ఒక్క నిమిషం కరెంటు పోతే.. ఆగమాగం అయిపోతాం. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం విద్యుత్ కావాల్సిందే. ఓ వైపు బొగ్గు వంటి సహజ వనరులు తరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ విద్యుత్‌కు మరెన్నో కష్టాలు.. ఇలాంటి సమయంలోనే ఆకాశం నుంచే కరెంటు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా?
– సాక్షి సెంట్రల్ డెస్క్
భూమ్మీద బొగ్గు తరిగిపోతోంది.. జల విద్యుత్ సరిపోదు.. సౌర విద్యుత్ ఉన్నా.. పగలు మాత్రమే కరెంటు ఉత్ప త్తి అవుతుంది. మబ్బు పట్టినా, ఫలకాలపై దు మ్ముపడినా ఉత్పత్తి తగ్గిపోతుంది. పవన విద్యు త్ వంటి ఇతర మార్గాలు ఉన్నా ఖర్చెక్కువ. నిరంతరంగా ఉత్పత్తి సాధ్యంకాదు. మరె లా అన్న ఆలోచన చేసిన శాస్త్రవేత్తలు.. అంతరిక్షం లో ఉపగ్రహాల తరహాలో భారీ సోలార్ ప్యానె ల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయవచ్చని ప్రతిపాదించారు. జపాన్, యూరోపియన్ యూ నియన్ ఆ దిశగా పరిశోధనలు చేస్తుండగా.. చైనా నేరుగా రంగంలోకి దిగింది. అంతరిక్షంలో అత్యంత భారీ సోలార్ ప్రాజెక్టు చేపట్టే పనిలో పడింది. మరో 14 ఏళ్లలో అంటే 2035 కల్లా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. చదవండి: తాలిబన్ల దమనకాండ
అంతరిక్షంలో సోలార్ ప్రాజెక్టు పనిచేసేదిలా..
చైనా ప్రాజెక్టు ఇదీ..
►భూమికి 23 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ ఏర్పాటుకు చైనా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. అంటే ఆ ప్లాంట్ భూమి తిరిగే వేగంతోనే కదులుతూ.. ఎప్పుడూ ఒకే ప్రాంతంపై ఉంటుంది.
►ప్రాజెక్టులో భాగంగా 2035 సంవత్సరం నా టికి సుమారు 1.6 కిలోమీటర్ల మేరసోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు. ముందు ఒక మెగావాట్ సామర్థ్యంతో మొదలుపెట్టి.. తర్వాత మరింతగా విస్తరిస్తూ వెళతారు.
►2050నాటికి ఒక అణువిద్యుత్ ప్లాంటు స్థాయిలో ఏకంగావెయ్యి మెగావాట్లు ఉత్పత్తి చేసేలా ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ను అభివృద్ధి చేస్తారు.
►ప్రస్తుతం చైనాలోని చోంగ్‌కింగ్ పట్టణం శి వార్లలో ‘బిషన్ స్పేస్ సోలార్ ఎనర్జీ స్టేషన్’ను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ప్రయోగాన్ని మొదలుపెట్టాలని భావిస్తోంది.
►అయితే ఈ భారీ ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలేమీ వెల్లడించలేదు. చదవండి: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..!
ఖర్చు తక్కువే..
2039 నాటికి ‘స్పేస్ ప్లాంట్’ ఏర్పాటు చేయాలని బ్రిటన్‌ను ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా సాధ్యాసాధ్యాలు, ఖర్చుపై ఓ నివేదికను రూపొందించింది. అంతరిక్షంలో ఒక కిలోమీటర్ వెడల్పున ప్లాంట్ ఏర్పాటుకు.. 2 వేల టన్నుల పరికరాలు అవసరమని లెక్కించింది. భూమిపై రిసీవింగ్ స్టేషన్‌ను 95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని అంచనా వేసింది.
ళీ ప్రస్తుతం వెయ్యి యూనిట్ల కరెంటు ఉత్పత్తి కోసం.. అణువిద్యుత్ ప్లాంట్లలో రూ.5 వేలకుపైగా.. భూమ్మీది సౌర, పవన విద్యుత్ ప్లాంట్లలో రూ.3,750 వరకు ఖర్చవుతోందని తెలిపింది. అదే ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ కేవలం రూ.385 మాత్రమే ఖర్చవుతాయని అంచనా వేసింది.
ఓ ఫిక్షన్ నవల నుంచి..
ఐజాక్ అసిమోవ్ రష్యన్ రచయిత 1941లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలో ‘స్పేస్ సోలార్ పవర్ స్టేషన్ల’ గురించి రాశారు. ఆ ప్లాంట్లు సూర్యరశ్మిని మైక్రోవేవ్‌ల రూపంలో వివిధ గ్రహాలపైకి పంపుకొంటారని పేర్కొన్నారు. సోలార్ పవర్ వినియోగం కొత్తగా మొదలైన 1970 దశకంలో కొందరు శాస్త్రవేత్తలు ‘స్పేస్ సోలార్ పవర్’ ప్రతిపాదనలు చేశారు. కానీ అప్పటి పరిస్థితి, భారీ ఖర్చుతో ఏదీ ముందుకుపడలేదు. ఇటీవలి కాలంలో పలు కొత్త టెక్నాలజీలు రావడంతో మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. ఇప్పటికే బ్రిటన్, జపాన్, రష్యా, అమెరికా, చైనా దేశాలు ప్రయోగాలకు సిద్ధమయ్యాయి.
లాభాలు ఎన్నో?
►సూర్యుడి కిరణాల తీవ్రత, రేడియేషన్ ఎ క్కువగా ఉంటాయి.పైగా దుమ్ముపడి సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఉండవు. పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
►భూమ్మీద రోజూ 9–10 గంటల పాటు మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అది కూడా సోలార్ ప్యానెళ్లపై సూర్యరశ్మి నేరుగా పడే ఐదారు గంటలు మాత్రమే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే అంతరిక్షంలో సోలార్ ప్యానెళ్లు పూర్తిగా సూర్యుడివైపే ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. దీనితో రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
►ఈ ప్రత్యామ్నాయ విద్యుత్ కారణంగా.. బొగ్గు, పెట్రోలియం, ఇతర శిలాజ ఇంధనాల వినియోగం నిలిచిపోయి భూమ్మీద కాలుష్యం తగ్గుతుంది.
ఆయుధంగా మారుతుందా?
జేమ్స్‌బాండ్ సినిమాలో ఓ ప్రైవేటు సంస్థ అంతరిక్షంలో సోలార్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. రాత్రిపూట అవసరమైన చోట వెలుగు ఇవ్వొచ్చని చెప్తుంది. కానీ ఆ వ్యవస్థతో సౌరశక్తిని లేజర్ కిరణాల తరహాలో ఒక దగ్గర కేంద్రీకరించి.. విధ్వంసం సృష్టిస్తుంది. ఇది సినిమాని సీన్ అయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లతో అలాంటి ప్రమాదమూ ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుండటం గమనార్హం.
►కావాలని చేయకపోయినా.. స్పేస్ సోలార్ స్టేషన్‌లో సమస్య వచ్చి.. అది భూమిపైకి పంపే మైక్రోవేవ్‌లు/లేజర్ కిరణాలు ప్రజలు ఉండే ప్రాంతాలపై పడితే ఎలాగన్న ప్రశ్నలూ వస్తున్నాయి. మైక్రోవేవ్‌ల వల్ల రేడియేషన్ ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
►అయితే ఇలాంటి ప్రమాదాలు ఉండకుండా.. కచ్చితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కిరణాలు రిసీవింగ్ స్టేషన్ పరిధి దాటి బయట ప్రసరించే పరిస్థితి ఉంటే.. ప్లాంట్ ఆటోమేటిగ్గా ఆగిపోయే ఏర్పాట్లు ఉంటాయని భరోసా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment