందుకు ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జేడీ, అసిస్టెంట్ మైనింగ్ ఆఫీసర్, మినరల్ రెవెన్యూ ఆఫీసర్, సూపరింటెండెం ట్, ముగ్గురు రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు డేటా ఆపరేటర్లు, మరొక అటెండర్ పని చేస్తున్నారు.

వాస్తవానికి ఐదు జిల్లాల్లో అనుమతుల్చిన మైనింగ్ లీజులను పరిశీలించడం, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం. గనుల అక్రమ రవాణాదార్లపై చర్యలు తీసుకోవడం, వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపడం, అధికారుల పనితీరును  పర్యవేక్షణ, బాధ్యతాయుతంగా పనిచేయని అధికారులపై చర్యలకు సిఫార్సు చేయడం వంటి విధులు నిర్వర్తించాలి. కానీ మూడేళ్లుగా ఈ బాధ్యతలేవీ చేపట్టడం లేదు. జేడీ స్థాయి అధికారిని నియమించకుండా ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచే పర్యవేక్షిస్తున్నారు.

ఐదు నెలల క్రితం రఫీ అహ్మద్ అనే అధికారిని జేడీగా నియమించారు. కానీ హెడ్ ఆఫీస్ అవసరాలకని నాలుగు నెలలు పాటు హైదరాబాద్‌లోనే ఉంచేశారు. నెల రోజులే ఇక్కడ పనిచేసిన ఆయనను ఇటీవల హైదరాబాద్ బదిలీ చేసేశారు. ఆయన స్థానంలో వేరొకర్ని నియమించలేదు. దీంతో లీజుల అనుమతులు, అక్రమాలు, అక్రమ రవాణా తదితర పర్యవేక్షణ చేసే నాధుడు లేకుండా పోయాడు.

జేడీ లేరన్న కారణంతో దిగువ స్థాయి అధికారులు ఉత్తర, ప్రత్యుత్తరాలు జరపడం మానేశారు. దీంతో ఉద్యోగులు చేసేందుకు పని లేకుండా ఉన్నారు. రెగ్యులర్ జేడీని నియమించి ఇక్కడే ఉంచాలని కోరుతున్నారు. మరోవైపు కార్యాలయం జీతాలు, అద్దెలు, నిర్వహణ వ్యయం కింద దాదాపు రూ.2.5 లక్షలు ప్రతీ నెలా ఖర్చవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement