రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో ప్రాచుర్యం పొందిన వంద పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ మధుసూదనరెడ్డి తెలిపారు.
జిల్లాలోని అరకు, మారేడుమిల్లి, రంపచోడవరం, గుడిసె, చింతపల్లి తదితర ప్రాంతాలను ఆయన బుధవారం సందర్శించారు. స్థానిక అటవీక్షేత్ర కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. పర్యాటకులు బస చేసేందుకు సౌకర్యవంతమైన కాటేజీలు, ట్రెక్కింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆదివాసీల సేవలు ఉపయోగించుకుని వారికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పర్యాటక ప్రదేశాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
పెద్ద పులుల స్థావరంగా నల్లమల:
శ్రీశైలం ప్రాజెక్టు పరిసరాల్లో నల్లమల అడవులు పెద్ద పులుల స్థావరంగా మారిందని చెప్పారు. గతంలో ఇక్కడ 45 పులులు మాత్రమే ఉండగా, ఇప్పుడు వీటి సంఖ్య 75కు పెరిగిందన్నారు. పాపికొండల ఏరియాలో గతంలో రెండు పులులు ఉండగా, ప్రస్తుతం మరో రెండు పులులు చేరాయన్నారు. మారేడుమిల్లి, రంపచోడవరం తదితర అటవీ ప్రాంతాల్లో చిరుతల సంచారం బాగా పెరిగిందని చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణకు అటవీ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. స్క్వాడ్ డీఎఫ్‌వో త్రిమూర్తులరెడ్డి, స్థానిక ఫారెస్ట్ రేంజర్ అబ్బాయిదొర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment