పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–నవంబర్ కాలంలో 15 మెగావాట్ల మేర అదనంగా సమకూరినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. క్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త ఏర్పాటు చేసిన 7.54 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం కంటే రెట్టింపుగా ఉందని పేర్కొన్నారు. గత నెలలోనే 2.3 గిగావాట్ల మేర సామర్థ్యం సమకూరినట్టు మంత్రి తెలిపారు.
సీఐఐ నిర్వహించిన ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో అసాధారణమైన బాటలు వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఇంధన శుద్ధి విభాగంలో భారత్ ప్రపంచంలోనే ప్రముఖ దేశంగా అవతరించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ తయారీ సాధించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ 6.1 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించినట్టు మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి: నాయకత్వ స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యం
స్థానికంగానే సోలార్ ప్యానెళ్లు, మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు పీఎల్‌ఐ ద్వారా రూ.24,000 కోట్లు అందించినట్లు మంత్రి గుర్తు చేశారు. 2025–26 నాటికి 38 గిగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఎలక్ట్రోలైజర్ల తయారీకి రూ.4,400 కోట్లు, ఇతర ప్రధాన విడిభాగాలకు రూ.13,050 కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment