న్యూఢిల్లీ: దేశంలోని 100 అగ్రగామి కంపెనీల డైరెక్టర్ల బోర్డుల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా గడిచిన నాలుగేళ్లలో ఇది గణనీయంగా మెరుగుపడినట్టు ‘ఎక్స్‌లెన్స్ ఎనేబులర్స్’ 5వ కార్పొరేట్ గవర్నెన్స్ సర్వే వెల్లడించింది. 2024 మార్చి నాటికి కేవలం ఐదు కంపెనీల్లోనే మహిళా స్వతంత్ర డైరెక్టర్ ఒక్కరూ లేని పరిస్థితి నెలకొన్నట్టు తెలిపింది. ఇవన్నీ ప్రభుత్వరంగ సంస్థలే (పీఎస్‌యూ) కావడం గమనార్హం. నాలుగు పీఎస్‌యూలతోపాటు, ఒక ప్రభుత్వరంగ బ్యాంక్‌లో మహిళా డైరెక్టర్ ఒక్కరూ లేరు.
2021 మార్చి నాటికి అగ్రగామి 100 కంపెనీల్లో మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ లేని కంపెనీలు 21 ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. కంపెనీల బోర్డుల్లో కనీసం ఒక్క మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ అయినా ఉండాలని కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 149 నిర్దేశిస్తోంది. సమర్థత కలిగిన మహిళలను గుర్తించి, కెరీర్ పురోగతి దిశగా అవకాశాలు కల్పించడం ద్వారా బోర్డుల్లో ప్రాతినిధ్యాన్ని పెంచగలమని ఈ సర్వే అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఇంటికి ఆటో స్పేర్‌పార్ట్స్
నిదానంగా పురోగతి..
కంపెనీ బోర్డుల్లో కీలక పదవుల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. 2021 మార్చి నాటికి మహిళా మేనేజింగ్ డైరెక్టర్లు కలిగిన కంపెనీలు రెండు ఉంటే, 2024–25 మార్చి నాటికి ఐదుకు పెరిగినట్టు తెలిపింది. అలాగే, 2021 మార్చి నాటికి రెండు కంపెనీలకు మహిళా ఛైర్‌పర్సన్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఐదుగురు ఈ స్థానానికి చేరుకున్నట్టు వెల్లడించింది. నాయకత్వ బాధ్యతల్లో మహిళల పాత్ర గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పెరుగుతూ వచ్చినట్లు తెలిపింది. లింగ సమానత్వం మెరుగ్గా లేకపోయినప్పటికీ.. కీలకమైన పాలన బాధ్యతల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment