Wind power
-
పెరిగిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం.. ఎంతంటే..
పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–నవంబర్ కాలంలో 15 మెగావాట్ల మేర అదనంగా సమకూరినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. క్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త ఏర్పాటు చేసిన 7.54 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం కంటే రెట్టింపుగా ఉందని పేర్కొన్నారు. గత నెలలోనే 2.3 గిగావాట్ల మేర సామర్థ్యం సమకూరినట్టు మంత్రి తెలిపారు.సీఐఐ నిర్వహించిన ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో అసాధారణమైన బాటలు వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఇంధన శుద్ధి విభాగంలో భారత్ ప్రపంచంలోనే ప్రముఖ దేశంగా అవతరించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ తయారీ సాధించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ 6.1 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించినట్టు మంత్రి వెల్లడించారు.ఇదీ చదవండి: నాయకత్వ స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యంస్థానికంగానే సోలార్ ప్యానెళ్లు, మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ ద్వారా రూ.24,000 కోట్లు అందించినట్లు మంత్రి గుర్తు చేశారు. 2025–26 నాటికి 38 గిగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఎలక్ట్రోలైజర్ల తయారీకి రూ.4,400 కోట్లు, ఇతర ప్రధాన విడిభాగాలకు రూ.13,050 కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించినట్టు చెప్పారు. -
జీడబ్ల్యూఈసీ ఇండియా ఛైర్పర్సన్ నియామకం
గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్(జీడబ్ల్యూఈసీ) ఇండియా ఛైర్‌పర్సన్‌గా గిరీష్ తంతిని నియమించారు. ఆయన ప్రస్తుతం సుజ్లాన్ ఎనర్జీ సంస్థలో వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగా జీడబ్ల్యూఈసీ విడుదల చేసిన ప్రకటనలో ‘దేశంలో పవన విద్యుదుత్పత్తి, సరఫరా సామర్థ్యాన్ని పెంపొందించాల్సి ఉంది. అందుకు అవసరమయ్యే విధివిధానాలు రూపొందించడానికి జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జీడబ్ల్యూఈసీ పనిచేస్తోంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద పవన విద్యుత్తు విపణిగా, సముద్ర తీర గాలితో 46 గిగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా మనదేశం ఎదగడానికి గిరీష్ తంతి నాయకత్వం సహకరిస్తుంది’ అని తెలిపింది.ఇదీ చదవండి: పైలట్ల కొరత తీర్చేందుకు ప్రత్యేక శిక్షణజీడబ్ల్యూఈసీ 80కు పైగా దేశాల్లోని సుమారు 1,500 కంపెనీలు, డెవలపర్లు, కాంపోనెంట్ సరఫరాదారులు, పరిశోధనా సంస్థలు, జాతీయ పునరుత్పాదక సంఘాలు, ఫైనాన్స్, బీమా కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. -
టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!
భూ భ్రమణం, ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య తేడావల్ల గాలులు ఏర్పడి ఒకవైపు నుంచి మరోవైపునకు వీస్తాయి. ఈ గాలి ఎందుకు అవసరం అంటే వెంటనే ఏం చెబుతాం.. గాలి పీల్చకుండా బ్రతుకలేమని అంటాం. వాతావరణ మార్పులకు గాలి అవసరం అని చెబుతాం. అయితే ఇటీవల నెలకొంటున్న పరిస్థితుల వల్ల గాలి అవసరాలు పెరుగుతున్నాయి. గాలి నెమ్మదిగా మన వరండా నుంచి గుమ్మం ద్వారా మన టీవీలో చేరి వినోదాన్ని అందిస్తోంది. మన మొబైల్లో ప్రవేశిస్తోంది. మన మిక్సీలో పిండి రుబ్బేందుకు సహాయం చేస్తోంది. అదేంటి గాలి ఇన్ని పనులు చేస్తోందా అని ఆశ్చర్యపోతున్నారా.. క్రమంగా పవన విద్యుత్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆయా ప్రాజెక్ట్‌ల్లో తయారైన కరెంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి నిత్యావసరాలకు వాడుతున్నాం. ఈరోజు గ్లోబల్ విండ్ డే సందర్భంగా పవన విద్యుత్‌కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.వాస్తవానికి 3500 ఏళ్ల కిందటే పవనశక్తిని కనుగొన్నా.. భౌగోళిక, సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా అంతగా అభివృద్ధి చెందలేదు. పారిస్ వాతావరణ ఒప్పందం తరవాత అనేక దేశాలు పవన విద్యుత్తుపై దృష్టి సారిస్తున్నాయి. భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసేందుకు, కర్బన ఉద్గారాలను కట్టడి చేసేందుకు, ఇంధన సుస్థిరతను సాధించేందుకు పునరుద్ధరణీయ ఇంధన వనరులు దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగమవుతున్న ఇంధనాల్లో వీటి వాటా 41శాతం. అందులోనూ పవన విద్యుత్తు 11శాతానికే పరిమితమైంది. సౌర విద్యుత్తు తరవాత చౌకగా లభ్యమయ్యేది పవన విద్యుత్తే. థర్మల్ విద్యుత్తు కంటే దీన్ని సుమారు 35శాతం తక్కువ ఖర్చుకే ఉత్పత్తి చేయవచ్చు.ప్రపంచవ్యాప్తంగా భారత్ పవన విద్యుత్తు తయారీలో నాలుగో స్థానం(42.87 గిగావాట్లు)లో ఉంది. మొదటి స్థానంలో చైనా 288.32 గిగావాట్లు, తరవాతి స్థానాల్లో వరుసగా అమెరికా (122.32 గిగావాట్లు), జర్మనీ (62.85 గిగావాట్లు) ఉన్నాయి. డెన్మార్క్ తన విద్యుత్తు అవసరాలన్నింటికీ పూర్తిస్థాయిలో పవనశక్తినే ఉపయోగిస్తోంది. భారతదేశానికి మూడు వైపులా సుమారు 7,600 కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉంది. నేషనల్ విండ్‌పవర్ కార్పొరేషన్, ప్రపంచ బ్యాంకుల సంయుక్త నివేదిక ప్రకారం..సముద్ర తీరాల వద్ద సుమారు 300 గిగావాట్ల సామర్థ్యంతో, ఇతర ప్రాంతాల్లో 195 గిగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పే అవకాశముంది. 2030 నాటికి 450 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన పునరుద్ధరణ ఇంధన వనరుల విద్యుదుత్పత్తి కేంద్రాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పవనశక్తి ద్వారా 140 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించాలని నిర్ణయించింది. కానీ, నేటికీ పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 42.87 గిగావాట్లకే పరిమితమైంది.రాష్ట్రాలవారీగా పవన విద్యుత్తు స్థాపిత సామర్థ్యంతమిళనాడు 9.62 గిగావాట్లుగుజరాత్ 8.58మహారాష్ట్ర 5.1కర్ణాటక 4.98రాజస్థాన్ 4.34ఆంధ్రప్రదేశ్ 4.11తెలంగాణ 0.12 గిగావాట్లపునరుత్పాదక ఇంధన వనరుల్లో సౌరశక్తి కూడా ప్రధానపాత్ర పోషిస్తోంది. పవన విద్యుత్తు, సౌరశక్తి మధ్య ప్రధాన తేడాలు గమనిస్తే..సౌరశక్తి పగటిపూటే లభ్యమవుతుంది. విద్యుత్తు వినియోగం మాత్రం రాత్రి వేళల్లో ఎక్కువగానే ఉంటుంది. దాంతో గ్రిడ్ స్థిరత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. బ్యాటరీ నిల్వల ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉన్నప్పటికీ, ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పవనశక్తి లభ్యత రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. సౌర, పవన విద్యుత్తులను సమ్మిళితం చేయడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
‘విండ్‌పవర్ కొనుగోలు నిలిపివేయలేదు’
సాక్షి, అమరావతి : విండ్‌పవర్ కొనుగోలు నిలిపివేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని విద్యుత్ శాఖ కార్యదర్శి ఎన్. శ్రీకాంత్ స్పష్టం చేశారు. వారం రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయని, దీంతో ఉత్పత్తి తగ్గిందన్నారు. గాలి వీచే వేగాన్ని బట్టి విండ్ పవర్ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ మార్పు వల్ల ఉత్పత్తిలో భారీ హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 4 వేల మెగావాట్ల విండ్ పవర్ సామర్థ్యం ఉంటే.. ప్రస్తుతం 40 మెగావాట్లు మాత్రమే వస్తుందన్నారు. థర్మల్ కేంద్రాల ఉత్పత్తిని స్థిరీకరించడానికి ముమ్మర చర్యలు చేపట్టామని శ్రీకాంత్ వెల్లడించారు. -
దోపిడీకి ‘పవర్’ఫుల్ బ్రేక్
సాక్షి, అమరావతి: ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల పేరిట సాగుతున్న దోపిడీకి కళ్లెం వేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. ప్రజలకు చౌకైన విద్యుత్ ఇవ్వాలన్న సర్కారు లక్ష్యానికి అత్యున్నత న్యాయస్థానం తీర్పు బలాన్నిచ్చింది. పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి(ఏపీఈఆర్సీ) అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిపుణులు స్వాగతిస్తున్నారు. ఆరు నెలల్లో కమిషన్ విచారణ పూర్తయి, కొత్త టారిఫ్ ఇచ్చే వరకూ పవన విద్యుత్ ధర యూనిట్‌కు రూ.2.43 చొప్పున చెల్లించాలని సూచిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఏపీఈఆర్సీ ముందు తమ వాదన బలంగా వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్రం సూచించిన దానికన్నా అధికంగా కొనుగోలు గత ప్రభుత్వం పవన విద్యుత్‌కు అత్యధిక ధర చెల్లిస్తూ ఒప్పందాలు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో పవన విద్యుత్ కొనుగోలును ప్రోత్సహించింది. దీనికోసం తక్కువ ధరకు లభించే ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్‌కు సైతం కోత పెట్టారు. పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లను అడ్డగోలుగా ప్రోత్సహించడం వల్ల గత ఐదేళ్లలో విద్యుత్ సంస్థలపై(డిస్కంలు) రూ.5,497.3 కోట్ల అదనపు భారం పడింది. మార్కెట్లో థర్మల్ విద్యుత్ యూనిట్ రూ.4.20కే లభిస్తోంది. కానీ, పవన విద్యుత్‌ను యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే దాంట్లో పవన, సౌర విద్యుత్ కలిపి 13,142 మిలియన్ యూనిట్లు ఉంటోంది. ఇందులో పవన విద్యుత్ వాటా 9,000 మిలియన్ యూనిట్లు. పవన విద్యుత్ అంశంలో ఎవరి పాత్ర ఎంత? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రైవేటు విద్యుత్ దోపిడీ నియంత్రణపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రైవేటు సంస్థల నుంచి కరెంటు కొనుగోళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో వాస్తవాలు వెల్లడయ్యాయి. ఇతర రాష్ట్రాల కన్నా ఏపీలోనే పవన విద్యుత్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. కరెంటు కొనుగోళ్ల పేరిట సాగుతున్న దోపిడీని అరికట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను పవన విద్యుత్ ఉత్పత్తిదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర స్థాయిలో రాష్ట్రానికి లేఖలు రాయించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టులో ప్రభుత్వం బలమైన వాదనలు విన్పించగలిగింది. పవన విద్యుత్ వల్ల వినియోగదారులకు జరిగే నష్టమేంటో చెప్పడంలో సఫలమైంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి విద్యుత్ అధికారులతో భేటీ అయ్యారు. పవన విద్యుత్ విషయంలో శాస్త్రీయ వాదనను ఏపీఈఆర్సీ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పరిమితికి మించి పవన విద్యుత్‌ను ప్రోత్సహించడంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే కోణంలోనూ ఆయన విచారణ చేపట్టారు. ఇప్పటికే కొందరు అధికారులకు సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. అధికారులపై ఎవరి ఒత్తిడి పనిచేసిందనే విషయాలను రాబడుతున్నారు. న్యాయ విచారణ చేపట్టాలి ‘‘హైకోర్టు తీర్పు హర్షణీయం. కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు వెళ్లకుండా యూనిట్ రూ.4.84 చొప్పున జనరిక్ టారిఫ్ ఇవ్వడానికి ఏపీఈఆర్సీ ఎందుకు సాహసిందనేది తేల్చాల్సి ఉంది. దీని వెనుక ఎవరికి ఎలాంటి మేలు జరిగింది? అనేది బయటపడాలి. గత ఐదేళ్లలో జరిగిన పవన విద్యుత్ కొనుగోళ్లపై న్యాయ విచారణ చేపట్టాలి.’’ – వేణుగోపాల్, విద్యుత్ రంగ విశ్లేషకులు వినియోగదారులకు మేలు ‘‘పవన విద్యుత్ ధరను యూనిట్‌కు రూ.2.43కు తగ్గిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల వినియోగదారులకు మేలు జరుగుతుంది. విద్యుత్ సంస్థల బలోపేతానికి ప్రభుత్వం సాహసోపేతంగా అడుగులు వేయడం అభినందనీయం’’ – వేదవ్యాస్, ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీపీఏలను తప్పకుండా సమీక్షించాలి ‘‘విద్యుత్ సంస్థలను బతికించాలన్న నిజాయతీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. పవన విద్యుత్ ధరలను సమీక్షించాలన్న ఆలోచనను ప్రజల కోణం నుంచి చూడాలి. కేంద్రంతో సహా ఎవరు అడ్డుపడ్డా ప్రజలకు నష్టమే. అవసరం ఉందా లేదా అనేది చూడకుండా, వ్యక్తుల అవసరాల కోసమే చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏ) తప్పకుండా సమీక్షించాలి. – టీవీ రావు, జన విజ్ఞాన వేదిక, జాతీయ ప్రధాన కార్యదర్శి -
పవన విద్యుత్ కొనుగోలుతో నష్టాలే
పవన విద్యుత్ కొనుగోలు వల్ల డిస్కంలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని దక్షిణాది రాష్ట్రాలు ఏకాభిప్రాయానికొచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.3.50 చొప్పున కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు అవసరమైన లైన్లు వేయడానికి డిస్కంలు అప్పులు చేసి, వడ్డీలు కట్టాల్సి వస్తోందని, చివరకు ఆ భారం వినియోగదారులపైనే పడుతోందని కేంద్రానికి తెలపాలని నిర్ణయించాయి. సాక్షి, అమరావతి: యూనిట్ రూ.2కే లభించే కరెంటును వదిలేసి, రూ.6.04 చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటే అది ఎంత నష్టదాయకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన విద్యుత్(విండ్ పవర్) కొనుగోలు వ్యవహారంలో అక్షరాలా ఇదే జరుగుతోంది. పవన విద్యుత్‌కు పెద్దపీట వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) భారీగా నష్టపోతున్నాయని కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించాయి. పవన విద్యుత్‌ను విధిగా తీసుకోవాల్సి వస్తే రాష్ట్ర డిస్కంలకు కేంద్రం పరిహారం చెల్లించాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేయాలని భావిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల(సదరన్) జోనల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 27వ తేదీన చెన్నైలో జరగనుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పవన విద్యుత్ కొనుగోలు షరతుపైనే ప్రధానంగా చర్చించాలని కౌన్సిల్ తీర్మానించింది. ఇందుకు సంబంధించిన 11 అంశాల అజెండాను ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖతో పాటు అన్ని దక్షిణాది రాష్ట్రాలకు పంపింది. ఈ ఎజెండాతో ఏపీ ఇంధన శాఖ పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు ఆ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి చెప్పారు. పవన విద్యుత్‌పై కమిటీ సమావేశంలో చర్చించి, తీర్మానాన్ని కేంద్రానికి పంపేందుకు అన్ని విధాలా తోడ్పాటునిస్తామని స్పష్టం చేశారు. ఒక్కో యూనిట్ ధర రూ.6.04 దేశంలో పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రతిఏటా పెంచాలని కేంద్రం 2015లో నిర్ణయించింది. దీంతో దక్షిణాది రాష్ట్రాలు కూడా పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. ఏపీలో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఇండియన్ ఎనర్జీ ఎక్ఛ్సేంజ్ లెక్కల ప్రకా>రం బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ రూ.2 లోపే లభిస్తోంది. కానీ ముందే కుదుర్చుకున్న పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) కారణంగా పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.4.84 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ట్రాన్స్‌కో పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు ట్రాన్స్మిషన్ లైన్లు కూడా అవసరమైన మేర వేయలేకపోయింది. దీంతో పూర్తిస్థాయిలో ట్రాన్స్మిషన్ లైన్లు లేకుండానే పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఫలితంగా సబ్ స్టేషన్లపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు రాష్ట్ర వినియోగంలో 21 శాతం సంప్రదాయేతర ఇంధన వనరులుంటున్నాయి. మార్కెట్లో యూనిట్ రూ.2కే లభించే విద్యుత్‌ను పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా తీసుకోలేకపోతున్నారు. మరోవైపు యూనిట్ రూ.4.20కే లభించే థర్మల్ విద్యుత్‌ను కూడా ఆపేయాల్సి వస్తోంది. పైగా పీపీఏలున్న పవన విద్యుత్ కేంద్రాలకు యూనిట్‌కు రూ.1.20 చొప్పున ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పవన విద్యుత్ ధర యూనిట్‌కు ఏకంగా రూ.6.04 వరకూ పడుతోంది. రూ.2కే లభించే విద్యుత్‌తో పోలిస్తే దాదాపు ఇది రూ.4 అదనం కావడం గమనార్హం. -
లైన్లు లేకున్నా లైన్ క్లియర్!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఏపీ ట్రాన్స్‌కోలో చోటు చేసుకున్న మరో అవినీతి వ్యవహారం తెరపైకి వచ్చింది. అనంతపురం జిల్లాలో అసలు సరిపడా లైన్లే లేకుండా పవన విద్యుత్‌కు అనుమతులు మంజూరు చేయడం విద్యుత్ వర్గాలనే విస్మయానికి గురి చేస్తోంది. విండ్ పవర్ లాబీ, విద్యుత్ అధికారులు, టీడీపీ పెద్దలు కలసికట్టుగా ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్ పరిశీలనలో వెల్లడైంది. 2017లో జరిగిన ఈ వ్యవహారంపై ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం ఇటీవల ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందచేసింది. అవసరం లేకుండా ప్రైవేట్ పవన విద్యుత్‌కు గత సర్కారు ఎలా పెద్దపీట వేసిందో నిపుణుల కమిటీ ఇప్పటికే నిగ్గు తేల్చడం తెలిసిందే. లోపాయికారీ ఒప్పందంతో అనుమతులు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పవన విద్యుత్‌ను యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం అనుమతించింది. నిజానికి ఆ సమయంలో అన్ని రాష్ట్రాలు బిడ్డింగ్ ద్వారానే పవన విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. అయితే విండ్ లాబీతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందంతో టీడీపీ పెద్దలు అడ్డగోలుగా అనుమతులిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సరిపడా ట్రాన్స్‌కో లైన్లు లేకున్నా పవన విద్యుత్ కొనుగోలుకు ట్రాన్స్‌కో అధికారులు పచ్చజెండా ఊపడం గమనార్హం. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై వ్యక్తమైన ఆరోపణలను అధికారులు తొక్కిపెట్టారు. సగానికి పైగా అదనం ఉరవకొండ పరిధిలో పవన విద్యుదుత్పత్తికి పలు బడా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తారు. ఇందుకు విద్యుదుత్పత్తి జరిగే ప్రదేశంలో 400 కేవీ సబ్స్టేషన్లు, లైన్లు ఏర్పాటు చేయాలి. 2017 నాటికి ఏపీ ట్రాన్స్‌కో కేవలం 997 మెగావాట్ల విద్యుత్ తీసుకునేందుకు వీలుగా ట్రాన్స్‌కో లైన్లను విస్తరించింది. కానీ గత ప్రభుత్వం ఏకంగా 1,851 మెగావాట్ల మేర విద్యుత్ తీసుకునేందుకు విండ్ ఉత్పత్తిదారులకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. దీన్ని ఆసరాగా చేసుకుని పవన విద్యుత్ ఉత్పత్తిదారులు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వాటిని అడ్డం పెట్టుకుని బ్యాంకు లోన్లు తీసుకున్నారు. వీటిల్లో మాజీ ముఖ్యమంత్రికి బినామీగా వ్యవహరించిన వ్యక్తులకు సంబంధించిన పవన విద్యుత్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఓ పవన విద్యుత్ సంస్థ విద్యుత్ శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తికి పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చినట్టు తేలింది. టీడీపీకి చెందిన స్థానిక నేత ఒకరు మాజీ ముఖ్యమంత్రికి విండ్ లాబీ నుంచి భారీగా ముడుపులు ఇప్పించినట్టు విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఎలాంటి లైన్లు లేకుండానే 854 మెగావాట్ల మేర పవన విద్యుత్ ఉత్పత్తికి అధికారులు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే అప్పటికప్పుడు కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా వేరే ప్రదేశం నుంచి 500 ఎంవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను కూడా ఉరవకొండ ప్రాంతంలో బిగించడం విశేషం. ఓ అధికారి కీలక పాత్ర ట్రాన్స్‌కోలో డిప్యుటేషన్‌పై పనిచేసిన ఓ అధికారి పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన విద్యుత్ లాబీకి, మాజీ ముఖ్యమంత్రికి మధ్య ఆయనే బేరసారాలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు అప్పటి ఇంధనశాఖ ముఖ్య అధికారి ప్రమేయం కూడా ఉందని విజిలెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. ఉరవకొండ ప్రాంతంలో సరిపడా లైన్లు లేవని, సామర్థ్యానికి మించి పవన విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు ఇవ్వడం సరికాదని స్థానిక అధికారులు నివేదికలు పంపినా డిçప్యుటేషన్‌పై వచ్చి ట్రాన్స్‌కోలో పనిచేసిన అధికారి వినలేదని తెలిసింది. నివేదికలు ఇచ్చిన ఇంజనీర్లను పిలిచి మందలించినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం అప్పటి సీఎం ఆదేశాల మేరకు జరిగిందని, ఇంధనశాఖ ముఖ్య అధికారి ఇంజనీర్లను సైతం బెదిరించినట్టు తెలిసింది. గత్యంతరం లేక క్షేత్రస్థాయి ఇంజనీర్లు ఉన్నతాధికారుల మాట వినాల్సి వచ్చిందని విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనేది పూర్తి స్థాయి నివేదికలో తేలనుంది. -
డిస్కమ్‌లను కొట్టి.. ‘ప్రైవేట్’కు పెట్టి..
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తవ్వేకొద్దీ ఆశ్చర్యకరమైన అనేక అంశాలు వెలుగుచూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పీపీఏల తీరుపై ఇటీవల ఆ కమిటీ ప్రభుత్వానికి సవివరమైన నివేదిక సమర్పించింది. వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకు దోచిపెట్టేందుకు నాటి టీడీపీ సర్కార్ ఏమాత్రం వెనుకాడలేదని స్పష్టమైంది. అవసరం లేకున్నా పరిమితికి మించి పవన, సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడంవల్ల విద్యుత్ పంపిణీ సంస్థలపై రూ.2,655 కోట్ల అదనపు భారం పడిందని కమిటీ గణాంకాలతో సహా వివరించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పవన విద్యుత్‌ను యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసింది. 2015–16 నుంచి 2018–19 వరకూ ఏకంగా 24,174 మిలియన్ యూనిట్ల మేర లభ్యతలో ఉన్న విద్యుత్‌ను నిలిపివేశారు. ఇందులో సోలార్, విండ్ కొనుగోలు (మస్ట్ రన్) కోసం 21,251 మిలియన్ యూనిట్లుఆపేశారు. ఇలా ఆపేయడంవల్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు యూనిట్‌కు రూ.1.29 చొప్పున విద్యుత్ తీసుకోకపోయినా చెల్లించారు. ఈ భారం ఏకంగా రూ.1,731 కోట్లుగా గుర్తించారు. ఇదే పరిస్థితి కొనసాగితే విద్యుత్ పంపిణీ సంస్థలు అప్పుల ఊబిలోకి వెళ్తాయని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. కమిటీ సిఫార్సులు - 2017 తర్వాత ఏపీఈఆర్సీ ముందుకొచ్చిన 21 పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను నిలిపివేయాలి. - గత ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి సంబంధించిన థర్మల్ విద్యుత్ సంస్థ సింహపురి ఎనర్జీ నుంచి విద్యుత్ కొనుగోలు ప్రతిపాదన సమీక్షించాలి. ఆ కంపెనీ ఇప్పటికీ బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదు. అనేక నిబంధనలు ఈ సంస్థ అనుసరించలేదు. కాబట్టి దీన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. - ఏపీ జెన్కోకు చెందిన ఆర్టీపీపీ స్టేజ్–4 పీపీఏ ఏపీఈఆర్సీ వద్దే పెండింగ్‌లో ఉంది. దీన్ని వీలైనంత త్వరగా ఆమోదించాలి. ట్రిబ్యునల్ ఆర్డర్‌ను బట్టి హిందూజా పవర్ తీసుకునే విషయాన్ని పరిశీలించాలి. గత ప్రభుత్వం అనుమతించిన హైబ్రిడ్ (విండ్, థర్మల్, సోలార్ కలిపి) విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఏపీలో 19,660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యముంది. ఇందులో 7,387 మెగావాట్ల సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన విద్యుత్ వాటా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సోలార్, విండ్ను అవసరం మేరకు అనుమతించాలి. అనవసరంగా కొనుగోలు సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచాలని రాష్ట్రాలకు టార్గెట్ పెట్టింది. దీంతో నాటి టీడీపీ సర్కార్ దీన్ని అవకాశంగా తీసుకుని అప్పటి నుంచి పవన, సౌర విద్యుత్‌ను కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువకు కొనుగోలు చేసింది. ఫలితంగా 2015–16 నుంచి 2018–19 వరకు 20,285 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగిలిపోయింది. దీంతో జెన్కో, దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాల నుంచి చౌకగా లభించే విద్యుత్‌ను 24,174 మిలియన్ యూనిట్ల మేర నిలిపివేశారు. అలాగే, యూనిట్‌కు రూ.1.29 చొప్పున రూ.1,731 కోట్లు విద్యుత్ తీసుకోకుండానే స్థిర విద్యుత్‌ను చెల్లించారు. మరోవైపు.. పవన విద్యుత్ ధరలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ తగ్గినా ఏపీలో మాత్రం రూ.4.84 చెల్లించారు. చౌకగా లభించే థర్మల్ విద్యుత్‌తో పోలిస్తే 2015–16 నుంచి 2018–19 వరకూ మొత్తం రూ.2,655 కోట్లు అదనంగా చెల్లించారు. ఈ నేపథ్యంలో కమిటీ కొన్ని సిఫార్సులను చేసింది. -
పవన విద్యుత్ వెనుక ‘బాబు డీల్స్’ నిజమే
రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. మిగులు విద్యుత్‌ను విక్రయించే స్థితిలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కొత్తగా.. అదికూడా యూనిట్ రూ.4.84 చొప్పున పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. – కేబినెట్ ఫైలులో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ సాక్షి, అమరావతి: అప్పట్లో మిగులు విద్యుత్ పుష్కలంగా ఉంది. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా, ఇంధన శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలు చేయడం సరికాదని నెత్తీనోరూ బాదుకున్నారు. అయినా.. అడ్డగోలు ఒప్పందాలతో అధిక ధరలు చెల్లించి మరీ మాజీ సీఎం చంద్రబాబు విద్యుత్ కొనుగోలు చేశారు. ఈ వ్యవహారం వెనుక ‘చంద్రబాబు డీల్స్’ నడిచాయని తేటతెల్లమవుతోంది. పవన విద్యుత్ కొనుగోలును అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్, అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, అప్పటి ఆర్థిక శాఖ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారి మాటల్ని ఖాతరు చేయని చంద్రబాబు 2017 సెప్టెంబర్ 9న కేబినెట్ సమావేశం నిర్వహించి.. అధిక ధరకు (యూనిట్ రూ.4.84) పవన విద్యుత్ కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పీపీఏల సమీక్ష సరికాదట రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రైవేట్ పవన, సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలావుంటే.. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం విలేకరుల సమావేశం నిర్వహించి ఒప్పందాలను ఎందుకు సమీక్షిస్తున్నామనే విషయాన్ని వెల్లడించారు. దీనిపై చంద్రబాబు నాయుడు బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పీపీఏలను సమీక్షించడం సరికాదని, అన్ని ఒప్పందాలను సక్రమంగానే చేసుకున్నామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. కేబినెట్ ఫైలులో స్పష్టం చేసినా.. సుజ్లాన్ అండ్ యాక్సిస్ ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి 837.20 మెగావాట్ల పవన విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన కేబినెట్ ఫైలులో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌తో పాటు ఆర్థిక శాఖ అధికారులూ ఆ కేబినెట్ ఫైలులో పవన విద్యుత్ కొనుగోళ్లను గట్టిగా వ్యతిరేకించారు. పవన విద్యుత్‌ను ఎందుకు కొనుగోలు చేయకూడదో కేబినెట్ ఫైలులో స్పష్టం చేశారు. అయినా.. వారి అభిప్రాయాలను తోసిరాజన్న చంద్రబాబు ఎక్కువ ధరకు పవన విద్యుత్ కొనుగోలు చేశారు. ఈ విషయం 2017 సెప్టెంబర్ 9న చంద్రబాబు నిర్వహించిన కేబినెట్ సమావేశం అజెండాలోని సుజ్లాన్ అండ్ యాక్సిస్ నుంచి పవన విద్యుత్ కొనుగోలు వ్యవహారం బట్టబయలు చేస్తోంది. ఎస్పీడీసీఎల్ నిరాకరించినా.. గత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కో–ఆర్డినేషన్ కమిటీ (ఏపీ పీసీసీ) 2017 ఫిబ్రవరి 4న సమావేశమై 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–21 వరకు 837.20 మెగా వాట్ల పవన విద్యుత్ కొనుగోలుపై చర్చించింది. ఈ సమావేశంలో ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకునేందుకు నిరాకరించింది. జాతీయ టారిఫ్ పాలసీ (ఎన్టీపీ) 2016లో నిర్ధారించిన మేరకు సంప్రదాయేతర ఇంధన వనరులను పోటీ టెండర్ల (కాంపిటేటివ్ బిడ్డింగ్) ద్వారానే కొనుగోలు చేయాలని స్పష్టం చేసిందని ఇందుకు ఇంకా మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేయలేదని, ఏపీ పీసీసీ పేర్కొంది. కాంపిటేటివ్ బిడ్డింగ్ మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. రూ.వెయ్యి కోట్ల భారం విద్యుత్ వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరులు ఉండాలనే ఏపీ ఈఆర్సీ నిబంధనలను ఇప్పటికే అమలు చేసినందున కొత్తగా పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అప్పటి ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ కేబినెట్ ఫైలులో స్పష్టం చేశారు. సర్కారు నిర్ణయాన్ని అమలు చేస్తే తక్కువ ధరకు ఇప్పటికే విద్యుత్ ఇస్తున్న ప్రాజెక్ట్‌లను మూసివేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల డిస్కమ్‌లపై అదనపు ఆర్థిక భారం పడుతుందని స్పష్టం చేశారు. సుజ్లాన్ అండ్ యాక్సిస్ నుంచి 837.20 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తే ఏటా రూ.250 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.వెయ్యి కోట్ల మేర డిస్కమ్‌లపై అదనపు భారం పడుతుందని వెల్లడించారు. సుజ్లాన్ అండ్ యాక్సిస్ సంస్థకు పారిశ్రామిక విధానంలో రాయితీలు కల్పించినందున పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. అప్పటికే రాష్ట్రంలో 12,014 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులు ఉందని, మరో మూడేళ్ల వరకు అదనపు విద్యుత్ కొనాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఏపీ డిస్కమ్స్ ఏ కంపెనీలతోనూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదని, భవిష్యత్‌లో కొనాల్సి వస్తే టెండర్ల ద్వారానే చేయాలని అజయ్‌జైన్ కేబినెట్ ఫైలులో వివరంగా పేర్కొన్నారు. ఇంధన శాఖ వెలిబుచ్చిన అభిప్రాయాలనే ఆర్థిక శాఖ కూడా వ్యక్తం చేసింది. ఆత్మహత్యా సదృశమే ‘రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. మిగులు విద్యుత్‌ను విక్రయించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కొత్తగా.. అదికూడా యూనిట్ రూ.4.84 చొప్పున పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు’ అని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ కేబినెట్ ఫైలులో స్పష్టం చేశారు. డిస్కమ్‌లు ఇప్పటికే రూ.2 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని, అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తే మరింత భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం డిస్కమ్‌లకు ఆత్మహత్యా సదృశమే అవుతుందన్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే పవన, సౌర విద్యుత్ దొరుకుతున్న నేపథ్యంలో గతంలో కుదుర్చుకున్న పీపీఏలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అయినా.. చంద్రబాబు సర్కారు విద్యుత్ కొనుగోలు చేసి డిస్కమ్‌లను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. -
పీపీఏలపై సమీక్ష అనవసరం
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమీక్ష అవసరం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. విద్యుత్ ధరలపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని ఒక రిసార్ట్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తమ హయాంలో విద్యుత్ ధరలు నిర్ణయించడంలో పెద్ద కుంభకోణం జరిగిందని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. సంప్రదాయేతర ఇంధనాన్ని ఐదు శాతానికి మించి తీసుకోకూడదని చెబుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అలాంటిదేమీ లేదన్నారు. కాలుష్యం తగ్గించేందుకే పునరుత్పాదక ఇంధనం వైపు వెళ్లామని, 2021 నాటికి సాంప్రదాయేతర ఇంధన వినియోగం 20 శాతానికి చేరాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించిందని తెలిపారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై సమస్యలు వస్తుండడంతో అన్ని దేశాలు సౌర, పవన విద్యుత్ వైపు వెళ్తున్నాయన్నారు. సాంప్రదాయేతర ఇంధనం వల్ల నష్టం లేదన్నారు. పవన్ విద్యుత్ ధరలపై తమిళనాడుతో పోల్చుతున్నారని, కానీ అక్కడ గాలి వేగం ఎక్కువగా ఉంటుందని అందుకే అక్కడ ధర తక్కువగా ఉందని చెప్పారు. గాలి వేగాన్ని బట్టి పవన్ విద్యుత్ ధరలను నిర్ణయిస్తారని తెలిపారు. సోలార్ విద్యుత్‌ను యూనిట్ రూ.6.90కు ఎక్కడా తీసుకోలేదన్నారు. ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు తమ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఎలాంటి క్విడ్ ప్రోకోలు లేవని చంద్రబాబు అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు రెండు పవర్ ప్లాంట్లు ఉన్నాయని, కర్ణాటకలో వాటికి లాభం చేకూర్చుకుని ఇక్కడ అవినీతి అంటూ హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. టెండర్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్న జ్యుడీషియల్ కమిషన్ సాధ్యం కాదని తెలిపారు. హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జి ఎలా వస్తారని, కార్యనిర్వాహక వ్యవస్థలో తాము జోక్యం చేసుకోమని న్యాయ వ్యవస్థ ఎప్పుడో చెప్పిందన్నారు. అయినా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గా ఉంటారని, వారి సిఫారసుల ప్రకారమే ధరలు నిర్ణయిస్తారన్నారు. పీపీఏల విషయంలో ప్రభుత్వం పాత్ర నామమాత్రమన్నారు. 221 పీపీఏల్లో ఎక్కువ ఐదుగురికే ఇచ్చామంటున్నారని ఇందులో తమ పాత్ర ఏదీ లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. తాము ఒప్పందాలు చేసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి అంశంలోనూ తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సున్నా వడ్డీ రుణాలకు వైఎస్సార్ పేరు పెట్టి దాన్ని ఇప్పుడే తెచ్చినట్లు చెప్పారని, తాము చిల్లిగవ్వ దానికి ఇవ్వలేదని అసెంబ్లీలో సవాల్ విసిరారని, తాను రెడ్‌హ్యాండెడ్‌గా దానిపై వాస్తవాలు బయటపెడితే పారిపోయారని విమర్శించారు. -
‘కోడ్’ ఉన్నా కమీషన్ల బేరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి(కోడ్) అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థలతో రూ.వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు. ‘ముఖ్య’నేతకు భారీగా ముడుపులు చెల్లించిన సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులకు ఆఖరి నిమిషంలో భారీగా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫెక్లీ పవర్, ఎనర్జీ షిప్పింగ్ స్టోరేజ్ సిస్టమ్ పేరుతో కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రైవేట్ సంస్థలు– ప్రభుత్వ పెద్దల మధ్య కుదిరిన ఈ డీల్‌కు రాష్ట్ర కేబినెట్ మార్చిలోనే ఆమోదముద్ర వేసింది. క్షేత్రస్థాయిలో అధికారులు దీనిపై అభ్యంతరాలు లేవనెత్తినా ప్రభుత్వం లెక్కచేయలేదు. ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవహారంపై ఒత్తిడి పెంచింది. ఉత్పత్తిదారుల నుంచి అధిక ధరకు కరెంటు కొనుగోలు చేసి, వారికి లాభం చేకూర్చి, కమీషన్లు దండుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగానే.. తక్షణమే విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశమై, ఈ ప్రాజెక్టును ఆమోదించాలని గత రెండు రోజులుగా అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి పెంచుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగానే సంబంధిత ఒప్పందాలు జరిగిపోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) హుకూం జారీ చేయడంతో విద్యుత్ అధికారులకు దిక్కు తోచడం లేదు. బుధవారం విద్యుత్ సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేసి, ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్టులకు అనుకూలంగా తీర్మానం చేయాలని సీఎంవో నుంచి ఒత్తిడి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్న ట్రాన్స్‌కో సీఎండీ వ్యక్తిగత సెలవులో ఉన్నారు. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) సీఎండీ ఎన్నికల విధుల్లో ఇతర రాష్ట్రానికి వెళ్లారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీనే అన్ని బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత హడావిడిగా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమిటని విద్యుత్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కనీసం ప్రాజెక్టు సమగ్ర నివేదిక కూడా లేని ఈ ప్రాజెక్టును ఆమోదించమని ఒత్తిడి చేస్తే తాము సెలవుపై వెళ్తామని ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు తేల్చిచెప్పారు. తమను బలి పశువును చేస్తున్నారని ట్రాన్స్‌కో తాత్కాలిక జేఎండీ ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటీ ప్రాజెక్టు? రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఎక్కడా లేని విధంగా అత్యధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. తాజాగా ఫెక్లీ పవర్ పేరుతో 600 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఉత్పత్తిదారులు చెప్పిన రేటుకు 25 ఏళ్ల పాటు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని ప్రతిపాదించింది. ఆయా సంస్థలు ఉత్పత్తి చేసిన సౌర, పవన విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి, విద్యుత్ డిమాండ్ ఉన్న సమయంలో డిస్కమ్‌లకు అందిస్తాయి. ఇతర రాష్ట్రాల్లో పవన, సౌర విద్యుత్ యూనిట్ రూ.3 చొప్పున లభిస్తోంది. బ్యాటరీల్లో నిల్వ చేసి అందించడం వల్ల యూనిట్ రూ.6 వరకూ పడుతుందని ప్రైవేట్ సంస్థలు పేర్కొన్నాయి. అదేవిధంగా ఏపీ జెన్కో ఉత్పత్తి చేసే సౌర విద్యుత్‌ను 400 మెగావాట్ల మేర నిల్వ చేసి, అవసరం అయినప్పుడు అందించే మరో విధానాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. దీన్ని ఎనర్జీ షిప్పింగ్ స్టోరేజ్ సిస్టమ్ అంటారు. జెన్కో ఉత్పత్తి చేసేదాని కన్నా ప్రైవేటు సంస్థలు నిల్వ చేసి, తిరిగి ఇవ్వడానికే ఎక్కువ ఖర్చవుతుందని తేల్చారు. దాదాపు 1,000 మెగావాట్ల విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేయడం ఇంతవరకూ ఎక్కడా లేదని, ఏ ప్రయోగం లేకుండానే ఈ ప్రాజెక్టును ఎలా ఆమోదిస్తామని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ ఆమోదించి తీరాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. ప్రభుత్వ పెద్దలకు ప్రైవేట్ ఉత్పత్తిదారుల నుంచి భారీగా ముడుపులు అందాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒత్తిడికి తాళలేక సెలవుపై అధికారులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడి నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. రాబోయే ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తే తాము చిక్కుల్లో పడతామని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ గుర్తించారు. అందుకే ఆయన ఈ నెల 22 వరకూ సెలవు పెట్టారని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ కూడా వారం రోజులుగా సెలవులో ఉన్నారు. నిజానికి ఆయన మంగళవారం విధుల్లో చేరాల్సి ఉంది. ఆయన సెలవును పొడిగించినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇంజనీర్లు సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. -
చౌక వద్దు.. వృథాయే ముద్దు
సాక్షి, అమరావతి: అవసరం లేకపోయినా మార్కెట్‌కి వెళ్లి ఏమన్నా కొనుక్కొచ్చేస్తామా? అదీ పక్క షాపులో తక్కువకే దొరుకుతున్నా రెట్టింపు కన్నా ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేస్తామా? అసలు అలా కొనుక్కురావద్దని కుటుంబంలో తీర్మానించుకున్నాక కూడా కొంటున్నామంటే అర్ధమేమిటి? ఏదో మతలబు ఉందనేగా అర్ధం.. ఇలా చేస్తే మనలని ఏమంటారు. అదే ఒక రాష్ట్రప్రభుత్వం వేల కోట్లరూపాయల విలువ చేసే వ్యవహారాలను ఇలా నడుపుతున్నదనుకోండి దానినేమంటారు? పవనవిద్యుత్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్రప్రభుత్వ తీరు చూసిన వారు నివ్వెరపోతున్నారు. నష్టదాయకం కాబట్టి పవన ‘విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు’ వద్దని విద్యుత్ నిపుణులు ప్రభుత్వానికి 03.03.2017న లిఖితపూర్వకంగా నివేదించారు. అప్పటికి రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ అది తాత్కాలికమేనని తర్వాత తెలిసింది. అంతా సద్దుమణిగాక పవన విద్యుత్ పీపీఏలకు రాష్ట్రప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. అదీ రెట్టింపుకన్నా అధికధరకు కొనుగోలు చేసేందుకు. గుజరాత్లో తక్కువకే పవనవిద్యుత్ దొరుకుతున్నా ఇలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి పీపీఏలు ఎందుకు కుదుర్చుకున్నారు? పోనీ రాష్ట్రంలో ఏమన్నా విద్యుత్ కొరత ఉందా అంటే లేదు. సమీప భవిష్యత్‌లో కొరత వచ్చే సూచనలూ లేవు. అయినా ఈ అడ్డగోలు కొనుగోలు ఒప్పందాల వెనక ఉన్న మతలబేమిటి? 41 పీపీఏలకు ఆమోదం.. విద్యుత్ రంగ నిపుణులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) 41 పీపీఏలకు అనుమతిం చింది. రాష్ట్రంలో విద్యుత్‌కు డిమాండ్ ఏమాత్రం పెరగలేదు. కొరతనేదే లేదు. అయినా అధిక ధర చెల్లించి ప్రైవేట్‌గా ఇలా పవన విద్యుత్ కొనుగోలుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధం కావటంపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. దీనివల్ల పెద్దఎత్తున భారం పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేసిన ఇంధన శాఖ మనసు మార్చుకుని కొనుగోలుకు పచ్చజెండా ఊపడం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని వినిపిస్తోంది. ఇలాంటి నష్టదాయకమైన పీపీఏల ఫలితంగా థర్మల్ విద్యుత్ యూనిట్ల ఉత్పత్తి వ్యయంతోపాటు అప్పులు కూడా పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పొరుగున ఉన్న కర్నాటక సహా అనేక రాష్ట్రాలు ఇలాంటి నష్టదాయకమైన పీపీఏలకు దూరంగా ఉంటున్నాయి. చౌకగా లభించే చోటే విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. యూనిట్ రూ.2.43కే అందుబాటులో ఉన్నా... మన రాష్ట్రంలో పవన విద్యుత్ ఏడాదికి 6 వేల మిలియన్ యూనిట్లకుపైగా ఉత్పత్తి అవుతోంది. వాస్తవానికి 2014 తర్వాత పవన విద్యుత్ ఉత్పత్తిలో పోటీ వచ్చింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో పవన విద్యుత్ ధరలు తగ్గుతున్నాయి. గుజరాత్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ఇటీవల ఓపెన్ బిడ్డింగ్‌కి పిలవగా పవన విద్యుత్ యూనిట్ రూ. 2.43 చొప్పున 500 మెగావాట్లను సరఫరా చేస్తామని ఉత్పత్తిదారులు ముందుకొచ్చారు. స్ప్రింగ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, కేపీ ఎనర్జీ లిమిటెడ్ రూ. 2.43 కే సరఫరా చేస్తామని ముందుకొచ్చాయి. అంటే ఆ రేటుకు కొనుగోలు చేసేందుకు మనకూ అవకాశం ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూనిట్ రూ. 4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు తాజా పీపీఏలలో సిద్ధపడింది. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.2.41 చొప్పున అధికంగా చెల్లించేందుకు రాష్ట్ర సర్కారు íసిద్ధమైందన్నమాట. అదనంగా దోచిపెట్టేది రూ. 11,625 కోట్లు.. ఈ పీపీఏలను 25 ఏళ్లకు కుదుర్చుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థలను రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. 41 పీపీఏల ద్వారా మొత్తం 840 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తారు. ఒక్కో మెగావాట్‌కు 2.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తుంది. 840 మెగావాట్లకు 1,932 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను డిస్కమ్‌లకు ప్రైవేట్ సంస్థలు అంటగడతాయి. ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ. 2.41 చెల్లించటం ద్వారా 1,932 మిలియన్ యూనిట్లకు ఏటా రూ. 465 కోట్లు అప్పనంగా ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 465 కోట్లు అంటే.. 25 ఏళ్లకు చెల్లించే అదనపు వ్యయం రూ.11,625 కోట్లు అన్నమాటేగా.. భారీగా ముట్టిన ముడుపులు? ఎలాంటి బిడ్డింగ్‌లు లేకుండా ప్రైవేటు విద్యుత్ సంస్థలకు రూ. 11,625 కోట్లు చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం ఎందుకు సిద్ధమౌతోంది? దీని వెనక భారీగా ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తొలుత అభ్యంతరాలు వ్యక్తం చేసిన రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ ఆ తర్వాత ఆమోదం తెలపడం వెనక కూడా రాష్ట్రప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందని వినిపిస్తోంది. విద్యుత్ ఉత్పత్తిదారులు ముఖ్యమంత్రిని కలిసిన తరువాత ప్రైవేట్ పవన విద్యుత్తు కొనుగోలుకు అంగీకరించటం ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. అసలు అదనపు విద్యుత్ అవసరమేమిటి? రాష్ట్రంలో 2017–18లో 57 వేల మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తే వాస్తవ వినియోగం 52 వేల మిలియన్ యూనిట్లు దాటలేదు. 2018–19పై కూడా డిస్కమ్‌లు ఇదే స్థాయిలో 61 వేల మిలియన్ యూనిట్ల అవసరం ఉంటుందని అతిగా అంచనా వేశాయి. అయినప్పటికీ ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు ఏపీ జెన్కో థర్మల్, హైడల్ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 156 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే థర్మల్ ద్వారా 96 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. కేంద్రం నుంచి చౌకగా మరో 48 మిలియన్ యూనిట్లు అందుతున్నాయి. జల విద్యుత్ ద్వారా 17 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. వీటి ద్వారా యూనిట్ విద్యుత్తు సగటున రూ. 3.50 లోపే లభిస్తుంది. డిమాండ్ కన్నా ఇంకా ఐదు మిలియన్ యూనిట్లు మిగులు ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు డిమాండ్ లేకుండా విద్యుత్తు కొనుగోలు చేసి ఏం చేస్తారనే ప్రశ్నకు జవాబు లేదు. రైటప్‌లు 1.. ఏపీఈఆర్సీ ఉత్తర్వులో పీపీఏలు కుదిరినట్లు తెలిపే భాగాలు.. 2. పవన విద్యుత్ పీపీఏలను ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తూ 03.03,2017న ఏపీఈఆర్సీ సెక్రటరీకి ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ నుంచి అందిన లేఖ. 3. పవన విద్యుత్ డెవలపర్లతో పీపీఏలు కుదుర్చుకోవడానికి అనుమతి కోరుతూ ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ నుంచి ఏపీఈఆర్సీ సెక్రటరీకి అందిన లేఖ 4. గుజరాత్లో పవన విద్యుత్ ధరలు భారీగా తగ్గిపోయాయని 21.12.2017న వచ్చిన వార్తా కథనం. -
జల విద్యుత్‌పై ‘పవన’వేటు
సాక్షి, అమరావతి: ప్రైవేటు సౌర, పవన విద్యుత్ కొనుగోలు కోసం థర్మల్ ఉత్పత్తికే కాదు... జల విద్యుత్‌కూ కోత పెట్టేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో పూర్తిస్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేసినా, ఏపీ మాత్రం దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. 2014 నుంచీ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీళ్ళున్నా, జల విద్యుత్ కేంద్రాలను సకాలంలో మరమ్మతులు చేయలేదు. ఫలితంగా యూనిట్ రూ.1.80లకే లభించే జల విద్యుత్‌కు బదులు... యూనిట్ రూ. 5లుపైగా వెచ్చించి, పవన, సౌర విద్యుత్‌ను కొనుగోలు చేశారు. 2005 నుంచి 2007 వరకూ రాష్ట్రంలో (ఉమ్మడి రాష్ట్రంలో) జల విద్యుత్ ఉత్పత్తి 32 శాతం వరకూ పెరిగింది. 2007–08లో కూడా 11 శాతం అదనంగా జల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అప్పటి ప్రభుత్వం చౌకగా లభించే విద్యుత్‌కే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. కానీ 2014 తర్వాత ఏపీ జెన్కో పరిధిలోని జల, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని దారుణంగా తగ్గించింది. ఇది 2015 తర్వాత మరింత పెరిగింది. అప్పటికే ప్రైవేటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులతో ప్రభుత్వం బేరసారాలు చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జల విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. ఏపీఈఆర్సీ అనుమతించినా... పవన, సౌర విద్యుత్ కన్నా ముందు జల విద్యుత్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని, దాని ఉత్పత్తిని పెంచాలని 2015–16లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) విద్యుత్ టారిఫ్ ఆర్డర్లో స్పష్టం చేసింది. ఈ కాలంలో 3,404 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపింది. కానీ ఏపీ జెన్కో మాత్రం 2,320 మిలియన్ యూనిట్లకు మించి (32 శాతం తక్కువ) ఉత్పత్తి చేయలేదు. 2014–15లో 15 వేల మిలియన్ యూనిట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున విద్యుత్ భారం మోపాల్సి వచ్చిందని అప్పట్లో కమిషన్ ముందు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి సోలార్, విండ్ పవర్‌కు ప్రభుత్వం యూనిట్‌కు సగటున రూ. 5 వరకూ ఖర్చు పెడుతోంది. 2014లో సోలార్ పవర్‌ను యూనిట్ రూ. 6.25 చొప్పున కూడా కొనుగోలు చేసింది. కానీ జల విద్యుత్ కేవలం రూ.1.80కే లభిస్తుంది. మరమ్మతులేవి? నిజానికి రాష్ట్రంలో వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ, ఎగువ ప్రాంతాల వరద నీటితో డ్యాంల్లో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీరు చేరుతూనే ఉంది. మాచ్‌ఖండ్, తుంగభద్ర వంటి పొరుగు రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఉన్న జల విద్యుత్ కేంద్రాల్లో మరమ్మతులు చేయని కారణంగా తరచూ రిపేర్లు వస్తున్నాయి. రాష్ట్ర జెన్కో పరిధిలోని అప్పర్, లోయర్ సీలేరు, డొంకరాయి, శ్రీశైలం కుడికాల్వ, నాగార్జునసాగర్ కుడి, టేల్పాండ్ జల విద్యుత్ ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి. వర్షాకాలం వచ్చే సమయానికే యంత్రాలను ఉత్పత్తికి అనుకూలంగా ఉండేలా చూసుకోవడంలో అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరోవైపు థర్మల్ ప్లాంట్లను తరచూ మరమ్మతుల కోసం ఉత్పత్తి నిలిపివేస్తున్నారు. వీటి స్థానంలో ప్రైవేటు పవన, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించడం వల్ల విద్యుత్ డిమాండ్‌లో సగానికిపైగా ఇవే ఆక్రమిస్తున్నాయి. అనూహ్య పరిస్థితిల్లో పవన విద్యుత్ పడిపోతే, అప్పటికప్పుడు థర్మల్ ప్లాంట్లను ఉత్పత్తిలోకి తేవడం కష్టంగా ఉందని అధికారులు అంటున్నారు. -
విద్యుత్తు కుంభకోణం.. రూ. 1,000 కోట్లు..!
ప్రైవేట్ పవనాలపై ప్రభుత్వ ప్రేమ.. ప్రజలపై పెను భారం.. ‘ముఖ్య’నేతకు భారీ ప్రయోజనం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ విద్యుత్తు కొనుగోలు కుంభకోణానికి తెరలేచింది. ఒక ప్రైవేట్ పవన విద్యుత్ కంపెనీకి భారీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిసినా పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ అభ్యంతరాలను ఖాతరు చేయలేదు. విద్యుత్ వినియోగదారులపై పెనుభారం పడుతుందని తెలిసినా లెక్కచేయలేదు. అవసరం లేకపోయినా పవన విద్యుత్ కొనుగోలు చేయడమంటే ఇటు వినియోగదారులను, అటు డిస్కమ్‌లను ముంచేయడమేనని ఇంధనశాఖ ఉన్నతాధికారి వ్యాఖ్యానించగా, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే డిస్కమ్‌లకు ఆత్మహత్యా సదృశం అవుతుందని సీఎస్ ఘాటుగా చెప్పారు. అయినా సరే భారీ ముడుపులకోసం రాష్ట్ర ప్రజలపై రూ.1000 కోట్లకు మించి భారాన్ని మోపడానికి సర్కారు సిద్ధమైంది. తమిళనాడుకు చెందిన పవన విద్యుత్ ప్రాజెక్టు యూనిట్ 3.46 రూపాయలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా, సుజ్లాన్ పవన విద్యుత్ యూనిట్ రూ.4.84గా ఏపీఈఆర్సీ నిర్థారించింది. దీనివల్ల రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై పెనుభారం పడనుండగా, ప్రైవేట్ విద్యుత్ కంపెనీతో పాటు ‘ముఖ్య’ నేతకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతోందని తెలుస్తోంది. గతంలో అధికారంలో ఉండగా ప్రైవేట్ విద్యుత్ కంపెనీలతో ఏ తరహాలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చేసుకున్నారో ఇప్పుడు అదే తరహాలో పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరతీశారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏపీ జెన్కోకు విదేశీ బొగ్గు కొనుగోలులో రూ.500 కోట్లు, సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో రూ.755 కోట్లు, కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల పనుల్లో రూ.2,680 కోట్లు, ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లలో రూ.15వేల కోట్లు అవకతవకలకు పాల్పడి వందలాది కోట్లు ముడుపులు అందుకున్న రీతిలోనే పవన విద్యుత్తు విషయంలోనూ వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా చంద్రబాబు ప్రభుత్వం అధిక ధరలకు కొనుగోలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తుందన్న విషయాన్ని దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ట్రేడింగ్ కార్పొరేషన్ అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్సే్చంజ్ (ఐఈఎక్స్) ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు గతంలోనే లేఖ రాసిన విషయం గమనార్హం. అభ్యంతరాలు కాదని మంత్రి మండలి ఆమోదం సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, యాక్సిస్ వెంచర్స్ లిమిటెడ్ అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 3000 మెగావాట్ల పవన్ విద్యుత్, 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. దీంతోపాటు పవన విద్యుత్ పరికరాలకు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం 2015 పవన, సోలార్ విద్యుత్ విధానంతో పాటు నూతన పారిశ్రామిక విధానం మేరకు ఆ కంపెనీలకు రాయితీలను వర్తింపచేసింది. ఈ మేరకు గత ఏడాది జనవరి 11వ తేదీన ప్రాజెక్టు అమలు ఒప్పందాన్ని డిసెంబర్ 2022 వరకు చేసుకుంది. ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు సమన్వయంతో ప్రాజెక్టు అమలు చేయాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సుజ్లాన్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ)కి లేఖ రాశారు. అలాగే దీర్ఘకాలిక విద్యుత్ అవసరాలు, విద్యుత్ కొనుగోలుకు ప్రణాళికను రూపొందించి ఏపీఈఆర్సీ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి అనుమతి పొందాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 11వ తేదీన ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన ఏపీ డిస్కమ్‌లతో పాటు ఏపీ ట్రాన్స్‌కో కూడా సుజ్లాన్‌తో ప్రాజెక్టు అమలు ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ మేరకు ఈ ఏడాది మార్చి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిలోకి వస్తున్న 837.20 మెగావాట్ల పవన విద్యుత్తును కొనుగోలు చేయాల్సిందిగా సుజ్లాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కో–ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన సమావేశమై ఈ అంశంపై చర్చించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకునేందుకు ఈ సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ నిరాకరించింది. జాతీయ టారిఫ్ పాలసీ (ఎన్టీపీ) 2016లో నిర్ధారించిన మేరకు సంప్రదాయేతర ఇంధన వనరులను టెండర్ల ద్వారానే (కాపిటేటివ్ బిడ్డింగ్) కొనుగోలు చేయాలని కేంద్రం స్పష్టం చేసిందని, అయితే ఇందుకు ఇంకా మార్గదర్శకాలను ఖరారు చేయలేదని పేర్కొంది. కాంపిటేటివ్ బిడ్డింగ్ మార్గదర్శకాలను సూచించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడమే కాకుండా, 1000 మెగావాట్ల పవన్ విద్యుత్ కొనుగోలుకు బిడ్స్‌ను ఆహ్వానించింది. తమిళనాడుకు చెందిన పవన విద్యుత్ ప్రాజెక్టు యూనిట్ రూ.3.46కు పంపిణీ చేసేందుకు బిడ్ దాఖలు చేసింది. అయితే ఏపీఈఆర్సీ పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.84గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి పరిస్థితిని సమీక్షించడమే కాకుండా విద్యుత్ వినియోగదారులు, డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి నేపధ్యంలో సుజ్లాన్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోరాదని నిర్ణయించారు. ఇదే విషయాన్ని డిస్కమ్‌లకు ఆదేశాల రూపంలో జారీ చేశారు. ఇంధనశాఖ అభిప్రాయంతో ఆర్థికశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ కూడా ఏకీభవించారు. సుజ్లాన్‌తో ఒప్పందాలను చేసుకోరాదంటూ గత నెల 3వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశానికి ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలను కేబినెట్ తిరస్కరించింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి సూచన మేరకు సుజ్లాన్ విద్యుత్తు కొనుగోలు చేయాలంటూ ఈ నెల 9వ తేదీ జరిగిన మంత్రిమండలి సమావేశం ఆమోదించడం గమనార్హం. రూ.1000 కోట్ల అదనపు భారం ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ విద్యుత్ వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరులు ఉండాలనే ఏపీఈఆర్సీ నిబంధనలను ఇప్పటికే అమలు చేసినందున కొత్తగా పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ స్పష్టంచేశారు. సంప్రదాయేతర ఇంధన వనరులను తప్పనిసరిగా డిస్కమ్‌లు కొనుగోలు చేయాలంటే తక్కువ ధరకు వస్తున్న, ఇప్పటికే ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను మూసివేయాల్సి వస్తుందని తెలిపారు. దీనివల్ల డిస్కమ్‌లపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, విద్యుత్ వినియోగదారులపై ఆ భారం పడుతుందని చెప్పారు. సుజ్లాన్ సంస్థ నుంచి 837.20 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తే ఏటా రూ.250 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.1000 కోట్లు అదనపు భారం డిస్కమ్‌లపై పడుతుందన్నారు. సుజ్లాన్‌కు పారిశ్రామిక విధానం మేరకు రాయితీలు కల్పించినందున పవన విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 12,014 మిలియన్ యూనిట్లు మిగులు ఉందని, మూడేళ్ల వరకు అదనపు విద్యుత్ కొనాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ డిస్కమ్‌లు సుజ్లాన్‌తో పాటు ఏ కంపెనీతో కూడా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్‌లో కొనాల్సి వస్తే టెండర్ల ద్వారానే చేయాలని సూచించారు. డిస్కమ్‌లకు సూసైడల్ సీఎస్ దినేశ్ కుమార్ ఇప్పటికే డిస్కమ్‌లు ఏడాదికి రూ.2000 కోట్ల రూపాయల నష్టాల్లో కొనసాగుతున్నాయని, పవన విద్యుత్ యూనిట్‌ను రూ.4.84కు కొనుగోలు చేయాలంటూ ఒప్పందాలు చేసుకుంటే డిస్కమ్‌లకు ఆత్మహత్యా సదృశం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఘాటుగా చెప్పారు. ఇప్పటికే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ఒప్పందాలను సమీక్షించి తక్కువ ధరకు కొనుగోలు చేయడంపై ట్రాన్స్‌కో, డిస్కమ్స్ దృష్టి సారించాలని సూచించారు. సుజ్లాన్‌తో ఒప్పందాలను చేసుకోరాదంటూ గత నెల 3వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశానికి ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలను తిరస్కరించి కేబినెట్, ఈ నెల 9వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొనుగోళ్లను ఆమోదించడం గమనార్హం. మొదటినుంచీ ముడుపుల బాటే... విద్యుత్ ప్రాజెక్టులను, కొనుగోళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటినుంచీ ముడుపులకు మార్గాలుగానే చూస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఒప్పందాలు చేసుకుంటూ భారీగా ముడుపులు అందుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి నిర్వాకం వల్లనే విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోతున్నాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయినా కానీ పట్టించుకోకుండా పవన విద్యుత్ కొనుగోలు చేస్తూ మరో రూ.1000 కోట్ల భారం మోపేందుకు సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన ఒప్పందాల వివరాలు.. - విదేశీ బొగ్గు కొనుగోలులో అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే 20.55 డాలర్లు అధికంగా చెల్లించిన అంశంలో రూ.వందల కోట్లు ముడుపులు చేతులు మారిన అంశంపై కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ సమన్లు జారీ. - అనంతపురం తలారిచెరువు సోలార్ పవర్ ప్రాజెక్టులో మెగావాట్‌కు రూ.1.51 కోట్లు అధికంగా చెల్లించడంవల్ల ఖజానాపై రూ.755 కోట్ల భారం. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో టెండర్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేయాల్సి వచ్చింది. - కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో పనుల అంచనావ్యయాన్ని రూ.2,680 కోట్లు పెంచి రూ.500 కోట్లు ముడుపులు పొందారు. దీనిపైనా పిల్ దాఖలు కావడంతో కాంట్రాక్టుల అప్పగింతకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. - అధికారం చేపట్టిన మరుక్షణమే చంద్రబాబు రెండువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చి డిస్కమ్‌ల నెత్తిన భారం మోపారు. ఆ తర్వాత కూడా అదే తీరును కొనసాగిస్తూ అవసరం లేకున్నా ముడుపుల కోసం ప్రైవేటు సంస్థలనుంచి 13 వేల మిలియన్ యూనిట్లు కొనుగోలు జరిపి డిస్కమ్‌లు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణమయ్యారు. - బయట మార్కెట్లో యూనిట్ రూ.2.71కి దొరుకుతున్నా ఆంధ్రప్రదేశ్ రూ.5.11 చెల్లించి కొనుగోలు చేయడంపై దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ట్రేడింగ్ కార్పొరేషన్ అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్సే్చంజ్ (ఐఈఎక్స్) ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు లేఖ రాసింది. -
తెలంగాణకు పవనకాంతులు
♦ రూ.600 కోట్లతో రంగారెడ్డి జిల్లా పరిగిలో విండ్ పవర్ ప్రాజెక్టు ♦ ఈ నెలాఖరున అందుబాటులోకి.. రోజుకు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ♦ వెయ్యి కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన బహుళజాతి సంస్థలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్‌ను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మొట్టమొదటి పవన విద్యుత్ ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటవుతోంది. పరిగి నియోజకవర్గంలో 100.5 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన పవన విద్యుత్ ప్రాజెక్టు ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు కొన్ని రోజులుగా ‘నెడ్‌క్యాప్’ సంస్థ ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టును మిత్రా ఎనర్జీస్ పూర్తి చేసింది. కాగా హీరో గ్రూపు సంస్థ ఇదే ప్రాంతంలో 31.5 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతోంది. నిజామాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా మీదు గా మహబూబ్‌నగ ర్ వరకు గల క క్ష్యలో గాలి ఉధృతి అధికం గా ఉంటుంది. ఈ మేరకు ఈ పరిధిలో పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించేందుకు బహుళజాతి కంపెనీలు ముందుకొచ్చాయి. సుమారు రూ. వెయ్యి కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని భావిస్తున్న సర్కారు.. సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది. 120 మీటర్ల ఎత్తులో.. 120 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న ప్రతి టవర్ రోజుకు కనిష్టంగా 2 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. వీచేగాలి సాంద్రతపై విద్యుత్ ఉత్పత్తి ఆధారపడుతోంది. రుతుపవనాల రాక మొదలు.. వర్షాకాలం మొదలయ్యే వరకు విండ్ సీజన్‌గా పరిగణిస్తారు. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో పవనాల ఉధృతి (ఫ్రీక్వెన్సీ) ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే 48 టవర్లను నిర్మించిన ఈ సంస్థ.. ప్రతి టవర్ సామర్థ్యాన్ని పరిశీలిస్తోంది. ఒక్కో టవర్ నిర్మాణానికి రూ.6.5 కోట్లు వెచ్చించించింది. ప్రతి టవర్ ఉత్పత్తి చేసే కరెంట్‌ను ప్రత్యేకంగా నెలకొల్పిన పవర్ స్టేషన్‌కు పంపిణీ చేస్తాయి. అక్కడి నుంచి ఎస్పీడీసీఎల్ గ్రిడ్‌కు విద్యుత్‌ను అనుసంధానం చేస్తారు. ఇప్పటికే రూ.600 కోట్ల అంచనా వ్యయంతో పరిగి మండలం కాళాపూర్, ఖుదావన్‌పూర్, సయ్యద్‌పల్లి, రాపోలు, తొండపల్లి, చిట్యాల్, మాదారం, పూడూరు మండలం సోమన్గుర్తి, కేరవెళ్లి.. మహబూబ్‌నగర్ జిల్లా పద్మారం గ్రామాల్లో ఇప్పటికే విండ్ పవర్ కేంద్రాలను ప్రైవేట్ సంస్థలు నెలకొల్పాయి. మరికొన్నింటి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పవన విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలుగా 132/33 కేవీ సబ్ స్టేషన్‌ను అక్కడ నిర్మిస్తున్నారు. రోజుకు 2.5 మిలియన్ యూనిట్లు పవన విద్యుత్ ఉత్పాదనలో కీలకంగా పనిచేసే గాలిమరలు 24 గంటలు పనిచేస్తే దాదాపు 2.5 మిలి యన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉం ది. పవన విద్యుత్ ప్రాజెక్టులో గాలి వేగాన్ని బట్టి ఉత్పత్తి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కీలకమైన పీక్ అవర్స్ (విద్యుత్ వినియోగం అధికంగా ఉండే ఉదయం, సాయంత్రం) వేళ ల్లో కరెంట్‌ను బాగా ఉత్పత్తి చేస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పవనాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో విద్యుత్ ఉత్పత్తి వల్ల గృహ, వాణిజ్య, పరిశ్రమలకు విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలవుతుంది. -
హైట్ పెంచితే హిట్!
‘మర’ల ఎత్తు 100 మీటర్లకు పెంచితే మరింత పవన విద్యుత్ ♦ రాష్ట్రంలో 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అవకాశాలు ♦ మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉత్పత్తికి వీలు ♦ జాతీయ పవన విద్యుత్ సంస్థ నివేదిక ♦ పవన విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు త్వరలో కొత్త విధానం సాక్షి, హైదరాబాద్: గాలి మరల ఎత్తును 100 మీటర్లకు పెంచితే తెలంగాణలో 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి ఆస్కారముందని జాతీయ పవన విద్యుత్ సంస్థ (ఎన్ఐ డబ్ల్యూఈ) అధ్యయనంలో తేలింది. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఆదేశాలతో దేశంలో పవన విద్యుదుత్పత్తికి ఉన్న అవకాశాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపిన ఈ సంస్థ, ఇటీవల తన నివేదికను ప్రచురించింది. 100 మీటర్ల ఎత్తులో గాలి మరల ఏర్పాటు ద్వారా దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల పరిధిలో ఏకంగా 3,02,251 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఈ నివేదిక పేర్కొంది. 2022 నాటికి దేశంలో పవన విద్యుదుత్పత్తి 66,000 మెగావాట్ల లక్ష్యాన్ని అందుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నిర్ణీత వేగంతో గాలులు వీచే ప్రాంతాల్లో మాత్రమే పవన విద్యుత్ ఉత్పత్తికి అవకాశముంది. తీర ప్రాంతాలైతే పవన విద్యుదుత్పత్తికి అత్యంత అనుకూలం. తీర ప్రాంతాలు లేని.. వేగంగా గాలులు వీచని ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతిలో 50 మీటర్ల ఎత్తులో గాలి మరలను ఏర్పాటు చేస్తే లక్ష్యం మేరకు పవన విద్యుదుత్పత్తికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గాలి మరల ఎత్తును 100 మీటర్లకు పెంచితే లక్ష్యానికి ఎన్నో రేట్లు ఎక్కువగా పవన విద్యుదుత్పత్తికి అవకాశముందని జాతీయ పవన విద్యుత్ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. కేంద్ర ఇంధన శాఖ నుంచి ఈ నివేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీని ఆధారంగానే రాష్ట్రంలో పవన విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. సాగు భూముల్లో విద్యుత్ పంట రాష్ట్రంలో మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు మాత్రమే పవన విద్యుదుత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలో 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అవకాశం ఉండగా, సాగుభూముల్లో 3,348 మెగావాట్లు, బీడు భూముల్లో 887 మెగావాట్లు, అటవీ భూముల్లో తొమ్మిది మెగావాట్ల ఉత్పత్తికి అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే 371 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవచ్చని ఈ నివేదిక సూచించింది. చదరపు కిలోమీటర్ పరిధిలో ఆరు మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తికి వీలుంటుందని తెలుస్తోంది. ఏపీలో 44,229 మెగావాట్ల పవన విద్యుత్‌కు అవకాశాలు పవన విద్యుదుత్పత్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉందని ఆ నివేదిక ద్వారా తెలుస్తోంది. 100 మీటర్ల ఎత్తులో గాలిమరల ఏర్పాటు ద్వారా ఏపీలో ఏకంగా 44,229 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అవకాశముంది. సముద్ర తీర ప్రాంతం విస్తారంగా ఉండటం, రాష్ట్రం మీదుగా అత్యంత వేగంగా గాలులు వీస్తుండటం వల్ల ఏపీలో పవన విద్యుదుత్పత్తికి అనుకూల వాతావరణం ఉంది. ఇక్కడి బీడు భూముల్లోనే 22,525 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అవకాశం ఉండగా, సాగుభూముల్లో 20,538 మెగావాట్లు, అటవీ భూముల్లో 1,165 మెగావాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. -
‘పవన విద్యుత్.. ఆ ఇంటికి సొంతం’
గుడ్లవల్లేరు : ఒక సాధారణ వెల్డరైన గుడ్లవల్లేరులోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన జె.వేణునాయక్ తనకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో పవన విద్యుత్ పరికరాన్ని ఇంట్లో ఏర్పాటుచేసుకున్నాడు. దీంతో ఉత్పత్తవుతున్న విద్యుత్‌తో ఇంట్లోని టీవీ, రెండు ఫ్యాన్లు, నాలుగు లైట్లు నిరంతరంగా పనిచేస్తుండటం గమనార్హం. వివరాలు ఆయన మాటల్లోనే...‘నాలుగు నెలల కిందట స్టీల్‌తో పెద్ద రెక్కల ఫ్యాన్‌ను తయారు చేసి మా ఇంటిముందు పిల్లర్‌కు అమర్చాం. అది గాలివాటాన్ని బట్టి తిరిగే విధంగా, ఈదురుగాలులకు సైతం తట్టుకునేలా రూపొందించాం. గాలికి తిరిగిన ఫ్యాన్ ద్వారా డీసీ డైనమోతో ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ చార్జ్ అవుతుంది. 24 గంటలూ టీవీతో పాటు రెండు ఫ్యాన్లు, నాలుగు లైట్లు వాడుకుంటున్నాం. పరిమితంగా అమర్చుకున్న ఈ విద్యుత్ పరికరాల వలన ఫ్రిజ్, మోటరు మాత్రం పనిచేయవు. ఇంట్లో తప్పనిసరి పరిస్థితుల్లో వాడుకునేందుకు ట్రాన్స్‌కో కరెంట్ మీటర్ కూడా ఉంచాం. పవన విద్యుత్‌ను ఉపయోగిస్తే నామమాత్రంగా నెలకు రూ.150లే కరెంట్ బిల్లు వస్తోంది. సొంత విద్యుత్ తయారీ లేకముందు రూ. 450 నుంచి రూ. 500 బిల్లు వచ్చేది..’ -
18న ఐనాక్స్ విండ్ ఐపీఓ
20న ముగింపు ప్రైస్‌బాండ్ రూ.315-రూ.325 ముంబై: విండ్ విద్యుత్తుకు సంబంధించిన సర్వీసులందజేసే ఐనాక్స్ విండ్ సంస్థ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 18న ఆరంభం కాబోతోంది. ఈ నెల 20న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.700 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓకు ప్రైస్బ్యాడ్గా రూ.315-325 ధరలను నిర్ణయించామని గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ డెరైక్టర్ దీపక్ ఆషర్ చెప్పారు. రూ.700 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లతో పాటు ఐనాక్స్ విండ్ ప్రమోటర్, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్కు ఉన్న 5 శాతం వాటాను (కోటి ఈక్విటీ షేర్లు) ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నామని, ఈ ఓఎఫ్ఎస్ ద్వారా రూ.300 కోట్లు సమీకరించాలని భావిస్తున్నామని తెలిపారు. షేర్ ముఖ విలువ రూ.10 అని కనిష్టంగా 45 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలని పేర్కొన్నారు. కంపెనీ విస్తరణకు, దీర్ఘకాల మూలధన అవసరాలు, తమ అనుబంధ సంస్థ ఐనాక్స్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్‌లో పెట్టుబడులకు ఈ ఐపీఓ నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు. -
పవన విద్యుత్ ఉత్పత్తిపై జీవో జారీ
హైదరాబాద్: పవన విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిద్వారా వచ్చే ఐదేళ్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చే వారికి రాయితీలు కల్పించనున్నారు. దీనికోసం సింగిల్ విండో విధానంలో అనుమతులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింగిల్ విండో విధాన పర్యవేక్షణకు ఆరుగురు సభ్యులతో ఒక హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
తెలంగాణలో పవన విద్యుదుత్పత్తి
ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన గ్రీన్కో సంస్థ అవకాశాలను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం రూ. 6 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమని ‘గ్రీన్కో’ సంస్థ వెల్లడి 2018 నాటికి 800 మెగావాట్ల పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టు స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కేందుకు భారీగా థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని లక్ష్యంగా ఎంచుకున్న తెలంగాణ ప్రభుత్వం... సౌర, పవన విద్యుదుత్పత్తిపైనా దృష్టి సారించింది. ఈ మేరకు వివిధ వర్గాల నుంచి ప్రతిపాదనలకు కూడా ఆహ్వానించింది. దీంతో తెలంగాణలో 800 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేస్తామని విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనుభవమున్న ‘గ్రీన్కో’ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం తాము రూ. 6 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని.. 2018 నాటికి ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది. దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని పేర్కొంటూ సంబంధిత ప్రతిపాదనలను బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ‘గ్రీన్కో’ సంస్థ అందించింది. దీనిపై స్పందించిన సీఎం.. రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదఢఢేశించారు. ఇప్పటికే సౌర విద్యుత్‌కు ఒక దఫా టెండర్లు పిలిచామని, అవసరమైతే మరోసారి టెండర్లు పిలవాలని సూచించారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల మెగావాట్ల వరకు వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉందని.. పగటి పూట విద్యుత్ అందించే సోలార్ వ్యవస్థను వ్యవసాయ పంపుసెట్లకు అనుసంధానం చేస్తే ఉభయ తారకంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. పవన విద్యుత్ ప్లాంట్లను కూడా ఎక్కువ ప్రాంతాల్లో స్థాపిస్తే ఉపయోగం ఉంటుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ విద్యుత్ అవసరాలు ఉన్న చోట పవన విద్యుత్ ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రయోగాత్మకంగా పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని, ఇప్పటికే అనుభవం ఉన్న సంస్థలతో ఈ పని చేయించాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాజధానిలో నిరంతరం విద్యుత్ హైదరాబాద్‌లో విద్యుత్ కోతలు లేకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. న్యూయార్క్, ముంబై వం టి నగరాల్లో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లే హైదరాబాద్‌పైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంద ని... పరిశ్రమలు, ఐటీ సంస్థలు, వ్యాపార, వాణి జ్య సంస్థలు 24 గంటలు పని చేసినా విద్యుత్ కోతలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. -
పవన విద్యుదుత్పత్తిలో భారత్‌కు 5వ ర్యాంకు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 పవన విద్యుదుత్పత్తి దేశాల్లో భారత్ 5వ స్థానం దక్కించుకుంది. గతేడాది 1,700 మెగావాట్ల సామర్థ్యాన్ని అదనంగా జతకావడంతో ఇది సాధ్యపడింది. అంతర్జాతీయ పునరుత్పాదక విద్యుత్ రంగ స్థితిగతులు 2014 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 2013లో 35,000 మెగావాట్ల మేర అదనంగా సామర్థ్యం జత కావడంతో పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 3,18,000 మెగావాట్లకు చేరుకుంది. చైనా అత్యధికంగా 16,100 మె.వా. అదనపు సామర్థ్యంతో అగ్రస్థానంలో నిలవగా.. అమెరికా, జర్మనీ, స్పెయిన్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇందులో పెట్టుబడుల విషయంలో చైనా టాప్‌లో, భారత్ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. గత కొన్నాళ్లుగా పవన, సౌర విద్యుదుత్పత్తి వ్యయాలు భారీగా తగ్గడంతో ప్రభుత్వ మద్దతు లేకుండానే ప్రాజెక్టుల ఏర్పాటు క్రమంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. 2013లో భారత్ మొత్తం 4,000 మె.వా. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని జతచేసుకుంది. ప్రస్తుతం 30,000 మె.వా.గా ఉన్న ఈ విభాగ విద్యుదుత్పత్తిని 2017 నాటికి 55,000 మె.వా.కు పెంచుకోవాలని యోచిస్తోంది. -
2016 నాటికి 1,500 మెగావాట్లు
పవన విద్యుత్‌లో మిత్రా ఎనర్జీ లక్ష్యం ఏపీ, తెలంగాణలో కొత్తగా 200 మెగావాట్లు: కంపెనీ చైర్మన్ రవి కైలాస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పవన విద్యుత్ రంగ సంస్థ మిత్రా ఎనర్జీ 2016 నాటికి 1,500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో కంపెనీ 527 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసేలా మరో 300 మెగావాట్లను జత చేస్తామని మిత్రా ఎనర్జీ చైర్మన్ రవి కైలాస్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇందుకు రూ.2,000 కోట్ల దాకా వ్యయం అవుతుందని చెప్పారు. మిత్రా ఎనర్జీ తెలంగాణలో కొత్తగా 100 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అనంతపూర్, కర్నూలులో కలిపి 100 మెగావాట్ల ప్రాజెక్టులుండగా, మరో 100 మెగావాట్లు చేరుస్తున్నారు. ఏపీలోనే ధర తక్కువ..: పవన విద్యుత్‌కు ఒక్కో యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.4.70 మాత్రమే చెల్లిస్తోంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌కు రూ.5.50, సోలార్కు రూ.6.50 చెల్లిస్తోంది. పవన విద్యుత్‌కు రాజస్థాన్ రూ.5.63, మహారాష్ట్ర రూ.5.70, మధ్యప్రదేశ్ రూ.5.94 చెల్లిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లోనే తక్కువగా ఉందని కంపెనీ ఎండీ విక్రమ్ కైలాస్ అన్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్ మాదిరిగా పవన విద్యుత్‌కూ యూనిట్‌కు రూ.5.50 ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నామని చెప్పారు.‘భారత్‌లో 2 లక్షల మెగావాట్ల పవన విద్యుత్‌కు అవకాశముంది. ప్రస్తుతం 20 వేల మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. నాలుగైదు పెద్దవి, ఐదారు చిన్న కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 10 వేలు, తెలంగాణలో 2 వేల మెగావాట్ల ఉత్పత్తికి ఆస్కారం ఉంది’ అని విక్రమ్ అన్నారు. విజేతకు లక్ష డాలర్లు.. ఇన్స్పైరింగ్ సొల్యూషన్ పేరుతో స్టార్టప్ విలేజ్, ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్, విల్‌గ్రో సహకారంతో ఒక కార్యక్రమానికి మిత్రా ఎనర్జీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్తమ ప్రణాళికను ఎంపిక చేసి, వ్యాపారం ప్రారంభించేందుకు ఒక లక్ష డాలర్లను (రూ.60 లక్షలు) సీడ్ క్యాపిటల్‌గా అందిస్తారు. విజేతను ఆగస్టు 30న ప్రకటిస్తారు. అత్యుత్తమమైతే మరో రెండు ఐడియాలకూ సీడ్ క్యాపిటల్ ఇచ్చేందుకు సిద్ధమని మిత్రా ఎనర్జీ తెలిపింది. -
ఈ కారుకు పవనమే ఇంధనం
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఫైనలియర్ విద్యార్థులు పవనశక్తి(గాలి)తో నడిచే కారును తయారు చేశారు. కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు సాయికిరణ్, అనిల్‌రెడ్డి, ప్రశాంత్, నరేశ్ బుధవారం కళాశాలలో ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా రూ.60 వేల ఖర్చుతో 45 రోజులపాటు శ్రమించి ఇంధనంతో పనిలేని, కాలుష్యం వెదజల్లని కారును వీరు రూపొందించారు. తాము తయారు చేసిన కారుకు ఉన్న ఫ్యాన్ తిరిగినప్పుడు.. ఆ గాలి యాంత్రికశక్తిగా మారి..విండ్ టర్బైన్ జనరేటర్ సిస్టం ద్వారా విద్యుచ్ఛక్తి తయారై ఎలక్ట్రిక్ (బ్యాటరీలు) మోటార్ల ద్వారా కారు నడుస్తుందని విద్యార్థులు వివరించారు. అయితే కారు ముందుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో నడిస్తేనే ఫ్యాన్ తిరిగి విద్యుచ్చక్తి తయారవుతుందన్నారు. వాహనం ఎంత స్పీడ్‌గా వెళ్తే అంతగా బ్యాటరీ చార్జి అవుతుందని..ఎలాంటి కాలుష్యం వెదజల్లదని విద్యార్థులు తెలిపారు.