బీ2బీ క్విక్ కామర్స్‌లోకి మైటీవీఎస్
చెన్నై: టీవీఎస్ మొబిలిటీ గ్రూప్‌లో భాగమైన మైటీవీఎస్ తాజాగా భారత్‌లో తొలిసారిగా బిజినెస్ టు బిజినెస్ క్విక్ కామర్స్‌లోకి ప్రవేశించింది. మైటీవీఎస్ యాప్‌లో ఆర్డర్ ఇచ్చిన రెండు గంటల్లో వాహన విడిభాగాలు, లూబ్రికెంట్స్‌ను రిటైలర్లు, వ్యాపార భాగస్వాములకు చేరుస్తారు. మూడేళ్లలో దేశవ్యాప్తంగా 250 డార్క్ స్టోర్లను మైటీవీఎస్ హైపర్‌మార్ట్ పేరుతో ఏర్పాటు చేస్తామని సంస్థ ఎండీ జి.శ్రీనివాస రాఘవన్ తెలిపారు.
2025 మార్చి నాటికి 50 డార్క్ స్టోర్లు అందుబాటులోకి వస్తాయని రాఘవన్ పేర్కొన్నారు. ‘ఈ దుకాణాలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరఫరా వ్యవస్థ సాంకేతికతను ఉపయోగించుకుంటాయి. సరైన ఉత్పత్తిని సరైన స్థలం, సమయానికి అందజేస్తాం. కన్‌సైన్‌మెంట్ ఇన్వెంటరీ విధానాన్ని అమలు చేస్తాం. రిటైలర్లు భారీగా స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వర్కింగ్ క్యాపిటల్ భారం తగ్గుతుంది’ అని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్
అతిపెద్ద డిజిటల్ కేటలాగ్..
పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కంపెనీ తమిళనాడు, కర్ణాటకలో 14 డార్క్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం అయిందని రాఘవన్ చెప్పారు. ఇది ప్రతి స్టోర్‌కు లాభదాయకతను పెంచుతుందని, మూడు నెలల్లో భాగస్వామి రిటైలర్‌లకు అత్యుత్తమ రాబడిని అందించిందన్నారు. వాణిజ్య, ప్యాసింజర్ వాహనాల కోసం విడిభాగాలు, లూబ్రికెంట్స్ విభాగంలో 1.2 కోట్లకుపైగా స్టాక్–కీపింగ్ యూనిట్లతో దేశంలో అతిపెద్ద డిజిటల్ కేటలాగ్ నిర్మించామని తెలిపారు. 2025 నాటికి భారత్‌లో 50,000 గరాజ్‌లు, రిటైలర్లను కనెక్ట్ చేయాలన్నది లక్ష్యమని వివరించారు. ప్రస్తుతం మైటీవీఎస్ 1,000కు పైగా సర్వీసింగ్ కేంద్రాలను నిర్వహిస్తోంది. 10 లక్షలకుపైగా కస్టమర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment