భూ గ్రహం వేగంగా వేడెక్కుతోంది. మానవ అనుచిత ప్రవర్తన వాతావరణ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. పర్యావరణ క్రియాశీలతలో పెనుమార్పులు తీసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అడవులు ధ్వంసం కావటం గ్లోబల్ వార్మింగ్ సంకేతాలను బలంగా వినిపిస్తోంది. భూమిపై కర్బన ఉద్గారాల్లో దాదాపు 15 శాతం అటవీ నిర్మూలన కారణంగానే వెలువడుతుండగా.. ఏటా 10 మిలియన్ హెక్టార్లలో ఉష్ణమండల అడవులు తరిగిపోతున్నాయి. దీనిని 2030 నాటికి అరికట్టకుంటే గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగకుండా పరిమితం చేయడం అసాధ్యమని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక హెచ్చరిస్తోంది. – సాక్షి, అమరావతి
ఉష్ణ మండలంలో 2002 నుంచి 60 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ అడవుల్ని కోల్పోయామని.. ఇది ఫ్రాన్స్ దేశ పరిమాణానికి సమానమని డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ఉష్ణ మండల అడవుల నరికివేతలో 80 శాతం కంటే ఎక్కువ వ్యవసాయం కోసం చేస్తున్నట్టు గుర్తించింది. 2021లోనే 11.0 మిలియన్ హెక్టార్లలో చెట్లు అంతరించిపోగా.. ఇందులో 3.75 మిలియన్ హెక్టార్లు ఉష్ణ మండల ప్రాథమిక వర్షారణ్యాల ధ్వంసం ఫలితంగా 2.5 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయి. ఇవి భారతదేశంలో వెలువడే వార్షిక శిలాజ ఇంధన ఉద్గారాలతో సమానంగా ఉండటం గమనార్హం. గ్రీన్‌హౌస్ వాయువులు, కర్బన ఉద్గారాలను 2030 నాటికి కనీసం 43 శాతానికి, 2035 నాటికి 60 శాతానికి తగ్గించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.
భూతాపం కట్టడి చేయకపోతే..
పారిశ్రామిక విప్లవానికి ముందునాటి పరిస్థితులతో పోలిస్తే ప్రపంచంలో సగటున 1.15 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంటే.. భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే పెరగకుండా కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతాయి. ఫలితంగా తీరప్రాంత దేశాలైన భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చాలా ప్రమాదం.
కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్ ఏంజిలిస్, న్యూయార్క్, బ్యూనస్ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు వాటిల్లుతుంది. మునుపటి శతాబ్దాల కంటే 1900 నుంచి ప్రపంచ సగటు సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ మించి పెరగకుండా పరిమితం చేయగలిగితే.. వచ్చే 2 వేల సంవత్సరాలలో ప్రపంచ సగటు సముద్ర మట్టం 2 నుంచి 3 మీటర్లు పెరుగుతుంది.
2 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలతో సముద్రాలు 6 మీటర్లు, 5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలతో సముద్రాలు 22 మీటర్లు వరకు పెరగవచ్చు. దీనివల్ల లోతట్టు ప్రాంతాలు, మొత్తం దేశాలు జలసమాధి అవుతాయి. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది.
ఇది భూ తాపంపై 1.50 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగకుండా ఉంచేందుకు అడవులను కాపాడాలని డబ్ల్యూఈఎఫ్ సూచిస్తోంది. ఇందుకు 100 బిలియన్ల డాలర్ల నుంచి 390 బిలియన్ల డాలర్ల వరకు ఖర్చవుతుందని భావిస్తోంది. ప్రపంచ జీడీపీలో సగాని కంటే ఎక్కువ.. అంటే దాదాపు 44 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక విలువ ప్రకృతిపై ఆధారపడి ఉంటుందని.. దాదాపు 1.60 బిలియన్ల మంది ప్రజలు ఆహారం, నీరు, కలప, ఉపాధి కోసం అడవులపై ఆధారపడుతున్నారని వెల్లడించింది.
మన దేశంలో ఏటా
గ్రీస్ దేశమంత అడవికి నష్టం
2021లో భారతదేశంలో వెలువడిన ఇంధన ఉద్గారాల కంటే వర్షారణ్యాల ధ్వంసం ద్వారా వచ్చిన కార్బన్‌డైఆౖMð్సడ్ ఎక్కువ ఉన్నట్టు నివేదిక చెబుతోంది. ఇక్కడ ఏటా జరిగే అటవీ నిర్మూలన శాతం గ్రీస్ దేశ పరిమాణానికి దగ్గరగా ఉందని వివరించింది. అటవీ నిర్మూలన, మానవ నివాసాల విస్తరణ, వ్యవసాయం, అడవుల్లో అధికంగా పశువులను మేపడం వంటి కారణాలతో మానవ, జంతువుల మధ్య దాడులకు దారి తీస్తున్నాయి.
అడవులు తగ్గిపోతుండటంతో వన్యప్రాణులు తమ భూ భాగాలను కోల్పోతున్నాయి. ఆహారం, ఆశ్రయం లేకపోవడంతో పెద్దఎత్తున బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని మూడు ప్రధాన పులుల అభయారణ్యాలలో చుట్టుపక్కల మానవ–జంతు సంఘర్షణ పెరిగినట్టు నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment