డిస్కమ్‌లను కొట్టి.. ‘ప్రైవేట్‌’కు పెట్టి.. | Expert Committee About TDP Govt decisions Over Power Purchase Agreements | Sakshi
Sakshi News home page

డిస్కమ్‌లను కొట్టి.. ‘ప్రైవేట్‌’కు పెట్టి..

Published Sun, Aug 11 2019 4:05 AM | Last Updated on Sun, Aug 11 2019 4:05 AM

Expert Committee About TDP Govt decisions Over Power Purchase Agreements - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తవ్వేకొద్దీ ఆశ్చర్యకరమైన అనేక అంశాలు వెలుగుచూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పీపీఏల తీరుపై ఇటీవల ఆ కమిటీ ప్రభుత్వానికి సవివరమైన నివేదిక సమర్పించింది. వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తిదారులకు దోచిపెట్టేందుకు నాటి టీడీపీ సర్కార్‌ ఏమాత్రం వెనుకాడలేదని స్పష్టమైంది. అవసరం లేకున్నా పరిమితికి మించి పవన, సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడంవల్ల విద్యుత్‌ పంపిణీ సంస్థలపై రూ.2,655 కోట్ల అదనపు భారం పడిందని కమిటీ గణాంకాలతో సహా వివరించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పవన విద్యుత్‌ను యూనిట్‌ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసింది. 2015–16 నుంచి 2018–19 వరకూ ఏకంగా 24,174 మిలియన్‌ యూనిట్ల మేర లభ్యతలో ఉన్న విద్యుత్‌ను నిలిపివేశారు. ఇందులో సోలార్, విండ్‌ కొనుగోలు (మస్ట్‌ రన్‌) కోసం 21,251 మిలియన్‌ యూనిట్లుఆపేశారు. ఇలా ఆపేయడంవల్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు యూనిట్‌కు రూ.1.29 చొప్పున విద్యుత్‌ తీసుకోకపోయినా చెల్లించారు. ఈ భారం ఏకంగా రూ.1,731 కోట్లుగా గుర్తించారు. ఇదే పరిస్థితి కొనసాగితే విద్యుత్‌ పంపిణీ సంస్థలు అప్పుల ఊబిలోకి వెళ్తాయని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. 

కమిటీ సిఫార్సులు 
- 2017 తర్వాత ఏపీఈఆర్‌సీ ముందుకొచ్చిన 21 పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను నిలిపివేయాలి. 
గత ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి సంబంధించిన థర్మల్‌ విద్యుత్‌ సంస్థ సింహపురి ఎనర్జీ నుంచి విద్యుత్‌ కొనుగోలు ప్రతిపాదన సమీక్షించాలి. ఆ కంపెనీ ఇప్పటికీ బ్యాంక్‌ గ్యారెంటీ ఇవ్వలేదు. అనేక నిబంధనలు ఈ సంస్థ అనుసరించలేదు. కాబట్టి దీన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. 
ఏపీ జెన్‌కోకు చెందిన ఆర్టీపీపీ స్టేజ్‌–4 పీపీఏ ఏపీఈఆర్‌సీ వద్దే పెండింగ్‌లో ఉంది. దీన్ని వీలైనంత త్వరగా ఆమోదించాలి. ట్రిబ్యునల్‌ ఆర్డర్‌ను బట్టి హిందూజా పవర్‌ తీసుకునే విషయాన్ని పరిశీలించాలి. గత ప్రభుత్వం అనుమతించిన హైబ్రిడ్‌ (విండ్, థర్మల్, సోలార్‌ కలిపి) విద్యుత్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఏపీలో 19,660 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యముంది. ఇందులో 7,387 మెగావాట్ల సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన విద్యుత్‌ వాటా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సోలార్, విండ్‌ను అవసరం మేరకు అనుమతించాలి. 

అనవసరంగా కొనుగోలు
సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి పెంచాలని రాష్ట్రాలకు టార్గెట్‌ పెట్టింది. దీంతో నాటి టీడీపీ సర్కార్‌ దీన్ని అవకాశంగా తీసుకుని అప్పటి నుంచి పవన, సౌర విద్యుత్‌ను కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువకు కొనుగోలు చేసింది. ఫలితంగా 2015–16 నుంచి 2018–19 వరకు 20,285 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ మిగిలిపోయింది. దీంతో జెన్‌కో, దీర్ఘకాలిక విద్యుత్‌ ఒప్పందాల నుంచి చౌకగా లభించే విద్యుత్‌ను 24,174 మిలియన్‌ యూనిట్ల మేర నిలిపివేశారు. అలాగే, యూనిట్‌కు రూ.1.29 చొప్పున రూ.1,731 కోట్లు విద్యుత్‌ తీసుకోకుండానే స్థిర విద్యుత్‌ను చెల్లించారు. మరోవైపు.. పవన విద్యుత్‌ ధరలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ తగ్గినా ఏపీలో మాత్రం రూ.4.84 చెల్లించారు. చౌకగా లభించే థర్మల్‌ విద్యుత్‌తో పోలిస్తే 2015–16 నుంచి 2018–19 వరకూ మొత్తం రూ.2,655 కోట్లు అదనంగా చెల్లించారు. ఈ నేపథ్యంలో కమిటీ కొన్ని సిఫార్సులను చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement