ఎమోజీ... అక్షర సందేశాల స్థానంలో నేడు ఎక్కువగా ఉపయోగిస్తున్నది ఇదే. వాట్సాప్ చాట్‌లో ఏదైనా సందేశానికి జవాబు ఇవ్వాలంటే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సాధనమిదే. చాంతాడంత వాక్యాలతో పనిలేకుండా మన భావాన్ని సింపుల్‌గా, సూటిగా, స్పష్టంగా ఒక గుర్తుతో చెప్పే సౌలభ్యం వీటి సొంతం. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎమోజీల వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో 2021లో క్రేజీ ఎమోజీ ఏంటి, ఏఏ ఎమోజీలను ఎక్కువగా వాడారన్న దానిపై యూనికోడ్ కన్సార్టియం ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.
→ఎమోజీ ర్యాంకింగ్ జాబితాలో ఆనందబాష్పాలతో ఉన్న ఎమోజీనే టాప్ పొజిషన్‌లో నిలబడింది. దీనితర్వాత ఎరుపు రంగు హృదయం రెండో స్థానంలో ఉండగా, పగలబడి నవ్వుతూ ఉన్న ఎమోజీకి మూడో స్థానం దక్కింది. నాలుగోస్థానంలో థమ్సప్, బిగ్గరగా ఏడుస్తున్నట్లున్న ఎమోజీకి ఐదో స్థానం దక్కాయి.
→ఎమోజీల్లో వివిధ కేటగిరీలుండగా, ఫ్లాగ్స్ విభాగంలో ఉన్న ఎమోజీలను చాలా తక్కువ మంది వినియోగించినట్లు వెల్లడైంది. అలాగే రవాణా విభాగంలో ‘దూసుకుపోతున్న రాకెట్’ బొమ్మ టాప్‌లో నిలవగా, శరీర భాగాల కేటగిరీలో అయితే చేతికండరాలను చూపుతున్న ఎమోజీని ఎక్కువగా వాడారు.
→తరచుగా వాడిన ఎమోజీల్లో ‘నవ్వుతున్నట్లు ఉన్నవి’, చేతులు’ వంటివి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. జంతువుల ఎమోజీల కన్నా మొక్కలు, పూల ఎమోజీలను ఎక్కువగా వాడారు. పూలు–మొక్కల విభాగాల్లో పుష్పగుచ్ఛం, జంతువుల–పక్షుల విభాగాల్లో సీతాకోకచిలుక టాప్‌లో ఉన్నాయి.
→గత అధ్యయనంలో టాప్–200 జాబితాలో ఉన్న కొన్ని ఎమోజీలు టాప్–50లోకి రావడం విశేషం. గతంలో నిర్వహించిన సర్వేలో ‘బర్త్‌డే కేక్’ 113వ స్థానంలో ఉండగా.. ఈసారి అది 25వ స్థానానికి వచ్చింది. అలాగే గతంలో 139వ స్థానంలో ఉన్న ‘బెలూన్’ ఈసారి మరింత పైకి ఎగిరి 48వ స్థానాన్ని దక్కించుకుంది. దిగాలుగా ఉన్న ఎమోజీ 97వ స్థానం నుంచి 14వ స్థానానికి వచ్చి చేరింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఆరోగ్య విభాగానికి చెందిన రెండు ఎమోజీలే టాప్–100 ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
→మొత్తం ఎమోజీల వాడకం విషయానికొస్తే టాప్–100లో ఉన్నవే 82 శాతాన్ని ఆక్రమిం చాయి. ఈ అధ్యయనం వల్ల ఎక్కువగా వాడే ఎమోజీలేంటే తెలియడంతోపాటు తదుపరి ఎలాంటి వాటిని తీసుకురావొచన్న విషయం కూడా తెలుస్తుందని అంటున్నారు.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment