సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కీటకాల పాత్ర కీలకం. మానవాళి కంటే దాదాపు 17 రెట్లు అధికంగా ఉండే కీటకాల జనాభా ప్రస్తుతం ముప్పు ఎదుర్కొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం కీటక జాతులు తగ్గిపోతున్నాయని, మూడో వంతు అంతరించిపోతున్నట్లు బయోలాజికల్ కన్జర్వేషన్ నివేదిక వెల్లడిస్తోంది. జనావాసాల పెరుగుదల, విచ్చలవిడిగా పురుగు మందులు, ఎరువుల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా మిత్ర కీటకాలు నశిస్తున్నాయి. పర్యావరణ నిపుణులు దీన్ని ‘కీటకాల అపోకలిప్స్’గా అభివర్ణిస్తున్నారు.
ఆహార చక్రంలో ఎంతో కీలకం
ప్రపంచవ్యాప్తంగా 5.5 మిలియన్ జాతుల కీటకాలు ఉన్నట్లు అంచనా వేయగా ఇప్పటివరకు కేవలం ఒక మిలియన్ జాతులను మాత్రమే గుర్తించారు. భూమిపై జంతు జాలంలో 80 శాతం కీటకాలే ఉండటం గమనార్హం. ఆహార పంటల పరాగ సంపర్కంతో పాటు తెగుళ్ల నియంత్రణ వ్యవస్థలుగా, భూమిని రీసైక్లింగ్ చేసే డీకంపోజర్లుగా పర్యావరణాన్ని కీటకాలు కాపాడుతున్నాయి.
ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ నివేదిక ప్రకారం భూమిపై ఉన్న 2.50 లక్షల రకాల పుష్పించే మొక్కలను పరాగ సంపర్కం చేయడంలో లక్ష కంటే ఎక్కువ కీటక జాతుల పాత్ర కీలకం. ఇందులో తేనెటీగలు, కందిరీగలు, సీతాకోక చిలుకలు, ఈగలు, బీటిల్స్ లాంటివి ఉన్నాయి. ఆహార చక్రంలో కీలక పాత్ర పోషించే కీటకాలు ఒక్క అమెరికాలోనే ఏటా 70 బిలియన్ డాలర్ల విలువైన సేవలను అందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏటా 1–2 శాతం క్షీణత..
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 నుంచి 2 శాతం కీటకాలు నశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత 30 ఏళ్లలో కీటకాల సంఖ్య దాదాపు 25 శాతం తగ్గింది. పక్షులు, క్షీరదాలు, సరీసృపాల కంటే కీటకాలు అంతరించిపోయే రేటు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. కీటకాల సంఖ్య క్షీణిస్తే ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 35 శాతం ఆహార పంటలకు పరాగ సంపర్కమే ఆధారం కావడం కీటకాల మనుగడ ఆవశ్యకతను సూచిస్తోంది.
♦ మానవులు దాదాపు 2 వేల కీటకాలను ఆహారంగా భుజిస్తారు.
♦ 75 శాతం కంటే ఎక్కువ కీటకాలు పరాగ సంపర్కంతో ఆహార చక్రాన్ని పరిరక్షిస్తాయి.
♦ దీని విలువ ఏటా 577 బిలియన్ల డాలర్లు ఉంటుంది.
♦ ప్రకృతిలో దాదాపు 80 శా>తం అడవి మొక్కలు పరాగ సంపర్కం కోసం కీటకాలపై ఆధారపడతాయి.
♦ గత 150 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 2.50 లక్షల నుంచి 5 లక్షల కీటక జాతులు అంతరించాయి.
Comments
Please login to add a commentAdd a comment