చెవిలో ‘పువ్వు’! | Triantha Occidentalis Digests Insects That Are Trapped By Sticky | Sakshi
Sakshi News home page

చెవిలో ‘పువ్వు’!

Published Tue, Oct 12 2021 5:22 AM | Last Updated on Tue, Oct 12 2021 5:24 AM

Triantha Occidentalis Digests Insects That Are Trapped By Sticky - Sakshi

అదో అడవి మొక్క. తెలుపు, లేత ఆకుపచ్చ రంగు పూలతో.. చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే.. అదో మాంసాహారి. ఈగల వంటి చిన్న చిన్న కీటకాలను పట్టేసుకుని ఆరగించేస్తుంది.. దానిపేరు ట్రియంతా ఆక్సిడెంటాలిస్‌. సాధారణంగానే కనిపిస్తూ.. ఇన్నాళ్లూ మన చెవుల్లో పూలు పెట్టిన ఈ మొక్కలు మాంసాహారులు అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. కీటకాలను ఎలా పట్టేసి, తినేస్తున్నాయో తేల్చారు. ఇవే కాదు.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 800కుపైగా మాంసాహార మొక్కలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి ఈ మొక్కలు ఏంటి, కీటకాలను ఎలా పట్టేసి తింటాయనే వివరాలు తెలుసుకుందామా.. 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

అమాయకంగా కనిపిస్తూ..  
ఉత్తర అమెరికాలోని అలస్కా నుంచి కాలిఫోర్నియా పశ్చిమ తీరం వెంబడి అడవులు, కొండలు, గుట్టల్లో పెరిగే మొక్క ట్రియంతా ఆక్సిడెంటాలిస్‌. తామర పూలకు ఉన్నట్టుగా ఆ మొక్క పుష్పాలకు పొడవైన కాండం ఉంటుంది. దానిపై జిగురులాంటి పదార్థం ఉంటుంది. ఈగలు వంటి చిన్న కీటకాలు ఏవైనా దానిపై వాలితే అతుక్కుపోతాయి. అలాగే చనిపోతాయి. ఇలా మొక్కలు తమను కీటకాలు, పురుగులు, చిన్న జంతువుల నుంచి రక్షించుకునేందుకు జిగురు, ముళ్లు వంటివి పెంచుకోవడం ప్రకృతిలో సహజమే. కానీ ట్రియంతా ఆక్సిడెంటాలిస్‌ మొక్క విషయంలో ఏదో తేడా ఉందని శాస్త్రవేత్తలకు అనుమానం రావడంతో పరిశోధన చేపట్టారు. ఈ మొక్కల కాండానికి ఈగలు అతుక్కుపోవడం ఏదో పొరపాటున జరుగుతున్నది కాదని.. మొక్కలే వాటిని ట్రాప్‌ చేసి పట్టేసి ఆరగించేస్తున్నాయని గుర్తించారు.
 
ఇలా ఉండటం చిత్రమే.. 
ప్రకృతిలో మాంసాహార మొక్కలు ఉండటం కొత్తేం కాదు. ఇప్పటికే కొన్ని వందల రకాలను గుర్తించారు. అయితే అవన్నీ కూడా కీటకాలను పట్టుకునేందుకు ప్రత్యేక నిర్మాణాలను కలిగి ఉన్నాయి. కానీ ‘ట్రియంతా ఆక్సిడెంటాలిస్‌’ రహస్యంగా పని కానిచ్చేస్తుండటం విచిత్రమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిపై ఇటీవల అమెరికాలో జరిగిన ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రొసీడింగ్స్‌’లో నివేదికను సమర్పించారు. ఈ వివరాలను కొలంబియా వర్సిటీ వృక్షశాస్త్ర పరిశోధకుడు సీన్‌ గ్రాహం వెల్లడించారు. 

ప్రత్యేక మూలకం ఇచ్చి.. 
కొన్ని ఫ్రూట్‌ఫ్లైస్‌ (ఒక రకం ఈగలు)ను తీసుకుని.. వాటికి ‘నైట్రోజన్‌–15 (ప్రకృతిలో సహజంగా లభించని నైట్రోజన్‌ ఐసోటోప్‌)’ ఉన్న ఆహారాన్ని తినిపించారు. తర్వాత వాటిని ట్రియంతా ఆక్సిడెంటాలిస్‌ మొక్కల వద్ద వదిలారు. ఆ ఈగలు మొక్క కాండానికి అతుక్కుని చనిపోయాయి. కొద్దిరోజులు దానిని పరిశీలిస్తూ.. మొక్కలోని వివిధ భాగాల నుంచి, ఈగ చనిపోయిన ప్రాంతం నుంచి శాంపిళ్లు సేకరించిన శాస్త్రవేత్తలు చిత్రమైన విషయాన్ని గుర్తించారు. 

ఈ మొక్కల కాండంపై ఉన్న సన్నని వెంట్రుకల్లాంటి నిర్మాణాలు ఈగలను పట్టేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిర్మాణాల నుంచి ‘ఫాస్పటేస్‌’ అనే ఎంజైమ్‌ను విడుదల చేసి ఈగలను కరిగించేస్తున్నాయని (జీర్ణం చేస్తున్నాయని).. ఆ ద్రవాన్ని పీల్చుకుంటున్నాయని తేల్చారు. ఈ మొక్కల ఆకులు, పూలలో రసాయనాలను పరిశీలించగా.. శాస్త్రవేత్తలు ఈగలకు తినిపించిన ‘నైట్రోజన్‌–15’ వాటిలో ఉన్నట్టు తేలింది.  

మొక్కలకు మాంసాహారం ఎందుకు? 
ఎడారులు, కొండ ప్రాంతాలతోపాటు కొన్ని రకాల నేలల్లో మొక్కలకు సరిపడా పోషకాలు లభించవు. ముఖ్యంగా చాలా చోట్ల నత్రజని సంబంధిత లోపం ఉంటుంది. దానితోపాటు కొన్నిరకాల మొక్కల్లో జన్యుపరమైన లోపాల కారణంగా నేల నుంచి నత్రజనిని గ్రహించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీనిని అధిగమించేందుకు ఆయా మొక్కలు మాంసాహారులుగా మారుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే జంతువుల్లా మొక్కలకు దంతాలు ఉండవు. కాబట్టి అవి కీటకాలు, ఇతర చిన్నచిన్న జీవులను పట్టుకుని, ప్రత్యేక రసాయనాలతో కరిగించి.. శోషించుకుంటాయి. కేవలం కీటకాలనే కాదు.. చిన్నచిన్న జంతువులను కూడా పట్టి ఆరగించేసే మొక్కలు కూడా ఉన్నాయి. 

వీనస్‌ ఫ్లైట్రాప్‌
అమెరికాలో కనిపించే మరో మాంసాహారపు మొక్క వీనస్‌ ఫ్లైట్రాప్‌ (డియోనియా మస్సిపులా). తెరిచిన ఆల్చిప్పలా, అంచుల్లో పెద్ద పెద్ద ముళ్లు ఉండే ప్రత్యేక నిర్మాణం (ట్రాప్‌) ఈ మొక్కల్లో ఉంటుంది. దానిలోపల జిగురు లాంటి ప్రత్యేక రసాయనాలు ఉంటాయి. ఇది ఒకరకమైన వాసనలు వెదజల్లుతుంది. క్రిమికీటకాలు, కప్పలు, బల్లుల వంటి చిన్నచిన్న జీవులు దీనిపైకి వస్తే.. ఆల్చిప్పలా ఉన్న నిర్మాణం చటుక్కున మూసుకుపోతుంది.

లోపల చిక్కిన జీవిని ఎంజైమ్‌లతో కరిగించి పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత తెరుచుకుని మరో జీవి కోసం వేచి ఉంటుంది. ఇప్పుడీ మొక్కలను ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటివాటిల్లోనూ ఆర్డర్‌ చేసి తెప్పించుకోవచ్చు. 

పిచర్‌ ప్లాంట్‌ 
చిన్న చిన్న కప్పలను, ఎలుకలను కూడా పట్టేసి తినేసే మొక్క పిచర్‌ ప్లాంట్‌. దీని ఆకుల చివరన ఒక సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. అంచులు జారుడుగా ఉంటాయి. దాని నుంచి కీటకాలను ఆకర్షించే వాసనలు విడుదలవుతాయి. ఈ సంచిపైకి వాలిన కీటకాలు, జీవులు అందులో పడిపోతాయి. దానిలోని ఎంజైమ్‌లు ఆ జీవులను చంపేసి, కరిగించేస్తాయి. పిచర్‌ ప్లాంట్లలో చాలా రకాలు ఉన్నాయి. విదేశాల్లో చాలా మంది ఇళ్లలో కూడా పెంచుతారు.  

సండ్యూ 
ఈ మొక్కలు అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో కనిపిస్తాయి. చిత్తడి నేలలు, రాతి నేలలు, నాచు లాంటి వాటి ఉపరితలంపై ఇవి పెరుగుతాయి. దీని ఆకులపై టెంటకిల్స్‌ (వెంట్రుకల వంటి నిర్మాణాలు) ఉంటాయి. వీటి చివరన ఎర్రటి బుడిపెల్లో తేనెవంటి పదార్థం ఉంటుంది.

దానికోసం వచ్చే కీటకాలను టెంటకిల్స్‌తో బంధించి.. ఎంజైమ్‌లతో ఆరగించేస్తుంది. ఈ టెంటకిల్స్‌లోని ఎర్రని ద్రవాన్ని గతంలో సిరాగా వినియోగించేవారని అంతర్జాతీయ మాంసాహార మొక్కల సొసైటీ పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement