మలేరియాకు వ్యాక్సిన్‌ రెడీ! | Vaccine For Malaria Developed By Glaxo SmithKline | Sakshi
Sakshi News home page

మలేరియాకు వ్యాక్సిన్‌ రెడీ!

Published Mon, Oct 11 2021 4:12 AM | Last Updated on Mon, Oct 11 2021 4:12 AM

Vaccine For Malaria Developed By Glaxo SmithKline - Sakshi

మలేరియా.. అందరికీ తెలిసిన వ్యాధే. అది పెద్ద ప్రమాదకరమేమీ కాదని అనుకుంటాం. కానీ మన దేశంలో, రాష్ట్రంలో ఏటా లక్షలాది మంది మలేరియా బారినపడుతున్నారు. పెద్దవాళ్లు దీన్ని తట్టుకుంటున్నా ఐదేళ్లలోపు చిన్నారుల్లో వందల మంది చనిపోతున్నారు. మలేరియాకు చాలా కాలం నుంచీ చికిత్స, మందులు అందుబాటులో ఉన్నా.. ప్రయోజనం మాత్రం తక్కువే. అలాంటి మలేరియాకు ఎట్టకేలకు ఓ వ్యాక్సిన్‌ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఈ మలేరియా మహమ్మారి, దాని వ్యాప్తి, చికిత్స, ప్రస్తుత వ్యాక్సిన్‌ వివరాలు తెలుసుకుందామా? 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది మలేరియా బారినపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. 

రోజు విడిచి రోజు బాగా పెరుగుతూ తగ్గుతూ ఉండే జ్వరం, తీవ్ర తలనొప్పి, కండరాల నొప్పులు, చెమటపట్టడం, చేతులు–కాళ్లు వణకడం వంటివి మలేరియా లక్షణాలు. 

దీనితో సుమారు ఏటా నాలుగు లక్షల మంది చనిపోతున్నారు. వీరిలో ఐదేళ్లలోపు పిల్లల సంఖ్యే 2.68 లక్షల మంది వరకు ఉంటోందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 

మలేరియా పరాన్నజీవి ఆడఅనాఫిలిస్‌ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అప్పటికే ఈ వ్యాధి ఉన్న వ్యక్తులను కుట్టిన దోమలు వేరే వ్యక్తులను కుట్టితే వారికీ వ్యాపిస్తుంది. 

వైరస్‌ కాదు.. బ్యాక్టీరియా కాదు.. 
ప్లాస్మోడియం ఫాల్సిపరం అనే అతిచిన్న పరాన్నజీవి (ఏకకణ జీవి–ప్రొటోజోవా) కారణంగా మలేరియా వ్యాధి వస్తుంది. ఇది వైరస్, బ్యాక్టీరియాల వంటి సూక్ష్మజీవి కాదు. వాటికన్నా పెద్దగా ఉంటుంది. 


ఉదాహరణకు ప్లాస్మోడియం క్రిముల పరిమాణం 8–12 మైక్రోమీటర్లు (మైక్రోమీటర్‌ అంటే మీటర్‌లో పదిలక్షల వంతు) ఉంటుంది. అదే వైరస్‌ల పరిమాణం వంద నానోమీటర్ల వరకు (నానోమీటర్‌ అంటే మీటర్‌లో వంద కోట్ల వంతు) ఉంటుంది. అంటే వైరస్‌ల కంటే.. ప్లాస్మోడియం క్రిములు వంద రెట్లు పెద్దగా ఉంటాయి. 

8 లక్షల మందిపై పరిశీలించి.. 
మస్కిరిక్స్‌’వ్యాక్సిన్‌ ప్రాథమిక ప్రయోగాలు 2019లోనే పూర్తయ్యాయి. భద్రతా ప్రమాణాల మేరకు ఉన్నట్టు నిర్ధారించుకున్నాక.. దాని పనితీరు, దీర్ఘకాలిక ప్రభావాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు విస్తృత పరిశోధన చేపట్టారు. గత రెండేళ్లలో ఆఫ్రికా ఖండంలోని ఘనా, కెన్యా, మలావి దేశాల్లో ఎనిమిది లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చి పరిశీలించారు.  


ఆరు వారాల వయసు నుంచి ఏడాదిన్నర వయసున్న పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ ఇస్తారు. 
దీనిని నాలుగు డోసులుగా (అర మిల్లీలీటర్‌ చొప్పున) ఇవ్వాల్సి ఉంటుంది. నెలకో డోసు చొప్పున మూడు డోసులు ఇస్తారు. 18 నెలల (ఏడాదిన్నర) తర్వాత నాలుగో డోసు ఇస్తారు.  
వాస్తవానికి ఈ వ్యాక్సిన్‌ పిల్లలపై 30శాతం ప్రభావవంతంగానే పనిచేస్తుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కానీ లక్షల కొద్దీ కేసులు, వేలకొద్దీ మరణాలు నమోదయ్యే చోట.. ఈ మాత్రమైనా పనిచేసే వ్యాక్సిన్‌ ప్రయోజనకరమని పేర్కొంది. 
ఆఫ్రికాలో 2019 ఒక్క ఏడాదిలోనే 3.86 లక్షల మంది మలేరియాతో మరణించారు. అదే గత ఏడాదిన్నరలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య మాత్రం 2.12 లక్షలే. 

ప్రపంచంలోనే తొలిసారిగా.. 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్‌లు, బ్యాక్టీరియాలతో వచ్చే వ్యాధులకు సంబంధించి చాలా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగాకుండా ఒక పరాన్నజీవికి సంబంధించిన వ్యాక్సిన్‌ విడుదల అవుతుండటం ఇదే మొదటిసారి అని నిపుణులు చెప్తున్నారు. మలేరియాకు వ్యాక్సిన్‌ ప్రయోగాలు చాలా ఏళ్లుగా సాగుతున్నాయి.


కొన్ని సంస్థలు వ్యాక్సిన్లను రూపొందించినా.. అవి సమర్థవంతంగా పనిచేయలేకపోవడం, సైడ్‌ ఎఫెక్టులు ఉండటం వంటి కారణాలతో అనుమతులు పొందలేదు. మస్కిరిక్స్‌ వ్యాక్సిన్‌ను కూడా ఏళ్లపాటు, లక్షలాది మందిపై పరీక్షించిన తర్వాతే అనుమతి ఇచ్చారు. 

వ్యాక్సిన్‌ ఎలా పనిచేస్తుంది?
దోమకాటు వేసినప్పుడు మలేరియా పరాన్నజీవులు మన రక్తంలోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి కాలేయానికి చేరుకుని వాటి సంఖ్యను పెంచుకుంటాయి. తర్వాత మళ్లీ రక్తంలోకి చేరి ఎర్రరక్త కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. ‘మస్కిరిక్స్‌’ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. మలేరియా పరాన్నజీవులు కాలేయంలో చేరి సంఖ్యను పెంచుకోకుండా 
ఈ యాంటీబాడీలు అడ్డుకుంటాయి. 

ప్లాస్మోడియం ప్రొటీన్ల నుంచే.. 
బ్రిటన్‌కు చెందిన గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ (జీఎస్‌కే) ఫార్మా సంస్థ ఈ ‘మస్కిరిక్స్‌’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మలేరియాను కలిగించే ప్లాస్మోడియం ఫాల్సిపరం పరాన్నజీవి పైపొరలో ఉండే ప్రొటీన్ల ఆధారంగా దీనిని రూపొందించారు. 2028 నాటికల్లా కోటిన్నర డోసులు ఉత్పత్తి చేస్తామని, ఉత్పత్తికి అయ్యే ఖర్చుపై కేవలం ఐదు శాతమే ఎక్కువ ధరతో విక్రయిస్తామని జీఎస్‌కే ప్రకటించింది.  


ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లోని చాలా దేశాల్లో మలేరియా సీజనల్‌గా వ్యాప్తి చెందుతుంటుంది. ఏటా లక్షల మంది దీని బారినపడుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం.. 2030 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు కోట్ల మలేరియా వ్యాక్సిన్లు అవసరం కానున్నాయి. 

మన దేశానికి అత్యవసరం! 
ప్రపంచంలో ఆఫ్రికా ఖండం తర్వాత ఎక్కువగా మలేరియా కేసులు నమోదయ్యే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. దేశంలో ఏటా లక్షలాది కేసులు నమోదవుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే టెస్టులు చేసే సౌకర్యాలు లేకపోవడం, మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటంతో అధికారికంగా కేసుల సంఖ్య తక్కువగా ఉంటోందని పేర్కొంటున్నారు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో మలేరియా వ్యాప్తి బాగా తగ్గిపోయిందని వివరిస్తున్నారు. 
2019లో భారత్‌లో సుమారు 56 లక్షల మందికి మలేరియా సోకగా.. 7,700 మంది మరణించినట్టు డబ్ల్యూహెచ్‌వో అంచనా. 
కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది జూలై చివరినాటికి దేశవ్యాప్తంగా 64,520 మలేరియా కేసులు నమోదుకాగా.. 35 మంది చనిపోయారు. 
హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ మన దేశంలో ‘మస్కిరిక్స్‌’ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుందని ఫార్మా వర్గాలు తెలిపాయి.  

ప్రపంచానికి ఓ బహుమతి
మలేరియా వ్యాక్సిన్లపై 30 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. జీఎస్‌కే ఫార్మాతయారు చేసిన ‘మస్కిరిక్స్‌’ వ్యాక్సిన్‌పై పలు దేశాల్లో విస్తృతంగా ప్రయోగం నిర్వహించారు.
ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్‌ను డబ్ల్యూహెచ్‌వో తరఫున సిఫార్సు చేస్తున్నాం.  మలేరియా బాధిత దేశాల్లో పిల్లలకు పెద్ద ఎత్తున ఈ వ్యాక్సినేషన్‌ చేపట్టాలి.


– డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement