Central desk
-
క్రేజీ.. ఎమోజీ!
ఎమోజీ... అక్షర సందేశాల స్థానంలో నేడు ఎక్కువగా ఉపయోగిస్తున్నది ఇదే. వాట్సాప్ చాట్‌లో ఏదైనా సందేశానికి జవాబు ఇవ్వాలంటే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సాధనమిదే. చాంతాడంత వాక్యాలతో పనిలేకుండా మన భావాన్ని సింపుల్‌గా, సూటిగా, స్పష్టంగా ఒక గుర్తుతో చెప్పే సౌలభ్యం వీటి సొంతం. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎమోజీల వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో 2021లో క్రేజీ ఎమోజీ ఏంటి, ఏఏ ఎమోజీలను ఎక్కువగా వాడారన్న దానిపై యూనికోడ్ కన్సార్టియం ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో తెలుసుకుందాం. →ఎమోజీ ర్యాంకింగ్ జాబితాలో ఆనందబాష్పాలతో ఉన్న ఎమోజీనే టాప్ పొజిషన్లో నిలబడింది. దీనితర్వాత ఎరుపు రంగు హృదయం రెండో స్థానంలో ఉండగా, పగలబడి నవ్వుతూ ఉన్న ఎమోజీకి మూడో స్థానం దక్కింది. నాలుగోస్థానంలో థమ్సప్, బిగ్గరగా ఏడుస్తున్నట్లున్న ఎమోజీకి ఐదో స్థానం దక్కాయి. →ఎమోజీల్లో వివిధ కేటగిరీలుండగా, ఫ్లాగ్స్ విభాగంలో ఉన్న ఎమోజీలను చాలా తక్కువ మంది వినియోగించినట్లు వెల్లడైంది. అలాగే రవాణా విభాగంలో ‘దూసుకుపోతున్న రాకెట్’ బొమ్మ టాప్‌లో నిలవగా, శరీర భాగాల కేటగిరీలో అయితే చేతికండరాలను చూపుతున్న ఎమోజీని ఎక్కువగా వాడారు. →తరచుగా వాడిన ఎమోజీల్లో ‘నవ్వుతున్నట్లు ఉన్నవి’, చేతులు’ వంటివి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. జంతువుల ఎమోజీల కన్నా మొక్కలు, పూల ఎమోజీలను ఎక్కువగా వాడారు. పూలు–మొక్కల విభాగాల్లో పుష్పగుచ్ఛం, జంతువుల–పక్షుల విభాగాల్లో సీతాకోకచిలుక టాప్‌లో ఉన్నాయి. →గత అధ్యయనంలో టాప్–200 జాబితాలో ఉన్న కొన్ని ఎమోజీలు టాప్–50లోకి రావడం విశేషం. గతంలో నిర్వహించిన సర్వేలో ‘బర్త్‌డే కేక్’ 113వ స్థానంలో ఉండగా.. ఈసారి అది 25వ స్థానానికి వచ్చింది. అలాగే గతంలో 139వ స్థానంలో ఉన్న ‘బెలూన్’ ఈసారి మరింత పైకి ఎగిరి 48వ స్థానాన్ని దక్కించుకుంది. దిగాలుగా ఉన్న ఎమోజీ 97వ స్థానం నుంచి 14వ స్థానానికి వచ్చి చేరింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఆరోగ్య విభాగానికి చెందిన రెండు ఎమోజీలే టాప్–100 ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. →మొత్తం ఎమోజీల వాడకం విషయానికొస్తే టాప్–100లో ఉన్నవే 82 శాతాన్ని ఆక్రమిం చాయి. ఈ అధ్యయనం వల్ల ఎక్కువగా వాడే ఎమోజీలేంటే తెలియడంతోపాటు తదుపరి ఎలాంటి వాటిని తీసుకురావొచన్న విషయం కూడా తెలుస్తుందని అంటున్నారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఈసారి వణుకుడే..
అప్పుడే చలి మొదలైంది. అయితే ఇది జస్ట్ శాంపిలే.. మున్ముందు జనమంతా గజగజ వణికిపోక తప్పదట. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని,మంచు కురిసే అవకాశమూ ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీనంతటికీ లానినా పరిస్థితి కారణమని అంటున్నారు. మరి లానినా ఏంటి, చలి విపరీతంగా పెరగడం ఏమిటి, దీనికి దానికి లంకె ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఇప్పటిదాకా భారీ వర్షాలు.. సాధారణంగా ఎల్‌నినో, లానినా పరిస్థితులు ఏర్పడినప్పుడు మన దేశంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజన్లలో గణనీయంగా మార్పులు వస్తాయి. ఈసారి లానినా కారణంగా నైరుతి రుతు పవనాలు ఎక్కువకాలం కొనసాగాయి. 1975 త ర్వాత ఇంత సుదీర్ఘంగా నైరుతి సీజన్ ఉండటం ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ►మన దేశానికి సంబంధించినంత వరకు.. ఎల్‌నినో సమయంలో ఏ సీజన్ అయినా కూడా ఉష్ణోగ్రతలు పెరగడం, వానలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది. లానినా సమయంలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనా.. వానాకాలంలో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. ►పసిఫిక్ మహా సముద్రంపై రెండేళ్లుగా లానినా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది దాని ప్రభావం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదయ్యాయి. తర్వాత వానాకాలం మొదలైనప్పటి నుంచీ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తర భారత రాష్ట్రాల్లో అక్కడక్కడా ఇప్పటికీ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక చలిచలిగా.. లానినా కారణంగా పసిఫిక్ మహా సముద్రం వైపు నుంచి శీతల గాలులు వీస్తాయని.. దీనితో భూమి ఉత్తర అర్ధభాగంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో)’ తాజాగా ప్రకటించింది. ఇదే సమయంలో దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండంలో దిగువభాగంలోని దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలపై లానినా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. చలి తీవ్రత పెరుగుతుంది. ఇప్పటికే ఉత్తర భారత ప్రాంతంలో చలి మొదలైందని.. చాలా ప్రాంతాల్లో మూడు డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ►ముఖ్యంగా డిసెంబర్ మూడో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు చలి విపరీతంగా ఉంటుందని పేర్కొంది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కురవడం మొదలైందని తెలిపింది. దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ సాధారణంతో పోలిస్తే.. మూడు నుంచి ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ►చైనాలోని తూర్పు ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోయాయని.. జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోనూ చలి తీవ్రత మొదలైందని.. ఆయా దేశాల వాతావరణ అధికారులు ప్రకటించడం గమనార్హం. ఏమిటీ ఎల్‌నినో, లానినా? భూమ్మీద అతిపెద్ద మహా సముద్రమైన పసిఫిక్ సముద్రం ఉపరితలంలోని నీటి ఉష్ణోగ్రతల్లో కొన్నేళ్లకోసారి హెచ్చుతగ్గులు వస్తుంటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర ప్రవాహాల్లో.. ఖండాల మీదుగా వీచే పవనాల (గాలుల) ఉష్ణోగ్రతలు, తేమ శాతంలో మార్పులు వస్తాయి. పసిఫిక్ ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్నినోగా.. తగ్గడాన్ని లానినాగా పిలుస్తారు. ఈ రెండు కూడా పసిఫిక్ మహా సముద్రం చుట్టూ ఉన్న వేర్వేరు ప్రాంతాలపై ఒకదానికొకటి వేర్వేరుగా, వ్యతిరేక ప్రభావం చూపుతాయి. ►ఉదాహరణకు ఎల్‌నినోతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే.. మరికొన్నిచోట్ల వానలు తగ్గి, ఎండలు పెరిగి కరువులు ఏర్పడతాయి. ►అదే లానినా వచ్చినప్పుడు దీనికి వ్యతిరేకంగా.. ఎల్‌నినోతో వరదలు వచ్చే చోట కరువులు వస్తాయి, ఎండలు ఉండే చోట భారీ వర్షాలు కురుస్తాయి. ఓ వైపు కరువు.. మరోవైపు వరదలు లానినా కారణంగా దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ, ఈక్వెడార్ వంటి దేశాల్లో తీవ్ర కరువు పరిస్థి తులు ఏర్పడ్డాయి. పసిఫిక్ మహా సముద్రానికి పశ్చి మాన ఉన్న దేశాల్లో, హిందూ మహాసముద్ర ప్రాంతదేశాల్లో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో మంచి వర్షాలు కురిశాయి. ►ప్రస్తుతం అమెరికాలో వానాకాలం మొదలైంది. లానినా ప్రభావం కారణంగా ఈసారి భారీ వర్షాలు కురుస్తాయని, తుపానులు వస్తాయని, తర్వాత చలికాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవచ్చని ఆ దేశ వాతావరణ శాఖ ఇటీవలే ప్రకటించింది. -
చెవిలో ‘పువ్వు’!
అదో అడవి మొక్క. తెలుపు, లేత ఆకుపచ్చ రంగు పూలతో.. చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే.. అదో మాంసాహారి. ఈగల వంటి చిన్న చిన్న కీటకాలను పట్టేసుకుని ఆరగించేస్తుంది.. దానిపేరు ట్రియంతా ఆక్సిడెంటాలిస్. సాధారణంగానే కనిపిస్తూ.. ఇన్నాళ్లూ మన చెవుల్లో పూలు పెట్టిన ఈ మొక్కలు మాంసాహారులు అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. కీటకాలను ఎలా పట్టేసి, తినేస్తున్నాయో తేల్చారు. ఇవే కాదు.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 800కుపైగా మాంసాహార మొక్కలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి ఈ మొక్కలు ఏంటి, కీటకాలను ఎలా పట్టేసి తింటాయనే వివరాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ అమాయకంగా కనిపిస్తూ.. ఉత్తర అమెరికాలోని అలస్కా నుంచి కాలిఫోర్నియా పశ్చిమ తీరం వెంబడి అడవులు, కొండలు, గుట్టల్లో పెరిగే మొక్క ట్రియంతా ఆక్సిడెంటాలిస్. తామర పూలకు ఉన్నట్టుగా ఆ మొక్క పుష్పాలకు పొడవైన కాండం ఉంటుంది. దానిపై జిగురులాంటి పదార్థం ఉంటుంది. ఈగలు వంటి చిన్న కీటకాలు ఏవైనా దానిపై వాలితే అతుక్కుపోతాయి. అలాగే చనిపోతాయి. ఇలా మొక్కలు తమను కీటకాలు, పురుగులు, చిన్న జంతువుల నుంచి రక్షించుకునేందుకు జిగురు, ముళ్లు వంటివి పెంచుకోవడం ప్రకృతిలో సహజమే. కానీ ట్రియంతా ఆక్సిడెంటాలిస్ మొక్క విషయంలో ఏదో తేడా ఉందని శాస్త్రవేత్తలకు అనుమానం రావడంతో పరిశోధన చేపట్టారు. ఈ మొక్కల కాండానికి ఈగలు అతుక్కుపోవడం ఏదో పొరపాటున జరుగుతున్నది కాదని.. మొక్కలే వాటిని ట్రాప్ చేసి పట్టేసి ఆరగించేస్తున్నాయని గుర్తించారు. ఇలా ఉండటం చిత్రమే.. ప్రకృతిలో మాంసాహార మొక్కలు ఉండటం కొత్తేం కాదు. ఇప్పటికే కొన్ని వందల రకాలను గుర్తించారు. అయితే అవన్నీ కూడా కీటకాలను పట్టుకునేందుకు ప్రత్యేక నిర్మాణాలను కలిగి ఉన్నాయి. కానీ ‘ట్రియంతా ఆక్సిడెంటాలిస్’ రహస్యంగా పని కానిచ్చేస్తుండటం విచిత్రమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిపై ఇటీవల అమెరికాలో జరిగిన ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్’లో నివేదికను సమర్పించారు. ఈ వివరాలను కొలంబియా వర్సిటీ వృక్షశాస్త్ర పరిశోధకుడు సీన్ గ్రాహం వెల్లడించారు. ప్రత్యేక మూలకం ఇచ్చి.. కొన్ని ఫ్రూట్‌ఫ్లైస్ (ఒక రకం ఈగలు)ను తీసుకుని.. వాటికి ‘నైట్రోజన్–15 (ప్రకృతిలో సహజంగా లభించని నైట్రోజన్ ఐసోటోప్)’ ఉన్న ఆహారాన్ని తినిపించారు. తర్వాత వాటిని ట్రియంతా ఆక్సిడెంటాలిస్ మొక్కల వద్ద వదిలారు. ఆ ఈగలు మొక్క కాండానికి అతుక్కుని చనిపోయాయి. కొద్దిరోజులు దానిని పరిశీలిస్తూ.. మొక్కలోని వివిధ భాగాల నుంచి, ఈగ చనిపోయిన ప్రాంతం నుంచి శాంపిళ్లు సేకరించిన శాస్త్రవేత్తలు చిత్రమైన విషయాన్ని గుర్తించారు. ►ఈ మొక్కల కాండంపై ఉన్న సన్నని వెంట్రుకల్లాంటి నిర్మాణాలు ఈగలను పట్టేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిర్మాణాల నుంచి ‘ఫాస్పటేస్’ అనే ఎంజైమ్‌ను విడుదల చేసి ఈగలను కరిగించేస్తున్నాయని (జీర్ణం చేస్తున్నాయని).. ఆ ద్రవాన్ని పీల్చుకుంటున్నాయని తేల్చారు. ఈ మొక్కల ఆకులు, పూలలో రసాయనాలను పరిశీలించగా.. శాస్త్రవేత్తలు ఈగలకు తినిపించిన ‘నైట్రోజన్–15’ వాటిలో ఉన్నట్టు తేలింది. మొక్కలకు మాంసాహారం ఎందుకు? ఎడారులు, కొండ ప్రాంతాలతోపాటు కొన్ని రకాల నేలల్లో మొక్కలకు సరిపడా పోషకాలు లభించవు. ముఖ్యంగా చాలా చోట్ల నత్రజని సంబంధిత లోపం ఉంటుంది. దానితోపాటు కొన్నిరకాల మొక్కల్లో జన్యుపరమైన లోపాల కారణంగా నేల నుంచి నత్రజనిని గ్రహించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీనిని అధిగమించేందుకు ఆయా మొక్కలు మాంసాహారులుగా మారుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే జంతువుల్లా మొక్కలకు దంతాలు ఉండవు. కాబట్టి అవి కీటకాలు, ఇతర చిన్నచిన్న జీవులను పట్టుకుని, ప్రత్యేక రసాయనాలతో కరిగించి.. శోషించుకుంటాయి. కేవలం కీటకాలనే కాదు.. చిన్నచిన్న జంతువులను కూడా పట్టి ఆరగించేసే మొక్కలు కూడా ఉన్నాయి. వీనస్ ఫ్లైట్రాప్ అమెరికాలో కనిపించే మరో మాంసాహారపు మొక్క వీనస్ ఫ్లైట్రాప్ (డియోనియా మస్సిపులా). తెరిచిన ఆల్చిప్పలా, అంచుల్లో పెద్ద పెద్ద ముళ్లు ఉండే ప్రత్యేక నిర్మాణం (ట్రాప్) ఈ మొక్కల్లో ఉంటుంది. దానిలోపల జిగురు లాంటి ప్రత్యేక రసాయనాలు ఉంటాయి. ఇది ఒకరకమైన వాసనలు వెదజల్లుతుంది. క్రిమికీటకాలు, కప్పలు, బల్లుల వంటి చిన్నచిన్న జీవులు దీనిపైకి వస్తే.. ఆల్చిప్పలా ఉన్న నిర్మాణం చటుక్కున మూసుకుపోతుంది. లోపల చిక్కిన జీవిని ఎంజైమ్లతో కరిగించి పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత తెరుచుకుని మరో జీవి కోసం వేచి ఉంటుంది. ఇప్పుడీ మొక్కలను ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటివాటిల్లోనూ ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. పిచర్ ప్లాంట్ చిన్న చిన్న కప్పలను, ఎలుకలను కూడా పట్టేసి తినేసే మొక్క పిచర్ ప్లాంట్. దీని ఆకుల చివరన ఒక సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. అంచులు జారుడుగా ఉంటాయి. దాని నుంచి కీటకాలను ఆకర్షించే వాసనలు విడుదలవుతాయి. ఈ సంచిపైకి వాలిన కీటకాలు, జీవులు అందులో పడిపోతాయి. దానిలోని ఎంజైమ్‌లు ఆ జీవులను చంపేసి, కరిగించేస్తాయి. పిచర్ ప్లాంట్లలో చాలా రకాలు ఉన్నాయి. విదేశాల్లో చాలా మంది ఇళ్లలో కూడా పెంచుతారు. సండ్యూ ఈ మొక్కలు అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో కనిపిస్తాయి. చిత్తడి నేలలు, రాతి నేలలు, నాచు లాంటి వాటి ఉపరితలంపై ఇవి పెరుగుతాయి. దీని ఆకులపై టెంటకిల్స్ (వెంట్రుకల వంటి నిర్మాణాలు) ఉంటాయి. వీటి చివరన ఎర్రటి బుడిపెల్లో తేనెవంటి పదార్థం ఉంటుంది. దానికోసం వచ్చే కీటకాలను టెంటకిల్స్‌తో బంధించి.. ఎంజైమ్లతో ఆరగించేస్తుంది. ఈ టెంటకిల్స్లోని ఎర్రని ద్రవాన్ని గతంలో సిరాగా వినియోగించేవారని అంతర్జాతీయ మాంసాహార మొక్కల సొసైటీ పేర్కొంది. -
మలేరియాకు వ్యాక్సిన్ రెడీ!
మలేరియా.. అందరికీ తెలిసిన వ్యాధే. అది పెద్ద ప్రమాదకరమేమీ కాదని అనుకుంటాం. కానీ మన దేశంలో, రాష్ట్రంలో ఏటా లక్షలాది మంది మలేరియా బారినపడుతున్నారు. పెద్దవాళ్లు దీన్ని తట్టుకుంటున్నా ఐదేళ్లలోపు చిన్నారుల్లో వందల మంది చనిపోతున్నారు. మలేరియాకు చాలా కాలం నుంచీ చికిత్స, మందులు అందుబాటులో ఉన్నా.. ప్రయోజనం మాత్రం తక్కువే. అలాంటి మలేరియాకు ఎట్టకేలకు ఓ వ్యాక్సిన్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఈ మలేరియా మహమ్మారి, దాని వ్యాప్తి, చికిత్స, ప్రస్తుత వ్యాక్సిన్ వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ►ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది మలేరియా బారినపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ►రోజు విడిచి రోజు బాగా పెరుగుతూ తగ్గుతూ ఉండే జ్వరం, తీవ్ర తలనొప్పి, కండరాల నొప్పులు, చెమటపట్టడం, చేతులు–కాళ్లు వణకడం వంటివి మలేరియా లక్షణాలు. ►దీనితో సుమారు ఏటా నాలుగు లక్షల మంది చనిపోతున్నారు. వీరిలో ఐదేళ్లలోపు పిల్లల సంఖ్యే 2.68 లక్షల మంది వరకు ఉంటోందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ►మలేరియా పరాన్నజీవి ఆడఅనాఫిలిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అప్పటికే ఈ వ్యాధి ఉన్న వ్యక్తులను కుట్టిన దోమలు వేరే వ్యక్తులను కుట్టితే వారికీ వ్యాపిస్తుంది. వైరస్ కాదు.. బ్యాక్టీరియా కాదు.. ప్లాస్మోడియం ఫాల్సిపరం అనే అతిచిన్న పరాన్నజీవి (ఏకకణ జీవి–ప్రొటోజోవా) కారణంగా మలేరియా వ్యాధి వస్తుంది. ఇది వైరస్, బ్యాక్టీరియాల వంటి సూక్ష్మజీవి కాదు. వాటికన్నా పెద్దగా ఉంటుంది. ►ఉదాహరణకు ప్లాస్మోడియం క్రిముల పరిమాణం 8–12 మైక్రోమీటర్లు (మైక్రోమీటర్ అంటే మీటర్లో పదిలక్షల వంతు) ఉంటుంది. అదే వైరస్ల పరిమాణం వంద నానోమీటర్ల వరకు (నానోమీటర్ అంటే మీటర్లో వంద కోట్ల వంతు) ఉంటుంది. అంటే వైరస్ల కంటే.. ప్లాస్మోడియం క్రిములు వంద రెట్లు పెద్దగా ఉంటాయి. 8 లక్షల మందిపై పరిశీలించి.. మస్కిరిక్స్’వ్యాక్సిన్ ప్రాథమిక ప్రయోగాలు 2019లోనే పూర్తయ్యాయి. భద్రతా ప్రమాణాల మేరకు ఉన్నట్టు నిర్ధారించుకున్నాక.. దాని పనితీరు, దీర్ఘకాలిక ప్రభావాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు విస్తృత పరిశోధన చేపట్టారు. గత రెండేళ్లలో ఆఫ్రికా ఖండంలోని ఘనా, కెన్యా, మలావి దేశాల్లో ఎనిమిది లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చి పరిశీలించారు. ►ఆరు వారాల వయసు నుంచి ఏడాదిన్నర వయసున్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ►దీనిని నాలుగు డోసులుగా (అర మిల్లీలీటర్ చొప్పున) ఇవ్వాల్సి ఉంటుంది. నెలకో డోసు చొప్పున మూడు డోసులు ఇస్తారు. 18 నెలల (ఏడాదిన్నర) తర్వాత నాలుగో డోసు ఇస్తారు. ►వాస్తవానికి ఈ వ్యాక్సిన్ పిల్లలపై 30శాతం ప్రభావవంతంగానే పనిచేస్తుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కానీ లక్షల కొద్దీ కేసులు, వేలకొద్దీ మరణాలు నమోదయ్యే చోట.. ఈ మాత్రమైనా పనిచేసే వ్యాక్సిన్ ప్రయోజనకరమని పేర్కొంది. ►ఆఫ్రికాలో 2019 ఒక్క ఏడాదిలోనే 3.86 లక్షల మంది మలేరియాతో మరణించారు. అదే గత ఏడాదిన్నరలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య మాత్రం 2.12 లక్షలే. ప్రపంచంలోనే తొలిసారిగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్లు, బ్యాక్టీరియాలతో వచ్చే వ్యాధులకు సంబంధించి చాలా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగాకుండా ఒక పరాన్నజీవికి సంబంధించిన వ్యాక్సిన్ విడుదల అవుతుండటం ఇదే మొదటిసారి అని నిపుణులు చెప్తున్నారు. మలేరియాకు వ్యాక్సిన్ ప్రయోగాలు చాలా ఏళ్లుగా సాగుతున్నాయి. కొన్ని సంస్థలు వ్యాక్సిన్లను రూపొందించినా.. అవి సమర్థవంతంగా పనిచేయలేకపోవడం, సైడ్ ఎఫెక్టులు ఉండటం వంటి కారణాలతో అనుమతులు పొందలేదు. మస్కిరిక్స్ వ్యాక్సిన్‌ను కూడా ఏళ్లపాటు, లక్షలాది మందిపై పరీక్షించిన తర్వాతే అనుమతి ఇచ్చారు. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? దోమకాటు వేసినప్పుడు మలేరియా పరాన్నజీవులు మన రక్తంలోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి కాలేయానికి చేరుకుని వాటి సంఖ్యను పెంచుకుంటాయి. తర్వాత మళ్లీ రక్తంలోకి చేరి ఎర్రరక్త కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. మలేరియా పరాన్నజీవులు కాలేయంలో చేరి సంఖ్యను పెంచుకోకుండా ఈ యాంటీబాడీలు అడ్డుకుంటాయి. ప్లాస్మోడియం ప్రొటీన్ల నుంచే.. బ్రిటన్‌కు చెందిన గ్లాక్సోస్మిత్‌క్లైన్ (జీఎస్కే) ఫార్మా సంస్థ ఈ ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మలేరియాను కలిగించే ప్లాస్మోడియం ఫాల్సిపరం పరాన్నజీవి పైపొరలో ఉండే ప్రొటీన్ల ఆధారంగా దీనిని రూపొందించారు. 2028 నాటికల్లా కోటిన్నర డోసులు ఉత్పత్తి చేస్తామని, ఉత్పత్తికి అయ్యే ఖర్చుపై కేవలం ఐదు శాతమే ఎక్కువ ధరతో విక్రయిస్తామని జీఎస్కే ప్రకటించింది. ►ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లోని చాలా దేశాల్లో మలేరియా సీజనల్‌గా వ్యాప్తి చెందుతుంటుంది. ఏటా లక్షల మంది దీని బారినపడుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం.. 2030 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు కోట్ల మలేరియా వ్యాక్సిన్లు అవసరం కానున్నాయి. మన దేశానికి అత్యవసరం! ప్రపంచంలో ఆఫ్రికా ఖండం తర్వాత ఎక్కువగా మలేరియా కేసులు నమోదయ్యే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. దేశంలో ఏటా లక్షలాది కేసులు నమోదవుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే టెస్టులు చేసే సౌకర్యాలు లేకపోవడం, మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటంతో అధికారికంగా కేసుల సంఖ్య తక్కువగా ఉంటోందని పేర్కొంటున్నారు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో మలేరియా వ్యాప్తి బాగా తగ్గిపోయిందని వివరిస్తున్నారు. ►2019లో భారత్‌లో సుమారు 56 లక్షల మందికి మలేరియా సోకగా.. 7,700 మంది మరణించినట్టు డబ్ల్యూహెచ్‌వో అంచనా. ►కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది జూలై చివరినాటికి దేశవ్యాప్తంగా 64,520 మలేరియా కేసులు నమోదుకాగా.. 35 మంది చనిపోయారు. ►హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ మన దేశంలో ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుందని ఫార్మా వర్గాలు తెలిపాయి. ప్రపంచానికి ఓ బహుమతి మలేరియా వ్యాక్సిన్లపై 30 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. జీఎస్కే ఫార్మాతయారు చేసిన ‘మస్కిరిక్స్’ వ్యాక్సిన్‌పై పలు దేశాల్లో విస్తృతంగా ప్రయోగం నిర్వహించారు. ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్‌ను డబ్ల్యూహెచ్‌వో తరఫున సిఫార్సు చేస్తున్నాం. మలేరియా బాధిత దేశాల్లో పిల్లలకు పెద్ద ఎత్తున ఈ వ్యాక్సినేషన్ చేపట్టాలి. – డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ -
సొంత సూర్యుడ్ని సెట్ చేసేసుకున్నారు!
అదో చిన్న ఊరు.. చుట్టూ పెద్ద పెద్ద కొండల మధ్య అందంగా ఉంటుంది.. కానీ ఆ ఊరిలో ఏడాదికి మూడు నెలలు అసలు ఎండ అనేదే పడదు. మధ్యాహ్నం రెండు, మూడు గంటల పాటు తప్పిస్తే.. మిగతా సమయంలో పగలూ, రాత్రీ తేడా తెలియదు. వందల ఏళ్లుగా ఇలాగే వెళ్లదీసిన స్థానికులు.. కొన్నేళ్ల కింద చిన్న ఆలోచనతో తమ ఊరికి మరో సూర్యుడ్ని తెచ్చేసుకున్నారు. ఇన్నిరోజులు పెద్దగా ఎవరికీ తెలియని ఈ విషయం.. ఓ టిక్‌టాకర్ చేసిన వీడియోతో వైరల్‌గా మారింది. మరి ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ అద్దాల నుంచి ప్రతిఫలిస్తున్న వెలుగులో విగనెల్లా గ్రామం. (ఇన్సెట్లో) కొండపై ఏర్పాటు చేసిన అద్దాలు ఏడాదికి మూడు నెలలు.. ఇటలీ ఉత్తర ప్రాంతంలోని అంట్రోనా లోయలో ఉన్న చిన్న ఊరే విగనెల్లా. రెండు, మూడు వందల మంది మాత్రమే ఉండే ఈ ఊరికి మూడు వైపులా పెద్ద కొండలు ఉంటాయి. అవి సూర్యరశ్మిని అడ్డుకోవడంతో.. ఏటా నవంబర్ 11వ తేదీ నుంచి ఫిబ్రవరి రెండో తేదీదాకా ఊరిలో ఎండ మొత్తానికే పడదు. కొండలపై పడ్డ ఎండ ప్రతిఫలించి (రిఫ్లెక్షన్) వచ్చే వెలుతురే వారికి దిక్కు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం.. 13వ శతాబ్దం నుంచీ అంటే ఎనిమిది వందల ఏళ్లుగా ఆ ఊరివాళ్లు ఇలాగే గడుపుతున్నారు. హా మూడు నెలల చీకటి తర్వాత ఎండపడటం మొదలయ్యే రోజున పండుగ చేసుకుంటారు. చదవండి: కరోనా అనిశ్చితి: చేతిలో డబ్బున్నా.. వాయిదాల్లోనే! చిన్న ఆలోచనే.. వరుసగా మూడు నెలల పాటు ఎండ పడకపోవడం, అదీ చలికాలం కావడంతో.. ఊరివాళ్లు శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపడుతూనే వచ్చారు. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కొండలపై పడే ఎండను ఊరిపైకి రిఫ్లెక్ట్ చేయాలని 1999లో ఊరి మేయర్ మిడాలి ప్రతిపాదన చేశాడు. ఆర్కిటెక్ట్ బొంజాని, ఇంజనీర్ గియానీ ఫెరారీ కలిసి ఓ పెద్ద అద్దాన్ని కొండపై అమర్చి.. వెలుతురును ఊరిపై పడేలా ఓ డిజైన్‌ను సిద్ధం చేశారు. అయితే.. సూర్యోదయం నుంచి అస్తమయం దాకా సూర్యుడు కదులుతూనే ఉంటాడు. మరి అద్దం నుంచి వచ్చే వెలుగు ఊరిలో ఒకేచోట పడేదెలా అన్న సమస్య వచ్చింది. స్టీలు అద్దం.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో.. మామూలు అద్దం అయితే పగిలిపోయే అవకాశం ఉంటుందని.. అత్యంత నున్నటి స్టీల్ అద్దాలను తెప్పించారు. ఎనిమిది మీటర్ల వెడల్పు, ఐదు మీటర్ల ఎత్తుతో వాటిని ఏర్పాటు చేసి.. ప్రత్యేకమైన కంప్యూటరైజ్డ్ మోటార్ వ్యవస్థకు అనుసంధానించారు. సూర్యుడి కదలికలకు అనుగుణంగా.. అద్దాల కోణాన్ని మార్చేలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు. దీనితో స్టీలు అద్దాల నుంచి ప్రతిఫలించే ఎండ.. ఎప్పుడూ ఊరి మధ్యలో పడుతూ ఉంటుంది. 2006 డిసెంబర్ 17న ప్రారంభించిన ఈ వ్యవస్థకోసం.. అప్పుడే రూ.90 లక్షలు (లక్ష యూరోలు) ఖర్చయింది. నేరుగా ఎండ పడినట్టుగా కాకపోయినా.. తమ ‘కొత్త సూర్యుడి’తో చాలా ఇబ్బందులు తప్పాయని ఊరివాళ్లు చెప్తుంటారు. నాలుగు రోజుల కింద మనదేశానికి చెందిన కరన్ రాజన్ అనే వ్యక్తి ఈ ఊరి గురించి చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారింది. చదవండి: Pan - Aadhaar Link: పాన్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక! మరో దేశానికీ స్ఫూర్తినిచ్చి.. భూమి ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే చాలా దేశాల్లో కూడా.. కొండలు, గుట్టల మధ్య ఉన్న గ్రామాల్లో ‘విగనెల్లా’ వంటి పరిస్థితే ఉంటుంది. నెలలకు నెలలు ఎండ పడదు. నార్వేలో అలా ఇబ్బందిపడుతున్న జుకాన్ అనే ఊరివాళ్లు.. విగనెల్లాను స్ఫూర్తిగా తీసుకుని 2013లో అద్దాల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. -
Space Solar Plant: ఆకాశం నుంచి కరెంట్!
ఒక్క నిమిషం కరెంటు పోతే.. ఆగమాగం అయిపోతాం. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం విద్యుత్ కావాల్సిందే. ఓ వైపు బొగ్గు వంటి సహజ వనరులు తరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ విద్యుత్‌కు మరెన్నో కష్టాలు.. ఇలాంటి సమయంలోనే ఆకాశం నుంచే కరెంటు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ భూమ్మీద బొగ్గు తరిగిపోతోంది.. జల విద్యుత్ సరిపోదు.. సౌర విద్యుత్ ఉన్నా.. పగలు మాత్రమే కరెంటు ఉత్ప త్తి అవుతుంది. మబ్బు పట్టినా, ఫలకాలపై దు మ్ముపడినా ఉత్పత్తి తగ్గిపోతుంది. పవన విద్యు త్ వంటి ఇతర మార్గాలు ఉన్నా ఖర్చెక్కువ. నిరంతరంగా ఉత్పత్తి సాధ్యంకాదు. మరె లా అన్న ఆలోచన చేసిన శాస్త్రవేత్తలు.. అంతరిక్షం లో ఉపగ్రహాల తరహాలో భారీ సోలార్ ప్యానె ల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయవచ్చని ప్రతిపాదించారు. జపాన్, యూరోపియన్ యూ నియన్ ఆ దిశగా పరిశోధనలు చేస్తుండగా.. చైనా నేరుగా రంగంలోకి దిగింది. అంతరిక్షంలో అత్యంత భారీ సోలార్ ప్రాజెక్టు చేపట్టే పనిలో పడింది. మరో 14 ఏళ్లలో అంటే 2035 కల్లా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. చదవండి: తాలిబన్ల దమనకాండ అంతరిక్షంలో సోలార్ ప్రాజెక్టు పనిచేసేదిలా.. చైనా ప్రాజెక్టు ఇదీ.. ►భూమికి 23 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ ఏర్పాటుకు చైనా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. అంటే ఆ ప్లాంట్ భూమి తిరిగే వేగంతోనే కదులుతూ.. ఎప్పుడూ ఒకే ప్రాంతంపై ఉంటుంది. ►ప్రాజెక్టులో భాగంగా 2035 సంవత్సరం నా టికి సుమారు 1.6 కిలోమీటర్ల మేరసోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు. ముందు ఒక మెగావాట్ సామర్థ్యంతో మొదలుపెట్టి.. తర్వాత మరింతగా విస్తరిస్తూ వెళతారు. ►2050నాటికి ఒక అణువిద్యుత్ ప్లాంటు స్థాయిలో ఏకంగావెయ్యి మెగావాట్లు ఉత్పత్తి చేసేలా ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ను అభివృద్ధి చేస్తారు. ►ప్రస్తుతం చైనాలోని చోంగ్‌కింగ్ పట్టణం శి వార్లలో ‘బిషన్ స్పేస్ సోలార్ ఎనర్జీ స్టేషన్’ను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ప్రయోగాన్ని మొదలుపెట్టాలని భావిస్తోంది. ►అయితే ఈ భారీ ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలేమీ వెల్లడించలేదు. చదవండి: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! ఖర్చు తక్కువే.. 2039 నాటికి ‘స్పేస్ ప్లాంట్’ ఏర్పాటు చేయాలని బ్రిటన్ను ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా సాధ్యాసాధ్యాలు, ఖర్చుపై ఓ నివేదికను రూపొందించింది. అంతరిక్షంలో ఒక కిలోమీటర్ వెడల్పున ప్లాంట్ ఏర్పాటుకు.. 2 వేల టన్నుల పరికరాలు అవసరమని లెక్కించింది. భూమిపై రిసీవింగ్ స్టేషన్‌ను 95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని అంచనా వేసింది. ళీ ప్రస్తుతం వెయ్యి యూనిట్ల కరెంటు ఉత్పత్తి కోసం.. అణువిద్యుత్ ప్లాంట్లలో రూ.5 వేలకుపైగా.. భూమ్మీది సౌర, పవన విద్యుత్ ప్లాంట్లలో రూ.3,750 వరకు ఖర్చవుతోందని తెలిపింది. అదే ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ కేవలం రూ.385 మాత్రమే ఖర్చవుతాయని అంచనా వేసింది. ఓ ఫిక్షన్ నవల నుంచి.. ఐజాక్ అసిమోవ్ రష్యన్ రచయిత 1941లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలో ‘స్పేస్ సోలార్ పవర్ స్టేషన్ల’ గురించి రాశారు. ఆ ప్లాంట్లు సూర్యరశ్మిని మైక్రోవేవ్‌ల రూపంలో వివిధ గ్రహాలపైకి పంపుకొంటారని పేర్కొన్నారు. సోలార్ పవర్ వినియోగం కొత్తగా మొదలైన 1970 దశకంలో కొందరు శాస్త్రవేత్తలు ‘స్పేస్ సోలార్ పవర్’ ప్రతిపాదనలు చేశారు. కానీ అప్పటి పరిస్థితి, భారీ ఖర్చుతో ఏదీ ముందుకుపడలేదు. ఇటీవలి కాలంలో పలు కొత్త టెక్నాలజీలు రావడంతో మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. ఇప్పటికే బ్రిటన్, జపాన్, రష్యా, అమెరికా, చైనా దేశాలు ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. లాభాలు ఎన్నో? ►సూర్యుడి కిరణాల తీవ్రత, రేడియేషన్ ఎ క్కువగా ఉంటాయి.పైగా దుమ్ముపడి సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఉండవు. పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ►భూమ్మీద రోజూ 9–10 గంటల పాటు మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అది కూడా సోలార్ ప్యానెళ్లపై సూర్యరశ్మి నేరుగా పడే ఐదారు గంటలు మాత్రమే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే అంతరిక్షంలో సోలార్ ప్యానెళ్లు పూర్తిగా సూర్యుడివైపే ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. దీనితో రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ►ఈ ప్రత్యామ్నాయ విద్యుత్ కారణంగా.. బొగ్గు, పెట్రోలియం, ఇతర శిలాజ ఇంధనాల వినియోగం నిలిచిపోయి భూమ్మీద కాలుష్యం తగ్గుతుంది. ఆయుధంగా మారుతుందా? జేమ్స్‌బాండ్ సినిమాలో ఓ ప్రైవేటు సంస్థ అంతరిక్షంలో సోలార్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. రాత్రిపూట అవసరమైన చోట వెలుగు ఇవ్వొచ్చని చెప్తుంది. కానీ ఆ వ్యవస్థతో సౌరశక్తిని లేజర్ కిరణాల తరహాలో ఒక దగ్గర కేంద్రీకరించి.. విధ్వంసం సృష్టిస్తుంది. ఇది సినిమాని సీన్ అయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లతో అలాంటి ప్రమాదమూ ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుండటం గమనార్హం. ►కావాలని చేయకపోయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లో సమస్య వచ్చి.. అది భూమిపైకి పంపే మైక్రోవేవ్‌లు/లేజర్ కిరణాలు ప్రజలు ఉండే ప్రాంతాలపై పడితే ఎలాగన్న ప్రశ్నలూ వస్తున్నాయి. మైక్రోవేవ్‌ల వల్ల రేడియేషన్ ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ►అయితే ఇలాంటి ప్రమాదాలు ఉండకుండా.. కచ్చితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కిరణాలు రిసీవింగ్ స్టేషన్ పరిధి దాటి బయట ప్రసరించే పరిస్థితి ఉంటే.. ప్లాంట్ ఆటోమేటిగ్గా ఆగిపోయే ఏర్పాట్లు ఉంటాయని భరోసా ఇస్తున్నారు. -
కమలంపై అవినీతి మరకలు
బీజేపీని, మోదీ సర్కారును ఇరుకునపెడ్తున్న మహిళా నేతల అవినీతి: సమర్ధించుకోలేని స్థాయిలో అక్రమాలకు ఆధారాలు బీజేపీలోని నలుగురు కీలక మహిళానేతలు.. వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు.. ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు రాష్ట్ర మంత్రి.. అవినీతి మరకల్తో ఆ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి యథాశక్తి తలవంపులుతెచ్చారు. సమర్ధించడానికి కూడా వీలుకాని తీరులో వారి అవినీతి, అక్రమాలు వెలుగులోకి రావడంతో బీజేపీ అగ్రనాయకత్వం నీళ్లు నమిలే పరిస్థితి నెలకొంది. అవినీతి మరకే లేదంటూ ఏడాది పాలన ఉత్సవాలను ఘనంగా జరుపుకుని నెల రోజులైనా గడవకముందే.. తమ మహిళా మంత్రుల నిర్వాకాలు మోదీ సర్కారును తలెత్తుకోలేని స్థాయికి దిగజార్చాయి. విపక్ష అస్త్రాలకు సమాధానమిచ్చేందుకు పార్టీ, ప్రభుత్వంలోని మహామహులైన మాటల మాంత్రికులకే మాటలు దొరకడం లేదు. - సెంట్రల్ డెస్క్ సుష్మా స్వరాజ్ కేంద్ర విదేశాంగ మంత్రి. పార్టీలో, ప్రభుత్వంలో సమర్ధవంతురాలైన కీలక నేత. ఐపీఎల్ స్కామ్‌స్టర్, లలిత్ మోదీకి.. బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు బ్రిటన్ ప్రభుత్వం నుంచి ట్రావెల్ డాక్యుమెంట్స్ లభించేందుకు సహకరించారు. ఆ విషయాన్ని అంగీకరించిన సుష్మా.. లలిత్ భార్య కేన్సర్ చికిత్స కోసం మానవతా దృక్పథంతోనే మాట సాయం చేశానని సమర్ధించుకున్నారు. కానీ తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఉండి, పరారీలో ఉన్న నిందితుడికి సాయం చేయడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదని, సుష్మా రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతున్నాయి. సుష్మా భర్త, కూతురు తనకు న్యాయ సేవలందించారని లలిత్ వెల్లడించడం సుష్మాను ఇబ్బందుల్లోకి నెట్టింది. వసుంధర రాజే బీజేపీ సీనియర్ నేత. రాజస్తాన్ ముఖ్యమంత్రి. లలిత్ మోదీ వ్యవహారంలో రెండో వికెట్. లలిత్ మోదీ బ్రిటన్ వెళ్లేందుకు వీలుగా ఇమిగ్రేషన్ పత్రాలపై సాక్షి సంతకం చేసి ఇరుక్కున్నారు. మొదట, సంబంధిత డాక్యుమెంట్ గురించి తెలియదని, ఆ తరువాత, గుర్తు లేదని సమర్ధించుకున్నారు. తాజాగా, ఆమె సంతకం చేసిన పత్రాలను కాంగ్రెస్ బయటపెట్టడంతో.. సంతకం చేసింది తానేనని, లలిత్‌ని కుటుంబ స్నేహితుడిగా భావించి, ఆ సాయం చేశానని బీజేపీ అగ్ర నాయకత్వానికి రాజే వివరణ ఇచ్చారని సమాచారం. రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ కంపెనీలో లలిత్ పెట్టుబడులు పెట్టిన విషయ మూ వెలుగులోకి రావడం ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. స్మృతి ఇరానీ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి. బీజేపీ కీలక నేత. ఇరానీ విద్యార్హతల అంశం మొదట్నుంచీ వివాదాస్పదమే. తాజాగా ఆమె తన విద్యార్హతలను వివిధ ఎన్నికల సందర్భాల్లో వేర్వేరుగా ఎన్నికల సంఘానికి అఫిడవిట్ల రూపంలో వెల్లడించారని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ(కరస్పాండెన్స్), 2011 రాజ్యసభ ఎన్నికల సమయంలో అదే వర్సిటీ నుంచి బీకాం(కరస్పాండెన్స్), 2014 లోక్‌సభ ఎన్నికలప్పుడు బీకాం (సార్వత్రిక విద్య) చేశానని ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో వేర్వేరుగా పేర్కొన్నారని ఆ పిటిషన్లో ఆరోపించారు. ఆ పిటిషన్‌కు విచారణార్హత ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఇరానీ చిక్కుల్లో పడ్డారు. పంకజ ముండే బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దివంగత గోపీనాథ్ ముండే కూతురు. మహారాష్ట్ర ప్రభుత్వంలో స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి. తాజాగా, ఆమె రూ. 206 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. చిన్నారులకు అందించే ఆహార పదార్ధాలను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక్కరోజులోనే దాదాపు రూ. 115 కోట్ల విలువైన పల్లీ పట్టీ(వేరుశనగ గింజలు, బెల్లంతో చేసే బలవర్ధక ఆహారం) కొనుగోలుకు ఆదేశాలిచ్చారన్నది ఆమెపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఆ పల్లీపట్టీ నాసిరకంగా ఉండటంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో భారీ మొత్తంలోనే చేతులు మారాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.